సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, March 1, 2011

జ్ఞాపకాల పూలు



పొద్దున్నే మెలుకువ వచ్చి లేచి కళ్ళు నులుముకుంటూ లైటు కనబడుతున్న వంటింటి వైపు వెళ్తే, అక్కడ రేడియో లోంచి వినబడుతున్న ప్రసార విశేషాలు, అప్పుడే తీసిన కాఫీ డికాషన్ తాలుకూ ఫ్రెష్ సువాసన, పొయ్యి మీద పెట్టడానికి రెడీగా ఉన్న ఇడ్లీ ప్లేట్లు, చెమట ఇంకటానికి మెడ చుట్టు చుట్టుకున్న పల్చటి తెల్లటి తువ్వాలుతో మామ్మయ్య దర్శనం అయ్యేది.(మా నాన్నమ్మను మేము "మామ్మయ్య" అని పిలిచేవాళ్లం). సెలవుల్లో ఊరు వెళ్లినన్నాళ్ళూ రోజూ అదే దృశ్యం. ఇంకా ముందర లేస్తే వంటింటి బదులు దొడ్లో లైటు, అక్కడ వారగా ఉండే సిమెంట్ గోలెం మందారాలు పుసిందా? అన్నట్లు గోలెం నిండుగా పరుచుకుని ఉన్న ఎర్రటి రేకమందారాలు(ముందు రోజు సాయంత్రమే ఎవరో ఒకరు మొగ్గలు కోసి అందులో వేసేవారు)...తులసి కోట దాటి తలుపు తీస్తే దొడ్లో ఏవో పనులు చేస్తూనో, మొక్కలకి నీళ్లు పోస్తూనో కనబడేది మామ్మయ్య. చీకట్లు తొలగుతూ తెల్లవారేవేళ అలా లేచి మామ్మయ్యను చూడటం ఒక అపురూపంగా తోచేది మాకు. ఆ దృశ్యం చూడటానికి వీలైనన్నిసార్లు పొద్దున్నే లేవటానికి ప్రయత్నించేవాళ్ళం నేనూ, మా తమ్ముడూ.

అదే వర్షాకాలమైతే దొడ్లో నూతి నిండా నీళ్ళు ఉండేవి. చేద వేయనక్కర్లేకుండా చెంబుతో ముంచితే నీళ్ళు అందేంత పైకి నీళ్ళు ఉండేవి. క్రితం రోజు సాయంకాలం మందార మొగ్గలు కోసి నూతిలో వెసేసేవారు. అప్పుడు పొద్దున్నే లేవగానే నూతి గోడల అంచుదాకా పైకి ఉన్న నీటిలో విచ్చుకున్న ఎర్రటి రేకమందారాలు ఎంత అందంగా ఉండేవో మాటల్లో చెప్పటం కష్టం. అప్పట్లో డిజిటల్ కెమేరాలు, మొబైల్ కెమేరాలు లేవు. లేకపోతే ఎన్ని ఫోటోలు తీసిఉందునో అనుకుంటూ ఉంటాను. దాదాపు పదమూడు రకాల మందారాలు పెంచేది మామ్మయ్య. అన్నీ పెద్ద పెద్ద వృక్షాలయి బోలెడు పూలు పూసేవి. పారిజాతాలు, కాసిని మల్లెలు, సంపెంగలు, నిత్యమల్లి, చామంతులు, దేవకాంచనాలు మొదలైన మిగిలిన పూలు కూడా పూసేవి. పాండ్స్ టాల్కం పౌడర్ ఏడ్ లో కనబడే ఫ్లవర్స్ లాగ ఉండేవి దేవకాంచనాలు. (అవి తెలుపు, లేవెండర్, గోధుమ రంగుల్లో ఉన్న చెట్లు చూసాను నేను. ఇంకా రంగులు ఉన్నాయేమో తెలీదు.) మా ఇంట్లోని దేవకాంచన వృక్షం తెల్లటి తెలుపు పులు పూసేవి. అందుకని మేము వాటిని "డ్రీమ్ ఫ్లవర్స్" అనేవాళ్లం. ఇక పనిమనిషి లక్ష్మి వస్తునే మిగిలిన పువ్వులన్నీ పూజకు కోసి తెచ్చాకా, అవి ఇంట్లోని నాలుగు వాటాలవాళ్లకు పంచబడేవి. సన్నజాజులు మాత్రం నేనక్కడ ఉన్నన్ని సాయంత్రాలు నా జడల్లోకే. మంచినీళ్లకు ఎవరొస్తేవాళ్ళు వాళ్ల వాటా తాలుకు పూలు పట్టుకెళ్ళేవారు. ఇంటివాళ్లం మనమే కదా అన్ని పూలూ మనమే వాడుకోవచ్చు కదా అనడిగేదాన్ని నేను. వాళ్ళూ దేవుడికి పెడితే మంచిదే కదా అనేది మామ్మయ్య. సాయంత్రాలు రెండ్రోజులకోసారి ఎరుపు, పసుపచ్చా రంగుల్లో పూసిన కనకాంబరాలు, దోడ్లో పెరిగిన మరువమో, ధవనమో కలిపి అమ్మ దండ కడితే రెండు జడలకీ వంతెనలాగ అటు నుంచి ఇటు వచ్చేలా నా జెడల్లో కట్టిన దండ పెట్టేది అమ్మ.

