సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, December 27, 2011

దిగంతం


పుస్తకం మూసిన తరువాత కూడా ఆ అక్షరాలు మన వెనుకెనకే పెరిగెడుతుంటాయి
అచేతనమై మస్థిష్కంలో ఏ మూలో పడి ఉన్న అలోచనలు నిద్ర లేస్తాయి
వరుస క్రమంలో వెళ్ళే చీమకు తెలిసిన గమ్యమైనా నీకు తెలుసా అని నిలేస్తాయి
ఆ అక్షరాలు... పాఠకుడికి ఎక్కడ తగలాలో తెలిసిన వాడి చురకత్తులు


కాశీభట్ల వేణుగోపాల్ గారి "దిగంతం" నవల చదివాకా నా మనసులోంచి వచ్చిన వాక్యాలు అవి. ఇంతకు ముందు చదివిన "తపన" కన్నా ఇది నాకు బాగా నచ్చింది. సాధారాణంగా ఏ ఇతర రచనలోను కనబడని తెగువ, ధైర్యం వేణుగోపాల్ గారి రచలల్లో కనబడుతుంది. ఆలోచింపజేస్తుంది. ఒకోసారి భయపెడుతుంది. చదివిన ప్రతిసారి నేను ఆ అక్షరాల్లోని, వాక్యాల్లోని సృజనాత్మకతను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. వారి రచనలో కేవలం ఒక కథ మాత్రమే కాక అంతర్లీనంగా మరేదో... ప్రతికోణంలోనూ మరో కొత్త చిత్రంలా కనబడే ఒక abstract painting లా కనబడుతుంటుంది నాకు.

వేణుగోపాల్ గారి రచనల్లోని ఇతివృత్తం ఏదైనా, మనిషి ఆలోచనాపరంపరలోని అనావిష్కృత పార్శ్వాలను, మనిషిలోని వ్యతిరేక అంతర్భాగాన్ని తనదైన శైలిలో అక్షరీకరించటమే వీరి రచనల్లోని ముఖ్యోద్దేశమేమో అని మరోసారి బలంగా అనిపించింది. కొన్ని వాక్యాల్లో వేణుగోపాల్ గారు వాడే సంయుక్తాక్షరాలు (అంత అలవోకగా ఎలా వాడేస్తారో కానీ) చదవటానికి కష్టంగానే కాదు గమ్మత్తుగా కూడా ఉంటాయి. ఈ నవలలో కథానాయకుడి మాటల్లో తప్ప ఎక్కడా కనబడని అతని మూగ, అవిటి ముసలి తల్లి నాకు భలే నచ్చేసింది. చాలాచోట్ల అతను వర్ణించే ఆమె 'గాజుకళ్ల నిర్వికారమైన చూపు' నన్ను వెంటాడుతూనే ఉంది...ఇంకా...!


"దిగంతం" గురించి ఇంకేమీ రాయాలని నాకు అనిపించటంలేదు. నవలలో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు :


 


" ఏ ముఖమూ లేని నేను నా ముందు పరిగెడుతున్నాను. ముఖమే లేని ఇంకో నేను... నన్నే తరుముతున్నాను."


"కోపం జ్ఞానాన్ని తొక్కి ముందుకు పోయింది."


"ఇళ్ళ చూరుల్లోంచీ పైకి లేచి రకరకాల ఆకారాలతో ఒళ్ళు విరుచుకుంటున్న పొగలూ...సర్రుసర్రుమని ఎప్పటికీ పోని దుమ్ముని ఊడుస్తూ ఆడవాళ్ళూ..."


"అన్నింటికీ...ఆ శూన్యం నిండిన చూపులే జవాబులు...! ఆమె మొహమ్మీద మడాతలన్నీ నాకు మూసేసిన పుస్తకాలు."


"జీవితం ఒక వ్యసనం...!
జీవించటానికి బానిసైనవాళ్ళే అంతా...!!
వ్యామోహవృక్షపు చిరు చిగురుకొమ్మలీ అలవాట్లు. "


"పగటి వెలుగులో గుర్తింపు దొరకని సామాజికులంతా ప్రవాస కాందిశీకుల్లాగా తరలిపొయే గుంపులో ఒకణ్ణైన నాకూ....ఓ ప్రవాసిక గుర్తింపు !"


"నేను కరెక్టు అయినా కాకపోయినా నా అభిప్రాయం మీద నాకు హక్కు ఉంటుంది కదా !"


"మనిషి మీదో మనిషికి కలిగే కృతజ్ఞత మోతాదు మిరితే బంధమై కూర్చుంటుందేమో...లేకపోతే ప్రతీది ఒక వ్యాపార సంబంధం కాదూ...?!"


"...కూరగిన్నెలో కాడ విరిగిన అల్యుమినియం గరిటే... కుంటికాలు అమ్మా ఒక్కలాగే ఉన్నారు.
ఇద్దరు సుఖాన్ని పంచేవాళ్ళే మరి."


