Thursday, December 31, 2020
నాకై నేను వెతికే క్షణాలు...
Sunday, September 27, 2020
"నువ్వు లేవు నీ పాట ఉంది"
"ఇప్పుడు నువ్వు లేవు నీ పాట ఉంది
నా లోపల లోపల
ఆరిన కుంపటిలో రగులుతున్న
ఒకే ఒక స్మృత్యాగ్నికణంలాగ"
He has left a vacuum that can never be filled by any other voice!! తెలుగు భాష మాత్రమే కాదు, సినీ సంగీతం బ్రతికి ఉన్నంతవరకూ బాలూ గళం ప్రజల మన్ననలు పొందుతూనే ఉంటుంది. ఆచంద్రార్కము, అమరం అనే పదాలకు బాలూ గళమే సరైన ఉదాహరణ అనిపిస్తోంది ఇవాళ.
తెలుగు పాట కాకపోయినా ఈ తమిళగీతం నాకు ఎంతో ఇష్టమైనది -
"నా ఏడుపు నాకు తప్ప లోకానికి వినిపించనివేళ
నే కూరుకుపోతున్న చేతకానితనపు వానాకాలపు బురద మధ్య
నీ పాట ఒక్కటే నిజంలాగ
నిర్మలమైన గాలిలాగ
నిశ్శబ్ద నదీ తీరాన్ని పలకరించే శుక్తిగత మౌక్తికంలాగ
ఇంటి ముందు జూకామల్లెతీగలో అల్లుకుని
లాంతరు వెలుతుర్లో క్రమ్ముకొని
నా గుండెల్లో చుట్టుకుని
గాలిలో ఆకాశంలో
నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని
నీరవంగా నిజంగా ఉంది
జాలీగా హాయిగా వినబడుతూ ఉంది"
గత రెండు రోజులుగా రేడియోలో రకరకాల ఛానల్స్ లో వినిపిస్తున్న బాలూ పాటలు వింటూంటే నాకు పదే పదే ఈ పైన రాసిన కవితా వాక్యాలు గుర్తుకువస్తున్నాయి. ఒకటా రెండా? ఇది, అది అని ఏ పాటను ప్రత్యేకించి చెప్పాలో తెలియటంలేదు. చిన్నప్పుడు రేడియోలో విన్న"సిరిమల్లె నీవే" నుంచీ ఇటీవలి ’శతమానం భవతి’ లోని "నిలువదే మది నిలువదే" పాట వరకూ ఉదహరించ వీలుకాని వేలకొద్దీ ఎన్నో గొప్ప పాటలు!! దేశం యావత్తూ మత్తెక్కినట్లు ఊగిపోయిన శిఖరాగ్రంలోని "శంకరాభరణం" పాటలు ఓ పక్కన పెడితే; "బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది" అని కాలేజీ పిల్లలందరూ పాడుకున్నా, "ఓలమ్మీ తిక్కరేగిందా" అని యువత ఉర్రూతలూగినా, "ప్రేమా ప్రేమా.." అంటూ ప్రేమికులు పాడుకున్నా, పదాలు ఉదహరించలేని కొన్ని ప్రత్యేకమైన శృంగారగీతాలు మత్తెక్కించినా, "ఆనాటి ఆ స్నేహమానందగీతం" అని నడివయస్సు వాళ్ళు పాడుకున్నా, "అంతర్యామీ అలసితి సొలసితి" అని వయసుమీరినవారు స్వగతాలుగా పాడుకున్నా, ఆ గొప్పతనం ఆ పాటల సాహిత్యానిది మాత్రమే కాదు, ఆ సాహిత్యాన్ని మన మనసుకు హత్తుకునేలా వినిపించిన బాలూగళానిది కూడా! రిక్షా నడిపే శ్రామికుడి మొదలు ఖరీదైన గదుల్లో రిలాక్సయ్యే ధనవంతుల వరకూ ప్రతి ఒక్కరూ నిత్యం విని ఆస్వాదించే ఆ మధురగళం బాలూని అందరివాడిగా మార్చేసింది. He is not just a singer, He is Family! అదీ మన తెలుగువారింట మాత్రమే కాదు, తను పాడిన ప్రతి పాటనూ పలికేవారందరికీ బాలూ ఒక కుటుంబసభ్యుడు. అందుకే ఇవాళ తను లేని లోటు అందరినీ బాగా దిగులుపెడుతోంది.
’కరోనా తనని తీసుకుపోయింది ’, ’ఫలానావారిది తప్పు’ అంటూ ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నా, నాకు మాత్రం ఒక్కటే అనిపిస్తోంది - ఇవన్నీ just reasons. Death has to have a reason. It finds its way in any of the directions. "మృత్యుదేవత నేరం తన మీద పెట్టుకోదమ్మా.. ఏదో ఒక వ్యాధి రూపంలో వచ్చి, నేరాన్ని దాని పైకి నెట్టేస్తుంది" అంటూ ఉండేది మా తాతమ్మ. ఘనమైన, వైభవోపేతమైన కళాజీవితం, చివరలో ఓ నెల రోజుల అనారోగ్యం ఆయన destinyలో ఉన్నాయన్నమాట అనిపించింది.
