బాపూగారు తమ "శ్రీ రామరాజ్యం"తో నయనానందం, శ్రవణానందం, రసానందం మూడూ కలిగించారు. ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. తన సినిమా ద్వారా ప్రేక్షకుడికి నయనానందాన్ని అందించటం బాపూగారి సినిమాల్లోని ప్రత్యేకత. ఆ ఆనందానికి రమణ గారి సంభాషణలు శ్రవణానందాన్ని కూడా జోడిస్తాయి. ఈ రెండు కలిసి ప్రేక్షకుడికి శాశ్వత రసానందాన్ని మిగులుస్తాయి. అదే బాపు-రమణల మ్యాజిక్. ఆ మ్యాజిక్ మళ్ళీ జరిగింది. చాలా ఏళ్ల తరువాత. నెట్ బుకింగ్ కుదరక, చాలా రోజుల తర్వాత నిన్న గంట ముందు వెళ్ళి నిలబడి కౌంటర్లో మొదటి టికెట్టు నేనే కొన్నా. కష్టానికి ఫలితం దక్కింది. శాశ్వత రసానందం మిగిలింది.
చిన్నప్పుడు ఎన్నిసార్లో బాపూ బొమ్మలతో ఉన్న బొమ్మల రామాయణం పుస్తకాన్ని తిరగేస్తూ, ఆ బొమ్మలను చూస్తూ ఉండేవాళ్ళం. వాటిల్లో కొన్ని బొమ్మలు మా తమ్ముడు వేసాడు కూడా. ఆ బొమ్మలను టైటిల్స్ లో మరోసారి మళ్ళీ చూసి బాల్య స్మృతుల్లోకి వెళ్పోయా ప్రారంభం లోనే. ఎర్రటి కేన్వాస్ మీద తోరణంలో కదులుతున్న పచ్చటి మామిడిఆకులు చిత్రమైన ఆనందాన్ని కలిగించాయి. మళ్ళీ ఓ "సంపూర్ణ రామాయణం", ఓ "సీతా కల్యాణం", ఓ "శ్రీరమాంజనేయ యుద్దమో" చూస్తున్న భావన. ఇన్నాళ్ళకు మళ్ళీ తెరపై పూర్తినిడివి రంగుల చిత్రాన్ని గీసాడే బాపూ అని మనసు మురిసిపోయింది. రాముడి ద్వారా, వాల్మీకి ద్వారా చెప్పించిన కొన్ని రమణ గారి డైలాగులు ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ కొట్టినట్లు, చికాకుగాను అనిపించలేదు. టకా టకా సీన్ పై సీన్ వెళ్పోయింది. నటీనటులందరూ తమ వంతు నటనా బాధ్యతను సమర్ధవంతంగా పోషించేసారు. డైరెక్టర్ ప్రతిభ ప్రతి ఫ్రేం లోనూ కనబడింది. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఇదే టెక్నాలజీ అందుబాటులో ఉండిఉంటే స్పీల్ బర్గ్ సినిమాలను మించిన చిత్రాలను మన విఠలాచార్య వంటివారు అందించేవారు కదా అనిపించింది.
ఇళయరాజా కూడా చాన్నాళ్ళకు ఏకాగ్రతతో పనిచేసినట్లు నేపధ్య సంగీతం తెలుపకనే తెలిపింది. ముఖ్యమైన సన్నివేశాల వెనకాల వచ్చిన వయోలిన్స్ మొదలైనవి ఇళయరాజా మార్క్ సంగీతాన్ని అద్భుతంగా వినిపించాయి. పాటలు కూడా విడిగా వినేకన్నా సినిమాలో చూస్తూంటే ఇంకా బాగున్నాయి అనిపించాయి. "జగదానంద", "ఎవడున్నాడీ లోకంలో", "రామ రామ రామ అనే రాజమందిరం" మూడు పాటలు నాకు బాగా నచ్చాయి. బాలు గళం చాన్నాళ్ళకు ఖంగుమంది.బాపూగారు ముందే చిత్రం గీసేసి, సన్నివేశాన్ని అలానే చిత్రీకరిస్తారని వినికిడి. ప్రతీ సన్నివేశానికీ బాపూ గారి ఫ్రేమింగ్, రాజు గారి సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరాయి. కొని దాచుకున్న పౌరాణిక చిత్రాల సీడీలకు ఈ చిత్రాన్ని కూడా జోడించాలి అని బలంగా అనిపించేలా ఉంది చిత్రం.
