సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 30, 2011

మిథునం : దస్తూరీ తిలకం


1998 లో "రచన" పత్రికలో బాపూగారి స్వదస్తూరిలో మిథునం కథానిక అచ్చయినప్పుడు; ఆ కథానిక, ఇంకా శ్రీరమణ గారి "బంగారు మురుగు" కథ తాలూకూ జిరాక్స్ కాపీ, రెండూ శ్రీకాంత శర్మగారు నాన్నకు ఇచ్చారు. అపురూపమైన బాపుగారి స్వదస్తూరిలో మిథునం కథానిక, ఆద్యంతం మధురమైన "బంగారు మురుగు".. రెండు కథలూ మా ఇంటిల్లిపాదికీ ఎంతగానో నచ్చేసి, ఆ రెండు కథలూ మరిన్ని జిరాక్సులు తీయించి మరికొందరు సాహితీ మిత్రులకూ, బంధువులకూ అప్పట్లో కొరియర్లో కూడా పంపించాము. తర్వాత ఇంటర్నెట్ లో బాపుగారి దస్తూరితో ఉన్న కథానిక పెట్టారనీ, బాగా ప్రాముఖ్యం పొందిందనీ విన్నాం.

తర్వాత మద్రాసు రేడియోస్టేషన్ నుంచి మిథునం కథ నాటక రూపంలో ప్రసారమైంది. శ్రీమతి పద్మజా నిర్మల గారు ప్రొడ్యూస్ చేసిన ఈ నాటకంలో సినీనటులు సుత్తివేలు, రాధాకుమారి గారూ అనుకుంటా ప్రధాన పాత్రలు పోషించారు. వాసుదేవన్ నాయర్ గారు ఈ కథపై తీసిన మళయాల సినిమా గురించి అందరికీ తెలిసినదే. తనికెళ్ళ భరణి గారు ఈ కథను తెలుగులో సినిమాగా తియ్యబోతున్నారన్నది కొత్త వార్త.



ఇప్పుడు మరొక కొత్తవార్త ఈ కథానిక అదే బాపూ గారి స్వదస్తూరీతో "ఒకే ఒక్క మిథునం" పేరుతో పుస్తకరూపంలో వచ్చింది. రచయిత శ్రీరమణ గారి ముందుమాట కొత్త విషయాలను తెలిపితే, శ్రీ జంపాల చౌదరి గారి ముందుమాట మనసుకు హత్తుకునేలా ఉంది.

ఈ పుస్తకాన్ని నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ గా పంపిన బ్లాగ్మిత్రుడు, అంతకు మించి మంచి సహోదరుడు అయిన శంకర్ గారికి బ్లాగ్ముఖంగా బోలెడు ధన్యవాదాలు. అభినందనలు.

13 comments:

మధురవాణి said...

ఓహో.. మీక్కూడా అందిందన్నమాట ఈ అమూల్యమైన కానుక.. బహు బాగు! :)

తృష్ణ said...

మధురా, నీకు తెలీదా శంకర్ గారు చేసిన "మిథునం నోము" ఉద్యాపనా కార్యక్రమంలో భాగంగా ఈ పుస్తకాల పంపిణీ జరుగుతోందని వేగులు తెచ్చిన వార్త...:)))

జ్యోతిర్మయి said...

మిధునం నాకు చాల ఇష్టమైన పుస్తకం..

Indira said...

డియర్ తృష్ణా,మిధునం సంచిక వచ్చిన కొత్తల్లో బంధువుల్లో,స్నేహితుల సర్కిల్లో ఎవరు కలిసినా దీనిగురించే మాట్లాడుకోవడం.విశ్రాంతజీవనాన్ని అత్యద్భుతంగా చిత్రించిన తీరు మనస్సుహత్తుకొనేలా వుంది.నాదగ్గరకూడా అసలు కాపీ,రచన వుంది. శంకర్ గారి టపాలు చదివాను.చాలా మంచి అభిరుచి ఆయనిది.మీ టపా చదివిన తరువాత మళ్ళీ వొకసారి తీసి చదువుకున్నాను.మీకు నా ధన్యవాదాలు.

SHANKAR.S said...

