సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, January 18, 2012

REVOLUTION 2020



నవంబర్లో అనుకుంటా ఒక కొలీగ్ ట్రైన్లో తను చదివేసాకా, ఈ పుస్తకం చదవమని ఇచ్చారని ఇంటికి తెచ్చారు శ్రీవారు. తను చదివి మెచ్చేసుకున్నారు కానీ నాకు ఆ పుస్తకం తెరవవటానికి మరో నెల పట్టింది. కథ మంచి సస్పెన్స్ లో ఉన్నా కూడా రోజుకు పాతిక పేజీలకన్నా చదవటం కుదరకపోతూంటే భలే కోపం వచ్చేసేది. డిసెంబర్ చివరివారంలో కాలికి దెబ్బ తగలటంతో 'జరిగేవన్నీ మంచికనీ...' అని పాడేకుంటూ సగమ్ చదివిన పుస్తకాన్ని ఒక్క రోజులో పూర్తి చేసేసి హమ్మయ్య ! అని ఊపిరితీసేసుకున్నా. ఉత్కంఠతతో నన్ను అసాంతం చదివించిన ఆ పుస్తకమే ఈ "REVOLUTION 2020".




రచయిత గురించి:
 చేతన్ భగత్. దేశంమొత్తమ్మీద ఇప్పుడీ పేరు ఒక సంచలనం. ఐదే నవలలు. ప్రతి నవలకూ వెల్లువలా ప్రసంశలు. రెండు నవలలు సినిమాలుగా మారగా, అందులో ఒకటి("3 Idiots") అనూహ్యమైన విజయాన్ని చూసింది. మరో రెండు నవలలు సినిమాలుగా మారుతూ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడీ లేటేస్ట్ నవల "REVOLUTION 2020" మార్కెట్లోని బెస్ట్ సెల్లర్స్ లో ఒకటి. ఇంతకు ముందు "3 Idiots" రిలీజ్ అయినప్పుడు నేను ఇతని పేరు విన్నాను. మొదటి నాలుగు నవలలు నేను చదవలేదు. అనుకోకుండా ఈ ఒక్క పుస్తకం చదవటం జరిగింది. ఇతను ఇంత పాపులర్ అవ్వటానికి కారణం తెలుసుకోవాలని ఆసక్తిగా ఈ పుస్తకం చదివాను. యువతను గురించీ, కొన్ని సమకాలీన సమస్యలను గురించీ ఇతను రాస్తాడని అర్ధమైంది. చేతన్ భగత్ టార్గెట్ 'యువత' అనిపించింది! అతని ఉద్దేశాలు, ఆంతర్యాలూ ఏవైనా రచనా శైలి ఆకట్టుకునేలా ఉంది. నవలను మొదలుపెట్టింది మొదలు చివరిదాకా వదలాలనిపించకపోవటం, మధ్యలో ఆపాల్సివచ్చినప్పుడూ..మళ్ళీ ఎప్పుడు చదువుతామా అనే తపన కలగటం...ఇవే ఏ రచనలోనైనా ముఖ్యంగా ఉండాల్సినవి. అవే ఆ రచయితకు విజయసోపానాలు. అది చేతన్ సాధించాడు.
ఈ కథలో ఏముంది?

మొదట ఇది ఒక సాధారణ ప్రేమ కథ అనుకున్నాను. కానీ ఇది వివిధ అంశాలను, సమకాలీన సమస్యలనూ కలిపిన ఒక విభిన్నమయిన కథ అని అర్ధమైంది. యువకుల కలలు-ఆశలు, యువకుల ఆశయాలు, చదువులు, నిరుద్యోగం, ప్రేమ, వివాహం మొదలైన అంశాలే కాక సమాజంలో అడుగడుగునా లంచగొండితనం ఎలా పాతుకుపోయిందో కూడా కళ్ళకి కట్టినట్లు చూపుతుందీ నవల. మరోపక్క ఒక నిస్సహాయ ప్రేమికుడి సున్నితమైన ప్రేమ, ఆనందం, ఒంటరితనం, నిరుత్సహం, వేదన మొదలైన అనేక పర్శ్వాలనూ మనసుకు హత్తుకునేలా చిత్రీకరించాడు రచయిత.