బాలకృష్ణ, నయనతార, శ్రీకాంత్ మొదలైన నటులను వారి పాత్రలలో చూసి ప్రేక్షకుడి మనసు తృప్తి పడిందంటే అది ఆ యా నటుల కృషి తో పాటుగా, వారితో అలా నటింపజేసిన ఘనత దర్శకుడిదే. సునీతా డబ్బింగ్ వాయిస్ సీత పాత్రకు ప్రాణం పోసిందని చెప్పాలి. ఏ.ఎన్.ఆర్ నటన చిత్రానికి అదనపు ఆకర్షణ. వశిష్ఠులవారిగా నటించిన బాలయ్యగారు డైలాగులు చెప్పేందుకు కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించగా, ఇంత వయసులో కూడా అంత స్పష్టంగా, పూర్వపు ధాటితో ఆయన డైలాగు చెప్పటం ఆశ్చర్యపరిచింది. నాగేశ్వరరావు సినీప్రస్థానంలో మరో మైలు రాయిగా ఈ వాల్మీకి పాత్ర నిలిచిపోతుంది. హనుమంతుడి పాత్రధారి నటన కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా కోయపిల్లవాడు బాలరాజుగా చేసిన పిల్లవాడు నాకు లవకుశుల కన్నా బాగా నచ్చేసాడు. లవకుశలుగా వేసిన పిల్లలిద్దరూ కాస్తంత బొద్దుగా ఉంటే బాగుండేదేమో అనిపించింది కానీ నటనలో ఎక్కడా ఓవరేక్షన్ వగైరాలు లేకుండా బహుచక్కగా చేసారు. పాటలు పాడేప్పుడు కూడా లిప్ సింక్ బాగా కుదిరింది.
అయితే అన్నీ ప్రశంసలేనా? లోపాలే లేవా సినిమాలో అంటే ఉన్నాయి. నటనా పరంగా ఒకటి రెండు చెప్పలంటే నయనతార ఎంత వంకపెట్టలేనటువంటి అత్యుత్తమ నటన కనబరిచినా "సీతాదేవి" వంటి శక్తివంతమైన పౌరాణిక పాత్రలో అంజలీదేవిలో, చంద్రకళనో, జయప్రదనో, బీ.సరోజాదేవినో మరచి నయనతార ను కూర్చోబెట్టలేకపోయాను నేను. బహుశా ఆమె బాపు మార్క్ పెద్ద కళ్ళ హీరోయిన్ కాకపోవటం కారణం కావచ్చు. ఇక వీపుపై ఎన్.టి.ఆర్ లాగనే పుట్టుమచ్చను పెట్టుకున్నా కూడా రాముడన్న, కృష్ణుడన్నా ఎన్.టి.ఆర్ మాత్రమేనన్న నానుడిని అధిగమించటం మరెవరివల్లా కాదేమో అనిపించింది. ఎన్.టి.ఆర్ లోని గాంభీర్యం కూడా బాలకృష్ణ నటనలో లోపించిందేమో అని కూడా అనిపించింది. అయినా చంద్రుడి అందాన్ని చూస్తామే కానీ మచ్చలు వెతుకుతామా మరి? ఇదీ అంతే. రా-వన్, రోబో లాంటి సినిమాలూ మాత్రమే పిల్లలకు ఎంటర్టైన్మెంట్ గా మారిన నేటి సూపర్ ఫాస్ట్ శతాబ్దపు రోజుల్లో అత్యుత్తమ విలువలతో ఇటువంటి పౌరాణిక చిత్రం రావటమే అదృష్టం నా దృష్టిలో.