ఆమధ్యన ఒకరు మీ ఫేవొరేట్ సింగర్ ఎవరు అని అడిగితే "హరిహరన్" అని చెప్పాను. మరి మీకు? అని అడిగితే, "ఇంకెవరూ.. బాలూ! నవరసాలనూ అంత బాగా పలికించగల మరో గళం నాకు కనబడదు" అన్నారు ఆవిడ. తర్వాత చాలా సేపు ఆలోచించాను - నిజమే కదా ఎప్పుడూ ఆ కోణంలోంచి చూడలేదు.. ఏ పాట విన్నా ఆ హీరోకో, ఆ సందర్భానికో అతికినట్టు పాడడం ఒక్క బాలూకే సొంతం. తన ప్రతి పాటా తను పాడినట్లు మరొకరు ఎప్పటికీ పాడలేరు అన్నది నూరుశాతం సత్యం. మనసు గదిలో ముందువరుసలో హరిహరన్ నిలబడినా, లోపల్లోపల నాకూ బాలూ అంటే ప్రేమ ఉంది అని అప్పుడు అనిపించింది. బహుశా అందుకేనేమో ఆ రోజు రాత్రి ఫోన్ అప్డేట్స్ లో కమల్ హాసన్ బాలూను చూసి వెళ్లారుట అన్న వార్త చదివినప్పటి నుండీ మనసులో ఏదో దిగులు, సన్నని బాధ నిదురపోనివ్వలేదు. వినకూడదనుకున్న వార్త వినాల్సివచ్చిన రెండు రోజుల తర్వాత ఇప్పటికి ఈ వాక్యాలు రాయగలుగుతున్నాను.
నాన్న స్నేహితుడైన మూర్తిబాబయ్య (సంగీత దర్శకుడు ఈ.ఎస్.మూర్తి) ఎస్.ఏ.రాజ్ కుమార్ దగ్గర పనిచెయ్యని క్రితం మొదట్లో కొన్నేళ్ళు బాలూ గారి దగ్గర కూడా ఉన్నారు. అందువల్ల వారి సాన్నిహిత్యం ఎంతో అపురూపమైనది. దూరంగా ఉండే మనలాంటివారికే ఇంత బాధ ఉంటే, కొన్నేళ్ల పాటు సన్నిహితంగా ఉండి, కలిసి పనిచేసినవారికి ఎంత బాధగా ఉంటుంది? నాన్న పలకరిస్తే, "జీవితంలో ఇంత శూన్యంగా ఎప్పుడూ లేదండీ" అన్నారట తను. బాలూ స్వగృహంలో వాళ్ళు కలిసినప్పుడు తీసుకున్న ఈ చిత్రాన్ని షేర్ చేసి, నేను వ్యాసంలో ప్రచురించడానికి అనుమతి ఇచ్చినందుకు బ్లాగ్ముఖంగా మూర్తిబాబయ్యకు ధన్యవాదాలు.
ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో నాన్న పనిచేసినప్పుడు, 1971లో బాలూగారిని నాన్న ఇంటర్వ్యూ చేసినప్పటి చిత్రం -
చిన్నప్పటి నుండీ ఎరిగి, మా తెలుగువాళ్ళు అని మనం గర్వంగా చెప్పుకునే మహామహులంతా ఒక్కొక్కరే మాయమైపోతున్నారు. వేటూరి, బాపూ, రమణ, బాలమురళీకృష్ణ, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం!! ఇలా మన తెలుగుభాషని జాతీయ స్థాయిలో గర్వంగా నిలబెట్టినవారంతా వెళ్ళిపోతుంటే, ముందుముందు మన తెలుగుతనపు ఘనతని చరిత్రలోనే చదువుకోవాలేమో అనిపిస్తోంది :(
*** *** ***
బాలూ గురించి జానకమ్మ గారి ఆప్యాయమైన మాటలు -
-----------------------------------
** (వ్యాసంలోని కవితా వాక్యాలు దేవరకొండ బాల గంగాధర తిలక్ "అమృతం కురిసిన రాత్రి"లోని "నువ్వు లేవు నీ పాట ఉంది" కవిత నుండి)
Wednesday, July 8, 2020
Pressure cooker
* స్టార్టప్స్ ని ఎంకరేజ్ చెయ్యాలి.
Thursday, April 30, 2020
Remembering Irfhan..
చిన్నప్పుడు టీవీ తో ఉన్న గాఢమైన అనుబంధం వల్ల ఆనాటి నటీనటులు, ఆనాటి సీరియల్స్, ఆ జ్ఞాపకాలన్నీ ఎంతో మధురంగా అనిపిస్తాయి. ఆ అనుబంధం వల్లే ఆనటి నటీనటుల పట్ల కూడా అభిమానం నిలిచిపోయింది. హిందీ ఛానల్స్ మాత్రమే ఉండే ఆ రోజుల్లో ఎందరో గొప్ప నటులు ఉండేవారు. వారిలో అతికొద్ది మందికే వెండితెరపై వెలిగే అవకాశం దక్కింది. వారందరిలోకీ ఒక విలక్షణ నటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఒకరు ఇర్ఫాన్ ఖాన్!
