సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, January 25, 2012

వంశవృక్షం - వెండితెర నవల



ప్రఖ్యాత కన్నడ రచయిత డా. ఎస్.ఎల్.భైరప్ప గారికి 1966 లో కన్నడ సాహిత్య అకాడమీ బహుమతి తెచ్చిన నవల "వంశవృక్ష". ఈ నవల ఆధారంగా అదే పేరుతో తీసిన కన్నడ చిత్రానికి జాతీయ బహుమతి (దర్శకత్వానికి) కూడా లభించింది. ఈ చిత్రాన్ని తెలుగులో బాపు-రమణలు "వంశవృక్షం(1980)" పేరుతో రీమేక్ చేసారు. సంభాషణలు, సినీ అనుకరణ, ముళ్ళపూడి. నవలీకరణ చేసినది శ్రీరమణగారు.ఇది బాపూ సినిమా అని తెలీనివారు, విశ్వనాథ్ సినిమా ఏమో అనుకునేలా ఉంటుందీ సినిమా కథ. 'శంకరాభరణం' తరువాత మరో గుర్తుండిపోయే పాత్రలో జె.వి.సోమయాజులు ఇందులో కనిపిస్తారు. కె.వి.మహాదేవన్ గారు అందించిన బాణిల్లో "వంశీకృష్ణ.. యదు వంశీకృష్ణా..." పాట చాలా బావుంటుంది.


ఈ సినిమా బాగా చిన్నప్పుడు హాల్లో చూసిన గుర్తు మాత్రమే ఉంది. బయట సీడి కూడా దొరకలేదు కానీ శ్రీరమణగారు నవలీకరించిన పుస్తకం మా ఇంట్లో ఉండేది. అది అప్పుడప్పుడు చదువుతూ ఉండేదాన్ని. ఇటీవలే ఈ వెండితెరనవల చాన్నాళ్ళకు దొరికింది. గొల్లపూడిగారి ’సాయంకాలమైంది’ చదివినప్పుడు నాకు ఈ సినిమానే గుర్తు వచ్చింది. బాపూ గారి "తూర్పువెళ్ళే రైలు" సినిమాలో నటించిన నటి జ్యోతి ఈ సినిమాలో నాయిక. బాపూ ఇతర చిత్రనాయికల్లాగనే ఈ చిత్రంలో బాపూబొమ్మ అయిపోతుందీ అమ్మాయి. మొదట్లో కాసేపు కలవారింటి కోడలుగా నగలన్నీ పెట్టుకుని కన్నులకింపుగా కనబడుతుంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.


ఈ చిత్ర కథ చాలా భారమైనదనే చెప్పాలి. గోదారొడ్డున ఉన్న తిరుమలపురం గ్రామంలో వంశప్రతిష్ట, పరువు,గౌరవం కల కుటుంబం శ్రీనివాసాచార్యుల వారిది. ఆయన ఏకైక కుమారుడు మాధవాచార్యులు. అతని భార్య సరస్వతి. వారి ముద్దుల కుమారుడు నామకరణమహోత్సవంతో కథ ప్రారంభం అవుతుంది. ఆనందకరమైన సరస్వతి జీవితంలో అనుకోని విధంగా చీకట్లు అలముకుంటాయి. మాధవాచర్యులను గోదారి తనలో కలిపేసుకుంటుంది. 'బిడ్డ బాధ్యత చూసుకుంటే చలదూ... ' అన్న అందరి మాటలూ తోసివేసి, ప్రొఫెసర్ పార్థసారథి గారి ప్రోద్బలంతో కోడలిని గోదారి ఆవలి వడ్డున ఉన్న కాలేజీలో చేరుస్తారు శ్రీనివాసాచార్యులవారు. అక్కడ ప్రొఫెసర్ గారి తమ్ముడు, ఇంగ్లీషు లెక్చరర్ అయిన శేషుతో పరిచయం ఏర్పడుతుంది. వారిద్దరి స్నేహం బలపడుతుంది.