కాకపోతే ఈ విజయానందాన్ని అనుభూతి చెందటానికీ, పంచుకోవటానికీ "రమణ" గారు బాపుగారితో, మనతో లేరన్నదొక్కటే విచారకరమైన విషయం. మొత్తమ్మీద రమణగారికి అంకితమిచ్చిన ఈ చిత్రం బాపురమణల కీర్తిప్రతిష్ఠలకు మరో కలికి తురాయి.
31 comments:
Wow! welcome back..
Very good.
" రా-వన్, రోబో లాంటి సినిమాలూ మాత్రమే పిల్లలకు ఎంటర్టైన్మెంట్ గా మారిన నేటి సూపర్ ఫాస్ట్ శతాబ్దపు రోజుల్లో అత్యుత్తమ విలువలతో ఇటువంటి పౌరాణిక చిత్రం రావటమే అదృష్టం నా దృష్టిలో"
బాగా చెప్పారు... పౌరాణిక చిత్రాలను ఇప్పటి గ్రాఫిక్స్ తో తీస్తే చూడాలన్న కోరిక (చాలా మంది లాగే) నాకూ ఎప్పటినుండో ఉండేది. అది ఇప్పటికి తీరింది.
కళ్ళు చేరిపోయే సెట్లు, డోల్బి డిజిటల్, తెర మీద అన్ని రంగులు... ఏదో కొత్త లోకంలో ఉన్నట్టనిపించింది... ఆ ఆశ్చర్యం నుండి బయట పడి కథను అనుసరించడానికి కొంత టైం పట్టింది నాకు :)
manchi review tho reentry ichharu. happy.
280 సీట్లు ఉన్న సినిమా హాల్ లో మొత్తం మేము 15 మంది సినిమా చూసాం.మిగతా అంతా ఖాళి....ఇప్పటి కాలం లో ఇలాంటి సినిమా రావటమే అదృష్టం...ఇంకా వంకలు పెట్టటం భావ్యం కాదు..ఓపిక లేని వాళ్ళు టీవీ లో చుడండి...సీతమ్మ వారి మీద నింద పడిందని చెప్పినప్పుడు బాలకృష్ణ అల నీలుక్కుపోయే సీన్ బాపు గారు బాగా తీసారు..సినిమా మొత్తం అంత బాగుంది....
ఎటువంటి కమర్షియల్ సీన్ లేకుండా మూవీ చాల నీట్ గ ఉంది..
Good to see ur post after a long time. Welcome back.
ramakrishna
ఇంతకి సినేమా హౌస్ ఫుల్ అయ్యిందా లేదా?
పునఃస్వాగతం. మేం కూడ ఈరోజె చూసాం
బ్లాగ్లోకం లో మీ పునరాగమనానికి సంతోషం.
చాలా బాగుందండి మీ రివ్యూ. క్యూ లో నిలబడి మొదటి టికెట్టు కొన్నందుకు పుణ్యం మహిళార్ధం లభించాయన్న మాట :)
thank u for your good review. I will go to the movie.
description on SREE RAMARAJYAM is very nice. every ascept of the film is well narrated.thankyou
Beautiful post! :)
ఫస్ట్ డేనే చూసేద్దాం అనుకున్నానండీ.. కుదరలేదు.. అందరూ భలే ఊరించేస్తున్నారు.. బావుందడీ రివ్యూ..