డాబా మీదకు వెళ్ళి, సన్షేడ్ మీదకు దిగి మరీ దొరికినన్ని సన్నజాజులు కోసుకు రావటం నా సాయంత్రపు దినచర్య. ఆల్రెడీ జళ్ళో కనకాంబరం దండ ఉంటే అవి రేప్పొద్దున్నకి ఫ్రిజ్ లో దాచేవాళ్ళు. తరువాత ఆకు సంపెంగ చెట్ల చుట్టూ తిరిగి వాసనబట్టి పువ్వులు ఎక్కడ ఉన్నాయో చూసి, ఇవాళ విడుస్తాయనిపించిన పూలు కోసి నీళ్లల్లో వేయటం ఓ పని. ఆ తర్వాత అన్నయ్యను నిచ్చెన వేయించి సింహాచలం సంపెంగ చెట్టు ఎక్కించి అందుబాటులో ఉన్న పూలన్నీ కోయించటం. "పువ్వుల కోసం నువ్వడగటం వాడెక్కటం బాగానే ఉంది" అని పెద్దవాళ్లు మందలించటం సరదాగా ఉండేది. ఆరు ఏడు అయ్యాక సాయంత్రమే కోసి నీటిలో వేసి మూత పెట్టిన ఆకు సంపెంగలు వంటింట్లోకి వెళ్తూనే గుప్పుమనేవి. రోజూ ఏడెనిమిది పూల దాకా పూసేవి ఆకుపచ్చ సంపెంగలు.

అలా శెలవులకు ఊరెళ్లినప్పుడల్లా నన్ను పలకరించే రకరకాల పూలన్నీ మామ్మయ్య ప్రేమగా పెంచినవే. తన చేత్తో వేస్తే ఏ మొక్క అయినా, కొమ్మ అయినా బ్రతికేది. పూల మొక్కలే కాక దబ్బకాయ, జామ, పనస, అరటి మొదలైన పెద్ద చెట్లు కూడా తన సంరక్షణలో పెరిగేవి. మామ్మయ్య పోయిన తరువాత తనను వీడి ఉండలేనట్లుగా తను పెంచిన దొడ్లోని చెట్లన్నీ చాలా వరకూ వాడి ఎండిపోయాయి. మామ్మయ్యకూ మొక్కలకీ ఉన్న ఆ అనుబంధం ఎంతో అపురూపమైనది..చిత్రమైనది. ఆ తోట, ఆ ఇల్లు, పూలు ఇప్పుడు లేకపోయినా తలచినప్పుడల్లా ఇప్పటికీ చుట్టుముట్టే ఈ జ్ఞాపకాల పూలన్నీ మనసులో పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి.