సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, November 26, 2011

ఈ కార్తీకం కబుర్లు





హమ్మయ్య ! పొద్దున్నే లేచి "పోలి స్వర్గం" దీపాలు వెలిగించేసాను. ఈ ఏటి కార్తీకమాస పూజలన్నీ సమాప్తం. అసలు పుణ్యప్రదమైన కార్తీక మాసంలో ముఖ్యంగా చెయ్యాల్సినవి దీపారాధన, పురాణ శ్రవణం లేదా పఠనం, ఉపవాసం, నదీస్నానం, దీపదానం, వనభోజనాలు మొదలైనవిట. వీటిలో కుదిరినవి చేసాను మరి. నదీస్నానం వీలయ్యేది కాదు కాబట్టి అది కుదరలేదు. ఉపవాసాలు చిన్నప్పుడు అమ్మతో ఉండేదాన్ని కానీ పెద్దయ్యాకా ఎందుకో వాటి జోలికి పోవాలనిపించలే. ఉండలేక కాదు కానీ ఏమిటో నమ్మకమూ, ఆసక్తి లేవంతే. so, ఉపవాసాలు కూడా చెయ్యలేదు.

నెలరోజులూ సాయంత్రాలు తులశమ్మ దగ్గర దీపంతో పాటూ కార్తీకపురాణంలో ఒకో అధ్యాయం చదివేసుకున్నా. కార్తీకపురాణంలో, సోమవారాలు శివలయంలో పొద్దున్న కానీ, సాయంత్రం కానీ దీపం వెలిగిస్తే బోలెడు పుణ్యమని రాసారు కదా అని శ్రధ్ధగా ప్రతి సోమవారం వెళ్ళి ఉసిరి చెట్టు క్రింద ఆవునేతిదీపం పెట్టేసి, పట్టుకెళ్ళిన పుస్తకంలోంచి నాలుగైదు స్తోత్రాలు అవీ చదివేసుకుని మరీ వచ్చేదాన్ని. ఆ గుడి ప్రాంగణం విశాలంగా ఉండి పేద్ద పేద్ద చెట్లు ఉంటాయి. నాకిష్టమైన కాగడా మల్లెపూల చెట్టు కూడా. దాని క్రిందే కూచునేదాన్ని మంచి సువాసన వస్తూంటుందని....:))


మధ్యలో ఓ ఆదివారం కీసరగుట్ట వెళ్ళి రామలింగేశ్వరస్వామి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అక్కడ ఉన్న పార్కులో అందరూ వనభోజనాలు చేస్తూంటే మేమూ సేదతీరాం. ఓ చెట్టు క్రింద కూచుని గుళ్ళో కొన్న పులిహార పేకేట్లు తినేసాం. తీరా చూస్తే మేం కూచున్నది బిళ్వవృక్షం క్రిందన. చుట్టూరా బోలెడు మండి వంటలు కూడా అక్కడే వండుకుంటున్నారు. భలే భలే మనకూ వనభోజనాలయిపోయాయి అనేసుకున్నాం.




క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసే పూజ నాకు చాలా ఇష్టం కాబట్టి అది బాగా చేసుకున్నా. ఈసారి అమ్మ మాటికి వచ్చింది. నేను, అమ్మ, పాప కలిసి పూజ చేసుకుంటుంటే భలే ఆనందం వేసింది. మళ్ళీ కార్తీకపౌర్ణమి పూటా శివాలయంలోనూ , ఇంట్లో తులశమ్మ దగ్గరా 365 వత్తులతో, ఉసిరి కాయతోనూ దీపం వెలిగించానా, ఇంకా ఎందుకైనా మంచిదని విష్ణుసహస్రనామాలు అవీ కూడా చదివేసా. మధ్యలో నాగులచవితి వచ్చిందా...అప్పుడు కూడా పుట్టకు వెళ్ళే ఆనవాయితీ లేదు కాబట్టి ఇంట్లోనే తులశమ్మలోని మట్టితో పుట్టలా చేసి, అందిమీద నావద్ద ఉన్న రాగి నాగపడగను కూచోబెట్టి ఇంట్లో అందరితో పాలు పోయించా. చిమ్మిలి, చలివిడి చేసి నైవేద్యం పెట్టా కానీ పుట్టకు ఫోటోతియ్యటం మర్చిపోయా...:( ఇక పౌర్ణమి అయిపోతే కార్తీకంలో మేజర్ పూజలన్నీ అయిపోయినట్లే. మిగిలిన రోజులు సాయంత్రాలు దీపం పెడుతూ ఉండటమే. నిన్నటి అమావాస్య దాకా.

