సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, April 29, 2014

రాజా రవివర్మ





"రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..." అనే పాటని రేడియోలో చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను కానీ 'రాజా రవివర్మ' అనే ఒక గొప్ప చిత్రకారుడు ఉన్నారని మొట్ట మొదట నేను 6th క్లాస్ లో ఉండగా తెలిసింది. బెంగుళూరులో ఉంటున్న మా మావయ్యావాళ్ళు ఊరు మారిపోతున్నాం రమ్మని గొడవపెడితే నాన్న మమ్మల్ని బెంగుళూరు, మైసూరు తీసుకువెళ్ళారు నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు. ఆంధ్రా దాటి వెళ్ళిన మొదటి ప్రయాణం కాబట్టి ఎంతో పదిలంగా గుర్తుండిపోయిందా ట్రిప్. అప్పుడు మైసూర్ మ్యూజియంలో చూసాం రవివర్మ వర్ణచిత్రాల్ని. చాలా ఫోటోలు కూడా తీసుకున్నాం. ఆ ట్రిప్ తాలూకూ అపురూపమైన ఫోటోలను ఫోటో స్టూడియో అతను మాయం చేసేసాడు. అందుకని ఆ ట్రిప్ ఇంకా బాగా గుర్తన్నమాట! తర్వాత మరోసారి 10th క్లాస్ లో ఉండగా మా స్కూల్ వాళ్ళు మైసూరు, బెంగుళూరు, తమిళ్నాడు ట్రిప్ కి తీసుకువెళ్ళినప్పుడు మరోసారి చూసాను. ఈ ట్రిప్ కి వెళ్ళడానికి ఇంట్లోవాళ్ళతో మూడో ప్రపంచయుధ్ధం చేయాల్సివచ్చింది.. సరే సరే గుండ్రాల్లోకి తీసుకువెళ్ళకుండా అసలు సంగతికొచ్చేస్తా... 



ఇవాళ అద్భుత చిత్రకారుడైన 'రాజా రవివర్మ' జయంతి(1848, Apr29th). రవివర్మ గురించిన చిన్న పుస్తకమొకటి ఆ మధ్యన దొరికింది. సుంకర చలపతిరావు గారు రచయిత. చిత్రకళాపరిషత్, విశాఖపట్నం వారి ప్రచురణ. వెల అరవై రూపాయిలు. ఇవాళ ఆ చిత్రకారుడి జయంతి సందర్భంగా ఈ చిన్ని పుస్తకంలోని విశేషాలు రాద్దామని సంకల్పం. రచయిత 'సుంకర చలపతిరావు' గారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ చిత్రకళా విమర్శకుల్లో ఒకరు. చిత్రకళ, శిల్పకళలపై నాలుగువందల పైగా వ్యాసాలు రాసారు. వడ్డాది పాపయ్య, దామెర్ల రామారావు మొదలైన ప్రముఖ ఆంధ్ర చిత్రకారుల ఆత్మకథలను ప్రచురించారు. చిత్రకళకు అందించిన సేవలకు గానూ ఎన్నో సత్కారాలు పొందిన వీరు ప్రస్తుతం 64కళలు.కామ్ వెబ్ పత్రిక సంపాదకమండలిలో సభ్యులు. రవివర్మపై తనకు గల అభిమానమే ఈ చిన్న పుస్తక రచనకు కారణమని ఆయన తన ముందుమాటలో చెప్తారు.





ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు:



 భారతీయ పురాణేతిహాసాల నుండి ప్రేరణ పొంది అసలు ఫలానా దేవుడు ఇలా ఉంటాడు అని మనకు ఒక రూపాన్ని చూపెట్టిన తొలి భారతీయ చిత్రకారుడు రాజారవివర్మ. లక్ష్మి, సరస్వతి, రాధామాధవులు మొదలైన దేవతలు కాక, దమయంతి, అహల్య, రాధ, నల-దమయంతి, తిలోత్తమ, మేనక మొదలైన ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఘనుడు. ప్రత్యేక ఆహ్వానాలపై హైదరాబాదు, పిఠాపురం విచ్చేసి చిత్రాలు గీసారుట ఆయన. మరణించి వందేళ్ళు దాటినా ఆయనను మనం గుర్తుకు తెచ్చుకుంటున్నామంటే "కళకు మరణం లేదు" అన్న నానుడిని ఆయన నిజం చేసినట్లే! సంస్కృతం, మళయాళం కు సంబంధించి ఇద్దరు పండితులను ప్రత్యేకంగా నియమించుకుని, వారితో పురాణాలు, ఇతిహాసాల్లోని శ్లోకాల అర్థాలు చెప్పించుకునేవారుట రవివర్మ. ఆ శ్లోకాల ఆధారంగా స్కెచ్ వేసుకుని వాటికి రంగులు అద్దేవారుట రవివర్మబాల్యంలో బొగ్గుతో గోడలపై పూలు, జంతువుల చిత్రాలు గీయడం చూసి  ఆయన విద్యాభ్యాసంతో పాటూ చిత్రరచననూ చేర్చారుట. నాయకర్ అనే ఆస్థాన చిత్రకారుడు చిత్రకళలో మెళకువలు నేర్పడానికి నిరాకరిస్తే, ఆయన శిష్యుడైన ఆర్ముగంపిళ్ళై రాత్రివేళల రహస్యంగా తనకు తెలిసిన విద్యను రవివర్మకు నేర్పేవారుట. ఒక బ్రిటిష్ వైస్రాయ్ ఆహ్వానంపై జెన్సన్ అనే బ్రిటిష్ చిత్రకారుడు తిరువాన్కూరు రాజాస్థానానికి వచ్చాడుట. అతను కూడా రవివర్మకు ఆయిల్ పెయింటింగ్ నేర్పించడానికి నిరాకరించాడుట కానీ దూరం నుండి తన చిత్రరచనను రవివర్మ చూడటానికి అంగీకరించాడుట. అలా బ్రెష్ ఉపయోగించే విధానం, రంగులు పూసే పధ్ధతి ఒక నెల రోజులు పరిశీలించాకా తన సొంత శైలిలో చిత్రరచన మొదలుపెట్టారుట ఆయన. ఒక తపస్సులా చిత్రకళ సాధన చేసేవారుట. . స్థానికంగా దొరికే ఆకులు, పువ్వులు,బెరడు, కోడిగుడ్డు సొన, మట్టి,విత్తనాలు, ఆలివ్ నూనె ఉపయొగించి రంగులు సొంతంగా తయారుచేసుకునేవారుట రవివర్మ. 




