రెండు నెలల క్రితం మావారికి ఓ చిన్న ఏక్సిడెంట్ అయ్యి కాస్త బాగానే దెబ్బలు తగిలాయి. ముందెళ్ళిన డాక్టర్ మామూలు దెబ్బలే అన్నారు గానీ తర్వాత వెళ్ళిన మరో డాక్టర్ గారు ఏంకిల్ దగ్గర హైర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది. రెస్ట్ గా ఉండమన్నారు. సో, ఓ మూడు వారాలు క్రేప్ బ్యాండేజ్ వేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్కున్నారు అయ్యగారు. అదేదో ఏడ్ లో "మరక మంచిదేగా.." అన్నట్లు తనకు దెబ్బలు తగిలించి దేవుడు మాకు మేలే చేసాడు. పెళ్ళయిన ఇన్నేళ్ళకి ఆ మూడువారాలు కాస్త ఖాళీగా తను ఇంట్లో ఉన్నారు. ఆ దెబ్బల వల్ల సత్కాలక్షేపం కూడా జరిగింది. తీరుబడిగా పనులు చేస్కోవడమే కాక తీరుబడిగా పురాణకాలక్షేపం చేసుకుని మహదానందాన్ని కూడా ప్రాప్తం చేసుకున్నాము.. కుంటున్నాము కూడా! ( బయటకు వెళ్పోవడం మొదలెట్టాకా పురాణపఠనం స్పీడ్ తగ్గి, ఇంకా రెండు ఛాప్టర్లు మిగిలి ఉన్నాయి.) మధ్యలో కొన్నాళ్ళు మా అత్తగారు కూడా ఉన్నందున ఆవిడ కూడా పురాణశ్రవణం చేసుకున్నారు.
మాకో అలవాటు ఉంది..(చాలామందికి ఉండే ఉంటుంది) చాలా బాగున్న పుస్తకం కలిసి చదవడం. ఒకళ్లతర్వాత ఒకళ్ళం తలో ఛాప్టర్ చదవడం. ప్రసాద్ గారి నాహం కర్తా హరి: కర్తా, ఇల్లేరమ్మ కథలు, దీపశిఖ, ఆ కుటుంబంతో ఒక రోజు, మోహన్ కందా గారి పుస్తకం... ఇలా కొన్ని పుస్తకాలు కంబైండ్ స్టడీ చేసాం. ఆమధ్యన కోటీలో పాత పుస్తకాల స్టాల్స్ దగ్గర ఏవో పుస్తకాలు కొంటుంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి "శ్రీ శివమహాపురాణము" దొరికింది. పుస్తకం కొత్తగానే ఉన్నా పాతపుస్తకాల దగ్గర పెట్టీ మూడొందల ఏభైకే అమ్మేస్తున్నారు. క్రిందటి పుస్తకప్రదర్శనలో చాగంటివారి భాగవత,రామాయణ, శివమహాపురాణా ప్రవచనాల పుస్తకాలను మూడింటినీ కలిపి డిస్కౌంట్లో అమ్మారు. అప్పటికే చాలా కొనేసినందువల్ల ఇక అవి తీసుకోలేకపోయాము. మూడింటిలో అమ్మ దగ్గర భాగవతప్రవచనం ఉంది. (సగభాగం ఇంకా పూర్తి చెయ్యాల్సి ఉంది.) మిగతావి కూడా కొనుక్కోవాలని మనసులో ఓ మూల కోరిక ఉంది. ఇప్పుడిలా అనుకోకుండా "శ్రీ శివమహాపురాణం" కొనడం జరిగింది. భగవత్ కృప!