"మధురా, నీకు తెలీదా శంకర్ గారు చేసిన "మిథునం నోము" ఉద్యాపనా కార్యక్రమంలో భాగంగా "

హ హ తృష్ణ గారూ నిజంగా అలాంటి నోము ఉంటె నేను రెండు కథల విషయంలో సంతోషంగా చేస్తాను. ఒకటి శ్రీ రమణ గారి "మిథునం" . రెండోది శ్రీ శ్రీ శ్రీ రమణ గారి "కానుక" కథ.

@ Indira గారు
ధన్యవాదాలు

ఇందు said...

మిధునం నోములో ఇందుకి పుస్తకం పంపడం మర్చిపోయిన శంకర్ గారిని తిట్టుకుంటున్న ఇందు ;)

తృష్ణ said...

@జ్యోతిర్మయి: అ పుస్తకంలో నాకు "బంగారు మురుగు" ,"మిథునం" రెండూ చాలా ఇష్టమైన కథలండీ.

@ఇందిర: నాకు బ్లాగ్లోకంలో పరిచయమైన చాలా కొద్దిమంది మిత్రులలో ఒకరండి శంకర్ గారు. ఈయన బ్లాగ్ పై సరిగ్గా శ్రధ్ధ వహించరని నా అభియోగం. రెగులర్ గా రాస్తే చాలా పాపులర్ బ్లాగర్ అయిపోయిఉండేవారు.

తృష్ణ said...

@శంకర్.ఎస్: :)))

@ఇందు: తిట్టుకుంటున్నవారి లిస్ట్ లో మీరూ చేరిపోయారా? హతవిధీ...పాపం శంకర్జీ !!

పద్మవల్లి said...

మంచి కానుక తృష్ణగారూ. నాకు కూడా మిధునం, బంగారు మురుగు బాగా నచ్చిన కథలు.
ఇది సినిమా తీస్తున్నారా? హ్మ్మ్.. చూడాలి అయితే. అసలు కథ మీద ప్రేమ పోకుండా ఉండేలా ఉంటె బానే ఉంటుంది. భరణి గారు అంటున్నారు కదా, కొంచెం ఆశలు పెట్టుకోవచ్చేమో లెండి.

వేణు said...

ఈ ‘ఒకే ఒక్క మిధునం’ బాపు చేతిరాతలో పుస్తకంగా తీసుకురావటం చెప్పుకోదగ్గ విశేషం. మామూలుగా కంపోజ్ చేస్తే ఇన్ని పేజీలు రావు కానీ అప్పుడింత ఆకర్షణయితే ఉండేది కాదు!

సాహితీప్రియులు ఒకటి మాత్రమే కొని ఊరుకోకుండా పదేసి పుస్తకాల చొప్పున కొని, స్నేహితులకు కానుకగా ఇస్తున్నారు. అందుకే ఈ పుస్తకం తొలి ముద్రణ ప్రతులు వేగంగా చెల్లిపోతూ, త్వరలోనే రెండో ముద్రణకు సిద్ధమవుతోంది.

భరణి ఈ కథను సినిమాగా ఎలా తీస్తాడో చూడాలి!

తృష్ణ said...

@పద్మవల్లి: భరణి గారనే ఆశగా ఉందండీ. మరి ఎలా ఉంటుందో వేచి చూడవలసినదే. పడుచువారికి ముసలి మేకప్ వెయ్యకుండా పాత్రల వయసుకు కాస్తైనా దగ్గరగా ఉన్న నటులను తీసుకుంటే బావుంటుందండీ.

@వేణు: పుస్తకాలకు ఆదరణ ఇంకా తగ్గలేదని సంతోషించాల్సిన విషయమండీ ఇది. మిత్రులకు కాపీలు పంచుతున్న శంకర్ గారు లాంటి సాహితీ మిత్రులందరికీ వందనాలు.

Indira said...

తృష్ణా,ఒక చిన్న అభ్యర్ధన!గుమ్మడెడె గొపిదేవి,గుమ్మడెడె కన్నతల్లి అన్న పాత రేడియో పాట ఆడియో మీదగ్గర వున్నదా?చాలా రోజులనుంచి వెదుకుతున్నాను.ఇతర బ్లాగ్ మిత్రులెవరి దగ్గరున్నా సరే,వారు ఇవ్వగలిగితే,నేను చాలా happy.

తృష్ణ said...

@ఇందిర: తప్పకుండా కనుక్కుంటానండీ...