మనం ఇతరులతో మట్లాడే మాటల కన్నా మనతో మనం మాట్లాడుకునేదే ఎక్కువేమో అని చాలాసార్లు నాకనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో మనవాళ్లతో; బయట, కాలేజీ, ఆఫీసు.. లాంటి చోట్ల మిత్రులతోనో, ఎదురుపడ్డవాళ్లతోనో మాట్లాడతాం. మిగతా సమయాల్లో అంటే పని చేస్కునేప్పుడు, బస్సులోనో ఆటోలోనో్.. నడచి వెళ్ళేప్పుడో, మనకి మనమే మిగిలే ఏకాంతాల్లో.. ఎక్కువగా మనలో మనమే కదా మాట్లాడుకునేది. అలా చూస్తే మనం అందరికంటే ఎక్కువగా గడిపేది మనతోనే. మన ఆలోచనల్లోనే..!
ఇంతకీ ఆ ఆలోచించేది ఏమిటీ అంటే కొదిసార్లు మత్రమే సీరియస్ విషయాలు ఉంటాయి. చాలాసార్లు ముఖ్యమైనది ఏమీ ఉండదు. ఎదుటివారు చెప్పేమాటల పట్ల మనకి శ్రధ్ధ లేకపోవటమో, ఆసక్తి లేకపోవటమో ఒక కారణమైతే, మనకి ఏకాగ్రత లేకపోవటం మరో కారణం అవుతూంటుంది. కారణం ఏదైనా ఆలోచనల్లో ములిగిపోవటం అనేది మనకి తెలియకుండానే మనం తరచూ చేసే పని. పుస్తకం చదువుతూ ఆలోచిస్తాం. నడుస్తూ ఆలోచిస్తాం. పని చేస్తూ ఆలోచిస్తాం. ఆఖరికి ఎవరితోనన్నా మాట్లాడుతూ కూడా ఒకోసారి ఆలోచనల్లో పడుతుంటాం.
నా అనుభవాలు చెప్పాలంటే... కాలేజీలో ఉన్నప్పుడు మా పోలిటిక్స్ లెక్చరర్ పాఠం మొదలు పెట్టగానే ఎక్కడలేని ఆలోచన్లూ ముసిరేసేవి. మహా అయితే ఓ పావుగంట పాఠం తలకెక్కేదేమో.. ఆ తర్వాత నాదారి నాదే. ఏవో ఆలోచనలు.. చూపులు లెక్చరర్ పైనే ఉండేవి కానీ బుర్ర మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉండేది. ఎందుకో పాపం ఆవిడ ఒక్క క్లాసే అలా అయ్యేది. మిగతా క్లాసులన్నీ బానే వినేదాన్ని. ఆవిడ క్లాసు కూడా శ్రధ్ధగా వినాలని చాలాసార్లు ప్రయత్నించాను...కానీ ఎప్పుడూ కాసేపయ్యాకా ఆలోచనల్లో ములిగిపోయేదాన్ని. హటాత్తుగా గుర్తుకొచ్చేది.. అయ్యో ఇవాళ కూడా పాఠం వినలేదే అని ..:(
ఇంకా ఎవరన్నా ఎక్కువసేపు మాట్లాడితే నా తలకెక్కదు. కాసేపు బుధ్ధిగా వినేసి ఆ తర్వాత నా ఆలోచనల్లో నేను పడిపోతాను. బెజవాడలో ఉండగా తుమ్మలపల్లిలోనో, రోటరీ క్లబ్ లోనో బోలెడు కార్యక్రమాలకి, సభలకీ వెళ్ళేవాళ్ళం. ఆ సభల్లో కార్యక్రమాలకన్నా ముందు ముఖ్య అతిథి వీ, మిగిలిన వక్తల ఉపన్యాసాలు ఉండేవి. ఆ ప్రసంగాలు అయితే అసలు చెవికెక్కేవి కాదు ఏమిటో. పెద్దపెద్దవాళ్లంతా ఏవో చెప్తూండేవారు... నాపాటికి నేను ఏవో ఆలోచిస్తూ ఉండిపోయేదాన్ని. ఇంట్లో కూడా నాన్న ఎప్పుడైనా పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నప్పుడు చెవిలో వేలుపెట్టి ఇలా...ఆడిస్తుంటే... "నీ బుర్రకేమీ ఎక్కటం లేదని అర్ధమైంది ఇక వెళ్ళు.." అనేవారు. "లేదు నే వింటున్నాను.." అని చెప్పినా ఇంకేమీ చెప్పేవారు కాదు. ఆయనకు అర్థమైపోయేది పాపం నేను వినట్లేదని !
