సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, March 26, 2012

తిరుపతి - శ్రీకాళహస్తి

 







మేం నడిచివచ్చిన దారి - పైనుంచి


సుమారు నాలుగైదేళ్ల తరువాత తిరుమలేశుని దర్శనానికి రెండువారాల క్రితం వెళ్ళి వచ్చాం. రెండుమూడు సార్లు అనుకున్న ప్రయాణం ఆగిపోయి ఇప్పటికి కుదిరింది. పరీక్షల సమయంలో రద్దీ తక్కువ ఉంటుందని ఇప్పుడు పెట్టుకున్నాం. సావకాశంగా రాయాలనుకోవటం వల్ల వెళ్ళొచ్చిన పదిహేనురోజులకి ఇప్పటికి టపా రాయటం అవుతోంది. తిరుపతి చాలామంది చాలాసార్లు వెళ్ళి వస్తుంటారు. ఇదేమీ అరుదైన ప్రయాణం కాదు కానీ మేము గత నాలుగుసార్లుగా కొండపైకి నడిచి వెళ్తున్నాము. అలా నడిచివెళ్ళాలనుకునేవారికి ఏదైనా వివరాలు తెలిపినట్లుంటుందని ఈ టపా.

 
తిరుమలకి మెట్లు ఎక్కివెళ్ళిన గత మూడుసార్లు కూడా మేము అలిపిరి వద్ద నున్న మెట్ల దారి మీదుగానే వెళ్ళాం. ఆ దారి మొదట్లో లగేజ్ ఇచ్చేస్తే మనం వెళ్ళే సమయానికి పైకి తెచ్చేస్తారు. దారి పొడుగునా ఏవో స్టాల్స్, తినుబండారాలు అమ్ముతూనే ఉంటారు. ఉదయంపూట బయల్దేరితే ఈ మెట్లదారి అనువుగా ఉంటుంది. ఎండపెరిగే సమయనికి పైకి చేరిపోవచ్చు. మధ్య మధ్య ఉండే కాలి బాట, రోడ్డు, డీర్ పార్క్లోని లేళ్ళు, చుట్టూ ఉండే చెట్లు, కొండలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందీ దారి. ముఖ్యంగా వర్షాకాలంలో వెళ్తే మంచి అనుభూతులను సొంతం చేసుకోవచ్చు. నాలా ఫోటోల పిచ్చి ఉన్నవాళ్ళు అయితే కొత్తగా కనబడిన ప్రతి చెట్టుకి,పుట్టకి ఫోటోలు తీసుకోవచ్చు. సగం దారికి వెళ్ళేసరికీ వేడి వేడి మిర్చి బజ్జీలు మొదలైనవి మనల్ని వాటివైపుకి లాగుతూ ఉంటాయి.

 
కానీ ఈ దారిలో వెళ్ళినప్పడల్లా నాకొక సందేహం వచ్చేది.. ఇలా కులాసాగా తింటూ, టీలు, కూల్డ్రింకులూ తాగుతూ, కావాల్సినంత సేపు ఆగుతూ కష్టం తెలీకుండా మెట్లు ఎక్కితే పుణ్యమేనా? అని. కొందరయితే చెప్పులు కూడా వేసుకుని ఎక్కేస్తారు. ఈ మెట్ల దారికిరువైపులా రాసి ఉండే గోవిందనామాలు చదువుకుంటూ ఎక్కటానికి వీలుగా బావుంటాయి. మాకు మొదటిసారి అమ్మనాన్న కూడా ఉండటంతో వాళ్లతో నెమ్మదిగా ఎక్కటం వల్ల ఐదు గంటలు పట్టిది. తర్వాత రెండుసార్లు కూడా మూడున్నర, నాలుగు గంటల్లో ఎక్కేసాం. ఒక్కళ్లం వెళ్ళేకన్నా నలుగురితో కలిసి వెళ్తే కబుర్లలో అలుపు తెలియదు. రెండవసారి వెళ్ళినప్పుడూ మొక్కులేకపోయినా వీలయినన్నిసార్లు మెట్లదారిలోనే వచ్చే శక్తిని ఇమ్మని వెంకటేశ్వరుడికి దణ్ణం పెట్టేసుకున్నా. అలా ఇప్పటికి అలిపిరి దగ్గరి మెట్లదారిలో మూడు సార్లు వెళ్లివచ్చాం. 