ఇర్ఫాన్ ఖాన్ పేరు వినగానే నాకు ఎప్పటికీ గుర్తుకు వచ్చేది "బనేగీ అప్నీ బాత్(Banegi Apni Baat)" అనే టివీ సీరియల్. Madhavan, shefali chaya, Irfhan khan మొదలైన నటులను నాకు పరిచయం చేసిన ఆ సీరియల్ ఎంతో బావుండేది. కథ, కథనం, నటీనటుల అద్భుతమైన అభినయం అన్నీ బావుండేవి. కాలేజీ రోజుల్లో అస్సలు మిస్సవకుండా చూసేవాళ్లం.. నేను, నా స్నేహితురాళ్ళూ. అప్పట్లో ఇర్ఫాన్ ని ఇంకా మరెన్నో సీరియల్స్ లో చూసేదాన్ని. నాకు బాగా గుర్తున్నవి - 'చంద్రకాంత', 'చాణక్య', 'శ్రీకాంత్', 'స్పర్ష్' సీరియల్స్. మంచి వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకునేవాడు ఇర్ఫాన్. మంచి పాత్రలను ఎంత బాగా చేసేవాడో, నెగెటివ్ రోల్స్ లో కూడా అంతే బాగా నటించడం అతడి ప్రత్యేకత. అందుకేనేమో అంతమంది టీవీ ఆర్టిస్టుల్లో బాగా గుర్తుండిపోయాడు.
సినిమాల్లో అవకాశాలు లేటుగా వచ్చినా అదృష్టవశాత్తూ మంచి memorable roles లభించాయి ఇతనికి. తను నటించిన సినిమాల్లో నేను చూసినవి చాలా తక్కువే. తపన్ సిన్హా తీసిన "ఏక్ డాక్టర్ కీ మౌత్", విశాల్ భరద్వాజ్ తీసిన "మక్బూల్", తెలుగులో విలన్ గా నటించిన "సైనికుడు", Salaam bombay, Slumdog millionaire, New york, New york, I love you, Life in a - Metro, Life of Pi, The lunch box, Piku మొదలైనవి గుర్తున్నాయి. అన్నింటిలోనూ Piku బాగా గుర్తుంది. ముఖ్యంగా చిత్రంలో వంద శాతం మార్కులు అమితాబ్ నటనకే అయినా, దీపిక తో పాటూ అంతే దీటుగా నటించిన ఇర్ఫాన్ పాత్ర కూడా గుర్తుండిపోయింది.
తన కృషికీ, కష్టానికీ ఫలితంగా పద్మశ్రీ పురస్కారాన్ని సగర్వంగా అందుకోగలగడం ఒకవిధంగా చాలా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ప్రతిభ ఉండి, ఎంతో కళాసేవ చేసిన ఎందరో మహానుభావులు, కళాకారులు ఆ పురస్కారాన్ని అందుకోకుండానే వెళ్పోయారు. ఇర్ఫాన్ ఇక లేడన్న వార్త చదవగానే బాధతో పాటూ ఒక నిట్టూర్పూ... ఇతని ఆయుష్షు సంగతి తెలిసేనేమో భగవంతుడు పిన్న వయసులోనే ఆ పురస్కారాన్ని ఇర్ఫాన్ కి అందించేశాడనిపించింది.
హాస్పటల్ లో తన అభిమానుల కోసం రికార్డ్ చేసిన తన చివరి సందేశం గురించి చదివి మనసు ఎంతో ఆర్ద్రమైంది..! చివరి క్షాణాలని ఎదుర్కోవడానికి కూడా ఎంతో bravery ఉండాలి.
అవే చివరి క్షణాలు అని తెలియకుండా వెళ్పోయేవారు దురదృష్టవంతులే కానీ అవే చివరి క్షణాలు అని తెలిసాకా చెప్పే మాటల్లో ఎంతో సత్యం దాగి ఉంటుంది. ఈమధ్యన near death experiences గురించి ఒక ఇంటర్వ్యూ లో చాలా ఆసక్తికరమైన విషయాలు విన్నాను.
హ్మ్!! ఏదేమైనా ఇర్ఫాన్ ఆత్మకి శాంతి కలుగుగాక!
ఈ సందర్భంలో H.W.long fellow పద్యంలోని
నాలుగు వాక్యాలు ...
"Lives of great men all remind us
We can make our lives sublime,
And, departing, leave behind us
Footprints on the sands of time"
Wednesday, March 11, 2020
మల్లేశం
ఎప్పుడు విడుదల అయ్యాయో కూడా తెలీకుండా కొన్ని అరుదైన చిత్రాలు విడుదలై అతి త్వరగా మయమైపోతూ ఉంటాయి. మన జీవన శైలి, గమ్యం ఏవైనా, ఆ సినిమా చూసిన ప్రతి వ్యక్తికీ స్ఫూర్తిని అందించి, ఒక నూతనోత్సాహాన్ని నింపే పనిని ఇటువంటి అరుదైన చిత్రాలు చేస్తూ ఉంటాయి. అటువంటి కోవకి చెందిన అరుదైన ప్రేరణాత్మక బయోపిక్ "మల్లేశం". తెలుగు సినిమా వెలుగుని తళుక్కుమని చూపెట్టే అతికొద్ది మెరుపుల్లాంటి సినిమాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుంది.
