సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, September 27, 2012

"నికషం"


తపన దిగంతం, నేనూ-చీకటి, కాశీభట్ల వేణుగోపాల్ కథలు చదివిన తర్వాత కాశీభట్ల వేణుగోపాల్ గారి రచనల పట్ల ఎంతో ఆసక్తి,అభిమానం కలిగాయి. వారి ఇతర రచనలన్నీ పుస్తక ప్రదర్శనలో కొనుక్కున్నా. తర్వాత "పాలపిట్ట"లో వారి కొత్త నవల "నికషం" ధారావాహికగా ప్రచురితమౌతున్నట్లు బ్లాగ్మిత్రులు కొత్తపాళీగారు ఒక వ్యాఖ్యలో చెప్పారు. అప్పటినుంచీ ఆ నవల ఎప్పుడు పుస్తకరూపంలో వస్తుందా అని ఎదురుచూసి కినిగె  ద్వారా "నికషం" కొనుక్కున్నా.


"ప్రపంచంలో ప్రతి మనిషి లోపలా మరొక భయంకరమైన మనిషి దాగి ఉంటాడు. నాగరికత ముసుగులో బ్రతికేస్తు ఉంటాం అంతే! ఆ ముసుగు తొలగించుకుని బాగా దగ్గరగా వెళ్తే ఎవరం ఎవరినీ భరించలేం"... ఇవి ఎప్పుడో పదేళ్ల క్రితం నేను రాసుకున్న కొన్ని వాక్యాలు. కాశీభట్ల వేణుగోపాల్ గారి "నికషం" చదివాకా అప్రయత్నంగా  ఆ వాక్యాలు గుర్తుకువచ్చాయి. అచ్చం నా ఈ భావనలాగానే, మనిషి లోపల ఉండే అంతర్గత, అనావిష్కృత పార్శ్వాలను,వ్యతిరేక అంతర్భాగాన్నీ మనకు వేణుగోపాల్ గారు తన రచనలలో పరిచయం చేస్తారు. మనలో దాగిఉన్న మనకు తెలియని మరో కొత్త వ్యక్తిని చూపగల అద్దం వేణుగోపాల్ గారి రచన. నిజానికి ఆ మనిషి అపరిచితుడేమీ కాదు. మన అంతర్గతాల్లోకి తొంగి చూసుకుంటే కనబడతాడు. వేణుగోపాల్ గారి రచనలు చదువుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మనం మనలోని ఆ మరో మనిషిని గుర్తుపడతాం. కానీ సభ్య సమాజంలో నాగరికత ముసుగులో సాంఘీభావంతో మెలుగుతూ ఉంటాం కాబట్టి మనం అతడిని ఎరుగనట్లే ప్రవర్తిస్తాం. అయితే, ఆ లోపలి మనిషిలో ఉన్న వ్యతిరేక అంతర్భాగాన్ని మనం స్వీకరించగలమా? దాని మంచి చెడులను మనం నిర్ణయించగలమా? అసలు నీతీ నిజాయితీలను కొలిచే గీటురాయి ఏది? మనిషిలోని అనావిష్కృత పార్శ్వాలను మంచి చెడుల తూకంతో తూచగలమా? అన్న ప్రశ్నలకు రూపమే "నికషం". (నికషం అంటే 'గీటురాయి’ అని నిఘంటువు చెప్పింది.)


Mysticism, symbolic characters,Stream of consciousness technique, abstract pictures అన్నింటినీ కలిపితే కాశీభట్ల వేణుగోపాల్ గారి రచనలౌతాయి. "నికషం" లో కూడా ఇవన్నీ మనకు కనబడతాయి. నవల చివర్న(బహుశా పరిచయవాక్యాలేమో) తల్లావఝ్ఝుల పతంజలి శాస్త్రిగారి వ్యాసంలో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది_ "మంచి పుస్తకం ఆలోచింపజేస్తుంది. అఖరివాక్యం నిన్ను మృదువుగా మౌనం లోకి వదిలిపెట్టాలి. సాహిత్యానికే కాదు. ఇది గొప్ప సినిమాలకి కూడా వర్తిస్తుంది.." అంటారు ఆయన.నవల చివరలో డా.వి.చంద్రశేఖరరావుగారి పరిచయవాక్యాలు కూడా బాగున్నాయి. ("ద్రోహవృక్షం" కథా సంపుటి రచయిత)


"నికషం" చదువుతుంటే సమాంతరంగా ఎన్నో ఆలోచనలు, అస్పష్ట నైరూప్య చిత్రాలు మనసులో కదలాడుతూ వచ్చాయి. నా దృష్టిలో ఏ రచన అయినా కథావస్తువు ముఖ్యం కాదు. ఆ రచన ద్వారా రచయిత ఏం చెప్పదలచుకున్నాడు అన్న విషయం ముఖ్యం. ఆ thought పాఠకుడి వరకూ చేరిందా లేదా అన్నది ముఖ్యం. ఏ పాఠకుడు రచయిత ఆలోచనాపధ్ధతికి చేరువగా వెళ్తాడో అతడికి రచయిత అంతరంగం అవగతమౌతుంది. అలా పుస్తకం చదివిన కొందరి మనసుల్లోకైనా రచయిత ఉద్దేశం వెళ్ళిననాడు ఆ రచనకు పరిపూర్ణత చేకూరినట్లే.


"నికషం"లో నచ్చినవి; గమనించినవి:

 * "దిగంతం"లో నిరుపేద కార్మికుడి దయనీయ పరిస్థితులను ఎంత సహజంగా చిత్రీకరించారో, నికషం లో కూడా sophisticated upper middle class living గురించి కూడా అంత సహజమైన పరిశీలనాత్మకమైన వర్ణన కనబడుతుంది.

