సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, October 27, 2025

విలక్షణ హాస్యనటుడు సతీష్ షా

    

                                                                

 

దూరదర్శన్ మాత్రమే ఏకఛత్రాధిపత్యం వహించిన ఎనభై దశకంలో ఎందరో నటీనటులు ప్రాంతీయ, భాషాభేదం లేకుండా మనలో చాలా మందికి ఆప్తులుగా మారిపోయారు. నిజజీవితానికి, ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టేలా ఉండేలాంటి అప్పటి టీవీ సీరియళ్ళు కొన్ని ఇప్పటికీ మన మనసుల్లో బంగారపు ఇళ్ళు కట్టుకుని ఉండిపోయాయి. 


హిందీ భాష నేర్పడం నుంచీ మొదలుపెట్టి, ఎంతో విజ్ఞానాన్ని అందించిన అప్పటి దూరదర్శన్ గురించి అసలు ఒక ప్రత్యేకమైన టపానే రాయాలి. కానీ ప్రస్తుతానికి నన్ను కదిలించిన నిన్నటి వార్త గురించి నాలుగు మాటలు - నటుడు సతీష్ షా మరణం! చిన్నప్పుడు "ఏ జో హై జిందగీ" అని ఒక సిరీస్ వచ్చేది. షఫీ ఇనాందార్, స్వరూప్ సంపత్ అందులో ముఖ్య పాత్రలు. ఆ సీరియల్ లో ఒక్కో ఎపిసోడ్ కీ ఒక్కో పాత్రలో సతీష్ షా కనిపిస్తారు. బొద్దుగా, అందంగా ఉండే ఆయన రూపం కూడా చూడగానే చిరునవ్వు తెప్పిస్తుంది. హాస్య నటుడిగా ఆయనది ఒక ప్రత్యేకమైన రీతి. బుల్లి తెరపై గానీ, వెండితెరపై గానీ సతీష్ షా కనిపించగానే సీరియస్ గా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా నవ్వులు పూస్తాయి. పోషించినవి లీడ్ రోల్స్ కాకపోయినా, చిన్న పాత్రలే అయినా,  కొందరు ఉత్తమ నటులు మనసుకి దగ్గరగా ఉండిపోతారు. అందులో హాస్య నటులు మరీనూ. 'జానే భీ దో యారో' మొదలుకొని ఎన్నో సినిమాల్లో ఆయన పోషించిన హాస్య పాత్రలు చిరస్మరణీయం. 


హాస్యనటులు అంటే నాకు మొదటి నుంచీ చాలా అభిమానం. ఎందుకంటే హాస్యం పండించడం తేలికైన పనేమీ కాదు. సీరియస్ రోల్స్ కూడా బాగా చెయ్యగలిగే కొందరు పెద్ద నటులు కూడా తెరపై హాస్యరసాన్ని సరిగ్గా పండించలేరు. అదీకాక మనిషిని ఆహ్లాదపరిచేదీ, మనసుని తేలికపరిచేది హాస్యమే. ఎప్పుడైనా బాగా చిరాకుగా ఉన్న ప్రతిసారీ నేను పాత బ్లాక్ అండ్ వైట్ రమణారెడ్డి, రేలంగీ హాస్యాన్ని చూస్తూ ఉంటాను. రిలాక్సింగ్ కి అంతకు మించిన మందు లేదనిపిస్తుంది నాకు. హాయిగా గట్టి గట్టిగా నవ్వేస్తే మనసు తేలికైపోతుంది. హాస్యానికి అంత పవర్ ఉంది. మనల్ని మనసారా నవ్వుకునేలా చేసే ప్రతి హాస్యనటుడూ ఒక గొప్ప మెజీషియన్ తో సమానం.

విలక్షణ హాస్యనటుడు సతీష్ షా కు నా హృదయపూర్వక శ్రధ్ధాంజలి.