పెళ్ళిచూపులు సినిమాలో "నా చావు నే చస్తా నీకెందుకు?" అనే డైలాగ్ తో ఫేమస్ అయిన నటుడు ప్రియదర్శి ప్రతిభావంతుడైన కళాకారుడిగా తనను తాను నిరూపించుకున్న ఒక ప్రేరణాత్మక బయోపిక్ "మల్లేశం". 2017లో తాను తయారుచేసిన "లక్ష్మీ ఆసు చేనేత యంత్రం" ఆవిష్కారానికి గానూ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న చింతకింది మల్లేశం జీవితకథ ఈ చిత్రానికి ఆధారం. చింతకింది మల్లేశం వృత్తిరీత్యా ఒక చేనేత కార్మికుడు. తెలంగాణా లోని నల్గొండ జిల్లాకు చెందిన షార్జిపేట గ్రామంలో సాంప్రదాయంగా వస్తున్న పోచంపల్లి పట్టుచీరల నేతపని చేసే కుటుంబం వారిది. చిన్ననాటి నుంచీ తన గ్రామంలో చేనేత పని చేసే కుటుంబాలలో మహిళలు పడే శ్రమనూ, ఇబ్బందులనూ చూస్తూ పెరుగుతాడు మల్లేశం. ముఖ్యంగా తన ఇంట్లో తల్లి పడే కష్టాన్ని దగ్గర నుంచి గమనిస్తూ వస్తున్న ఆపిల్లాడికి ఒకటే తపన - తల్లిని సుఖపెట్టాలని; నేత పనిలో ఉన్న ఇబ్బందుల నుండి తల్లికీ, తన గ్రామంలోని ఇతర మహిళలకూ శ్రమను తగ్గించాలని! తమ ఇంట్లోని బలహీనమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరవ తరగతితో మల్లేశం చదువు ఆపేయాల్సివస్తుంది. విషయం కనుక్కోవడానికి ఇంటికి వచ్చిన మాష్టారు ఒక డిక్షనరీ ఇచ్చారనీ, అది తనకెంతో ఉపయోగపడిందని సినిమా చివర్లో చూపించిన ఉపన్యాసంలో చెప్తాడు చింతకింది మల్లేశం.
మషీన్ తయారుచెయ్యాలని సంకల్పం అయితే చేసుకుంటాడు కానీ సరైన(సాంకేతికపరమైన) చదువులేకపోవడం వల్ల అది ఎలా తయారుచెయ్యాలో తెలీక సతమతమౌతాడు మల్లేశం. కొన్నేళ్ల పాటు ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుంటూ, కుటుంబానికి దూరంగా పట్నంలో ఉంటూ, చివరికి అనుకున్నది సాధిస్తాడు అతను. తయారు చేసిన మషీన్ కు తన తల్లి పేరు పెట్టి, అందరికీ చూపెడతాడు.
ఒక జీవిత కథను సినిమాగా మలిచేప్పుడు ఎన్నో మార్పులు జరుగుతాయి. కానీ ఈ అసలు కథలో నిబిడీకృతమైన స్ఫూర్తిని ప్రేక్షకుల మనసుల దాకా తీసుకురావడంలో దర్శకుడు రాజ్ రాచకొండ సఫలీకృతమయ్యారు. నటి ఝాన్సీ తానొక మంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ నని మరోసారి నిరూపించుకుంది. కమెడియన్ గానే ఎక్కువగా పాపులర్ అయిన ప్రియదర్శి కూడా అవకాశం ఇస్తే ఎటువంటి పాత్రనైనా సులువుగా చెయ్యగలనని మల్లేశం పాత్రతో నిరూపించాడు. చక్కని పల్లె వాతావరణం, నటీనటుల సహజమైన నటన, ముఖ్యంగా వారి సహజమైన మేకప్, పల్లెల్లో జరుపుకునే పండుగలు, ఉత్సవాలు అన్నీ బాగా చూపెట్టారు.
ఏ పాటలు పెట్టకపోతే కూడా ఇంకా సహజంగా ఉండేదేమో అనిపించింది కానీ ఈ జానపద గీతం బావుంది -
చింతకింది మల్లేశం inspirational TEDx speech:
ఈ చిత్రాన్ని Netflix లో చూడవచ్చు. ఇటువంటి మంచి చిత్రాలు మరిన్ని ఆన్లైన్ మాధ్యమాల్లో లభ్యమయ్యే ఏర్పాటు జరిగితే బావుంటుంది.
Saturday, March 7, 2020
చిllలllసౌll
2018లో విడుదలైన "చిllలllసౌll " చిత్రం విడుదలైనప్పుడు, టైటిల్ తమాషాగా ఉందే చూద్దామనికునేలోగా, చాలా త్వరగా వెళ్పోయింది. గత ఏడాదిలో నాకు ఈ చిత్రం చూడడం కుదిరింది. చాలా బావుందని బంధుమిత్రులందరికీ వీలైతే చూడమని సజెస్ట్ చేశాను. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి ఇది మొదటి చిత్రమని తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. మొదటి సినిమా ఇంత పర్ఫెక్ట్ గానా అని. ఆ తర్వాత ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే కు గానూ జాతీయ బహుమతి లభించిందని చదివి చాలా ఆనందించాను.
’పెళ్ళిచూపులు ’ అనే తతంగం ఒక సమరంలాగ, జీవన్మరణ సమస్య లాగ సాగిన రోజుల్లో, ఇష్టం ఉన్నా లేకున్నా పెళ్ళిచూపులకి కూర్చున్న ప్రతి అమ్మాయీ ఈ కథకు కనక్ట్ అవుతుంది. హీరోయిన్ గా నటించిన రుహానీ శర్మ ఎంతో బాగా తన పాత్రను ప్రెజెంట్ చేసింది. ఆమె పాత్రకు ప్రాణం పోసిన క్రెడిట్ మాత్రం ఆమెకు గాత్రదానం చేసిన చిన్మయి శ్రీపాదకి దక్కుతుంది. అసలా అమ్మాయి వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది. పాడే పాటకూ , చేప్పే డబ్బింగ్ కూ - రెండిటికీ ప్రాణం పోసేస్తుంది. గిఫ్టెడ్ వాయిస్ అనాలేమో!