మేం వెళ్ళిన మెట్లదారి మొదలు


మళ్ళీ నాలుగైదేళ్ల తరువాత పదిహేనురోజులక్రితం తిరుపతి వెళ్ళివచ్చాం. అయితే ఈసారి అలిపిరి దారి కాక శ్రీనివాస మంగాపురం నుండి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మెట్ల దారి గురించి తెలిసింది. ఈ కొత్తదారిలో వెళ్దాం అని బయల్దేరాం. ఏడాది క్రితమే ఈ దారిని బాగుచేసారని ఆటో అబ్బాయి చెప్పాడు. సుమారు రెండువేలనాలుగొందల మెట్లు ఉంటాయి ఈ దారిలో. అన్ని మెట్లే. మధ్యలో రోడ్డు ఉండదు. సమంగా ఎక్కగలిగితే రెండుగంటల్లో చేరిపోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ దారిలో ఏ విధమైన తినుబండారాలు అమ్మరుట. దారిపొడుగునా టిటిడి వాళ్ళు పెట్టిన పంపుల్లో మంచినీళ్ళు, వాష్ రూమ్స్ మాత్రం ఉంటాయని చెప్పారు.
 









నడకదారిలో ధ్యానముద్రతో దర్శనమిచ్చిన శంకరుడు


అందువల్ల క్రిందనే ఓ రెండులీటర్ల బిస్లరీ వాటర్ బాటిల్ కొనేసుకుని బయల్దేరాం. మెట్లకు పసుపు-కుంకుమ పెట్టి ఎక్కేవారు ఇటు ఎక్కువగా వెళ్తూంటారేమో అనుకున్నాం. నయనానందకరంగా లేకపోయినా అలిపిరి మెట్లదారి కన్నా ఈ మెట్ల దారి మాకు బాగా నచ్చింది. అడుగడుక్కీ తినుబండారాల కొట్లు లేకపోవటం మరీ నచ్చింది. అటుఇటు గోవిందనామాలు రాసి ఉంచారు. మెట్లు కూడా ఏంతో పరిశుభ్రంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఎక్కడికక్కడ టిటీడి సిబ్బంది మెట్లు తుడుస్తూ కనబడ్డారు. అడుగడుక్కీ మంచినీళ్ల పంపులు కూడా బాగా పెట్టారు. దారిపొడుగునా మెట్లపైన షెల్టర్ వేడి తగలకుండా కాపాడుతుంది.

మొదట్లో త్వరగా మెట్లు ఎక్కేస్తే త్వరగా అలసిపోతాము. అలాకాకుండా మొదటి నుంచీ నెమ్మదిగా ఎక్కితే త్వరగా అలసట రాదు. మేము అలా నెమ్మదిగా రెండున్నర గంటల్లో ఈ మెట్లన్ని ఎక్కేసాము. ఇక్కడ మధ్యలో మెట్లదారిలో వచ్చేవారికి "దివ్య దర్శనం" టికెట్లు ఇస్తున్నారు. ఆ టికెట్ ద్వారా శ్రీవారి దర్శనం కూడా మామూలు కన్నా త్వరగా అయిపోతుందిట.