Friday, October 10, 2025

OTT Entertainment 5 : మేఘాలు చెప్పిన ప్రేమ కథ


సినిమా పేరు ఎంత బాగుందో కథలో ప్రేమ కూడా అంతే బాగుంది ! అందమైన ప్రకృతి.. తమిళనాడులోని "వాల్పరై" కొండప్రాంతాల రమణీయమైన అందాలు, చిత్రీకరణ చాలా చాలా బాగుంది. స్టన్నింగ్ ఫోటోగ్రఫీ!  హీరో అబ్బాయిని ఇదివరకూ "వికటకవి" వెబ్ సిరీస్ లో చూసి బాగా నటించాడనుకున్నాము. ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలని ఫిక్సయిపోయాము. ఈ చిత్ర కథ ఎలా ఉన్నా, నాయికా,నాయకుల మధ్య ప్రేమ చిత్రీకరించిన విధానం బాగుంది. వెరీ డీసెంట్ ఇన్ టుడేస్ టైమ్స్ అనే చెప్పాలి. సినిమాలో వీరిద్దరి  ప్రేమకథ పార్ట్ చాలా చాలా బాగుంది. ఎంతో హృద్యంగా ఉంది. ఇద్దరి మధ్య డైలాగ్స్, ఇంకా పేరెంట్స్ తో హీరో హీరోయిన్ మాట్లాడే డైలాగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కొత్తమ్మాయి. కేరెక్టర్ చాలా బాగుంది. భలే సరదాగా ఉంది ఆ అమ్మాయి స్క్రీన్ మీద ఉన్నంతసేపూ. బాగా నటించింది. కానీ మొత్తం మీద ఇంకా బాగుండచ్చేమో అనిపించింది. బామ్మగా, శాస్త్రీయ సంగీత గాయనిగా రాధిక పాత్ర, ఆవిడ చీరలు, జువెలరీ, మేకప్ బాగా తనకి సెట్ అయ్యాయి. ముఖ్యంగా తను పెట్టుకున్న ముక్కుపుడక బాగా నచ్చింది నాకు. హీరోయిన్ ముక్కుపుడక కూడా అందరు హీరోయిన్ లూ ఈమధ్య పెట్టుకునే నోస్పిన్ లా కాకుండా కాస్త డిఫరెంట్ గా బాగుంది. గాయకులు ప్రిన్స్ రామవర్మ గారు ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఒక అందమైన డీసెంట్ ఫిల్మ్ కేటగిరీలోకి ఈ సినిమా వస్తుంది. Sun NXT లో ఈ సినిమా చూడవచ్చు. యూట్యూబ్ లో కూడా ఉంది కానీ పాటలు ఉండవు. చిన్న చిన్న  stanza songs 2,3 ఉన్నాయి. సో, ఆ పాటలతో కలిపి చూస్తేనే ఫీల్ ఉంటుంది కాబట్టి సన్ నెక్స్ట్ లో చూస్తేనే బాగుంటుంది.



క్రింద ఇన్సర్ట్ చేసిన పాట ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా వర్షం, గాలి, అందమైన ప్రకృతి, చిత్రికరణ, సాహిత్యం అన్నీ చాలా బాగున్నాయి. చరణ్ గళం మరోసారి బాలుని గుర్తు చేసింది. వాయిద్యాల హోరు కాకుండా నేచరల్ సౌండ్స్ ని ఉపయోగించుకున్న విధానం సృజనాత్మకంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.

https://www.youtube.com/watch?v=mawyH673nq0&list=PL0ZpYcTg19EHUh9wA_NZQtSVD0O2GBbUZ&index=6 



సినిమా ట్రైలర్:

https://www.youtube.com/watch?v=gHbiVKq0jtY






Tuesday, October 7, 2025

OTT Entertainment 4 : కొరియన్ పిచ్చి!


                                                                         
                                                 


ఓటిటిలో వచ్చేరకరకాల భారతీయ భాషల సినిమాలు, వెబ్ సిరీస్లు చాలవన్నట్లు ఇతర దేశ భాషల వెబ్ సిరీస్లు బాగా చూసేయడం మన ప్రేక్షకులకి బాగా అలవాటయిపోయింది. (అలా అనేకన్నా నెమ్మదిగా అలవాటు చేసేసారు అనాలేమో!) 