కాకినాడలోని అయ్యప్పస్వామి గుడిలో మండలం రోజులు చాగంటివారు చెప్పిన ప్రవచనాలుట ఇవి. (టివీలో వచ్చే ఉంటాయి.) వాటికి పుణ్య దంపతులు శ్రీ పురిఘళ్ళ సత్యానంద శర్మ, శ్రీమతి భాస్కరం గార్లు అక్షరూపాన్ని అందించారు. ఆకర్షణీయమైన బాపూ బొమ్మలతో ఎమెస్కో బుక్స్ వాళ్ళు ప్రచురించారు. వినడం కన్నా పుస్తకం చదవడమే ఇంకా ఆనందాన్ని ఇచ్చిందని మాకనిపించింది. ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలను గురించి , వాటి చరిత్ర, కొన్ని ప్రదేశాల్లో ఉన్న విగ్రహామూర్తులను గురించీ చదువుతుంటే అసలు ఇప్పటిదాకా చూసిన కొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలు మళ్ళీ వెళ్ళి చూడాలనిపించింది. శివుడంటే ఇదివరకటి కంటే ఎక్కువగా ఆరాధన కలిగింది. నా రాముడితో సమానంగా నా మనస్సులో స్థానాన్నధిస్టించాడు ఈశ్వరుడు :)
పుస్తకంలో ముందర కొందరు నాయనార్ల చరిత్రలు ఉన్నాయి. శివుని అనుగ్రహం వల్ల తరించిపోయిన మహాపురుషులైనవారీ నాయనార్లు. ఒక్కొక్కరి కథా ఒకో పాఠం అని చెప్పాలి. తర్వాత పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యాలనూ, వాటి చరిత్రనూ, ప్రాముఖ్యతనూ తెలియజేసారు. మాకు ఇప్పటికి శ్రీశైలంలో మల్లికార్జునుడు, త్ర్యంబకంలోని త్ర్యంబకేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఘృష్ణేశ్వర్ లోని ఘుష్ణేశ్వరుడు, భీమశంకర్ లోని భీమేశ్వరుడూ ఐదు క్షేత్రాల్లోని శివలింగాలను చూసే సదవకాశం కలిగింది. అరుణాచల పర్వతం విశిష్ఠత, రమణ మహర్షి చరిత్ర, అరుణాచలేశ్వర దేవాలయం గురించీ చదువుతుంటే మాత్రం రెక్కలు కట్టుకుని ఆ కొండకు ఎగరి వెళ్ళాలనిపించింది. ఆ దర్శనం, గిరిప్రదక్షిణ ఎప్పటికి ప్రాప్తమో..
పుస్తకంలోని కొన్ని తెలియని, తెలిసిన మంచి విషయములు:
* మన శరీరంలో ఉండే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన్, నాగ, కూర్మ, క్రుకుర, ధనంజయ, దేవదత్తములనే పది వాయువులు, వాటి పనులూ చెప్పారు. శివుడి ఆజ్ఞ వలననే వాయువు జీవుల శరీరములందు ఉండి ఈ పదిరకముల వివిధ కర్మలనూ చేస్తాడుట.
* పూర్వం స్నానం చేసి అగ్నిదేవుడికి నమస్కరించి కట్టె వెలిగించి, మడిబట్ట కట్టుకుని అన్నం వండడం కూడా గౌరవంగా చేసేవారు.
* "పిల్లలను పోటో పరీక్షలకు తయారుచేస్తున్నాం. కానీ పాపభూయిష్టమైన ప్రవర్తనతో వాళ్ళను పెంచి పెద్దచేస్తున్నాం. వాడు రోడ్డుమీదికి వెడితే వాడి కన్నులు చెదరగొట్టి పాపభూయిష్టమైన నడవడి వైపుకి తీసుకువెళ్ళే వాల్ పోస్టర్లు! ఏషాపుకి వెళ్ళినా వాడి మనస్సుని పాడుచెయ్యగలిగిన పుస్తకాలు! ఎన్ని ఛానళ్ళు నొక్కినా అన్నింటిలో వ్యగ్రతతో కూడిన విశేషములు! మీరు వానికి మురికినీరు పట్టించి వాడు వాడు ఆరోగ్యంగా బ్రతకాలంటే వాడు ఎలా బ్రతుకుతాడు?ఈవేళ సమాజానికి భాద్యత లేదు. ప్రభుత్వానికి బాధ్యత లేదు. పెద్దలకు బాధ్యత లేదు...."
"పురాణముల ప్రయోజనం మీ బాధ్యతలను గుర్తు చెయ్యడం. పురాణం ఎప్పటిదోనని, అది పనికిమాలినదని మీరు అనవద్దు. అది ఎప్పటికీ నవీనమే. అది మీ బాధ్యతను మీకు గుర్తుచేస్తుంది. లోక సంక్షేమము ఎక్కడ ఉందో దానిని మీకు జ్ఞాపకము చేస్తుంది."