ఇంకా.. ఒకోసారి ఎవరితోనన్నా ఫోన్ లో మాట్లాడేప్పుడు కూడా అర్జెంట్ గా ఏదో గుర్తొచ్చి దాని గురించి ఆలోచించేస్తాను. కాసేపు మాట్లాడాకా అవతలివాళ్ళు ఏదో ప్రశ్న వేసేసరికి గుర్తుకు వస్తుంది నేను వాళ్ళు చెప్పేది వినట్లేదని...:( ఫోన్లో మాట్లాడేది బాగా తెలిసినవాళ్లైతే ఇందాకా సరిగ్గా వినలేదు..మళ్ళీ చెప్పమని బుధ్ధిగా నిజం చెప్పేస్తాను కానీ కొత్తవాళ్లైతే...:(( పాపం వాళ్ళు !!
అలా రకరకాల సందర్భాల్లో మనం రకరకాల ఆలోచనల్లోకి వెళ్పోతూ ఉంటాం. ఆలోచనల్లోంచి ఒక్కసారిగా మేల్కొని "అరే ఏమిటీ ఇలా ఆలోచించేస్తున్నాం..." అని మనలో మనం అనుకునే సందర్భాలే ఎక్కువ అనటం అతిశయోక్తి కాదు. ఆఖరికి నిద్రను కూడా ఖాళీగా వదలం మనం. మంచివో, చెడ్డవో.. కలలు కనేస్తూ ఉంటాం. అసలు ఏ పనీ లేకుండా ఎప్పుడన్నా ఉంటామేమో కానీ ఏ ఆలోచనా లేకుండా ఖాళీగా ఎప్పుడైనా ఉంటామా మనం? అసలలా ఉండగలమా అని సందేహం కలుగుతుంది నాకు. అలా ఏమీ ఆలోచించకుండా ఉందామని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యను కూడా..:) నిజంగా అసలు ఏమీ ఆలోచించకుండా ఐదు నిమిషాలన్నా ఖాళీగా ఎవరన్నా ఎప్పుడన్నా ఉన్నారా? కాస్త చెప్దురూ...
10 comments:
బాగుందండి..నిజమే ఇవి అచ్చంగా నా అనుభవల్లాగానే ఉన్నాయి.:))
బహుశా,ఆలోచనారహిత స్థితినే ధ్యానం అంటారేమో..
ఇది చాలా పెద్ద, మంచి సబ్జెక్ట్. సైకాలజీమీద authenticity ఉన్నవాళ్ళు ఎవరైనా స్పందిస్తే బాగుండు.
నిజమే. నేనూ ఇలా ఆలోచిస్తూనే ఉంటాను. అస్సలు ఏమీ ఆలోచించకుండా ఉన్న సమయమా!! ఊహూ.. అస్సలు లేదేమో. :)
ధ్యానం లో ఉండవచ్చు.దానినే ఆలోచన రహిత స్తితి అంటారు.
నాకు కూడా ఇలా సార్లు జరుగుతున్దండీ...:-)
తృష్ణగారు,ఇవ్వాళ మీ పోస్టు చూసినతరువాత ఎవరికివారు ఇది మనస్వానుభవమే అనుకుని వుంటారు.ఎన్నోసందర్భాలలో మనకి తెలీకుండానే అంతర్ముఖులమై పోతుంటాంకదా?అసలుఈమధ్య నా అలోచనలని నేనే ఎంజాయ్ చెయ్యడం కూడా జరుగుతోంది.ఆసక్తిలేని విషయాలని భరించటం కంటే వంటరిగా మనలో మనమే వుండటం మంచిదికదా?
ఏంటోనండి తృష్ణ గారు, మీ మీ టపా చదువుతున్నంతసేపూ వేరే ఆలోచన రాలేదు :-))))
Just kidding... బాగా వ్రాసారు.
నిజమే కదా| ప్రతి ఒక్కరి విషయంలో అలాగే జరుగుతదేమో.
నాదీ ఇదే సమస్య :)
@dhaatri: may be..:)
@Tejaswi: have to find out..
@sisira:won't be..:)
@sasi kala:but that's a different topic again ..:)
@nagini: :-)
@Indira:true..:)
@Sridhar:u forgot to reverse your comment it seems..:)
@David: yes..mostly !
@sooryudu: is it?
Thanks to all for your valuable comments.
Post a Comment