వర్షాకాలం వస్తోంది అంటే "బాబోయ్ వర్షం" అని భయపడిపోయే నేను ఈసారి ఎప్పుడెప్పుడు వాన పడుతుందా అని చాతకంలా ఎదురుచూసాను. మరి ఈసారి వేసవి మనసునీ, శరీరాన్నీ కూడా అంతగా మండించింది. చిన్నప్పటి నుండీ విజయవాడ మండుటెండలకు అలవాటుపడిన ప్రాణం కూడా ఈఏటి వేడిమిని భరించలేకపోయింది. ఈ ఇంట్లోని సదుపాయాలను సరిగ్గా చూసుకోకుండా అద్దెకు చేరటం మేము చేసిన పేద్ద పొరపాటని ఈ వేసవి వచ్చేదాకా తెలీలేదు మాకు:( చాలాఏళ్ల తరువాత కూలర్లు, ఏసీ, కనీసం వట్టివేళ్ల తడికలు కూడా లేకుండా నానారకాల ఇబ్బందులతో రెండునెలలూ ఎలానో గడిపేసాము..! నాలుగురోజుల క్రితం ఊళ్ళో చాల చోట్ల వాన పడిందిట కానీ మా దగ్గరకి రాలేదు. ఇక మేము ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది.. నిన్న !
ఎన్నాళ్లకెన్నాళ్ళకెన్నాళ్ళకన్నట్లుగా నిన్నటి రోజంతా కురిసి కురిసి మురిపించి పులకింతలు రేపి వెళ్ళింది వాన. వర్షానికి తోడొచ్చిన చల్లని గాలి మనసు నిండా ఆనందం నింపింది. రెండ్రోజుల క్రితమే వాతావరణం చల్లబడిందని చల్లిన విత్తనాల్లోంచి తలలెత్తిన బుల్లి బుల్లి ఆకులు కూడా నిన్ననే ఆకాశాన్ని చూశాయి. మేఘాలు గొంతులెత్తాయి.. చెట్టు, చేమా, పుట్టా, గట్టూ, రోడ్డు, మట్టీ, మనిషీ, మనసూ.. అన్నీ తడిసి చల్లబడ్డాయి. పచ్చదనం కొత్త అందాలను సంతరించుకుంది. అప్రయత్నంగా "చినుకు చినుకు చినుకు చినుకు..." పాట గుర్తుకొచ్చింది. ఎండ వేడికి ఎండిన మట్టిపై కురిసిన పన్నీటి జల్లుల తొలకరి వాన తెచ్చిన కమ్మని మట్టివాసనను పీల్చుకుని మనసు ఉప్పొంగిపోయింది. కష్టమంటే ఏమిటో తెలిస్తేనే సుఖంలోని ఆనందం బోధపడేది. చల్లదనం కోసం, తొలకరి చినుకు కోసం తపించిపోయాకా.. ఒక్కసారిగా దేవుడు ప్రత్యక్ష్యమై వరమిచ్చినట్లుగా రోజంతా వర్షం కురవటం చెప్పలేని సంబరాన్ని కలిగించింది.
కాస్తంత నలతగా ఉండటం వల్ల వర్షంలోకి వెళ్ళి తడవలేకపోయినా ఇంట్లోంచే చూసి ఆనందించాను. గత రెండు నెలలుగా భరించలేకపోతున్న పవర్ కట్స్ వల్ల ...కరెంటు పీకగానే మళ్ళీ ఇచ్చేదాకా ఆ కరెంటుఆఫీసు వాళ్లని వచ్చిన నానారకాల తిట్లన్నీ తిట్టేసుకునే నేను నిన్న సాయంత్రం నాలుగింటికి తీసేసి పన్నెండు దాటినా పవర్ ఇవ్వని కరెంట్ఆఫీసువాళ్ళని ఒక్కసారి కూడా తిట్టుకోలేదంటే అదంతా వర్షం మహిమే. వానలో ఆడుకుని ఆడుకుని పిల్లది కూడా గుమ్మంలోనే తలగడ వేసుకుని నిద్రోయింది. కేండిల్ లైట్ లోనే వంట చేసి, red fm వాళ్లు వినిపిస్తున్న తియ్యని ఆపాత మధురాలను వింటూ కేండిల్ లైట్ డిన్నర్ కూడా చేసేసాం. ఒకదాని తర్వాత ఒకటిగా అద్భుతమైన పాటలు మనసుల్ని రంజింపజేసాయి. బయట చల్లదనానికి కరెంట్ లేకపోయినా నిద్ర ముంచుకొచ్చేసింది.
