సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, May 31, 2011

"వివేకానంద ఎక్స్ ప్రెస్"

భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచమంతటా చాటడానికి భగవంతుడు పుట్టించిన అరుదైన రత్నాలలో ఒకరు స్వామి వివేకానంద. జీవించిన అతి చిన్న జీవితకాలంలో ఆయన సాధించినది అనంతం. భారతదేశానికే కాక ప్రపంచమంతటికీ అందించిన జ్ఞాన నిధి అపారమైనది. యువతరానికి వారు అందించిన సందేశం, ఆయన టీచింగ్స్ ప్రతి కాలేజ్ వాళ్ళు ఓ కంపల్సరీ సబ్జక్ట్ గా పెట్టి పిల్లలకి బోధించగలిగితే బావుంటుంది అనిపిస్తుంది నాకు. నాకా మహానుభావుని పై అభిమానం ఎలా మొదలైందంటే, మా ఇంట్లో "శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర" పుస్తకం ఉండేది. అది చదివినప్పుడు వివేకానందుడి గురించి కొంత తెలుసుకున్నాను. ఆ తరువాత విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో రామకృష్ణామఠ్ స్టాల్లో కొన్ని పుస్తకాలు కొనేదాన్ని. వాటివల్ల కొంత తెలుసుకున్నాను.

ఆ తరువాత కాలేజ్ లో నా క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లోవాళ్ళు రామకృష్ణ మఠంలో సభ్యులు. ఆంటీ రెగులర్ గా భజన్స్ కీ వాటికీ వెళ్ళేవారు. తను నాకు చాలా సంగతులు చెప్తూండేది. "Strength is life, weakness is death." అని ఉన్న ఒక పెద్ద పోస్టర్ నాకు ఇచ్చింది . నా పెళ్ళి అయేవరకు నా గదిలో ఆ పోస్టర్ ఉండేది. ఉదాసీనంగా ఉన్నప్పుడు ఆ పోస్టర్ ను చూసి ధైర్యం తెచ్చుకునేదాన్ని. "Take the responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny." అన్న వివేకానందుడి మాటలు ఒక స్టిక్కర్ రూపంలో మొన్నమొన్నటిదాకా మా గదిలో ఉండేది. ఇల్లుమారినప్పుడు అది పీకటం ఇష్టం లేక అలా ఉంచేసి వచ్చేసా.

వివేకానందుని 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రైల్వే శాఖ ప్రారంభించిన "వివేకానంద ఎక్స్ ప్రెస్" బోయిగూడా మార్గంలో మూడురోజులు ఉంచారు. ఆయన జీవిత విశేషాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా ఈ రైలు పర్యటిస్తోంది. గతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా ఇలానే రైలును దేశవ్యాప్తంగా తిప్పారు. రైల్వేశాఖ వారి ఈ ప్రయత్నాన్ని అభినందించాలి. నేను నిన్న వెళ్ళి చూసి, కొన్ని ఫోటోలు తీసుకుని వచ్చాను. నిజానికి కొన్ని మేము కలకత్తా వెళ్ళినప్పుడు బేలూర్ మఠ్ లో చూసినవే. బేలూర్ మఠ్ సందర్శనం ఒక మరపురాని అనుభూతి. అక్కడ గార్డెన్ లో ఒక వింత చెట్టు ఉంది.ఇప్పుడు ఉండో లేదో మరి. చెట్టు ఆకులు దొన్నెల్లా ఉన్నాయి. కృష్ణుడికి యశోద వెన్న పెట్టేదిట ఆ ఆకుల్లో. అందుకని ఆ పేరు వచ్చిందని చెట్టు కేదో పేరు చెప్పారు అప్పుడు. మర్చిపోయా. ఆక్కడ రాలిన ఒక ఆకు తెచ్చి పుస్తకంలో ప్రెస్ చేసి దాచాం కూడా. ఇంకా నాన్న దగ్గర ఉంది అది.

నిన్న "వివేకానంద ఎక్స్ ప్రెస్"లో తీసిన ఫోటోలలో కొన్ని:
ఈ ఫోటోలో కుడివైపు చివర ఉన్నది సిస్టర్ నివేదిత :




చికాగో నుంచి వచ్చినప్పుడుట:


కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ :




వివేకానందుని చేతి గుర్తు:

belur math view:

వివేకానంద టీచింగ్స్ లో నాకు బాగా నచ్చినది:
Strength, strength it is that we want so much in this life, for what we call sin and sorrow have all one cause, and that is our weakness. With weakness comes ignorance, and with ignorance comes misery.