రేడియో చరిత్ర తెలిసిన నిన్నటితరం వారందరికీ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు చిరపరిచితులు. సహస్రచంద్ర దర్శన సౌభాగ్యం కలిగిన వీరు వేంకట పార్వతీశకవులలో ఒకరైన శ్రీ వేంకటరవుగారి కుమారులు. రజనిగారి గొప్పతనం గురించి నేనెంత చెప్పినా చంద్రునికో నూలుపోగు చందానే ఉంటుంది. అంతటి అత్యుత్తమ ప్రతిభాశాలి మన తెలుగువారవ్వటం మన అదృష్టం. ఆయన ఏ బెంగాలీవారో అయ్యుంటే ఇంతకు నాలుగురెట్లు ఆయన ప్రతిభకు తగ్గ గుర్తింపు వచ్చి ఉండేదేమో కూడా..! నా దృష్టిలో రజని గారి సేవలను అందుకున్న "ఆకాశవాణి" అదృష్టవంతురాలు. రేడియోలో ఉదయం ప్రసారమయ్యే "భక్తిరంజని"ని వీరి పేరున "భక్తరజని" అనేవారంటే అందుకు వారి కృషే కారణం. ఇక లలిత సంగీతానికీ, గేయరూపకాలకూ రజనిగారి చేసిన సేవ అనంతం. ఒక్కమాటలో చెప్పాలంటే సంగీతసాహిత్యాలు ఆయన ఉఛ్వాసనిశ్వాసాలు ! సంగీతంలో ఎన్నో రకాల పరిశోధనలూ, ప్రయోగాలు చేసారు. రజనిగారు రవీంద్రసంగీతాల్ని తెలుగులోకి అనువదించి, స్వరపరిచిన విశేషాలు, వారికి సంగీత నాటక అకాడమీ వాళ్ళు చెన్నై లో "టాగూర్ రత్న అవార్డు " ఇచ్చిన విషయం సంగీతప్రియ బ్లాగ్‌లో ekla chalo re పాట గురించి రాసినప్పుడు రాసాను.
రజని గారి గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు:
http://en.wikipedia.org/wiki/Balantrapu_Rajanikanta_Rao
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న "ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర", "శతపత్ర సుందరి", "మువ్వగోపాలపదావళీ", పిల్లల కోసం రాసిన "జేజిమావయ్య పాటలు" మొదలైనవి రజనిగారు సాహిత్య ప్రపంచానికి అందించిన కలికితురాయిలు. "కొండ నుండి కదలి దాకా" అని గోదావరీనది మీద రజనిగారు చేసిన సంగీత రూపకం జపాన్ దేశ పురస్కారాన్ని అందుకుంది. ఇంతటి గొప్ప వ్యక్తి తన స్వీయచరిత్రను ఇంత ఆలస్యంగా రాయటమేమిటో అని ఆశ్చర్యం వేసినా ఇప్పటికైనా వారు పుస్తకం రాసినందుకు చాలా సంతోషించాను నేను.
ఈ ఏటి ఉగాది నాడు(23-3-12) రజనిగారి స్వీయ చరిత్ర "రజనీ ఆత్మకథా విభావరి" సభాముఖంగా విడుదల చేసారు. పుస్తకంలో రజనిగారు తన బాల్యం, పిఠాపురం కవిపండితులు, రేడియో అనుబంధాలు అనుభవాలూ; సాలూరి రాజేశ్వరరావు, శ్రీ గోపీచంద్, బాల సరస్వతి, ఓలేటి, చలం, విశ్వనాథ, శ్రీపాద పినాకపాణి మొదలైన మహామహులతో తనకున్న జ్ఞాపకాలు, తన రచనలు, సత్కారాలూ పురస్కారాలు మొదలైన అంశాలను గురించి తెలిపారు. రేడియో పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ కొని దాచుకోవాల్సిన పుస్తకం ఇది.