ఇంక కథలోకి వస్తే "ఐదేళ్ల వరకూ అసలు పెళ్ళే వద్దు" అంటున్న ఒక అబ్బాయిని పెళ్ళి చూపులకి ఒప్పిస్తారు అతడి అమ్మానాన్నా. పేరు అర్జున్. పెళ్ళిచూపులకి వెళ్లడం అర్జున్ కి ఇష్టం లేదు కాబట్టి ఓ సంబంధం చూసి, ఆ అమ్మాయిని వాళ్ల ఇంటికే రావడానికి ఒప్పించి, ఓ సాయంత్రం పూట - "ఆ అమ్మాయి వచ్చేస్తోంది రెడీగా ఉండు" అని కొడుక్కి చెప్పేసి, వాళ్ళు షికారుకి వెళ్పోతారు. అయోమయంగా మారిన ఆ అబ్బాయి వచ్చిన అమ్మాయితో సరిగ్గా మట్లాడడు. ఇష్టం లేకపోతే నన్నెందుకు పిలిచారు అని ఆ అమ్మాయి కోప్పడేస్తుంది. "ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలి.." అని అనుకుంటూ ఆ మాట బయటకు అనేస్తుంది. అదేమిటని అబ్బాయి అడుగుతాడు. అప్పుడు తన కథ చెప్పుకొస్తుంది అంజలి(వచ్చిన పెళ్ళికూతురు). తన తల్లికి బైపోలార్ డిజాడర్ ఉందనీ, అందువల్ల ఇంతకు ముందు తప్పిపోయిన రెండు సంబంధాల గురించీ, ఇప్పుడు కూడా ఇలాంటి ఆక్వార్డ్ పెళ్ళిచూపులకి ఎందుకు ఒప్పుకున్నదీ చెప్తుంది. ఇద్దరికీ స్నేహం కుదిరి కాసేపు కబుర్లు చెప్పుకున్నాకా ఆ అమ్మయి వెళ్పోతుంది. ఎందుకనో వెళ్ళాలనిపించి, వెనకాలే తలుపు తీసుకుని వచ్చిన ఆ అబ్బాయికి మెట్ల మీద గోడకి తల ఆనించి, బాధగా నిల్చున్న ఆ అమ్మాయి కనిపించి దగ్గరకు వెళ్తాడు. ఆ క్షణంలో విపరీతమైన బాధలో అతడి భుజానికి తల ఆనించి ఏడ్చేస్తుంది ఆ అమ్మాయి. మొత్తం సినిమాలోకెల్లా నాకు బాగా నచ్చిన సీన్ అది. కన్ఫ్యూజింగ్ గా ఉన్న ఆబ్బాయిని తనకి దూరంగా ఉండమని, తన బాధలేవో తానే పడతానని చెప్పి వెళ్పోతుంది. కానీ మన కన్ఫ్యూజింగ్ పెళ్లికొడుకు వెనకాలే వెళ్తాడు. తర్వాత ఆ రాత్రంతా జరిగే కథే మిగిలిన చిత్రకథ !
చాలా స్ట్రాంగ్ గా portray చేసిన అంజలి కేరక్టర్ ఎంతో కాలం గుర్తుండిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి హీరోయినే కాదు హీరో కూడా అంజలే ! పెళ్ళికొడుకు పాత్రధారి సుశాంత్. నాగార్జున పోలికలు బాగానే కనిపించాయి. ఇంతకు ముందు సుశాంత్ సినిమాలేవీ చూడలేదు నేను. ఇలాగే కంటిన్యూ అయితే నటుడిగా నిలబడగలడు అనిపించింది. అంజలి తల్లిగా రోహిణిది కూడా గుర్తుండిపోయే పాత్ర. డి-గ్లామరస్ రోల్ ప్లే చేయడం సామాన్యమైన విషయం కాదు.
ఇంతకన్నా సినిమా గురించి ఏమీ రాయను. వీలైతే చూడమనే చెప్తాను. ట్రైలర్ :
చిత్రంలో ప్రశాంత్.ఆర్.విహారి సంగీతాన్ని సమకూర్చిన రెండు పాటలూ బావున్నాయి. రెండు పాటలలో నాకు నచ్చిన ఈ పాటకు సాహిత్యాన్ని అందించింది కిట్టూ విస్సాప్రగడ .
నీ పెదవంచున విరబూసిన చిరునవ్వులో
ఏ కనులెన్నడూ గమనించని ముళ్ళున్నవో
వర్షించే అదే నింగికీ, హర్షించే ఇదే నేలకీ
మేఘంలా మదే భారమై, నడుమ నలిగి కుమిలి కరిగే
సంకెళ్ళే విహంగాలకి వేస్తున్న విధానాలకి
ఎదురేగే కథే నీది అని తెలిసి మనసు నిలవగలదా?
*** *** ***
మరో పాట "తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా..." కూడా బావుంది. ఆ సాహిత్యాన్ని అందించింది శ్రీ సాయి కిరణ్.
Wednesday, March 4, 2020
ఇప్పుడన్నీ తేలికే..
ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన చాలా ఇష్టమైన కొన్ని పనులు.. మధ్యలో వదిలేయడం చాలా కష్టమే. కానీ ఆ పనులు మన మార్గానికే ఆటంకమై, ముందడుగు పడనీయనప్పుడు, ఆగిపోవడమో, వేరే దారిని వెతుక్కోవడమో.. ఏదో ఒకటి చెయ్యాలి.
