సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Friday, December 9, 2011
విశాలాంధ్ర తెలుగు కథ (1910-2000)
కాలాంతరంలో సమాజంలో జరిగే మార్పుల్ని.. కలిగే చైతన్యాన్ని, సామాజికజీవనంలో కనబడే లోపాలనూ సులభంగా అద్దంపట్టగల సాహితీప్రక్రియ "కథ". విభిన్న దృక్కోణాలతో ఇప్పటిదాకా ఎన్నో కథా సంకలనాలు వెలువడ్డాయి. అయితే ఒక్కో సంకలనానిది ఒక్కో విశేషం. సామాజిక సమస్యలు, ప్రాదేశిక కథలు, స్త్రీ చైతన్యానికి సంబంధించినవి, అత్యంత ప్రజాదరణ పొందిన కథలు...ఇలా అనేక కథాంశాలు. 2002 అక్టోబర్లో ప్రధమ ముద్రణ ద్వారా విశాలాంధ్ర వారు అందించిన "విశాలాంధ్ర తెలుగు కథ (1910-2000)" సంకలనం కూడా ఒక అంత:సూత్రానికి కట్టుబడింది. అదేమిటంటే సామాజిక లోపాలు...వాటి తాలూకూ సమస్యలు. 1910 మొదలు 2000 వరకూ మొత్తం తొంభై ఏళ్ళలో వివిధ కథకులు అందించిన రకరకాల సామాజిక సమస్యల చిత్రణ ఈ కథల్లోని ముఖ్య కథాంశం. ఈ ఏడాది ఏప్రిల్ లో రెండవ ముద్రణ ద్వారా మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకానికి బాపూ వేసిన అందమైన ముఖచిత్రం ముచ్చట గొలుపుతుంది. ఇటువంటి మంచి కథసంకలనాన్ని అందించిన విశాంలాంధ్ర వారు, ఉత్తమమైన కథలను ఎంపిక చేసిన విశాంలాంధ్ర సంపాదకవర్గం ప్రశంసార్హులు.
ఈ సంకలనంలో ఆకలి, పర్యావరణ, రాజకీయ, ఆర్ధిక, నిరుద్యోగ, వృధ్ధాప్య సమస్యలు, స్త్ర్రీ సమస్యలు మొదలైన ఎన్నో సామాజిక సమస్యలను రచయితలు తమ తమ కథల్లో స్పృశించారు. తెలుగు కథ ద్వారా ఇంతటి వైవిధ్యమైన సామాజిక స్వరూపాన్ని ఒక చోట అందించటం మెచ్చదగ్గ విషయం. ఈ సంకలనంలో పొందుపరచాలని సంకల్పించిన అంత:సూత్రం సమాజికమైనది కాబట్టి (గత శతాబ్దపు ఉత్తమ కథల్లో) మానసిక చిత్రణ ఉన్న కథానికలకు చోటు ఇవ్వలేకపోయామని సంపాదకులు ముందుమాటలో చెప్పారు. ఇలాంటి ఒక ముఖ్యోద్దేశానికి కట్టుబడి ఉన్నందువల్ల ఈ సంకలనంలోని కథలు గత శతాబ్దపు జీవన విధానాలనూ, సామాజిక పరిస్థితులనూ,ఎన్నో రకాల సమస్యలను కళ్ళకు కట్టి చూపెడతాయి. ఇవి అందంగా, మనోహరంగా ఉండవు. గుండెల్లో బరువుని పెంచి, ఆవేశం రగులుస్తాయి. కన్నీరు తెప్పిస్తాయి. ఏళ్ళ తరబడి సమాజంలో మనం ఏదైనా మార్పుని చూస్తున్నామా? అసలు ముందుకు వెళ్తున్నామా? అక్కడే నిలబడిపోయామా..? అని మనల్ని ఆలోచింపజేస్తాయి.