అమావాస్య వెళ్ళిన పాడ్యమి తెల్లవారుఝామున "పోలి" అనే ఆవిడ కార్తీక దీపాలు ఇంట్లోనే, అదీ వెన్న చిలికిన కవ్వానికున్న వెన్నతో దీపాలు శ్రధ్ధగా పెట్టిన కారణంగా స్వర్గానికి వెళ్ళిందట. అందుకని ప్రతిఏడూ కార్తీకమాసం అయిపోయిన మర్నాడు పాడ్యమి తెల్లవారుఝామున లేచి నదీస్నానం చేసి, అరటిదొప్పలో ఆవునేతివత్తులు వేసి నదిలో దీపాలు వదులుతారు చాలామంది. నెలంతా దీపాలు పెట్టలేకపోయినా ఈ రోజు ముఫ్ఫై దీపాలూ పెడితే చాలని అన్ని దీపాలూ వదులుతారు. నదీ స్నానం చేసి అక్కడ దీపాలు పెట్టడం కుదరనివారు ఇంట్లోనే తులసమ్మ దగ్గర పళ్ళేం లోనో, పేద్ద బేసిన్ లోనో నీళ్ళు పోసి అందులోనే దీపాలు పెడతారు అమ్మలాగ. చిన్నప్పుడు అలా పళ్ళేంలో నీళ్ళల్లో అమ్మ దీపాలు పెట్టడం బావుండేది చూట్టానికి. ఇప్పుడు నేనూ అమ్మలాగ రాత్రే ఆవునెయ్యిలో వత్తులు వేసి ఉంచేసి, పొద్దున్నే అరటిదొప్పలో వత్తులు వెలిగించి నీళ్ళల్లో దీపాలు వదులుతున్నను క్రింద ఫోటోలోలాగ.




ఇంకా, కార్తీక మాసంలో ఎవరైనా పెద్ద ముత్తయిదువను పిలిచి పసుపు రాసి, పువ్వులు, పళ్ళు, పసుపు, కుంకుమ పెట్టి చీర పెడితే చాలా పుణ్యమని ఓ పుస్తకంలో చదివాను. ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తూంటే అమ్మనాన్న ఉన్నారని మా పిన్నిలిద్దరూ, మరికొందరు కజిన్స్ అంతాకలిసి ఓరోజు ఇంటికొచ్చారు. ఇంకేముంది నాకు పండగే పండగ. మొత్తం అయిదుగురినీ కూచోపెట్టి పసుపు రాసేసి, మిగిలినవన్నీ పెట్టి అందరికీ తలో చీరా పెట్టేసి దణ్ణం పేట్టేసా. ఎంత పుణ్యమో కదా. శభాష్ శభాష్... అని భుజం తట్టేసుకున్నా..! నేనూ ఖుష్. బంధువులూ ఖుష్. దేవుడూ ఖుష్.

ఇక ఇవాళ పొద్దుటే దీపాలు వదలటంతో కార్తీకం అయ్యింది. హామ్మయ్య అనుకుని గాఠ్ఠిగా ఊపిరి తీసుకుని ఓ పుస్తకం పట్టుకున్నానా, మార్గశిర శుధ్ధ పాడ్యమి నాడు విష్ణుసహస్రనామం చదివితే మంచిది అని ఉంది ఆ పుస్తకంలో. సరే ఇంత పొద్దుటే చీకట్లో చేసే పనేముంది అనేసుకుని ఆ సహస్రనామాలు కూడా పూర్తయ్యాయనిపించా !!




ఈ విధంగా ఈసారి నా అకౌంట్ లో ఎప్పుడూకన్నా కాస్తంత ఎక్కువ పుణ్యమే పడేసుకున్నా...:)) దాంట్లోంచి ఎలాగూ సగం శ్రీవారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుందనుకోండి. ( భర్తల పాపంలో మనకూ వాటా ఉంటుందిట, మన పుణ్యంలో వారికి వాటా వెళ్తుందిట....:(( అసలిది దేవుడితో డిస్కస్ చేయాల్సిన పేద్ద విషయం.) మరీ నాలుగింటికి లేచానేమో.. బాగా నిద్ర వస్తోంది. ఇంక కాసేపు బజ్జుంటా.