* తల్లిదండ్రులు ఏ ఏ సంస్కారములతో ఉన్నారో అవి బిడ్డ యందు ప్రతిఫలించి సంస్కారరూపంలో సుఖమును గానీ, దు:ఖమును గానీ ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందుకని క్షేత్రశుధ్ధి కొరకు, భావపరిపుష్టి కొరకుమనవాళ్ళు పూర్వం కొంతకాలం భార్యాభర్తలు దేవతారాధనం చేసేవారు. బాగా మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమయిన తరువాత సంతానము కనేవారు. ఈశ్వరారాధనలో పరిపుష్టి లోపించినట్లయితే, నిష్ఠ లోపించినట్లయితే సంతానమునందు వ్యగ్రతతో కూడినవారు జన్మిస్తారు. కాబట్టి సంస్కార బలం ఉన్న పిల్లలు కలగడానికి బాధ్యత తల్లిదండ్రుల యందు ఉంటుంది. ఇంత చేసినా దుర్మార్గుడో, దుర్మార్గురాలో పుడితే అది బిడ్డ ప్రారబ్ధం. దాని పాపం మీకు అంటదు అని శాస్త్రం చెప్పింది.
* ప్రదూషవేళ (కాలము స్ఫుటముగా మార్పు చెందే రెండు సంధ్యాసమయాలూ) జరుగుతూండే శివుడి ఆనందతాండవం సమయంలో శివస్వరూపాన్ని చూసే అధికారం నలుగురికే ఉందిట. నందీశ్వరుడు, భృంగి, పతంజలి, వ్యాఘ్రపాదుడు.
* కావ్య కంఠగణపతి ముని కథ కమనీయం.
* మధురమైన ముత్తుస్వామి దీక్షితులు జీవిత కథ..
* శంకరాచార్యులవారు, శ్రీ చంద్రశేఖర పరమచార్యుల వారి గురించిన కొన్ని తెలియని విశేషాలు..
* భృగుమహర్షి కుమారుడైన భార్గవుడు మహాపురుషుడిగా ఎలా మారాడు, శుక్రాచార్యుడన్న పేరు ఎలా ప్రకాశించిందో తెలిపే కథ విచిత్రమైనది. ఈశ్వరుడి కృపాకటాక్షాలను తెలిపేదీనూ!
* శివకోటి, రామ కోటి రాసిన పుస్తకాలలో ఎంతో శక్తి ఉంటుంది. అటువంటి పుస్తకాలు ఒక స్తూపంలో పెట్టినట్లయితే ఆ స్తూపము అపారమైన శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఆ శక్తికి ప్రసరించే లక్షణం ఉంది. ఊళ్ళో ఎవరికయినా ఆపద వచ్చినట్లయితే ఆ స్తూపం చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. స్తూపంలో ఉన్న శక్తి బయటకు తరంగములుగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మీరు ఆ తరంగములలోకి వచ్చి తిరుగుతున్నట్లయితే ఏ ఆలోచన చేస్తే మీకా కష్టం పోతుందో ఆ శక్తి అందులోంచి మీ మనసు లోకి ప్రవేశించి నిర్ణయం వైపుకి బుధ్ధిని మారుస్తుంది. కాబట్టి ఉళ్ళో ఉన్నవాళ్ళు ప్రమాత్మ ప్రు రాసిఉన్న స్తూపం కట్టుకోవాలి. రాననాం ఎంత గొప్పదో శివనామమూ అంతే గొప్పది.