నాలుగేళ్ల క్రితం అటువంటి ఆటంకం ఏర్పడినప్పుడు.. ఇది నా సమయం కాదు అనుకుని మౌనంగా ఆగిపోయాను. నాకు ప్రాణ కన్నా ఎక్కువైన ఈ బ్లాగుని కూడా మూసేసాను. వెనక్కు తిరిగి చూసిందే లేదు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటైన పనే. ఈసారి భగవంతుడు నాకు మరో చక్కని మార్గాన్ని చూపెట్టాడు. ఆరేళ్ల బ్లాగ్ రాత వెతను మిగిల్చినా, మరో విధంగా ఉపయోగపడింది.. ఒక పనిలో ఒదగగలిగాను. ఇక తీరదనుకున్న ఒక చిరకాల కోరిక నెరవేరింది ! స్వల్పమే అయినా సొంత సంపాదన ఎంత ఆనందాన్ని ఇస్తుందో, వాటితో కావాలనుకున్న వస్తువులు కొనుక్కోవడం అంతకు మించిన తృప్తిని ఇస్తుంది.
కానీ రాయాలనే బలమైన కోరిక మాత్రం అలానే మిగిలిపోయింది. మనకి ఆనందాన్ని కలిగించి, మనసు పెట్టి చేసే ఏ పనినీ ఆపకూడదంటారు పెద్దలు. చేతనయినంతలో ఏ కోరికనూ మిగిలిపోనీయకూడదనే ఆలోచనతో నాలుగేళ్ళ తరువాత మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. కేవలం రాయడం మాత్రమే..! కామెంట్ బాక్స్ ని తొలగించడం కూడా చాలా తేలిగ్గా చేసిన పని. ఎప్పుడో చెయ్యాల్సినది.. ఇప్పటికైనా ఆలస్యంగా చేసాను.
ఇవాళ ఇంకో పని చేసాను..నా 'సంగీతప్రియ ', 'సినిమా పేజీ' బ్లాగులను డిలీట్ చేసేసాను. అందులోని టపాలన్నీ ఈ బ్లాగ్ లోకి ఇంపోర్ట్ చేశాను. అప్పట్లో.. ఏడు నెలలు మోసిన బిడ్డను కోల్పోయినప్పుడు, ఆ బాధను మరవటానికి నాలుగు కొత్త బ్లాగులు కావాలని మొదలుపెట్టి, మరో ఆలోచన అనేది రాకుండా బ్లాగుల్లో తోచింది రాసుకుంటూ బాధను మరిచేదాన్ని! ఇవాళ నా చేతులతో నేనే ఆ బ్లాగులు డిలీట్ చేశాను. ఒకప్పుడైతే బాధపడేదాన్నే.. కానీ ఇప్పుడు చాలా బావుంది. తేలికగా ఉంది. ఓడిపోయాననిపించడం లేదు. అల్లిబిల్లిగా పెరిగిన మొక్కలను ప్రూనింగ్ చేసినట్లు ఉంది. చిన్న మొక్క నుండీ చెట్లు గా మారిన తోటలో మందారాలు, నందివర్ధనాలూ శుభ్రంగా ట్రిమ్ చేసినట్లు! కొమ్మలు కట్ చేసేప్పుడు చివుక్కుమనిపిస్తుంది, చేతులు రావసలు. కానీ కొత్త చిగుర్లు కనబడగానే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఎందుకనో అనిపించింది..డిలీట్ చేసేసాను.
అయినా చెట్టంత మనుషులే పుటుక్కున మాయమైపోతున్నారు... వాటితో పోలిస్తే ఇదెంతనీ!!
Friday, February 21, 2020
October
2018లో అనుకుంటా ఒకరోజు అనుకోకుండా ఈ సినిమా చూశాను. చాలా చిత్రమైన కథ.
ఒక స్టార్ హోటల్లో intern స్టూడెంట్స్ కొందరు పనిచేస్తూ ఉంటారు. ఒకే గ్రూప్ కాబట్టి అందరూ కలివిడిగా, స్నేహంగా ఉంటారు. కానీ Dan అనే కుర్రాడు కొంచెం రెక్లెస్ గా, ఇర్రెగులర్ గా, ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. మిగతావారితో కూడా పేచీలు పడుతూ ఉంటాడు. గ్రూప్ లో ఒకరిద్దరు మిత్రులు మాత్రమే ఉంటారు. కొత్తగా వచ్చిన జూనియర్ ఒకమ్మాయి పారిజాతం పూలు ఏరుతూండగా చూస్తాడు. ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోరు కానీ ఒకర్ని ఒకరు గమనిస్తూ ఉంటారు. Dan స్నేహితురాలికి ఈ అమ్మాయి ఫ్రెండ్ అన్నమాట. ఆ అమ్మాయి పేరు షూలీ అయ్యర్. పారిజాతాలని "షూలీ" అంటారు. ఆ అమ్మాయికి ఆ పూలు ఇష్టం అని అదే పేరు పెడతారు ఇంట్లోవాళ్ళు.
