సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, June 18, 2012

తొలకరి వర్షపు హేల


వర్షాకాలం వస్తోంది అంటే "బాబోయ్ వర్షం" అని భయపడిపోయే నేను ఈసారి ఎప్పుడెప్పుడు వాన పడుతుందా అని చాతకంలా ఎదురుచూసాను. మరి ఈసారి వేసవి మనసునీ, శరీరాన్నీ కూడా అంతగా మండించింది. చిన్నప్పటి నుండీ విజయవాడ మండుటెండలకు అలవాటుపడిన ప్రాణం కూడా ఈఏటి వేడిమిని భరించలేకపోయింది. ఈ ఇంట్లోని సదుపాయాలను సరిగ్గా చూసుకోకుండా అద్దెకు చేరటం మేము చేసిన పేద్ద పొరపాటని ఈ వేసవి వచ్చేదాకా తెలీలేదు మాకు:( చాలాఏళ్ల తరువాత కూలర్లు, ఏసీ, కనీసం వట్టివేళ్ల తడికలు కూడా లేకుండా నానారకాల ఇబ్బందులతో రెండునెలలూ ఎలానో గడిపేసాము..! నాలుగురోజుల క్రితం ఊళ్ళో చాల చోట్ల వాన పడిందిట కానీ మా దగ్గరకి రాలేదు. ఇక మేము ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది.. నిన్న !




ఎన్నాళ్లకెన్నాళ్ళకెన్నాళ్ళకన్నట్లుగా నిన్నటి రోజంతా కురిసి కురిసి మురిపించి పులకింతలు రేపి వెళ్ళింది వాన. వర్షానికి తోడొచ్చిన చల్లని గాలి మనసు నిండా ఆనందం నింపింది. రెండ్రోజుల క్రితమే వాతావరణం చల్లబడిందని చల్లిన విత్తనాల్లోంచి తలలెత్తిన బుల్లి బుల్లి ఆకులు కూడా నిన్ననే ఆకాశాన్ని చూశాయి. మేఘాలు గొంతులెత్తాయి.. చెట్టు, చేమా, పుట్టా, గట్టూ, రోడ్డు, మట్టీ, మనిషీ, మనసూ.. అన్నీ తడిసి చల్లబడ్డాయి. పచ్చదనం కొత్త అందాలను సంతరించుకుంది. అప్రయత్నంగా "చినుకు చినుకు చినుకు చినుకు..." పాట గుర్తుకొచ్చింది. ఎండ వేడికి ఎండిన మట్టిపై కురిసిన పన్నీటి జల్లుల తొలకరి వాన తెచ్చిన కమ్మని మట్టివాసనను పీల్చుకుని మనసు ఉప్పొంగిపోయింది. కష్టమంటే ఏమిటో తెలిస్తేనే సుఖంలోని ఆనందం బోధపడేది. చల్లదనం కోసం, తొలకరి చినుకు కోసం తపించిపోయాకా.. ఒక్కసారిగా దేవుడు ప్రత్యక్ష్యమై వరమిచ్చినట్లుగా రోజంతా వర్షం కురవటం చెప్పలేని సంబరాన్ని కలిగించింది.






కాస్తంత నలతగా ఉండటం వల్ల వర్షంలోకి వెళ్ళి తడవలేకపోయినా ఇంట్లోంచే చూసి ఆనందించాను. గత రెండు నెలలుగా భరించలేకపోతున్న పవర్ కట్స్ వల్ల ...కరెంటు పీకగానే మళ్ళీ ఇచ్చేదాకా ఆ కరెంటుఆఫీసు వాళ్లని వచ్చిన నానారకాల తిట్లన్నీ తిట్టేసుకునే నేను నిన్న సాయంత్రం నాలుగింటికి తీసేసి పన్నెండు దాటినా పవర్ ఇవ్వని కరెంట్ఆఫీసువాళ్ళని ఒక్కసారి కూడా తిట్టుకోలేదంటే అదంతా వర్షం మహిమే. వానలో ఆడుకుని ఆడుకుని పిల్లది కూడా గుమ్మంలోనే తలగడ వేసుకుని నిద్రోయింది. కేండిల్ లైట్ లోనే వంట చేసి, red fm వాళ్లు వినిపిస్తున్న తియ్యని ఆపాత మధురాలను వింటూ కేండిల్ లైట్ డిన్నర్ కూడా చేసేసాం. ఒకదాని తర్వాత ఒకటిగా అద్భుతమైన పాటలు మనసుల్ని రంజింపజేసాయి. బయట చల్లదనానికి కరెంట్ లేకపోయినా నిద్ర ముంచుకొచ్చేసింది.



ఎటొచ్చీ డాబా పైనుంచి క్రిందకు పారిన వర్షపు నీరంతా వృధా అయ్యిందని మాత్రం బాధ కలిగింది. అదంతా నిలువ చేస్తే నాలుగు రోజులు రెండువాటాల వాళ్లం వాడుకోదగ్గ నీరు ఉంటుంది. ఈ ఇల్లుగలాయనకు దూరాలోచన లేదు అనుకున్నాం. ఏదేమైనా నిన్నటి తొలకరి వర్షపుచినుకులు మాత్రం చాలా ఉల్లాసపరిచాయి. నిన్న నాకు గుర్తుకొచ్చిన పాట మీరూ ఓసారి వినేయండి...



చిత్రం: సిరివెన్నెల, రచన : సీతారామశాస్త్రి

చినుకు చినుకు చినుకు చినుకు

తొలితొలి తొలకరి చిలికిన చినుకు

పిలుపు పిలుపు పిలుపు పిలుపు

పుడమికి పులకల మొలకల పిలుపు

ఆషాఢమాసాన ఆ నీలిగగనాన మేఘాల రాగాల ఆలాపన

ఆషాఢమాసాన ఆ నీలిగగనాన మేఘాల రాగాల ఆలాపన

మేఘాల రాగాల ఆలాపన...