ఈరోజంతా ఈ సినిమా రివ్యూలు చదివి ఎంజాయ్ చేశాను ;)
మీరు రాసిన విశేషాలు చాలా బాగున్నాయి. సినిమా చూడ కుండానే కొంచెం ఆనందం కలిగేసింది. మేము కుడా ఎప్పటినించో రిలీజ్ కోసం వైట్ చేస్తున్నాము. గత కొన్ని రోజుల క్రితం పోస్టర్లు పెట్టినప్పటి నించి రోజూ రోడ్లమ్మట వెళ్తూ వాటిని చూసి తెగ ఆనందించేస్తున్నాం. ఇప్పుడేమో ఐమాక్స్స్క్రీన్ మీద రిలీజ్ అయ్యే సరికి అదే చూడాలని ఫిక్స్ అయిపోయాము. త్వరలో చూసేస్తాము.
రమణ గారు ఇప్పుడు లేరే అని మేము కూడా చాల సార్లు అనుకున్నాము.
సిడి కొనుక్కోవాలని రాసినదానికి చిన్న కరక్షన్. రిలీజ్ అయితే బ్లూరే డిస్క్ కొనుక్కోవాలి.
బాగుందని అందరూ అంటున్నారు...చూడాలండి.
బాపు గారి సినిమాలు గత కొన్ని సంవత్సరాలుగా బాగా పేలవంగా ఉండి ఆకట్టుకోలేకపోయ్యాయి. ఈ సినిమా కూడా, బాలకృష్ణ రాముడా అని నేను నిరాశపడి ఊరుకున్నాను. . మీ పరిచయం, బ్లాగులో మరికొందరు వ్రాసినవి చూస్తున్నప్పుడు, బాపు గారి "స్పార్క్" మళ్ళి మెరిసింది అన్న ఆశ కలుగుతున్నది.
రమణ గారు ఈ పాటికి ఇంద్రుడు ఎదురుగా ఉన్నాడన్న లెక్క లేకుండా, ఈల వేసి ఆనందించి ఉంటారు.
పునఃస్వాగతం.
ఈ వ్యాఖ్య మీరు మరలా వ్రాస్తున్నందుకు సంతోషంతో పెట్టింది.
ఈ రోజు సినిమా చూసొచ్చాక మీ టపా చదివి మరలా వ్యాఖ్య వ్రాస్తా!
mee review chadivaka tappaka chudalanipistondi Trishna. Nice review and welcome back :)
వయోలెన్స్ అని కాకుండా వయోలిన్స్ అని ఉండాలేమో...అలవోకగా చదివి, బెంబేలెత్తిపోయాను. మొత్తానికి చక్కగా రాసారు. అభినందనలు.
http://telugujabili.blogspot.com/
ఒక గొప్ప దర్శకుడు, రచయిత తమకు అత్యంత ఇష్టమయిన కథని ప్రాణం పెట్టి సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో శ్రీరామ రాజ్యం చూస్తే అర్ధమయిపోతుంది. వారికి అంత మంచి అభిరుచి కలిగిన నిర్మాత దొరకడం తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ప్రతి ఫ్రేం లో, ప్రతి అక్షరం లో ఆ మిత్రద్వయం మార్కు స్ఫుటంగా కనిపించింది. ఈ సినిమా అనౌన్స్ చేయగానే నేను భయపడింది బాలకృష్ణ గురించే. చిరాకొచ్చే హీరోయిజంతో, వినీ వినీ విసుగొచ్చే మాడ్యులేషన్ తో డైలాగులు చెప్పే బాలకృష్ణ రాములోరిగా మెప్పించాగలడా అన్న అనుమానం. అందులోనూ ఈ మధ్యే పాండురంగ మహత్యంలో శ్రీకృష్ణుడి పాత్రని చేతనయినంత మేరకు ఖూనీ చేయడం గుర్తొచ్చి ఇంకా భయపడ్డాను. అదృష్టవశాత్తు చాలా ఏళ్ల తర్వాత (అప్పుడెప్పుడో ఆదిత్య 369 లో శ్రీకృష్ణ దేవరాయల పాత్ర) బాలకృష్ణ ఓవరాక్షన్ లేకుండా పాత్రకు తగినట్టు నటించాడు. అయితే వీపు మీద పుట్టు మచ్చ పెట్టుకోవడం మాత్రం "పులిని చూసి నక్క..." సామెత గుర్తుకు తెచ్చింది. ఇక నయనతార బాపు గీసిన సీతమ్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఈ సినిమాలో అందరికన్నా నాకు విపరీతంగా నచ్చిన పాత్ర కోయపిల్లవాడి రూపంలో ఉన్న హనుమంతుడిది. అక్కినేని వంటి శిఖరం ముందు ఏమాత్రం తగ్గకుండా తన ఉనికిని కాపాడుకుని నటించాడు ఆ బాల నటుడు.