ఒకరోజు హోటల్ టేర్రేస్ మీద ఏదో పార్టీ జరుగుతుండగా ఆ కొత్తమ్మాయి పిట్టగోడని ఆనుకుందామని వెనక్కి జరిగి పొరపాటున పైనుంచి క్రిందకి పడిపోతుంది. చనిపోదు కానీ మేజర్ ఇంజరీస్ కారణంగా కోమాలోకి వెళ్పోతుంది. Dan రెండురోజుల తర్వాత డ్యూటీకి వచ్చాకా విషయం వింటాడు. ఆ పిల్ల పడిపోయే ముందు మాటాడిన ఆఖరి మాట "where is Dan?" అని తెలిసి ఆశ్చర్యపోతాడు. అప్పటిదాకా ఎంతో రెక్లెస్ గా ఉండే అతడు విచిత్రంగా ఎంతో మారిపోతాడు.. "నా గురించి అడిగిందా? నా గురించా..? " అని ఆలోచిస్తూ ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. హాస్పటల్ బెడ్ మీద ఏ మాత్రం స్పృహ లేకుండా ఉన్న ఆ అమ్మాయిని చూసి కదిలిపోతాడు. "ఎందుకు నా గురించి అడిగావు?" అంటూ ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలుపెడతాడు. నెమ్మదిగా రోజూ వచ్చి కాసేపు ఆ అమ్మాయి దగ్గర కూర్చుని మాట్లడుతూ ఉంటాడు. కోమా లో ఉన్న అమ్మాయికీ , అతడికీ చిత్రమైన బంధం ఏర్పడుతుంది. పెద్దగా పరిచయం కూడా లేని ఆ అమ్మాయి కోసం ఓ కుటుంభసభ్యుడిలా సహాయం చేయడం మొదలుపెడతాడు. ఉద్యోగం చేసే తల్లి మాత్రమే వారి కుటుంబానికి ఆధారం అని తెలుసుని, తన డ్యూటీలు ఎడ్జస్ట్ చేసుకుంటూ వారికి సాయం చేయడం మొదలుపెడతాడు. చిత్రంగా ఆ అమ్మాయితో అతడికి ఎంతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది. బాధ్యతగా తన పనులు చేసుకుంటూ, ఎంతో శ్రధ్ధగా ఆ అమ్మాయిని చూసుకోవడం మొదలుపెడతాడు.
అసలు లేస్తుందో లేదో తెలియని ఆ అమ్మాయి కోసం జీవితం వృధా చేసుకోవద్దని చాలామంది చెప్తారు. షూలీ తల్లి కూడా నచ్చ చెప్పి అతడిని పంపేస్తుంది. వేరే ఊరు వెళ్పోతాడు. ఆ అమ్మాయి కోమాలోంచి లేచిందని ఒకరోజు ఫోన్ వస్తే తిరిగి వస్తాడు. వీల్ చైర్ లో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చేదాకా తోడు ఉండి ఎంతో సహాయం చేస్తాడు. వారిద్దరి మధ్యా పెరిగిన bond, ఆ అబ్బాయి తపన చూసి తీరాల్సిందే! శారీరిక ఆకర్షణలకు అతీతమైన బంధం కూడా ఉంటుంది అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఈ కథ. కోమాలో ఉన్న పేషేంట్స్ తో మాట్లాడుతూ ఉంటే వారికి వినిపిస్తుంది. నెమ్మదిగా మార్పు కూడా వస్తుంది అనే కొన్ని వార్తాపత్రికల వ్యాసల ఆధారంగా ఈ కథ తయారైందిట.
అయితే ఈ కథ క్లైమాక్స్ నాకు నచ్చలేదు :(
i don't like tragedies..!
దర్శకుడు Shoojit Sircar మంచి వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు తీస్తూంటాడు. Dan పాత్రలో వరుణ్ ధవన్ జీవించాడనే చెప్పాలి. ఈ కుర్రాడి సినిమాలు రెండు,మూడు చూశాను. బాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ నటుడికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనిపిస్తుంది. ఈ పాత్ర కోసం వరుణ్ కొన్నాళ్ళు ఒక స్టార్ హోటల్లో పనిచేశాడట కూడా! షూలీ పాత్రను బందిత అనే బ్రిటిష్ నటి పోషించింది. ఎక్కువ సినిమాలు చెయ్యలేదనుకుంటా. భారీ డవిలాగులు చెప్పేస్తూ నటించడం కన్నా ఏ డవిలాగులూ లేకుండా మంచానికి అతుక్కుపోయి, డిగ్లామరస్ రోల్ ప్లే చేయడం చాలా కష్టమైన పని. ఈ పిల్ల కళ్ళు చాలా బావున్నాయి. పేధ్ధవి!
ట్రైలర్:
Thursday, February 20, 2020
'రంగపుర విహార' గానామృతం
దక్షిణ భారత కర్ణాటక సంగీత విద్వాంసులలో చెప్పుకుని తీరాల్సిన కళాకారుడు టి.ఎం. కృష్ణ. గాయకుడే కాక మంచి రచయిత కూడా. కొన్నేళ్ల క్రితం మొట్టమొదటిసారి ఈయన గురించి నేను చదివింది హిందూ దినపత్రికలో. ఈయన పుస్తకం ఒకటి రిలీజ్ అయినప్పుడు పెద్ద ఇంటర్వ్యూ వేశారు పేపర్ లో. అది చదివి ఆసక్తి కలిగి ఈయన సంగీతామృతాన్ని వినడం జరిగింది. అది మొదలు నాకు అత్యంత ఇష్టమైన గాయకుల జాబితాలో చేరిపోయారు టి.ఎం. కృష్ణ. ఆసక్తి ఉన్నవారు ఈయన గురించిన మరిన్ని వివరాలు క్రింద లింక్స్ లో తెలుసుకోవచ్చు.