ఎంతో వైభవంగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభ తాలూకూ ఆడియో వీడియోలు నేను విని, చూడటం జరిగింది. అందులో ఇద్దరు వక్తల ప్రసంగాలు విని నేనెంతో ముగ్ధురాలినయ్యాను. శ్రీ గొల్లపూడి మారుతీరావుగారు, శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారూ తమ ప్రసంగాల్లో ఎన్నో కబుర్లను, విశేషాలనూ తెలిపారు. అవి బ్లాగ్మిత్రులకు అందించాలని ఈ టపా...! వీడియో పెట్టడం కష్టమైనందువల్ల ఆడియో మాత్రం అందించగలుగుతున్నాను. ఈ ప్రసంగం విని గొల్లపూడి గారు "గొప్ప వక్త" అని మరోసారి అనుకున్నాను.
గొల్లపూడి మారుతీరావుగారి ప్రసంగం:
ఎంతో వైభవంగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభ తాలూకూ ఆడియో వీడియోలు నేను విని, చూడటం జరిగింది. అందులో ఇద్దరు వక్తల ప్రసంగాలు విని నేనెంతో ముగ్ధురాలినయ్యాను. శ్రీ గొల్లపూడి మారుతీరావుగారు, శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారూ తమ ప్రసంగాల్లో ఎన్నో కబుర్లను, విశేషాలనూ తెలిపారు. అవి బ్లాగ్మిత్రులకు అందించాలని ఈ టపా...! వీడియో పెట్టడం కష్టమైనందువల్ల ఆడియో మాత్రం అందించగలుగుతున్నాను. ఈ ప్రసంగం విని గొల్లపూడి గారు "గొప్ప వక్త" అని మరోసారి అనుకున్నాను.
గొల్లపూడి మారుతీరావుగారి ప్రసంగం:
భట్టుగారి ప్రసంగం:
చిన్ననాటి నుండీ ఇంట్లో మనిషిలాగ రజనిగారి చుట్టు తిరిగగలగటం, ఇవాళ ఆయన స్వీయచరిత్రను గురించి బ్లాగ్‌లో రాయ గలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ పుస్తకం కాపీల కోసం అడ్రస్:
సత్యం ఆఫ్సెట్ ఇంప్రింట్స్
బృందావనం,డో.నం.49-28-5,
మధురానగర్, విశాఖపట్నం -16.
ph-0891-2735878,9849996538
10 comments:
నాకు radio తో స్నేహం తక్కువే ...కానీ నాకు తెలియని చాలా విషయాల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది..Thanks for sharing a nice post..:-)
Wonderful information Madam. Thank you. At present I am in the process of shifting from Bangalore to Mumbai as my Office has been shifted to the financial capital.
I have a rare audio of Shri Rajanikantarao speaking about himself and I shall post it once I settle down in Mumbai.
good intro...
రజనీకాంతరావుగారు స్వయంగా తెలియదు.కాని చిన్నప్పుడు ఒక మిత్రుడు ఆయన గురించి చెబుతూ ఉండేవాడు.ఆయన గేయాలు ' ఒహో విభావరి '(రాజేస్వరరావు) ,ఒహో శతపత్రసుందరి ' (సూర్యకుమారి)గ్రామఫోన్ రికార్డులు వినే వాళ్ళం. 'స్వర్గసీమ ' సినిమాలో భానుమతి పాడిన 'ఒహో పావురమా ' కూడా ఆయన స్వరపరచినదే.
ఎన్ని మధురమయిన సంగతులు? గతం ఎప్పుడు ఘనమే అనటానికి సొదాహరణలు ఎన్ని స్మృతులు ఎన్ని గతులు ఎన్ని రీతులు వీటన్నిటిని అలావోకగా తమ ఙ్ఞాపకాల నిధినుంచి సభాపూర్వకముగా తెలపటము చాలాగొప్ప. నాకు అసలు గొల్లపూడి గారి స్వరములో వారి బ్లాగ్ లో వినటము, చదవటము ఇష్టము అలా చాలా విషయాలు చాలా సంగతులు విశ్వ సాహిత్యములో మంచి విషయాలు ఎన్నొ.అలాగే భట్టుగారి ప్రసంగము చాలా చాలా గొప్పగావున్నది. ఒక వ్యక్తి గొప్పతనాన్ని కళను ఇలాగే పరిచయము చేయాలనే తపన, కాంక్ష, నమ్మకము ఇలా అన్ని వ్యక్తీకరించారు.బాలంత్రపు గొప్పదనానికి మరొక్క సారి వందనాలు.
Thanks for the wonderful AUDIO files!