ఇక పాటల విషయానికొస్తే "రామ రామ రామ అనే రాజమందిరం" పాట ఆడియో విడుదలయిన దగ్గరనుంచీ నాకు తెగ నచ్చేసిన పాట. సినిమా స్టార్ట్ అయిన దగ్గరనుంచీ ఆ పాట ఎప్పుడొస్తుందా అని ఆతృతగా ఎదురుచూశాను. చిత్రీకరణలో ఎక్కడా నన్ను నిరాశపరచలేదు ఆ పాట. నేపధ్య సంగీతం విషయంలో ఇళయరాజా చక్కగా చేసినప్పటికీ ఎందుకో కీరవాణి అయితే ఇంకాస్త బావుండేదేమో అని ఎక్కడో లీలగా అనిపించింది. మొత్తం మీద ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. అందరికన్నా బాగా ఈ చిత్ర రచయిత ముద్ర కనిపించింది. అందుకేనేమో ఆ రాములోరు "ఈ సినిమా ఒక్కటి చాలు రమణా నీ కీర్తి నిలిచిపోవడానికి, ఇహ చాలు నా దగ్గరకొచ్చేయ్!" అని పిలిచేశాడు.
స్వాగతం త్రుష్ణ గారు ,
బాగుంది మీ అభిప్రాయం.
సీత గా అంజలి దేవి ని మించి ఎవరిన చెయ్యలెరు అని నా అభిప్రాయం.
మీ లిస్ట్ లొ అంజలి గారిని కుద చెర్చాలని మనవి.
@ కృష్ణప్రియ: ధన్యవాదాలు.
@ Bebedores do Gondufo : ధన్యవాదాలు.
@అయినవోలు ప్రణవ్: అవునండి...కొత్తగా తియ్యకపోయినా, మన విఠలాచార్య గారి జానపద హిట్ చిత్రాలను కొన్నయినా ఇప్పుడు రీమేక్ చేస్తే భలే ఉంటుంది. ధన్యవాదాలు.
@గీత_యశస్వి: ధన్యవాదాలు.
@ఖర్(sekhar): నేను చూసిన హాలు బాగానే నిండిందండీ మరి. పౌరాణికం రీమేక్ అనేసరికీ మరి అంచనాలూ, నిరాశలూ, వంకలూ ఉంటాయండి మరి...మీఅన్నట్లు లోపాలను పట్టించుకోకూడదనే నేనూ చివర్లో రాసానండీ.
@mhsgreamspet : ధన్యవదాలు రామకృష్ణగారూ.
@unknown: నే చూసిన హాలులో పై క్లాసంతా నిండిందండీ. క్రిందన మొదటి ఐదారు వరసలూ నిండలేదంటే. ధన్యవాదాలు.
@kaamudha: మేము నిన్న అంటే శుక్రవారం చూసామండి. మీరన్నట్లు మీ ఊరు రావాల్సినవాళ్ళమే...చివరినిమిషంలో ఆగిపోయాం...:)
ధన్యవాదాలు.
@రామ్: మరేనండి..:) వ్యాఖ్యకు ధన్యవాదాలు.
@ఎస్పి జగదీష్: ధన్యవాదాలు.