https://en.wikipedia.org/wiki/T._M._Krishna
https://tmkrishna.com/
టి.ఎం. కృష్ణ కాన్సర్ట్స్ లో అన్నింటికన్నా నాకు బాగా నచ్చినది ముత్తుస్వామి దీక్షితార్ రచన "రంగపుర విహారా.." ! ఈ కృతి వేరే ఎవరు పాడినదీ నాకు అంతగా రుచించదు. ఈయన పాడినది మాత్రం అసలు ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. వింటూంటే... ఏవో గంధర్వలోకాల్లో విహరిస్తున్నట్లు, అమృతం ఇలా ఎవరో చెవిలో పోస్తున్నట్లు, మనసంతా హాయిగా దూదిలా తేలికగా గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది నాకు. ఆసక్తి ఉన్నవారు వినండి -
సాహిత్యం:
రచన : ముత్తుస్వామి దీక్షితార్
రాగం: బృందావనసారంగ
పల్లవి:
రంగపుర విహార జయ కోదండరామావతార రఘువీర
శ్రీ రంగపుర విహార ll ప ll
అనుపల్లవి:
అంగజ జనక దేవ బృందావన
సారంగేంద్ర వరద రమాంతరంగ
శ్యామళాంగ విహంగ తురంగ
సదయాపాంగ సత్సంగ ll ప ll
చరణం:
పంకజాప్త కులజలనిధిసోమ
వరపంకజముఖ పట్టాభిరామ
పదపంకజజితకామ రఘురామ
వామాంక గత సీతా వరవేష
శేషాంకశయన భక్తసంతోష
ఏణాంక రవినయన మృదుతర భాష
అకళంక దర్పణ కపోల విశేష
మునిసంకట హరణ గోవింద
వేంకటరమణ ముకుంద
సంకర్షణ మూలకంద
శంకర గురుగుహానంద విహార ll ప ll
Tuesday, February 18, 2020
కుసుమత్త
**** ****
వెళ్ళాను. వెళ్లగలిగాను! ఫంక్షన్ హాల్ గుమ్మంలో కుసుమత్త మావయ్యగారు కనబడ్డారు. "ఎవరో చెప్పుకోండి..." అనడిగాను. గుర్తుపట్టలేదు. అన్నయ్యని చూసి గుర్తుపట్టారు. అది కూడా వాట్సప్ లో వాడి ఫోటో చూశారుట, అలా గుర్తుపట్టారు. కుమత్తేదీ అని అడిగితే, ఎటో వెళ్తున్న తనని చూపించారు. గభాలున వెనక్కి వెళ్ళి, భుజాలు పట్టుకుని " నేనెవరో చెప్పుకో" అన్నాను.. నవ్వుతూనే ఆలోచిస్తూ చూసింది.. మళ్ళీ అడిగాను "నేనెవరో చెప్పుకో.." అని...హా...అనేసి గుర్తుపట్టేసిందిభలే అనిపించింది. "హ్మ్మ్...నువ్వు గుర్తుపట్టావు. మావయ్యగారు గుర్తుపట్టలేదు" అన్నాను. "ఎంత మారిపోయావూ.. పదేళ్లవుతోంది నిన్ను చూసి.."అంది.
పెళ్ళి బాగా జరిగింది. మధ్యాన్నం, రాత్రి రెండు భోజనాలూ బాగున్నాయి. పొద్దున్నేమో చక్కగా సొజ్జప్పం వేశారు. వంకాయ పులుసు పచ్చడి కూడా. ఈ రెండు ఐటెమ్స్ నేనైతే పెళ్ళిళ్ళలో చూడలేదు. రాత్రి టిఫిన్స్ తో పాటూ లక్కీగా నేను తినదగ్గ ఐటెమ్ దొరికింది -"కొర్రలతో బిసిబెళెబాత్". పెళ్ళయ్యాకా, టైమైపోతోందని పరుగులెడుతూ స్టేషన్ కి వెళ్ళాం. ఎక్కి కూర్చున్నాం. రైలు కదిలింది.
Sunday, January 19, 2020
భగవంతుడి దయ
భగవంతుడి దయ ఉండబట్టి ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది. సాయంత్రం కూరలు కొనుక్కుని రోడ్దుకి ఎడమ పక్కగానే మెల్లగా నడిచి వస్తున్నాను. బరువుగా ఉందని కూరల సంచీ భూజానికి వేసుకున్నాను.. మరుక్షణంలో వెనుకనుంచి ఒక ట్రాలీ వాడు గుద్దేశాడు. బండి నా వీపుకున్న బ్యాగ్ కి గుద్దుకుంది. అమాంతం ముందుకు బోర్లా పడిపోయాను. బ్యాగ్ దూరంగా పడి కూరలన్నీ దొర్లిపోయాయి. వాడు ట్రాలీ ఆపి, దిగి వచ్చి సారి సారీ అనేసి వెళ్పోయాడు. నేను వాడి వైపు కూడా చూడలేదు. ఆ అదురుకి కాసేపు అసలు లేవలేకపోయాను. ఎవరో ఒకామె వచ్చి లేపింది. అదృష్టం బాగుండి చిన్న చిన్న కముకు దెబ్బలతో బయటపడ్డాను. ఏ చెయ్యో కాలో విరిగి ఉంటే, నే మంచాన పడితే ఇల్లెలా గడుస్తుంది?
అరచేతితో అనుకోవడం వల్ల అరచేతి నెప్పి
బాగా ఉంది.. నిజంగా ఎంతటి అదృష్టం నాయందు ఉందో ఇవాళ! లేచిన వేళ మంచిది. భగవంతుడి కృప గట్టిది.