ఎటొచ్చీ డాబా పైనుంచి క్రిందకు పారిన వర్షపు నీరంతా వృధా అయ్యిందని మాత్రం బాధ కలిగింది. అదంతా నిలువ చేస్తే నాలుగు రోజులు రెండువాటాల వాళ్లం వాడుకోదగ్గ నీరు ఉంటుంది. ఈ ఇల్లుగలాయనకు దూరాలోచన లేదు అనుకున్నాం. ఏదేమైనా నిన్నటి తొలకరి వర్షపుచినుకులు మాత్రం చాలా ఉల్లాసపరిచాయి. నిన్న నాకు గుర్తుకొచ్చిన పాట మీరూ ఓసారి వినేయండి...
చిత్రం: సిరివెన్నెల, రచన : సీతారామశాస్త్రి
చిత్రం: సిరివెన్నెల, రచన : సీతారామశాస్త్రి
చినుకు చినుకు చినుకు చినుకు
తొలితొలి తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు
పుడమికి పులకల మొలకల పిలుపు
ఆషాఢమాసాన ఆ నీలిగగనాన మేఘాల రాగాల ఆలాపన
ఆషాఢమాసాన ఆ నీలిగగనాన మేఘాల రాగాల ఆలాపన
మేఘాల రాగాల ఆలాపన...
9 comments:
I was in VJA last Saturday and just returned to Bangalore. I know how you feel, and can very well understand how refreshing these 1st rains could be.
కరెంటు ఇలా వాన పడే వేళల్లోపోతే బానే ఉంటుందిలెండి. క్యాండిల్లైట్ డిన్నర్ బోనస్ కదా మరి.! :)
అమ్మా వాళ్ళూ, మామిడి పళ్ళూ వెనక్కి లాగుతున్నాయ్ కానీ, విజయవాడ ఎంతలా మారిపోయిందండీ, - మీరన్నట్టు చిన్నప్పటి నుండీ ఉన్న మనమే ఇలా అనుకుంటున్నామంటే చాలా అన్యాయంగా ఉంది పరిస్థితి. :(
అన్ని నీళ్ళు వృథా పోయాయంటే బెంగనిపించింది.
రెండ్రోజులుగా మాకూ బాగా వర్షం పడుతుందండీ.. చిత్రంగా నేను కూడా నిన్నటినుండీ వృథా అవుతున్న వర్షపు నీటిగురించే ఆలోచిస్తున్నాను.
ఫోటోలు భలేగున్నాయి. చిట్టికవిత కూడా:-)
వర్షం పడుతుందండీ, ఈ పాటనే వింటూ కమెంటిడుతున్నా!
నీన వర్షం చాలా చాలా నచ్చింది . ముఖ్యం గా ఎన్ని నీళ్ళో . బకెట్ తో పట్టి టాంక్ నింపుకున్నాము :) మా క్వాటర్ లో వున్న పనమ్మాయి వాళ్ళ బట్టలన్నీ వుతుక్కుంది .ముఖ్యం గా నా చెట్లన్నీ హాయిగా నీళ్ళు తాగి బొజ్జ నిపుకున్నాయి :)
ఎంత అందంగా చెప్పారండీ మీ భావాలను?
నిజంగా వర్షంలో తడిసినంత ఆనందంగా వుంది.
కాని అంత నీరు అలా వృధా అవడమే బాధ కలిగించింది.
ఒక విషయం చెబితే నమ్ముతారో లేదో తృష్ణ గారూ.. అంత పెద్ద వర్షం కాస్త తెరిపిన పడ్డాక, నిన్న ఆఫీసు లోపలికి నడుస్తూ చూద్దును కదా చెట్లు మొక్కలు అన్నీ అదొక అందమైన ఆకుపచ్చ రంగుని కప్పుకుని ఉంటే నా ఆలోచన అంతా ఆ చెట్ల చుట్టూ అంత అందమైన ఆకుపచ్చ రంగు చుట్టూ తిరిగింది చాలా సేపు. ఉన్నట్టుండి నా తలపుల్లో మీ మొక్కలు వాటి పువ్వులు కదలాడాయి. ఈ టపా చదువుతూ కూడా, మీ మొక్కల ఫోటోలు పెడితే బాగుండు అనుకుంటూ ఉన్నా :) గులాబి ఆకులు గన్నేరు మొగ్గలు చూసి సంతోషించా..
మామూలుగా ఉండే ఆకుపచ్చే వర్షం కురిసి వెలిశాక ఎందుకంత అందంగా ఉంటుందంటారు!!
Mee asalu peru Trishnaaaaa? koncham curiosity koddi adiganu... mee blog chala bagundi.. beautiful write ups, thanks
Siri
mee tapaa vaananu choosthunnatle undi. keep writing.
Post a Comment