చిత్రకళ గురించిన "శ్రీ మహావజ్ర భైరావతంత్ర" అనే గ్రంధం ఆయనకు ప్రియమైనదిట. చిత్రకారుడు సత్యవంతుడు, గుణవంతుడు, పవిత్రంగా జీవిస్తూ పాండిత్యం గలవాడై ఉండాలి. అంతేకాక దానశీలత, దైవభక్తి, ఆదర్శప్రాయమైన నడవడి కలిగి కోపిష్ఠి, బధ్ధకస్తుడు కారాదని ఆ గ్రంధంలో చిత్రకారుడికి ఉండవలసిన లక్షణాలు పేర్కొన్నారుట. అదే విధంగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని మలుచుకున్నారుట రవివర్మ.






మైసూరుకు దగ్గరలో ఉన్న మూకాంబికాదేవిని ఆయన ఆరాధించేవారుట. అమ్మవారిని దర్శించడం కోసం నలభైఒకటి రోజులు కాలినడకన ప్రయాణించి ఆలయాన్ని చేరుకున్నారుట. ఆ తిరుగు ప్రయాణంలోనే ఆయనకు వృత్తిపరమైన అవకాశం వచ్చింది. అది మొదలు జీవం ఉట్టిపడే ఎన్నో కుటుంబాల రూపచిత్రాలు, రాజ దంపతుల చిత్రాలు ఆయన గిసారు. అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనల్లో కూడా ఆయన చిత్రాలు బహుమతులు అందుకున్నాయి. రామాయణ, భారత,భాగవతాల్లోని ముఖ్య దృశ్యాలను ఒక పక్క,  రాజ కుటుంబాలకు చెందిన రూపచిత్రాలు ఒక పక్క, ప్రాచీన ప్రబంధాల ముఖ్య దృశ్యాలు, ప్రకృతి దృశ్యాలు, ఉహాచిత్రాలూ ఎన్నో సహజ సుందరంగా చిత్రించి కళాభిమానుల మన్ననలు పొందారు రవివర్మ. తైల వర్ణాల గురించి మనకు తెలియని రోజుల్లో స్వశక్తితో సాధన చేసి, రంగుల్ని తయారు చేసి, ఆ వివరాలు మనకు అందించారు. జీవితాన్ని కళకే అంకితం చేసిన ఈ కళాతపస్వి కి కూడా విమర్శలు తప్పలేదు. 




తమ్ముడు రాజవర్మతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేదిట. చిత్రకళారంగంలో ఇరువురూ రామలక్ష్మణలుగా కీర్తి  పొందారుట. తమ్ముడి మరణం తాలూకూ విషాద ఛాయలు ఆయన చిత్రాలపై ప్రభావం చూపాయిట. ఆరోగ్యం క్షీణించి ఎన్నో అసంపూర్ణ చిత్రాలను వదిలేసి 1906,అక్టోబర్ రెండున రవివర్మ కన్నుమూశారుట. " నీ చిత్రాలను స్వర్గంలో ఉన్న దేవతలతో పోల్చిచూడటానికి స్వర్గానికి వెళ్ళావా.." అంటూ ఆయనకు నివాళులర్పింఛారుట తమిళ మహాకవి సుబ్రహ్మణ్యభారతి. 




మూడు రవివర్మ చిత్రాలను పోస్టల్ స్టాంపులుగా భారత ప్రభుత్వం విడుదల చేసింది. జె.శశికుమార్ అనే భిమాని ఆయనపై డాక్యుమెంటరీ నిర్మించారు. మళయాళంలో "మరకమన్జు" అనీ, హిందీలో "రంగ్ రసియా" అనీ ఆయన జీవితచరిత్రను తెర కెక్కించారు. ఆయన శత జయంతినీ, శత వర్ధంతినీ అభిమానులు వైభవంగా జరుపుకున్నారు. ఆయన జీవిత చరిత్రపై ఎన్నోఆంగ్ల గ్రంధాలు ప్రచురించబడ్డాయి . వాటిల్లో కొన్ని వివిధ ప్రాంతీయ భాషల్లో ముద్రించబడ్డాయి కూడా. ప్రాక్ పశ్చిమ కళారీతుల్ని జోడించి భారతీయ కళారంగంలో ఓ నూతన అధ్యాయానికి పునాది వేసిన ఆద్యుడిగా గుర్తుంచుకోదగ్గ మహోన్నతుడు శ్రీ రాజా రవివర్మ.







పుస్తకంలో ప్రచురించిన కొన్ని చిత్రాలు:










(రవివర్మ చిత్రాలు అంతర్జాలంలో కూడా లభ్యమవుతున్న కారణంగా పుస్తకంలోని ఫోటోలు ఈ టపాలో ప్రచురిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరమైతే తొలగిస్తాను.)