గురజాడ అప్పారావు గారి "మీ పేరేమిటి?" అనే కథ తో మొదలయ్యే ఈ పుస్తకంలో మొత్తం 108 కథలున్నాయి. కథారచనలో అందవేసిన చెయ్యి ఉన్న రచయితలందరి కథలూ ఇందులో పొందుపరిచారు. చలం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, అడివి బాపిరాజు, తిలక్, కాళీపట్నం రామారావు, చాగంటి సోమయాజులు, కొడవటిగంటి, ముళ్ళపూడి, వాసిరెడ్డి సీతాదేవి, బీనాదేవి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, మధురాంతకం రాజారాం, వాడ్రేవు చినవీరభద్రుడు, ఓల్గా, తల్లావఝ్ఝుల పతంజలిశాస్త్రి, రహమతుల్లా, కుప్పిలి పద్మ మొదలైనవారి రచనలను ఈ సంకలనంలో పొందుపరిచారు. చలం కథ "భార్య" అలనాటిబాల్య వివాహాలలోని లోపాలను తెలుపుతూనే ఒక స్త్రీ అంతరంగ అద్భుత చిత్రీకరణను మనకు చూపుతుంది. ఆనాటి సమాజంలోని మత మౌఢ్యాలను ఎత్తిచూపే గురజాడ గారి కథ ఈతరంలో రాసినదా అనిపించక మానదు. వాసిరెడ్డి సీతాదేవి గారి "తరాలూ-అంతరాలు" కథానిక తరతరాలుగా మారని అత్తాకోడళ్ళ సంఘర్షణను చూపెడుతుంది. అదివరకూ రహమతుల్లా గారి "బా" సంకలనంలో నాకు నచ్చిన "అమ్మీజాన్" కథ మరోసారి చదివాకా కంట్లో తడి అడ్డం పడింది. సి.సుజాత గారి "స్మైల్స్ ఫర్ సేల్" కథ ఉద్యోగినుల సమస్యలకు, మనోభావాలకు అద్దం పడుతుంది.
ఈ సంకలనంలో కథలు చదువుతుంటే చాలావారకూ వాటిలోని అంశాలు నిన్నటి శతాబ్దపు సామాజిక సమస్యల్లా కాక నేటి సమాజిక ప్రతిబింబాల్లా కనిపించటం చిత్రం ! సమాజంలో మార్పు నిజంగా వచ్చిందా? సమస్యలు అలానే ఉన్నాయా? అని సందేహం కలుగుతుంది. అయితే సమాజిక మార్పును గురించి ఆలోచించినప్పుడల్లా నాకు తోచే సమాధానం ఒక్కటే... సమాజంలో మార్పు తేవాలంటే ఉద్యమాలే నడపనక్కర్లేదు...ప్రతిఒక్కరం మన ఇంట్లోని భావితరాన్ని సరైన దారిలోకి మళ్ళించగలిగితే చాలేమో అని !
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
ఈ మధ్య విశాలాంధ్ర మీదకు దండయాత్ర కుదరలేదండీ. పుస్తకాల పండగ వస్తోంది కదా అని కుసింత నిర్లక్ష్యమేమో :). మీ సమీక్ష బట్టి ఈ పుస్తకం చదవబుల్ గా ఉంటుందని భావిస్తున్నాను. తిరుపతి షిఫ్ట్ అనంతరం దండయాత్రలో దీన్నీ చేర్చాలి.
మీరన్నట్టు చాలా వరకు సామాజిక సమస్యలు మారలేదండీ. సమస్య మూలాలు అలాగే ఉన్నాయి. అది నిరుద్యోగమైనా, స్త్రీల సమస్యలైనా, వరకట్నం వగైరాలైనా మూలాలు మారలేదు. ఇక అభివృద్ధి అంటారా? అది మేడి పండు చందం అని నా అభిప్రాయం.
Chala bavundi. Price kooda ivvandi please.
@shankar.s:definitely readable.
'yes' to everything u said.
Thanks for the comment.
@sujata: oh..i forgot...the book is a heavy bound with 108 stories & the price is Rs.500/-
Thanks for the comment.
"సమాజంలో మార్పు తేవాలంటే ఉద్యమాలే నడపనక్కర్లేదు...ప్రతిఒక్కరం మన ఇంట్లోని భావితరాన్ని సరైన దారిలోకి మళ్ళించగలిగితే చాలేమో అని"
ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.
@నాగేస్రావ్:అభిప్రాయం నచ్చినందుకు ధన్యవాదాలు.
Post a Comment