తృష్ణ గారూ,
అద్భుతంగా ఉన్నాయండీ మీరు ఉంచిన రెండు రికార్డింగులూ. నిన్ననే ముంబయినుంచి వచ్చి ఒక పక్క సామాన్లు పాక్ చేయిస్తూనే అవి విన్నాను. ముంబాయి వెళ్ళినాక రజనీకాంతరావు గారి గురించిన ఒక సమగ్ర వ్యాసం, ఆయన మాటల్లోనె ఆయన గురించి చెప్పుకున్న సంగతులతో కలగలిపి వ్రాయాలి. మీరు ఉంచిన రెండు ఆడియోలు తెలుగు రేడియో చరిత్రను ఎత్తి చూపే ప్రసంగాలు.అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. వీటిల్లో కొన్ని భాగాలు నేను వ్రాయబొయ్యే వ్యాసంలో మీరు అనుమతీస్తే వాడుకుందామని అనుకుంటున్నాను.
నిన్ననే, నా బ్లాగుల్లో నండూరి శశి మోహన్ గారు (నండూరి సుబ్బారావుగారి అబ్బాయి) పంపిన ఫొటోల సహాయంతో రెండు వ్యాసాలు వ్రాశాను.
http://saahitya-abhimaani.blogspot.in/
అందులో ఆయన పంపిన ఫొటోల్లో కొందరి పేర్లు తెలియవు. మీరు ఆ ఫొటోలు చూసి, వీలైతే మీ నాన్నగారికి చూపించి వారి వారి పేర్లు నా బ్లాగులో వ్యాఖ్య రూపంగా మీరు ఉంచితే చాలా సంతోషిస్తాను.
@నాగిని గారూ,
@శివరామ ప్రసాద్ గారూ,
@ఫణీంద్ర గారూ,
@అవినేని భాస్కర్ గారూ
అందరికీ ధన్యవాదాలు.
@కమనీయం: అవును తెలుసండీ. ఇంకా ఎన్నో పాటలు ఆయన క్రెడిట్ లేకుండా ఉండిపోయినవి ఉన్నయటండి.. ధన్యవాదాలు.
@ఆలపాటి రమేష్ బాబు: ధన్యవాదాలు.
@శివరామప్రసాద్ గారు, వినగానే చాలా గొప్పగా అనిపించి ఆసక్తి కల బ్లాగ్మిత్రులు వింటారని ఇక్కడ పెట్టానండి. మళ్ళీ ఖాళీ చేసుకుని విన్నందుకు ధన్యవాదలు.
శశిమోహన్ గారు సహృదయులు. నాన్నగారికి మంచి మిత్రులు. తప్పకుండా ఈసారి నాన్నగారిని కలిసినప్పుడూ మీ బ్లాగ్‌లోని పోటోలు చూపెట్టి ఎవరన్నా తెలుసేమో కనుక్కుంటానండి.
రజనిగారిపైన కాస్త నిడివైన వ్యాసం: http://www.eemaata.com/em/issues/200101/616.html
రాసింది నేనే.
గత పదేళ్ళలో ఆయనతో పెరిగిన పరిచయం, జరిపిన సంభాషణల వివరాలతో మరో పెద్ద వ్యాసం త్వరలో.
Regards,
Sreenivas
తృష్ణ గారూ, మునుపు చెప్పినట్టుగానే, రజనీ కాంతరావుగారు ఆయన ఆకాశవాణి వారికి ఇచ్చిన ఇంటర్వ్యూను ఎట్టకేలకు నా బ్లాగులో ప్రచురించాను. మీరు అనుమతి ఇస్తారనే ముందుగానే భావించి, మీ బ్లాగులో ఉంచిన రెండు ఆడియో ఫైళ్ళను కూడా నా బ్లాగులో షేర్ చేశాను. మంచి సమాచారంతో కూడిన ఆడియోలు అందరికీ అందుబాటులోకి తెచ్చిన మీకు రేడియో అభిమానులందరి తరఫునా మరొక్క సారి ధన్యవాదాలు.
ఈ కింది లింకు సహాయంతో నేను వ్రాసిన అతి చిన్న వ్యాసం చదువవచ్చు:
http://saahitya-abhimaani.blogspot.in/2012/11/blog-post.html
Post a Comment