"మనుషులు కూచునే చోట నాలుగు గోనెపట్టాల్తో గూడులా కట్టి ఉంది. ఓ ముసలి బిచ్చగత్తె తన సామాన్తో ఆ గూట్లో కాపురముంటోంది.
కాదేది ఆవాసానికి అనర్హం ఈ భారతదేశంలో...!"


"శ్రీరంగం ఎంతమంది బిచ్చగాళ్ళకి ఎన్ని పదిపైసలు నానేలు దానం చేసుంటాడు....? అడుక్కుతిఏ ముసల్దాని మీదో గొప్ప కవిత సృష్టించాడు."


"మనకు నచ్చని ప్రపంచాన్ని కూడా అలా వెనక్కి నెట్టేస్తూ మనకు నచ్చే లోకాల అంచులకు నడుచుకుంటూ మనం వెళ్లగలిగితే..."


"రకరకాల పుస్తకాల్లోంచి ఒక్కో పేజీ చించుకొచ్చి అన్నిటినీ కలిపి కుట్టిన పుస్తకం లాంటి మ్లిష్ట భావన... !"


"యే రోజుకారోజు ఒక జీవితాన్ని గడిపినట్లు గడిపేయటమేనా...?"


"దేన్నించీ యెవర్నించీ పారిపోయినా అలోచనల్నుంచి మనిషి పారిపోలేడు కదా....!"


"ఆయన చూసినట్లుగానే ప్రపంచం లో జనాలందరూ చూసుంటే...ఇన్ని వందల వేల కోట్ల రూపాయిల పువ్వులమ్ముడుపోతాయా రోజూ...?
అందుకే...అందరూ జంధ్యాలలు కాలేరు. ఆయనకు పుష్పవిలాపం...కోట్లాది జనాలకి పుష్పవిలాసం..."


"పరిపూర్ణమైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు...! సంపూర్ణత్వం ఓ మిధ్యాభావన మాత్రమే."


**** **** ****

ఈ నవల గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే భాను గారి "నేను-మీరు" బ్లాగ్లో ఇక్కడ చూడవచ్చు..

9 comments:

SHANKAR.S said...

"నేను కరెక్టు అయినా కాకపోయినా నా అభిప్రాయం మీద నాకు హక్కు ఉంటుంది కదా !"

"మనిషి మీదో మనిషికి కలిగే కృతజ్ఞత మోతాదు మిరితే బంధమై కూర్చుంటుందేమో...లేకపోతే ప్రతీది ఒక వ్యాపార సంబంధం కాదూ...?!"

"మనకు నచ్చని ప్రపంచాన్ని కూడా అలా వెనక్కి నెట్టేస్తూ మనకు నచ్చే లోకాల అంచులకు నడుచుకుంటూ మనం వెళ్లగలిగితే..."


"యే రోజుకారోజు ఒక జీవితాన్ని గడిపినట్లు గడిపేయటమేనా...?"

"దేన్నించీ యెవర్నించీ పారిపోయినా అలోచనల్నుంచి మనిషి పారిపోలేడు కదా....!"

"పరిపూర్ణమైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు...! సంపూర్ణత్వం ఓ మిధ్యాభావన మాత్రమే."


భలే ఉన్నాయండీ ఈ ఆలోచనలు. అర్జంటుగా కవిసార్వభౌముడు కంప్లీట్ చేసేసి ఈయన రచనల మీద పడాలి నేను. అవునూ అన్నట్టు మీ దగ్గర "ఘోష" ఉందా? దానికోసం వెతుకుతున్నాను నేను.

మెహెర్ said...

నాకూ "తపన" కన్నా "దిగంత"మే నచ్చుతుంది. "తపన" లక్షరూపాయల నవల అని ఆ పేరొచ్చేసిందంతే అనిపిస్తుంది. ఆయన పుస్తకాల్ని ప్రాధాన్యతా క్రమంలో పెట్టమంటే నా జాబితా ఇది:

1) దిగంతం
2) నేనూ చీకటి
3) కాశీభట్ల వేణుగోపాల్ కథలు
4) తపన
5) తెరవని తలుపులు
6) మంచుపూవు
7) ఘోష

ఈ చివరి కథా సంపుటి "ఘోష" నన్ను నిరాశ పరిచింది. తెలుగులో ఆయన శైలి ఎంత అరుదైనదంటే, మూణ్ణాలుగు పుస్తకాలు చదివింతర్వాత ఆయన్ని ఆయనే కాపీ కొట్టుకుంటున్నాడనిపిస్తుంది. అదొకటే ఇబ్బంది.

ఆయన రాబోయే రచన "నికషం" పాలపిట్టలో సీరియలైజ్ అయిందిగానీ, ఇంకా పుస్తకంగా రాలేదు. అదెలా వుంటుందో చూడాలి.

తృష్ణ said...

@shankar.s:చదవందీ..చదవండి.'ఘోష ' లేదండీ. దొరకలేదు.