అందులో వింతేముంది.. విదేశీ భాషలలో సిన్మాలు, సీరియళ్ళు చూడడం తప్పా ఏమిటి? కొత్త భాష నేర్చుకోవచ్చును కదా అనుకోవచ్చు. అవును మరి మేమూ మా చిన్నప్పుడు టీవీ చూసే హిందీ, తమిళం, ఇంగ్లీషు మొదలైన రెండు, మూడు భాషలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఓటీటీ వల్ల మళయాళం, కన్నడం, మరాఠీ, బెంగాలీ మొదలైన భాషలు(కొన్ని లాంగ్వేజ్ సెలెక్షన్ లేని సినిమాలు కూడా ఉంటున్నాయి మరి) కూడా కాస్త బాగానే అర్థమైపోతున్నాయి. పోనీలే ఈ వంకన కొన్ని భారతీయ భాషల పదజాలాలు, పదాలు తెలుస్తున్నాయి అని చిన్నగా ఆనందపడుతూ పడుతూ ఉండగా, ఈమధ్యన అంటే ఈమధ్యన కాదుగానీ ఓ ఏడాది నుంచీ కొరియన్ వెబ్ సిరీస్లు ఇంట్లో బాగా వినిపిస్తున్నాయి. ఇదేమిటీ ఇన్ని భారతీయ భాషలు ఉండగా అవేమీ సరిపోవన్నట్లు కొత్తగా ఈ కొరియన్ భాషేమిటీ? అని ప్రశ్నిస్తే మా పాపగారికి అవే బాగా నచ్చాయట. పొద్దంతా అదే గోల. దే, వే అనుకుంటూ దీర్ఘాలు తీసుకుంటూ డైలాగులు వినిపిస్తూ ఉంటాయి వంటింట్లోకి. నేను అడిగితే ఒక్కదానికీ టైమ్ దొరకదు కానీ కూతురుతో పాటూ కొరియన్ సీరియళ్ళు చూడడానికి మాత్రం ఎక్కడ లేని సమయం దొరికేస్తుంది అయ్యగారికి. అందుకని నాకింకా కోపం అవంటే.


ఏదో ఒకటి పోనీ కలిసి చూసేద్దాం అని సరదా పడి కూచుంటే పది నిమిషాలు కూడా చూడలేకపోయాను నేనైతే. అందరు ఆడవాళ్ల మొహాలూ ఒకలాగే ఉంటాయి. గుండ్రంగా ఉండే కళ్ళు, మైదా పిండిలా తెల్లని తెలుపు, అందరూ ఒకేలా ఉంటారు, పోనీ అంత అందంగా ఉన్నారు కదా అని చూస్తే ముసలమ్మల్లాగ సాగదీసుకుంటూ మాట్లాడతారు ఏమిటో...చిరంజీవిలాగ అంత చక్కని రూపేంటీ? ఆ భాషేంటీ అంటాను నేను. మా అమ్మాయి ఆ భాషని ఎనలైజ్ చేసి, ఏమేమిటో లింగ్విస్టిక్ పాఠాలు చెప్తూ ఉంటుంది నాకు. మా ఇంట్లోనే అనుకుంటే కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్ ఫోన్ చేసి మా పిల్లలు కూడా తెగ చూస్తారు కొరియన్ సిరీస్లు. నేనూ చూస్తాను వాళ్ళతో, ఎంత బాగుంటుందో! అని ఒక సీరీస్ పేరు చెప్పింది. పొరపాటున అది చెప్పాను. అంతే అది అయిపోయేదాకా వదల్లేదు మా వాళ్ళు. ఇదిగో మీ ఫ్రెండ్ చెప్పిందిగా నువ్వూ చూడు అని చూపెట్టేసారు. అదేదో అత్తగారూ, కోడలు, ఇగోలు, ఆస్థుల ఇగోలు, ఆస్తుల  సిరీస్. ఎత్తుకు పై ఎత్తులు, చివరికి క్షమించేసుకోవడాలు! కథ బానే ఉంది కానీ ఇవన్నీ మన కథల్లో కూడా ఉన్నాయి కదా.. 


