సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, April 27, 2011

nearly Perfect !!

కొత్త సినిమాను ఒక్కసారే భరించటం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో చాలా రోజుల తరువాత ఓ కొత్త సినిమా మళ్ళీ చూద్దామనిపిస్తోంది. గత వారంలో చూసిన రెండు కొత్త సినిమాలు బాగున్నాయనిపించాయి. వాటిల్లో నాకు రెండవసారి చూడాలనిపిస్తున్నది nearly Perfect అనిపించిన "Mr.Perfect". నేనీ సినిమా చూడ్డానికి రెండు కారణాలు.
ఒకటి - బాగా నచ్చిన మూడు పాటలు.
రెండు - కాజల్.



అసలీ సినిమా పేరు Mr.Perfect కాకుండా Miss.Perfect అని పెడ్తే బాగా సరిపోయేదేమో. ఆ అమ్మాయి పాత్ర అలా ఉంది. "చందమా" సినిమా చూసినప్పుడే నాకు బోల్డంత నచ్చేసింది ఈ అమ్మాయి. తప్పకుండా పైకి వస్తుంది అనుకున్నా. ఆ సినిమాలో ఈ అమ్మాయిని చాలా అందంగా చూపించారు. ముక్కు కొంచెం వంకర అనిపించినా, ఈ అమ్మాయికి అదృష్టవశాత్తు కాలం కలసివచ్చి మంచి పాత్రలు లభించి త్వరగానే అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ("అదృష్టవశాత్తు" అని ఎందుకు అన్నానంటే అభినయం, అందం అన్నీ ఉన్నా రావాల్సినంత పేరు రాక ఉనికి కోల్పోయిన వారెందరో ఉన్నారు.) చాలా వరకు అభినయానికి అవకాశం ఉన్న పాత్రలే రావటం కూడా కాజల్ కు కలిసివచ్చింది. కాస్తంత ఒళ్ళుగా ఉంటే ఇంకా అందంగా, పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఈ అమ్మాయి.

ఇక ఈ చిత్రం ఓ అద్భుతమైన సినిమా ఏమీ కాదు. మొదటి భాగం మధ్యలో స్లో అయినట్లు కూడా అనిపించింది. కొన్ని అనవసరమైన సీన్లు కూడా ఉన్నాయి. కానీ మంచి కాన్సెప్ట్, చక్కని కథనం, పాత్రల్ని మలిచిన తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు అయ్యాయి. ముఖ్యంగా కథలో మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం బాగుంది. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే కావాల్సినది అభిరుచులు కలవటమా? ఒకర్నొకరు అర్ధంచేసుకోవటమా? రాను రాను మనుషుల మధ్యన అనుబంధాలు ఎందుకు బలహీనపడుతున్నాయి? ఒక బంధం కలకాలం నిలవాలంటే ఏం చెయ్యాలి? మన ఆనందం గొప్పదా? పదిమందికి సంతోషం కలిగించటం గొప్పదా? మొదలైన ప్రశ్నలకు సంతృప్తికరంగా ప్రేక్షకులను సమాధానపెట్టగలిగారు దర్శకులు.

"ప్రేమ అంటే ఇద్దరు కలిసి ఒక మంచి కాఫీని తయారుచేసుకోవటం", "మనం కాస్త ఎడ్జస్ట్మెంట్ చేసుకుంటే మన చుట్టు చాలామంది మిగిలిఉంటారు" "మన సంతోషం కన్నాఇతరులను ఆనందపెట్టడంలోనే ఎక్కువ తృప్తి లభిస్తుంది" "ప్రేమంటే ఎదుటిమనిషి కోసం జీవించటం" మొదలైన ఎన్నో డైలాగ్స్ మనసును తాకుతాయి. పెళ్ళి విషయంలో ఒకేలాగ ఆలోచించే ఇద్దరు మనుషులు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతారన్నది కేవలం అపోహ. ఒకర్నొకరు అర్ధం చేసుకోగలిగితే భిన్న ధృవాలైన ఇద్దరు మనుషులు కూడా సంతోషంగా ఉండగలరు అన్నది సినిమా అందించిన సందేశం. ఏక్షన్, సస్పెన్స్, ఓవర్ ఎక్స్పోజింగ్, హింసలతో కాక ప్రేక్షకుల మనసులను సెంటిమెంట్ తో దోచారీ సినిమా కధకులు. క్లీన్ అండ్ నీట్ మూవీ అని కూడా అనొచ్చు. అందుకే nearly Perfect అనిపించింది.