@phanindra sharma: టపా నచ్చినందుకు + వ్యాఖ్యకూ ధన్యవాదాలు.
@మధురవాణి: థాంక్యూ..:)
@రాజ్ కుమార్: మీ రివ్యూ కోసం వైటింగ్...:) ధన్యవదాలు.
@R Satyakiran: త్వరగా చూడండి. బ్లూరేడిస్క్ కొనుక్కున్నాకా చెప్పండి..:)
@padmarpita' : బావున్నారా..? ధన్యవదాలు.
@శివరామప్రసాద్ కప్పగంతు: నిజమేనండి...గత కొన్ని సినిమాల్లో వారి మేజిక్ పనిచెయ్యలేదు. రమణ గారూ ఈల వేసేసారంటారా? బావుంది..:)
ధన్యవాదాలు.
@సిరిసిరిమువ్వ:అలాగేనండి...ఎదురుచూస్తాను...ధన్యవాదాలు.
@మహెక్: థాంక్యూ..!
@చంద్రం: కంప్యూటర్ మీద అచ్చు తప్పులు తప్పవు కదండి....మార్చాను. సరిచేసినందుకు ధన్యవాదాలు.
@శంకర్.ఎస్: ఈ పాయింట్ నేను మర్చిపోయాను."ఇటువంటి నిర్మాత మా కెరీర్ మొత్తంలో మాకు దొరకలేదని" బాపూగారు అన్నారని నిన్న ఈటివీలో ఒక ప్రోగ్రాంలో జొన్నవిత్తుల గారు అన్నారు. నిజంగా నిర్మాతను ఎంట మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. బాలకృష్ణ, నయనతార పాత్రల్లో నిజంగా ఒదిగిపోయారు, వంద శాతం న్యాయం చేసారు కానీ ఎక్కడో నా మనసులో ఎంచేతో మన పాత చిత్రాల్లోని రాముడు, సీతలే కనబడ్డారండి..
పాటలు విడిగా వినేకన్నా సినిమాలో చూస్తేనే బాగున్నాయి. ఇంకా బాగుండొచ్చు.. జొన్నవిత్తుల గారి సాహిత్యం గొప్పగా ఉన్నా కూడా వేటూరి, మహదేవన్ మొదలైనవారు లేరే అనిపించింది.
thankyou..:)
@siri: అవునండి...అసలు లవకుశ లో అంజలీదేవే కదా.. మిస్సయ్యాను. లిస్ట్ లో చేర్చానండి. ధన్యవాదాలు.
:(((((..నేను ఇంకా చూడలేదు :(
ఎన్నైనా చెప్పండి. ఈ సినిమా లవకుశ సినిమాకి కార్బన్ కాపీ అనిన్నూ, తండ్రికి తగ్గ తనయుడిగా తన కెరీర్ చరమ దశలో బాలకృష్ణ చేసిన ప్రయత్నంగానూ ఈ సినిమా గురించి వినికిడి. బాలకృష్ణ రామారావుకి జన్యపరంగా మాత్రమే తనయుడు. బాపు, ఇళయరాజా వంటి ఉద్దండులని సమీకరించి తీసినంత మాత్రాన పూర్వపు రామాయణం సినిమాల (లేదా తదితర పౌరాణికాల) పక్కన దీన్ని నిలబెట్టలేము. ఇక మరో ముఖ్యమైన మాట. లవకుశ సినిమాకి తెలుగువారి అంతర్గళసమానుడు ఘంటసాల చేసిన సంగీతం నభూతో, నభవిష్యతి. బహుశ: తెలుగు సినీ చరిత్రలో పురాణపురుషుల (స్త్రీల) బృహద్రచనలతో ఈనాటి నకళ్ళని పొల్చుకు చూసే దురభ్యాసాన్ని నాబోంట్లు వదులుకోవాలేమో.
- తాడేపల్లి హరికృష్ణ
Post a Comment