@మెహెర్: కొత్త పుస్తకం గురించిన సమాచారానికి ధన్యవాదాలు. 'తెరవని తలుపులు', 'ఘోష' రెండూ లేవండీ నా దగ్గర. మిగతావన్ని ఉన్నాయి. ఎక్కడ దొరుకుతాయో కనుక్కోవాలి.
'మంచుపూవు' ఒక్కటి చదవాలి ఇంకా.

రమణ said...

వేణుగోపాల్ గారి కధనం అద్భుతం. నా దగ్గర ఉన్న ఆయన పుస్తకాలను పదే పదే చదువుకుంటాను. ఒక్క మంచుపూవు మినహా ఆయన రచనలు అన్నీ చదివాను. వేణుగోపాల్ గారి రచనలు వాహినీ బుక్ ట్రస్ట్ వారి వద్ద లభిస్తాయి. మిగతా వివరాల కోసం rachana.net చూడండి.

తృష్ణ said...

@ramana: thanks for the link ramana gaaru.

SHANKAR.S said...

రమణ గారూ వాహినీ వాళ్ళ దగ్గర "తెరవని తలుపులు", "ఘోష" లేవండీ. అవి ఇంకా ఎక్కడైనా దొరుకుతాయేమో చెప్పగలరా ప్లీజ్.

రమణ said...

శంకర్ గారూ, వాహినీ బుక్ ట్రస్ట్ వారి వద్ద 'ఘోష' కధల సంకలనం మరియు 'కాశీభట్ల వేణుగోపాల్ కధలు' పేరుతో మరొక సంకలనం ఉన్నాయండీ. తెరవని తలుపులు విశాలాంధ్రలో దొరకవచ్చు. నేను అక్కడే కొన్నాను. కాకపోతే రెండు సంవత్సరాలయ్యింది. విశాలాంద్ర వాళ్ళను అడిగితే వాళ్ళు తెచ్చి ఉంచుతారు.

శ్రీనుపైండ్ల‌ said...

కాశీభట్ల రచనలు ఎప్పుడైతే చదివానో అప్పుడే జీవితం నాశనమైపోయింది. ( విపరీతంగా బాగుపడిందని) .ఖర్మకాలి ఓ షాపులో తపన కొనుక్కున్నానా.. ఒకటే ఆరాటం .. మిగితా పుస్తకాలను చదివేయాలని. క్యూరియాసిటి ఆగక , ఆయనకే ఫోన్ చేసి వేధించా. దెబ్బకు తెచ్చిచ్చారు. ఆయన్ని కలిసిన ఆ క్షణాన్ని జీవితంలో మర్చిపోలేను. ఆయనతో గడిపింది చాలా కొద్ది సమయమే అయినా .. అన్నమయ్య గురించి ఆయన చేసిన విశ్లేషణ ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. కొన్నాళ్ల తరువాత ఆయనపై కోపం వచ్చి మాట్లాడ్డం మానేశా. ఆయన రాసిన పుక్తకాల్లో ఉదహరించిన పుసకాలను చదవడం మొదలెట్టా. జీన్ పాల్ సార్త్రే, కామూస్, డోస్తయేవ్ స్కీ, చెకోవ్, తోల్ స్తోయ్,ముఖ్యంగా కాఫ్కా.. కిర్కెగార్డ్.. వీళ్లంతా నాకు అర్ధం అయ్యారు అని చెప్పను కానీ అర్ధం చేసుకోనేందుకు ప్రయత్నిస్తున్నా.. అర్ధం చేసుకున్నా కొద్ది చాలా కన్ ఫ్యూజన్ లో పడిపోతున్నా. ఇంత సాహిత్యాన్ని కాశీభట్ల గారు.. చదివారంటే ఆయనపై చాలా గౌరవం ఏర్పడింది. గౌవరం చాలా చిన్న మాటే..కానీ నాకు పెద్ద మాట తోచట్లేదు. ఆయన గురించి మరింత డిష్కషన్స్ ను నాకు దయతో పోస్ట్ చేయండి.కాశీభట్ల గురించి ప్రతీ విషయం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఫేస్ బుక్ లో paindla.srinu@facebook.com లో పోస్ట్ చేయ ప్రార్ధన. శ్రీనుపైండ్ల జర్నలిస్ట్

తృష్ణ said...

@paindla: శ్రీను గారూ, మీ వ్యాఖ్య చాలా ఆసక్తికరంగా ఉందండి. ఆయన రిఫర్ చేసే రచయితల రచనలు చదవాలని నాకు చాలా అనిపిస్తుంది.. కొందరి గురించి వికీలో వివరాలైతే చదివాను. వేణుగోపాల్ గారివి మరో మూడు పుస్తకాలు ఈమధ్యనే కొన్నాను.తీరుబడిగా చదవాలి.. చదివాకా టపాగా రాస్తే గనుక తప్పక తెలియజేస్తాను.
ధన్యవాదాలు.