ప్రభాస్ నటన, రూపం అన్నీ బాగుంటాయి కానీ పాపం ఇతనికి గ్లామర్ పాళ్ళు కాస్తంత తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో బాగా చేసాడు. అతని డైలాగ్ డెలివరీ బాగుంటుంది. కాస్తంత ఎక్కువ గ్లామరస్ గా ఉండి ఉంటే మహేష్ బాబుకి పోటీ అయిపోయేవాడనిపిస్తుంది నాకు. గతంలోని రకరకాల ఎక్స్పరిమెంటల్ రోల్స్ చూసిన తరువాత ఈ సినిమాతో ఇతన్ని కుటుంబ కథాచిత్రాలకే పరిమితం చేసేస్తారేమో ప్రేక్షకులు అని డౌట్ వచ్చింది. ప్రతీ హీరోనూ ఏదో ఒక ఇమేజ్ లో ఫిక్స్ చేసేయటం మనవాళ్ళకు అలవాటు కదా. ఆ "ఇమేజ్ చట్రం"లో ఇరుక్కుపోయి వైవిధ్యమైన పాత్రల్ని చెయ్యలేక, ఇమేజ్ లోంచి బయటకు రాలేక ఈ కాలపు యువహీరోలు అవస్థలు పడుతున్నారు పాపం. ఇతగాడికి ఆ అవస్థ రాకూడని నా అభిలాష.

ఈ సినిమాలో నాకు బాగాబాగా నచ్చిన సీన్ ఒకటుంది. రాత్రిపూట సిన్లో ఒక గుబురు చెట్టు, దాని పక్కనే ఉన్న బెంచ్ మీడ అటుతిరిగి హీరో కూర్చుని ఉంటాడు. చెట్టు మీదుగా పడుతున్న కొద్దిపాటి లైట్. రాత్రి పూట ఉండే నిశ్సబ్దం..! భలే నచ్చాయి నాకు. ఈ బెంచ్ ఉన్న సీన్ రెండుసార్లేమో సినిమాలో వస్తుంది. అర్జెంట్ గా ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చోవాలి అనిపించింది. ఇండియా కాదేమో మరి..:(

ఇక రెండో హీరోయిన్(తాప్సీ) గురించి ఏమీ రాయకపోవటమే మంచిది. నేను ఎర్ర ఇంకుతో పెద్ద ఇంటూ మార్క్ పెట్టేసాను ఈ అమ్మాయికి. బ్రహ్మానందం పాత్ర కూడా నాకు అంతగా నచ్చలేదు. ఇక ఆయన అటువంటి పాత్రలు తగ్గించుకుంటే మంచిదేమో. మిగతా పెద్దలందరు తమ వంతు పాత్రల్ని ఇచ్చిన మేరకు సమర్ధవంతంగానే పోషించారు. ఎంత మేకప్ వేసినా విశ్వనాథ్ గారి వయస్సు బాగా తెలిసిపోతోంది. ఈ వయసులో ఎందుకో అంత కష్టపడటం అనిపించింది.


ఇక తులసి ఎందుకు ఇలా నటనకు ఆస్కారం లేని అమ్మ పాత్రలు చేస్తోందో తనకే తెలవాలి. ఒక కాలంలో సినిమాలో తులసి ఉందంటే సంబరంగా ఉండేది. మంచి నటిని ఇప్పుడిలా కాస్తైనా ప్రాధాన్యత లేని పాత్రల్లో చూస్తే బాధ వేస్తోంది. "శశిరేఖా పరిణయం"లో కూడా ఇలానే అనిపించింది. పైపెచ్చు పావలాకి అర్ధరూపాయి ఏక్షన్ చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తోంది.

ఇక చిత్రంలోని నేపథ్య సంగీతం కూడా సన్నివేశానుసారం బాగుంది. మొత్తం పాటల్లో నాకు మూడు పాటలు ముందు నుంచీ వినీ వినీ బాగా నచ్చేసాయి. "బదులు తోచని ప్రశ్నల తాకిడి" గురించి ఇదివరకే చెప్పేసాను. మరొకటి "లైట్ తీస్కో భాయ్ లైట్ తీస్కో..". కానీ నాకో సందేహం నిజంగా అన్ని విషయాలనూ అలా లైట్ తీసుకోగలమా? తీసుకున్నా ఇబ్బందే ! ఒక మూడోది సుమధుర గాయని శ్రేయ ఘోషాల్ పాడిన "చలిచలిగా అల్లింది..." పాట చాలా చాలా నచ్చేసింది నాకు.

నాకు నచ్చిన మరొక కొత్త సినిమా గురించి తదుపరి టపాలో..