సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, June 1, 2011

బాబోయ్ వర్షం !!


ఋతుపవనాలు వచ్చేసాయి వచ్చేసాయి...అని తెగ చెప్పేస్తున్నారు వార్తల్లో. వర్షాలు కూడా అలానే మొదలైపోయాయి. ఇప్పుడే ఓ అరగంట జల్లు కురిసింది. "వాన" అంటే ఇష్టం లేనివారు అరుదుగా కనిపిస్తారు. నాకూ ఇష్టమే. కానీ వానా కాలం అంటేనే భయం. గృహిణి అవతారం ఎత్తాకా మాత్రం ఎందుకనో ఇదివరకూలా ఆస్వాదించలేకపోతున్నాను. వర్షాకాలం వచ్చేసిందంటే "బాబోయ్ వర్షం.." అని భయమేస్తోంది.



ఒకప్పుడు వర్షమంటే..
కాగితం పడవలు చేసి సందంతా నిండిన వాననీటిలో వెసి ఆడుకోవటం...
చిన్నగదిలో కిటికీ గూటిలోకెక్కి సన్నటి జల్లు మీద పడుతూంటే పుస్తకం చదువుకోవటం...


ఎప్పుడెప్పుడు వర్షంలో తడుద్దామా అని ఆత్రుత..


ఆ తర్వాత..
బాల్కనీలో ఉయ్యాలలో ఊగుతూ వేడి వేడి కాఫీ తాగటం..
ఊయ్యాల ఊగుతూనే మంచి మ్యూజిక్ వినటం..
వర్షం పడినప్పుడల్లా వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు వేసుకోవటం..
వానవల్ల కాలేజీకి శెలవు దొరికితే ఆనందంతో గంతులెయ్యటం..
ఇంకా తరువాత..
హాల్లోంచి వర్షం చూస్తూ మంచి బొమ్మ వేసుకోవటం..
గుమ్మంలో కుర్చీ వేసుకుని వాన పడుతున్నంతసేపు చూస్తూ కూచోవటం..
మళ్ళీ ఎప్పుడు వాన పడుతుందా అని ఎదురుచూడటం..


కాలం గడిచే కొద్దీ మన అభిప్రాయాల్లో, ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలానే వర్షం గురించిన అభిప్రాయాలు కూడా మారిపోయాయి.
ఇప్పుడు వర్షమంటే..
అమ్మో మళ్ళీ వచ్చేసింది వాన... ఆరేసిన బట్టలు ఆరతాయా?
ఆరీ ఆరని తడిపొడీ బట్టలతో ఇల్లంతా కంపు కంపు ! మయదారి వాన..
పొద్దున్నే మొదలయ్యిందివాళ వాన..పనమ్మాయి వస్తుందో రాదో...రాకపోతే చచ్చానే..
వర్షం వల్ల స్కూల్ వాన్ రాకపోతే పిల్లని స్కూలుకి ఎలా దింపాలో?
ఇవాళ ముఖ్యమైన పని మీద వెళ్దాం అనుకున్నాను...మొదలైపోయింది వాన..ఎలా వెళ్ళేది?
వాన వల్ల ట్రాఫిక్ జామ్లు ఇంకా పెరిగిపోతాయి..తను ఇంటికి ఎప్పుడొస్తారో...
వేసంకాలమే నయం ఎండలు భరించాలే తప్ప అన్ని పళ్ళు దొరుకుతాయి...
వాన వాన వాన...వీధంతా కాలవలా ఉంది. దీన్ని దాటుకుని బయటకు వెళ్లటం ఎలా?

ఇలా సాగిపోతాయి ఆలోచనలు. ఇప్పుడు కాసేపు కుర్చీ వేసుకుని కూచుని వర్షాన్ని చూస్తూ ఆనందించాలని అనిపించదు. పనులాగిపోతాయని భయం వేస్తుంది. అప్పుడప్పుడు వస్తేనే వాన బావుంటుంది. రోజూ వచ్చేస్తే ఏం బావుంటుంది? ఎప్పుడెప్పుడు వర్షాకాలం అయిపోతుందా అనే అనిపిస్తుంది. కానీ నాకు వర్షం ఇష్టమే. కానీ వానాకాలం అంటేనే భయం.

ఎప్పుడెప్పుడా అని మేం ఎదురుచూస్తూంటే, ఇంకా వర్షాలు మొదలవ్వకుండానే నీ గోలేంటమ్మా चुप रहो ! అంటారా? సరే నేను गायब అయితే..!!