సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, November 19, 2010

చంద్రుడికవతల వైపు ...


ఎప్పుడైనా మా అన్నయ్య నాలుగైదు రోజులు ఫోన్ చెయ్యకపోతే నాన్న అడిగేవారు ఎక్కడున్నావురా ఫోనే లేదు? అని. అప్పుడు వాడు చెప్పేవాడు "నేను చంద్రుడికవతలవైపు ఉన్నాను..అక్కడ network ఉండదు.." అని. అలా నేనిప్పుడు చంద్రుడికవతలవైపు...ఉన్నా!!


ఫోన్ లేదు,నెట్ లేదు,కేబుల్ లేదు,మొబైల్ కూడా లేదు. పొద్దున్నే న్యూస్ పేపర్ కూడా లేదు. ప్రపంచంతో సంబంధమే లేదు. ఏడెనిమిదేళ్ల క్రితం మేము బొంబాయిలో ఉన్నప్పుడు అలా ఉండేది.మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా..ఇది కూడా బాగుంది. టివీ చానల్స్ గోల వినక్కర్లేదు.phonecalls కు సమాధానం చెప్పక్కర్లేదు. నెట్ లేదు కాబట్టి బ్లాగుల్లో ఏమౌతోందో ఇవాళ బ్లాగులు చూడలేదు అని బెంగ పడక్కర్లేదు. ఇవాళింకా టపా రాయలేదు అని కంగారు పడక్కర్లేదు..టపాలకి వ్యాఖ్యలు రాలేదని బాధపడక్కర్లేదు..!

ఆహా ఇలానే ఇంకొన్నాళ్ళు ఉందాం అనిపిస్తోంది. అందుకే అన్ని కనక్షన్లూ పెట్టించమని తనని తొందరపెట్టట్లేదు. ఒకోసారి ఇలా చంద్రుడికి అవతల వైపు కూడా ఉండిపోతే ఎంత బాగుంటుందీ... అనిపిస్తోంది. పక్క సందులో నెట్ సెంటర్ ఉంది.పాప స్కూల్కు వెళ్ళాకా వెళ్ళి చూసుకో అన్నారు నిన్న తను. కూరలకు వెళ్తూంటే మనసు పీకి కాళ్ళు ఇలా ఇటువైపు మళ్ళాయి. బ్లాగు తెరవగానే అమ్మో ఎన్నిరోజులైందో టపా రాసి అని చేతులు దురద పెట్టాయి...ఇదిగో ఇలా ఈ టపా తయారౌతోంది..

ఇంకొద్దిరోజులు ఇలా చంద్రుడికి అవతలవైపే ఉన్నాకా ఈ కొత్త జీవితపు విశేషాలతో మళ్ళీ కలుస్తానూ...