మొదట ఒప్పుకోకపొయినా శేషు తెచ్చిన వివాహ ప్రస్థావనను తోసేయలేకపోతుంది సరస్వతి. పెద్ద మనసున్న అత్తమామలంటే అమెకెంతో గౌరవం. తన సమస్యను ఉత్తరంలో రాసి మామగారి వద్ద పెడుతుంది ఆమె. వంశప్రతిష్ట అంటే ప్రాణం పెట్టే శ్రీనివాసాచర్యులు గారు సరస్వతితో చెప్పిన మాటలకు ఆమె తలవంచుతుంది. కానీ శేషుని వదిలి ఉండలేనని తెలుసుకుని, ఇంట్లో చెప్పకుండా అతడిని వివాహం చేసుకుంటుంది. అయితే బిడ్డనూ కూడా ఆమె వదుకోలేకపోతుంది. శేషు భార్యగా తన బిడ్డ కోసం శ్రీనివాసాచార్యుల గడప ఎక్కుతుంది సరస్వతి. అదే రోజు మొదటి భర్త అబ్దీకం జరుగుతూండటం యాదృచ్ఛికం. సరస్వతిని దుయ్యబుడుతున్న అందరినీ శాంతపరిచి ఆమెతో ఉచితానుచితాలు మట్లాడి నిర్ణయం ఆమెకే వదిలేస్తారు శ్రీనివాసాచార్యులవారు. మామగారి మాటలను కాదనలేక బిడ్డను వదిలి ఒంటరిగా వెళ్ళిపోతుంది సరస్వతి. అయితే పిల్లవాడి తాలూకూ బెంగ, అశాంతి ఆమెను జీవితాంతం వెంటాడి ఆమెను కృశింపజేస్తాయి.





ఉపకథ గా ప్రొఫెసర్ పార్థసారధి,  డాక్టరేట్ చేస్తూ ఆయనకు సహాయ పడుతున్న కరుణ; ఆయన రాస్తున్న భారతీయ తత్వశాస్త్రం పై థీసీస్ , వారిద్దరి వివాహం ఎన్నో ఆలోచనలను కదిలిస్తాయి. సినిమా మొదట్లో పార్థసారధి భార్య నాంచారి, కొడుక్కు తలంటు పొయ్యటానికి అతని వెనకాల పరిగేట్టే సీన్ నవ్వుతెప్పిస్తుంది. అది నాకిప్పటికి లీలగా గుర్తుంది. తరువాత ఆయన చివరి దశలో భార్య వద్దకు వచ్చి క్షమాపణ అడిగే దృశ్యం కూడా మర్చిపోలేము.






పెరిగి పెద్దయిన మనవడికి ఒకరోజు బృందావనంవారి  వంశవృక్షాన్ని చూపెడుతున్న సమయంలో తన తండ్రిగారు రాసిపెట్టిన ఒక లేఖ శ్రీనివాసాచార్యుల కళ్ళబడుతుంది. నిప్పులాంటి ఓ నిజం ఒక్కసారిగా ఆయనలో అలజడిని రేపుతుంది. ఈ నేపధ్యంలో వచ్చే పాటలోని సి.నారాయణరెడ్డి గారి సాహిత్యం బావుంటుంది..

ఏది వంశం? ఏది గోత్రం? ఏది పరమార్ధం?
ఏది బీజం? ఏది క్షేత్రం? ఏది పురుషార్థం?
ఏది పాపం? ఏది పుణ్యం? ఏది గీటార్థం?
మత్స్యమై కూర్మమై - వరాహమై నరసింహమై
బ్రాహ్మణాకృతి వామనుండై - క్షత్రియాకృతి రాముడై
యదుకులమ్మున కృష్ణుడై - ఇన్ని అవతారములు దాల్చిన
ఆదిదేవుని వంశమేదీ వర్ణమేదీ - గోత్రమేదీ సూత్రమేదీ?

ఆ నిజం ఏమిటి? సరస్వతి జీవితం చివరికి ఏమైంది? తల్లి పనిచేస్తున్న కాలేజీలోనే ఇంటర్లో చేరిన ఆమె కొడుకు కృష్ణకు తల్లి ఎవరో తెలిసిందా? అన్నది మిగిలిన కథ. ఈ మొత్తం కథలో ప్రభావవంతమైన పాత్ర బృందావనం శ్రీనివాసాచార్యులవారిదే. ఆలోచింపజేసే ఎన్నో ప్రశ్నలు పుస్తకం మూసాకా కూడా మనల్ని వెంటాడతాయి. ఈ కథకు  సినిమాను శ్రీరమణగారు నవలీకరించిన తీరు బాగుంటుంది.





"వంశవృక్షం" సినిమా పాటలు క్రింద లింక్ లో వినవచ్చు:
http://www.raaga.com/channels/telugu/album/A0002467.html

డౌన్లోడ్ కోసం:
http://www.telugusongsfree.com/2011/08/vamsa-vruksham-1980-telugu-movie-audio-mp3-songs.html