అంతకు ముందు ఏదో హోటల్ రిలేటెడ్ స్టోరీ. ఒక్కసారి చూడడమే కష్టం అంటే, కాస్త గ్యాప్ తర్వాత కామిడీ బాగుంటుంది అంటూ ఆ సిరీస్ ని రెండోసారి కూడా మోగించారు మా ఇంట్లో. ఒక స్టార్ హోటల్ ఓనర్, స్టాఫ్. ఒక ట్రయినీ పిల్ల పై ఓనర్ కి ప్రేమ. ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. అక్కడా ఏవేవో కుట్రలు,కుతంత్రాలూ. వాట్స్ న్యూ? ఐ డోన్నో !! అందులో పాటలు డౌన్లోడ్ చేసుకుని బట్టీ పట్టేసి పాడేసేంత పిచ్చిగా మా పిల్ల, ఇంకా రిలెటివ్స్ పిల్లలు అంతా కూడా తెగ చూసేసారు. 


ఆ తర్వాత ఒక కోర్ట్ డ్రామా. సాధారణంగా అలాంటివి నేనూ చూస్తాను కానీ ఇందులో ఏం చేసారంటే హీరోవిన్ లాయర్ పిల్ల ఆటిస్టిక్ అమ్మాయి. అయినా అద్భుతమైన తెలివితేటలతో ఉండి, ఎవ్వరూ పట్టుకోలేని లా పాయింట్లు లాగి కేసులు గెలిచేస్తూ ఉంటుంది. అలాంటివాళ్లని నేను ఏమీ అనట్లేదు, కానీ అలాంటి కేరెక్టర్ ఉంటే అసలు చూడలేను. ఆ సిరీస్ ఇక ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అది కూడా వంటింట్లోకి దీర్ఘపు సాగతీత డైలాగులు వినిపించడమే. 


ఆ తర్వాత మరో హారర్ సిరీస్. అందులో మాయలు కూడా. ఇంక చాలర్రా అంటే అపుతారా? ఇంక ఇప్పుడు ఓ వారం నుంచీ మరో కొత్త కొరియన్ సిరీస్ చూస్తున్నారు మా ప్రేక్ష మహాశయులు. నిన్న ఆదివారం పొద్దున్న మా పిల్ల ఇంక నన్ను పారిపోకుండా పట్టుకుని , అమ్మా నీకు వంటలు అయితే నచ్చుతాయి కదా ఇది వంటల సీరియల్ చూడు కొత్త కొత్త వంటలు ఎంత బాగా చేస్తుందో ఈ అమ్మాయి అని కూర్చోపెట్టింది. సేమ్ సేమ్ ఫేసెస్, సేమ్ సేమ్ డైలాగ్స్, నాకేమీ ఎక్సైటింగ్ గా అనిపించలేదు. అయినా వంటలు కదా అని కాసేపు చూశాను. ఏదో బుక్కు లోంచి రాజుల కాలంలోకి ఆ షెఫ్ వెళ్పోతుందిట.[మన టైం లోంచి రాజుల కాలం లోకా...ఇదేదో మన ఆదిత్యా 369 కథ లా ఉంది కదా] సో, ఆ రాజుగారికి ఆ అమ్మాయి వంట నచ్చేసి హెడ్ కుక్ గా పెట్టేసుకుని, రోజూ కొత్త కొత్త వంటలు చేయించుకుని తినేస్తూ, ఆమ్మాయిని విపరీతంగా ప్రేమించేస్తూ ఉంటాడు. ఇంతలో మరో రాజ్యం వారితో వంటల పోటీ. ఇరు రాజ్యాల వారూ అతి అరుదైన పదార్థాలతో రుచికరమైన వంటలు చేసి పెట్టేస్తే, ఆ రాజులు అద్భుతమైన ఫీలింగ్స్ చూపెడుతూ తినేస్తూ ఉంటారు. కథ బానే ఉంది గానీ ఆ వండే పదార్ధాలని చూస్తే కడుపులో తిప్పింది నాకు. డక్కులు, చికెన్లు, ఇంకా ఏవేవో క్రిమికీటకాలు, రోస్టింగులు. 'అవన్నీ చూడకూడదమ్మా, వంట ఎలా చేస్తున్నారో చూడాలంతే..' అని నాకు సలహాలు. మళ్ళీ ఆ కథలో కూడా కుట్రలు, ఎత్తుకు పై ఎత్తులు.. ఎక్కడ చూసినా అవే కథలు కదా! మన దగ్గర లేని కథాలా?  మరి ఎందుకీ కొరియన్ పిచ్చి? 