* స్కందోత్పత్తి - కుమారసంభవం:
కాళిదాసు రచించిన "కుమారసంభవం" పేరు వినడమే తప్ప కథ తెలియదు. ఇంతకుమునుపెక్కడా కూడా కుమారస్వామి జననానికి సంబంధించిన కథ వినలేదు కూడా. మొత్తం పుస్తకంలో మేము ఆసక్తికరంగా చదివిన వృత్తాంతమిది. పార్వతీపరమేశ్వరులిద్దరి దయ,కారుణ్యము ఒకచోట ప్రోగు చెస్తే ముద్ద చేస్తే అదే సుబ్రహ్మణ్యుడుట. ఇది గర్భిణి అయిన స్త్రీ వినడానికి యోగ్యమయినదిట. ఏ జ్యోతి స్వరూపమునకు సంబంధించిన కథ స్త్రీ వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్న బిడ్డ సంస్కార బలములు మార్చగలిగినటువంటి అగ్నిహోత్రము వంటి తేజస్సుతో కూడిన కథలు ఉంటాయో వాటిని వినాలని, అవి ఔషధాలుగా మారి లోపల ఉన్న పిండము మనస్సుని ఆరోగ్యవంతంగా మారుస్తాయి. అందుకే స్కందోత్పత్తి గర్భిణి వినాలని శాస్త్రం చెప్పిందిట. ఆయురారోగ్యాలూ, వంశాభివృధ్ధి, ధనం, దీర్ఘమైన ఆరోగ్యం మొదలైనవి సుబ్రహ్మణ్యారాధన వల్ల కలుగుతాయిట.
ఇలా చెప్పుకుపోతే ఎన్నో కథలు, వింతలూ, విశేషాలూ..! మధ్యమధ్య చాగంటివారు ఉదహరించిన వివిధ సంస్కృత శ్లోకాలూ, శివానందలహరి, భాగవతం మొదలైనవాటి నుండి తీసుకున్న పద్యాలన్నీ కూడా మధురమైన భక్తితత్వంతో నిండి ఉన్నాయి.
ఇంకో మూడు,నాలుగు రోజుల్లో పారాయణ పూర్తవుతుంది. చదువుతున్న కాలంలో ఎదురైన చిన్న చిన్న విశేషాలు:
* గత రెండునెలల కాలం కూడా మాకెంతో పరీక్షాసమయం. కొన్ని చికాకులూ, సమస్యలతో సతమతమై అయోమయావస్థలో ఉన్న మాకు శివానుగ్రహం వల్లనే ఈ పురాణపఠనం చేసే సదవకాసాశం కలిగి, తద్వారా మా భారాలని తేలిక చేసుకోగలిగే మనస్థితిని శంకరుడే కల్పించాడని మేమిద్దరం కూడా విశ్వసిస్తున్నాం.
* సెప్టెంబర్ లో ఒకనాడు మా అత్తగారు హాస్పటల్లో సీరియస్ గా ఉన్న రోజున.. ఆ అర్థరాత్రి పూట ఒక్కదాన్నీ హాల్లో కూచుని ఈ పుస్తకాన్ని కాగలించుకుని శివా..శివా.. శివా.. అన్న ఒక్క నామాన్ని మాత్రమే జపిస్తూ గడిపిన గంటలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈశ్వరానుగ్రహం వల్లనే ఆవిడ అప్పటికప్పుడు మామూలై ఆ పూటే మా ఇంటికి రాగలిగారని మేం నమ్మాము.
* సరిగ్గా శరన్నవరాత్రుల్లోనే "గౌరీపూజ", "అమ్మవారి రూపములు" ఛాప్టర్లు చదవడం చిత్రమనిపించింది.
* నిన్న ఏదో పని మీద ఓ ఆఫీసుకి వెళ్తే అక్కడ మావారికి తెలిసినాయన, "పొద్దున్నే శ్రీశైలం వెళ్ళి వచ్చాను.. ప్రసాదమిదిగో.." అని ఇచ్చారుట. మేం వెళ్ళలేకపోతున్నామని శివుడు ప్రసాదం పంపాడని మురిసిపోయాం ఇద్దరం.
ఇవి చిన్న విశేషాలే అయినా మా మనసులని ఎంతో ప్రభావితం చేసినవి. ఆసక్తి ఉన్నవారు తప్పక ఈ శివమహాపురాణపఠనాన్ని చేసి ఈశ్వరానుభూతిని పొందవలసినదని మనవి.
***
లోకుల్ నన్గని మెచ్చనీ యలగనీ లోలోన నిందించనీ
చీకాకున్ బడనీ మహాత్ముడననీ..
మూకీభా వమునన్ తిట్టనీ త్రోయనీ
నీ కారుణ్యము కల్గి ఉండినను అంతేచాలు నోశంకరా!
(శంకరాచార్యులు)
మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..!