దారిలో విచిత్రంగా తోచిన చెట్టుకాయలు


మెట్లు ఎక్కగానే వెళ్పోయి ఉంటే మాకూ అలా రెండుగంటల్లో దర్శనం అయిపోయేది. కానీ మా పాపను క్రిందన ఉంచాము. తను వచ్చి మేము క్యూలో చేసేసరికీ బ్రేక్ దర్శనం టైమ్ అయిపోయి లోపల జైల్లో ఇరుక్కుపోయాం. జైల్లా ఉండే ఆ కంపార్టుమెంట్లలో గంటల తరబడి కూచోవటం ఓ పెద్ద శిక్ష. ఈ పధ్ధతిని మార్చే ప్రయత్నం ఏదైనా టిటిడి వాళ్ళు చేస్తే బావుంటుంది. ఆ జనాల్లో ఏ హార్ట్ పేషంట్ కో ఏదైనా జరిగితే పట్టించుకునే దిక్కు, బయటపడే మార్గం కూడా లేవక్కడ. ఇది చాలదన్నట్లు క్యూల్లో జనాలకు కంట్రోల్, సహనం ఉండవు. తలుపు తియ్యగానే పొలోమని తోసేసుకుంటారు. ఏ గుడిలో చూసినా ఇదే తోపులాట. శిరిడి వెళ్ళినా, వేరే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా దైవదర్శనం జరిగిందన్న ఆనందం కన్నా ఈ తోపులాటల వల్ల పెరిగే అశాంతే ఎక్కువౌతోంది. అలా నాలుగుగంటలు పట్టినా తిరుమలేశుని దర్శనం బాగా జరిగింది.

శ్రీకాళహస్తి:

తిరుపతికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో "శ్రీకాళహస్తి" ఉంది. "శ్రీ" అనగా సాలెపురుగు, "కాళము" అంటే పాము, "హస్తి" అంటే ఏనుగు. ఈ మూడు ప్రాణులూ ఈ చోట పరమేశ్వరుడిపై తమకున్న భక్తిని చాటుకుని మోక్షాన్ని పొందాయి కాబట్టి ఈ ప్రాంతానికి "శ్రీకాళహస్తి" అని పేరు వచ్చింది. ఈ ప్రాంత మహత్మ్యం గురించి "శివపురాణం", "శ్రీ కళహస్తి మహత్మ్యం " మొదలైన పురాణాల్లో తెలుపబడింది. స్వయంభూలింగంగా భావించే ఈ కాళహస్తీశ్వరుడిది వాయులింగ స్వరూపమట. కాళహస్తి ఆలయానికి దగ్గరలో "స్వర్ణముఖి" నది కూడా ప్రవహించేదిట...ఇప్పుడు ఎండిపోయింది. ఈ నదిలో నీరు లేకపోవటానికి అగస్త్యుడి శాపమే కారణమని కొందరు చెప్తారు.








శ్రీకాళహస్తి గుడి


ఊహ తెలిసాకా శ్రీకాళహస్తి వెళ్లలేదు నేను. అందుకని ఈసారి ప్రత్యేకం శ్రీకాళహస్తి వెళ్లాం. లక్కీగా అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామికి, అమ్మవారు జ్ఞానప్రసూనాంబల దర్శనం బాగా జరిగింది. మేం వెళ్ళిన సమయంలో బయటకు పల్లకీ ఊరేగింపుకి వచ్చారు స్వామివారు. గుడి తాలూకూ కట్టడం, ప్రాకారాలు అన్నీ బాగున్నాయి. అయితే ఇక్కడ కూడా చాలా చోట్లలాగ గుడి ఆవరణంలో పసుపు కుంకుమ ఇచ్చి డబ్బులడిగే అర్చకులను చూడ్డం విచారకరంగా తోచింది.



తిరుగుప్రయాణంలో తిరుపతి స్టేషన్లో నాకు ఇష్టమైన సన్నజాజుల చిక్కటిమాల దొరకటం సంతోషాన్నిచ్చింది.








సన్నజాజులు తురిమిన మా చిన్నది



11 comments:

SHANKAR.S said...

శ్రీవారి మెట్టువైపు మెట్ల దారి జనాలు ఎక్కువ ఉండరు, దూరం తక్కువ అనే కానీ ఇంత బావుంటుందని తెలియదండీ. ఈసారి ఈ దార్లో ఎక్కుతా.

అన్నట్టు కాళహస్తి గురించి రాయనేలేదు?

నైమిష్ said...

త్రుష్ణ గారు మేము ఈ శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళాము మూడేళ్ళక్రితం..మెట్లకి పసుపు పెట్టే మొక్కు తీర్చుకోడానికి..ఆ రోజు ఆదివారం..చాలా ప్రశాంతంగా ఉంది..అయితే అస్సలు జన సంచారం ఉండకపోవటం వల్ల కొంచెం భయం వేసింది..
అలిపిరి మార్గం - 3 గంటల 30 నిమిషాలు or 4 hrs..
శ్రీవారి మెట్ల మార్గం - 2 గంటల 30 నిమిషాలు..
కానీ ఈ మార్గంలో అక్కడ అక్కడ బాగా steep మెట్లు ఉన్నాయి..అలిపిరి మార్గం లొ కొన్ని మెట్లు కొంత దారి కావటం వల్ల అంత అలసట తెలీదేమో..