* కథా వస్తువు వెనకాల ఉన్న deep mystic instinct

* నిర్భయమైన రచనా శైలి

* చిన్న చిన్న విషయాల పట్ల కూడా రచయితకు ఉన్న పరిశీలన శక్తి

* అన్ని రచనల్లోలాగే చాలా కేజువల్ గా వాడేసే సంయుక్తాక్షరాలు ఒకోసారి చదవటానికి కష్టంగా ఉన్నా చాలా తమాషాగా ఉంటాయి.

* నవలలో ఒక చోట "మనిషికీ మనిషికీ మధ్య ఆకాశం" అంటారు. మనుషుల మధ్యన దూరాన్ని ఆకాశంతో పోల్చటం నచ్చింది నాకు.

* కథకుడు, అతని భార్య కావేరిల మధ్యన చూపిన ఆదర్శవంతమైన అనుబంధం ముచ్చటగా ఉంది. ఇద్దరు మనుషులు ఇంతకంటే ఎక్కువ దగ్గరగా ఎక్కడా ఉండరేమో అన్నట్లు.

* "మనకు తెలీని దాని గురించి ఆలోచించటమంత బుధ్ధి తక్కువ ఇక ఉండదు" అనే వాక్యం రెండు చోట్ల,రెండు సందర్భాల్లో వాడారు రచయిత.

* కావేరి, ప్రియ పేర్లు వారికి ఇష్టమేమో, వేణుగోపాల్ గారి కథల్లో ఈ పేర్లు చదివిన గుర్తు.


నచ్చనిది: 

ఈమధ్యన సినిమాల్లో పొగ త్రాగటం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం" అంటూ వార్నింగులు చూపిస్తూనే సన్నివేశాల్లో వ్యక్తులు తాగినట్లు, సిగరెట్ కాల్చినట్లు చూపిస్తున్నారు. ఈ సన్నివేశాలు అవసరమా? అసలు ఎందుకని చూపెట్టాలి ఇలా? అనుకుంటూ ఉంటాను నేను. అలానే ఇటువంటి ప్రయోగాత్మక రచనలు తెలుగులో రావాలి అని కోరుకుంటుంటే, ప్రతి రచనలోనూ మద్యపానం, మాంసాహారం గురించిన ప్రస్తావన చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. ఆ ప్రస్తావన లేకుండా కూడా నవల,కథలు రాయచ్చు కదా అనిపించింది నాకు. ఇదొక్కటే నాకు వేణుగోపాల్ గారి రచనల్లో అస్సలు నచ్చని విషయం.


my word:

తాత్వికమైన అన్వేషణ కనబడుతూ, మనిషి లోపలి మనిషిని తట్టిలేపేటువంటి ప్రయోగాత్మకమైన రచనలు ఇంకా ఇంకా తెలుగులో రావలని ఈ నవల చదువుతున్నంత సేపు నాకు అనిపించింది.


6 comments:

నిషిగంధ said...

చివర్లో మీరు చెప్పింది చాలా బావుంది, తృష్ణా! మనలోపకికి తొంగిచూసుకునేలా చేసే నవలలు అంతకంతకీ తగ్గిపోతున్నాయనిపిస్తుంది..
కాశీభట్ల నాకు చాలా నచ్చే రచయితల్లో ఒకరు! ఆయన పుస్తకం చదువుతున్నంతసేపూ కాస్త ఉద్వేగం.. ఇంకాస్త విస్మయం.. 'ఇంతలా లోపలి మనిషిని ఎలా బహిర్గతం చేసేయగలరా!' అని!
ఈ పుస్తకం ఇంకా చదవలేదు.. తెప్పించుకోవాలి ఇంకా!
కావేరి, ప్రియ పేర్లు ఆయన ఇంకో నవల 'మంచుపూవు ' లో వాడారు.
:-)

తృష్ణ said...

నిషీజీ, సరిగ్గా మీరు రాసిన విషయాలే ఆయన రచనలను విస్మయంతో చదివేలా చేస్తాయి. మొదలెట్టింది మొదలు అయిపోయేవరకూ ఏకబిగిన చదివేలా చెయ్యటం ఆయన రచనల్లోని ప్రత్యేకత.
థాంక్స్ ఫర్ ద కామెంట్ :)

Bindu said...

చాలా చక్కగా రాశారండి. మీ conclusion కూడా బావుంది.

మాంసాహారం గురించి రాస్తే మనకి ఇబ్బంది ఏముందండి? నేను శాకాహారినే, కానీ ఇంకెవరన్నా తింటే నేను పట్టించుకోను.

తృష్ణ said...

బిందు గారూ, మీరన్నది కరక్టే. కానీ కొన్ని సందర్భాల్లో కథలో లీనమై ఏవో ఆలోచనల్లో ఉండగా మధ్యలో వాటి గురించిన ప్రస్తావన నాకు వ్యక్తిగతంగా నా థాట్స్ కి ఇంటరప్టింగ్ గా అనిపించిందండి. అది ఎలా అనేది మీకు వీరి రచనలు చదివితే తెలుస్తుంది. మీకు అలా అనిపించకపోవచ్చు కూడా. This is just my personal opinion..:)
more over సాహిత్యంలో రకరకాల రచనల గురించి అభిప్రాయాలూ డిఫర్ అవుతాయి కదండీ..!
ధన్యవాదాలు.

Anil Atluri said...

కావేరి, ప్రియలను అనుసరిస్తే కాశీభట్ల ఇంకొంచెం అర్ధమవుతాడు.

వి.బి సౌమ్య ఈ పుస్తక పరిచయం లింక్ ఇచ్చారు:

తృష్ణ said...

@Anil Atluri: thanks for the visit anil gaaru.