చాలా మంది ఇవి చూస్తున్నారనడానికి ఒక ఉదాహరణ - ఇటీవల ఏదో సినిమా టైటిల్స్ లో కథ కొరియన్ రైటర్ దని చూసి హాచ్చర్యపోయాను. ఇంకా మొన్నమొన్న ఓటీటీలో వచ్చిన కొత్త "సుందరకాండ" సినిమాలో హీరో తల్లి ఒక డైలాగ్ అంటుంది. ఏమంటున్నావే అంటారు ఆవిడ భర్త. ఆ ఫలానా డైలాగ్ ని కొరియన్ భాషలో అన్నానండి అంటుంది ఆ తల్లి. ఆవిడకి కొరియన్ సీరియళ్ల పిచ్చి అని, అస్తమానూ అవే సిరియల్స్ చూసేస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. జంధ్యాల ఉండుంటే ఈ కేరక్టర్ని ఇంకాస్త బాగా ఎలివేట్ చేసేవారేమో అనిపించింది. అన్నట్లు ఆ కొత్త "సుందరకాండ" సినిమా కూడా బావుంది సరదాగా. 


ఇంతకీ నాకు అర్థంకాని పాయింట్ ఒక్కటే.. మన భారతీయ కథల్లో, సినిమాల్లో లేని కొత్తదనం ఆ కొరియన్ కథల్లో ఏముందీ అని?! అవే మంచి-చెడు, అవే కుళ్ళు,కుట్రలు, పగలు-ప్రతీకారాలు, అవే చెడు అలవాట్లు, గృహ హింస, అవే ప్రేమలు. ఇంకా మన కథల్లో మనుషులు వేరు వేరుగా ఉంటారు. వాళ్ళేమో చూడ్డానికి కూడా అంతా ఒకేలా ఉంటారు. ఏమిటో.. నాకయితే ఎంత మాత్రం నచ్చవు. 


ఈ వంట సీరియల్ అయిపోయాకా ఇంకో కొత్త కొరియన్ సిరీస్ రాకుండా ఉంటే బాగుండ్ను అని మాత్రం కోరుకుంటున్నాను. లేకపోతే నే అడిగే ప్రశ్నలకి నాకే మళ్ళీ క్వశ్చన్ మార్కులా మా అమ్మాయి చెప్పే కొరియన్ సమాధానాలకి నేను గూగుల్ సర్చ్ చేసుకోవాల్సివస్తోంది :((

కొసమెరుపు ఏమిటంటే నిన్న పొద్దున్న వంటల సీరియల్ చూస్తున్నప్పుడు యురేకా నేనొకరిని గుర్తుపట్టా అన్నాను. ఏమిటంటే ఈ హీరోయిన్ను ఇదివరకూ హోటల్ సీరియల్లో హీరోయిన్నుగా వేసినమ్మాయి అని!! "ఆహా..అమ్మా నువ్వు.. నువ్వు గుర్తుపట్టావా...నువ్వు అప్గ్రేడ్ అయ్యావమ్మా. ఐయామ్ వెరీ హేపీ" అంది మా అమ్మాయి!