తృష్ణ said...

@శంకర్ గారూ, టపా నిడివి పెద్దదయిపోయిందని కాళహస్తి గురించి కొంచెమే రాసాను. ఇందాకా మీరడిగితే కొంచమైనా రాసా కదా అనుకున్నా కానీ టపా చూడలేదు. కానీ ఆ పేరా అసలు టపాలో రాలేదని ఇప్పుడే గమనించాను...:(( కలిపాను. తెలిపినందుకు ధన్యవాదాలు.

శేఖర్ (Sekhar) said...

చాల చక్కగా మీ అనుభూతులని పంచుకున్నారు బాగుంది ...నేను మెట్ల దారి లోనే వెళ్తుంటాను...ఎందుకోగాని తరువాత దర్శనం బాగుంటుంది :)

*కొంచెం ఫాంట్ పెద్దగ ఉంటె బాగుంటుంది తృష్ణ గారు :)

ఇందు said...

Trishna.... baagunnay mee Tirupathi-Kalahasthi viseshalu :) Naaku nenu vellinappati vishayalu gurtostunnay :) Nice post.

Indira said...

డియర్ తృష్ణా, మీ తిరుపతి ట్రిప్ విశేషాలు బాగున్నాయ్.పివీఅర్కె ప్రసాద్ గారి నాహం కర్తా,హరిః కర్తా!! చదివిన తరువాత తిరుపతి దర్శన అనుభూతి వేరు.ఆయన టైం లో నిర్మాణం జరిగిన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట,అంజనాద్రి దగ్గరి హనుమంతుల విగ్రహం,పద్మావతి గెస్టు హౌస్ వీటి వెనకాల ఎంతటి కధ జరిగిందోకదా అనిపిస్తుంది

తృష్ణ said...

@నైమిష్ గారూ, ఎక్కువగా పసుపుకుంకుమ బొట్లు మొక్కు ఉన్నవాళ్ళు ఈ దారి గుండా వెళ్తుంటారుట. అలిపిరి దార్లో ఉన్నంత కాకపోయినా ఈ మెట్ల దారిలో ఎక్కే జనం ఇప్పుడు బాగానే ఉన్నారండి. చివర చివర్లో కాస్త steepగానే అనిపించాయి..:)
ధన్యవాదాలు.

@శేఖర్(sekhar): ఈ టెంప్లేట్ లో ఫాంట్ ఎడ్జెస్ట్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉందండి. మార్చాను కానీ ఇప్పుడు గేప్స్ ఎక్కువ వచ్చేసాయి...:)
ధన్యవాదాలు.

తృష్ణ said...

@ఇందు: అవునా? వెళ్ళిన ప్రతిసారి ఓ కొత్త అనుభూతిని అందిస్తాడు తిరుమలేశుడు...:)
ధన్యవాదాలు.

@ఇందిర: నాకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటండి "నాహం కర్తా,హరిః కర్తా!" పుస్తకం. ఆయనదే "తిరుమల చరితామృతం" చదివారా?
ధన్యవాదాలు.

Balu said...

namaskaram,

prastutam darshanam Q halls lopale undavalasina pani ledu.mana darshana samayaniki 2 gantala mundu velthe chalu.okasari hall lopaliki velli,malli bayatiki vaccheyya vacchu.March modati varam lo maa annayya vallu vellinappudu, ee vishayam telisindi.
Just for info.
sreevivasa mangapuram daari gurunchi telipinanduku dhanyavadalu.


Balu

మధురవాణి said...

బావున్నాయి మీ తిరుమల కబుర్లు.. లాస్ట్ ఫోటోకి సూపర్ లైక్! ;)

www.web express.com said...

namo venkatesa namo srinivasa namaste,namaste namaha