ఇది ఒక ముక్కోణ ప్రేమకథ. కథాస్థలం ప్రాచీన ప్రఖ్యాత పట్టణం "వారణాసి". ఉత్తమ రచనకు కావాల్సినవంటూ Aristotle ప్రతిపాదించిన three unities (unity of time, place and action) ఈ  నవలలో బాగా కుదిరాయి . తన ఆశయాలను నిజం చేసుకోవాలనీ, దేశం కోసం ఏదేదో చెయ్యాలనీ ఆశ పడే యువకుడు రాఘవ్. తన తెలివితేటల్ని ఒక ఉద్యమానికి, మార్పుకీ నాందిగా వాడుకునే వారణాసి పౌరుడు అతను. తన అపజయాన్నే పునాదిగా చేసుకుని వేళ్ళూరిన లంచగొండితనాన్ని నిచ్చెనగా చేసుకుని ఉన్నతశిఖరాలను అందుకుంటాడు గోపాల్. తన తెలివితేటల్ని అవినీతి బాటలో నడిపించి విజయాన్ని పొందుతాడు. బాల్యస్నేహితులైన వీరుద్దరూ ఒకరినే ప్రేమించటం కథలోని మెలిక. చివరికి అమ్మాయి ఎవరికి దక్కుతుందా అన్నది నవలలోని పతాక సన్నివేశం.


కథలో శక్తివంతమైన గోపాల్ పాత్ర ముందు రాఘవ్, ఆరతి ఇద్దరూ అతిథులే అనిపిస్తారు. చదువుతున్నంత సేపూ గోపాల్ తో మనం నవ్వుతాం, గోపాల్ తో మనం వేదన పడతాం, గోపాల్ తో పాటు కన్నీరు కారుస్తాం, గోపాల్ తో పాటూ మనమూ ప్రేమిస్తాం...! అతని బాట అవినీతితో నిండినదైనా, స్వచ్ఛమైన అతని ప్రేమ మన మనసుల్ని తాకుతుంది. నిస్వార్ధమైన అతని త్యాగం 'అయ్యో..' అనిపిస్తుంది...! స్వచ్ఛత నిండిన అతని ప్రేమ మనల్ని స్పర్శిస్తుంది. 'చివరికి ఇలా చేసాడేం... ఆమెను తనదాన్ని చేసేసుకోవచ్చు కదా...' అనే స్వార్ధపూరిత ఆలోచన పాఠకులకు కలిగేలా చెయ్యటంలో రచయిత సమర్థవంతమయ్యాడు.

కథలో మధ్య మధ్య రచయిత అమ్మాయిల స్వభావాల గురించి చెప్పే వాక్యాలు సరదాగా ఉంటాయి. ఒక చారిత్రాత్మక పట్టణంలో జరిగిన అందమైన ముక్కోణ ప్రేమ కథను గోపాల్ కళ్ళతో చూడటానికి.. అతని సున్నితమైన భావాలను స్పర్శించటానికీ పుస్తకం చదవచ్చు !

నచ్చనిది:

నాటకీయత ఎక్కువైందేమో అనిపిస్తుంది కథ చివరలో. ముందర రాసిన నాలుగు నవలలూ సినిమా కథలుగా మారిపోవటం వల్ల ఈ కథ కూడా 'వెండితెర'ను దృష్టిలో పెట్టుకుని రాసాడా? అనిపిస్తుంది. రచయితకు జనాకర్షణ ఎక్కువైపోతే కథనంలో నాటకీయత ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉందేమో అన్న అనుమానం నన్ను వెంటాడింది.