Add caption |
భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సామాన్య మానవుడి దాకా తీసుకువెళ్ళటానికి రేడియో సరైన మాధ్యమమని గుర్తించిన రేడియో అధికారులు, మన దేశపు శాస్త్రీయ సంగీత వారసత్వ సంపదను ప్రజలకు అందించే ప్రయత్నం "సంగీత సమ్మేళన్" ద్వారా ప్రారంభించారు. 1954 అక్టోబర్ లో ఢిల్లీ లోనూ, మద్రాసు లోనూ కూడా ఒకేసారి మొదటి రేడియో సంగీత సమ్మేళన్ కార్యక్రమాలు జరిగాయి. ఉత్తర దేశంలో ఢిల్లీ లోనూ, దక్షిణాదిలో మద్రాసులోనూ ఈ కచేరిలు ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రముఖ సంగీత విద్వాంసులు, వాయిద్యకారులు ఆ కచేరీలలో పాల్గొన్నారు. ఆ కచేరీలను రేడియోలో దేశవ్యాప్తంగా ప్రసారం చేసినప్పుడు అనూహ్యమైన స్పందన లభించింది.
ఆ స్పందనను చూసిన ఆకాశవాణి ఇకపై ఈ రేడియో సంగీత సమ్మేళన కార్యక్రమాలను వార్షికంగా నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న మ్యుజికల్ స్కూల్స్ కూ, అన్ని రకాల ప్రాంతీయ వాయిద్యకారులకూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానాలు అందాయి. జాతీయ సమైక్యత ముఖ్య ఉద్దేశంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కచేరీలు ఏర్పాటు చేయటం ఆనవాయితీగా మారింది. కాలక్రమంలో ఈ సంగీత సమ్మేళనాలకు ప్రజాదరణ పెరిగింది. కచేరీలు జరిగే ప్రాంతాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవైకు పైగా ప్రముఖ పట్టణాల్లో ఈ కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ కచేరీలు జరుగుతాయి. కానీ అదివరకట్లా లైవ్ ప్రసారలు కాకుండా, కచేరీలను రికార్డింగ్ చేసి, తరువాత ఢిల్లీ నుంచి ఒక నెల పైగా జాతీయ స్థాయిలో ప్రసారం చేయటం మొదలెట్టారు.
ప్రతి సంవత్సరం ఆహూతులైన ప్రేక్షకుల మధ్యన సెప్టెంబర్ నెలలో కచేరీలు జరుగుతాయి. అక్టోబర్, నవంబర్లలో వాటిని రేడియోలో ప్రసారం చేస్తారు. రోజూ రాత్రి పది నుంచీ పదకొండు వరకూ, శని,ఆదివారాల్లో రాత్రి తొమ్మిదిన్నర నుంచీ పదకొండున్నర దాకా, ఆదివారం ఉదయం అదనంగా పది నుంచీ పన్నెండు దాకా ఆ కచేరిలను ప్రసారం చేస్తారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని ఉత్తమ సంగీత విద్వాంసుల మరియు ఔత్సహిక కళాకారుల గాత్ర , వాద్య సంగీతాలను దేశవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులందరూ పరిచయం చేసుకోవటానికి ఆకాశవాణి ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. వీటన్నిటితో పాటూ ప్రతి ఏటా సంగీట సమ్మేళనానికి సంబంధించిన కళాకరుల ఛాయా చిత్రాలు, జీవిత చరిత్ర, ఆ కచేరీ ఎప్పుడు ఎక్కడు ఏర్పాటు చేసినదీ మొదలైన పూర్తి వివరాలతో హిందీ, ఇంగ్లీషు భాషల్లో ముద్రించిన చక్కని రంగుల బ్రోచర్ ను కూడా ఆకాశవాణి ప్రచురిస్తుంది. కచేరీలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరిమితంగా ఈ బ్రోచర్లు లభిస్తాయి. కొన్ని చోట్ల కచేరీ సమయాలలో సభికులకు పరిమితంగా అందచేయటం కూడా జరుగుతుంది. ఇంతటి విలువైన ఆకర్షణీయమైన బ్రోచర్ లను ఎలాగైనా సంపాదించి సంగీతాభిమానులు అపురూపంగా దాచుకునే అలవాటు కూడా ఉంది.
ఈ సంవత్సరం "సంగీత సమ్మేళన్" రేడియో కార్యక్రమాలు నిన్న రాత్రి నుంచీ ప్రారంభం అయ్యాయి. తొలి సంగీత కచేరీ మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన దంపతుల నాగస్వర యుగళంతో మొదలైంది. ఈ కచేరీ సెప్టెంబర్ నెల్లో వారణాసిలో ఏర్పాటు చేయబడటం మన ఆంధ్రులకు గర్వకారణం. కచేరీ ప్రసార సమయంలో ఆయా కళాకారుల యొక్క జీవిత సంగ్రహం వివారించి, వారు వినిపిస్తున్న అంశాలు (రాగం,తాళం, వాగ్గేయకారులు వగైరా వివరాలు.) కూడా చెప్పటం వల్ల సంగీతం తెలిసినవారికీ, తెలియనివారికీ కూడా చక్కని సమాచారం అందుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా ప్రైవేట్ చానల్స్ వచ్చాయి కాబట్టి, ఈ ప్రసారాలు ఆలిండియా రేడియో ద్వారా, అన్ని ఆకాశవాణి కేంద్రల నుంచీ ఏక కాలంలో ప్రసారమౌతాయని ఈనాటి రేడియో శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి శాటిలైట్ ద్వారా కూడా ప్రసారాలు ప్రారంభించటంవల్ల ఆకాశవాణి కేంద్రాలు లేని దూరదూర ప్రాంతాలవారు కూడా డి.టి.హెచ్ ద్వారా ఈ సంగీత ప్రసారాలను వినే అరుదైన అవకాశం ఉంది. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సామాన్య మానవుడి దాకా తీసుకువెళ్ళటానికి ఆకాశవాణి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిజంగా అభినందించాల్సిన అవసరం ఉంది.
No comments:
Post a Comment