యూట్యూబ్ లో పోలి స్వర్గం కథ రెండూ భాగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చూడండి:
http://www.youtube.com/watch?v=a9459H0nerI&feature=related




11 comments:

లత said...

బావున్నాయండి మీ కార్తీకం కబుర్లు.బిజీ బిజీ అన్నమాట
ఓపిక ఉండాలే కానీ ఈ మాసంలో ఎంత ఎక్కువ పూజలు చేసుకుంటే అంత పుణ్యం అంటారు కదా

siri said...

పొని లెండి మీరన్న చెశారు.నాకు అస్సలు కుదరలెదు .దీప దర్సనం చెస్కున్నా పుణ్యమె కద ఆ భాగ్యాన్ని కలిగించారు చాలు.

కృష్ణప్రియ said...

ఇన్ని చేస్తారని తెలియదు నాకు .. తమిళ వారు రోజూ దీపం పడుతుంటే.. వాళ్లకి చాలా ఉన్నాయి పద్ధతులు అనుకున్నా :)

అందరూ పెడుతున్నారు కదా అని సరదాకి సోమ వారాలు నేను చిన్న దీపం పెట్ట్టాను..

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మీరు తప్పుగా విన్నారండి. భర్త చేసుకున్న పుణ్యంలో భార్యకు భాగం ఉంటుంది. రివర్స్ లో కాదు.

swathi said...

బావునయండి మీ కార్తిక మాస కబుర్లు.కాని మీరు ఒకటి reverese చెప్పారు. భార్య పాపం లో సోగం భర్తకి వెళ్తుంది.భర్త పుణ్యంలో సోగం భార్యకి వస్తుంది.అంతే కాని భర్త పాపం భార్యకి రాదు.

తృష్ణ said...

@ లత: అవునండి. ఎంతో ఓపిగ్గా ఇంకా చాలా శ్రధ్ధగా చేస్తూండేవాళ్ళను చూసానండి.
ధన్యవాదాలు.

@ సిరి: :)) ధన్యవాదాలు.

@కృష్ణప్రియ: ఓ అవునా...తమిళులకున్న చాలావరకూ పధ్ధతులు మనకూ ఉన్నాయండి.
నేను చేసిండి చాలా కొంచెం అండీ...మా అత్తగారు తెల్లవారుఝామున చన్నీళ్ళ స్నానంతో పాటూ ఇంకా బోలెడు చేసేవారు. ఈ ఏడు ఇక ఓపికలేక మానేసారు పాపం.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@మందాకిని: అయిఉండవచ్చండి..! కానీ నేను చదివినది మాత్రం ఇదే పాయింట్...:)
ధన్యవాదాలు.

@స్వాతి: బావున్నారా? మీ బాబు (బాబే కదా?) నడిచేస్తున్నాడా?
అయిఉండవచ్చండి....నేను చదివినది అదే మరి. కరక్టో కాదో తెలీదు మరి.. !
ధన్యవాదాలు.

swathi said...

hello తృష్ణ గారు ,
నేను బాగుననండి.మీకు బాగా గుర్తు వుందే!thank you. బాబే అండీ .నడవడమేంటి అండీ గోల గోల చేస్తునాడు.

swathi said...

మరో విషయమండి ఇవ్వాళా chaganti koteswaro గారి ప్రవచనం చెప్తుంటే మీరు గుర్తోచారు.మొన్న మనం అనుకున్న విషయం భర్త పుణ్యం సోగం భార్యకి వస్తుంది అదే ఆయన చెప్తునారు.ఒకసారి chaganti .netlo పార్వతికల్యనం వినండి.

Unknown said...

మీ బ్లాగ్ ఫాన్స్ లో నన్ను కూడా వేసుకోండి
మీ కార్తీకం కబుర్లు చాలా బావున్నాయి.

తృష్ణ said...

@స్వాతి:ఎందుకు గుర్తుండదండీ...మీరు తరచూ రాయకపోయినా గుర్తుంచుకుని నేను చదివే బ్లాగుల్లో ఒకటి మీది.
వింటాలెండి. అయినా నేను రాసినది వాళ్ల పుణ్యం గురించి కాదు...:))
ధన్యవాదాలు.

@కల్లూరి శైలబాల: చాలా థాంక్స్ అండీ..