సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, October 26, 2010

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 4 !!

మూడవ భాగం తరువాయి...

recording of a children's play produced by ramam

Oct 26, 8.30a.m
ఆ విధంగా వివిధభారతిలో వైవిధ్యమైన కార్యక్రమాల ద్వారా " When God closes one door, he opens another.." అన్న సూక్తిని నిజం చేస్తూ మద్రాస్ లో దాగుండిపోయిన కలలో కొన్నింటినన్నా రేడియో ద్వారా తీర్చుకునే సువర్ణావకాశాన్ని భగవంతుడు రామానికి అందించాడు. డైలీ డ్యూటిలతో పాటూ తనకు మొదటి నుంచీ ఇష్టమైన పిల్లల కార్యక్రమాలు అనేకం సమర్పించే అవకశాలు వచ్చాయి. ప్రముఖ ఆకాశవాణి కళాకారులు, హాస్య రచయిత పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు అప్పట్లో పిల్లల కార్యక్రమం ప్రొడ్యూసర్ గా ఉండటం వల్ల రామంలోని పిల్లల పట్ల ఆసక్తిని గమనించి అనేక పిల్లల కార్యక్రమాలు రూపొందించే ఫ్రీ హాండ్ ఇచ్చారు. అందులో భాగంగా అనేక వారాలు సీరియల్గా వచ్చిన ఉపనిషత్ కథలు ఒకటి. ఇంటి చుట్టూ పిల్లలని పోగేసి ఓపిగ్గా వాళ్ళతో రిహార్సల్స్ చేయించి చక్కని సంగీతానికి, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ జోడించి ఈ సీరియల్స్ రూపొందించేవాడు రామం. అలాంటిదే మరో సీరియల్ "అల్లరి గోపి". అల్లరి చేసే ఓ కొంటె పిల్లాడిని ఓ సీతాకోకచిలుక తన మాయాజాలంతో అణుమాత్రంగా మార్చేసి ఓ కొత్త ప్రపంచాన్ని చూపించి అతని మానసిక పరివర్తన తేవటం ఇందులో ఇతివృత్తం. ఈ సీరియల్ లో ఉపయోగించిన ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల ఇది పిల్లల పసి మనసుపైన చరగని ముద్ర వేసింది. తరువాత ఇది రష్యన్ భాషలో కూడా రావటం ఎంతో ఆనందించాల్సిన విషయం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా ఏళ్ళ తరువాత ఇంచుమించు ఇదే ఇతివృత్తంతో ప్రముఖ హాలీవుడ్ దర్శకులు స్పీల్ బర్గ్ దర్శకత్వంలో "హనీ ఐ ష్రంక్ ద కిడ్స్" అనే పేరు మీద ఈ నాటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకపోయినా అద్భుతమైన పిల్లల చిత్రంగా రావటం.


అలాంటిదే "అల్లాఉద్దీన్ అద్భుతదీపం" నాటిక. పేరు పొందిన సినిమా సంస్థల్లాగ, రామం చేతిలో ఒక చురుకైన పిల్లల బృందం ఎప్పుడు తయారుగా ఉండేది. వాళ్ళు ఏ నాటకానికైనా సిధ్దమే. మెత్తని మైనంలాగ మలచుకునే అవకాశం ఉన్న పిల్లలు. అంతేకాక ఇంకా కొత్త కొత్త పిల్లలకు కూడా రామం ద్వారా అవకాశాలు దొరుకుతూ ఉండేవి. ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రెంటాల గోపాలకృష్ణగారి కుమార్తె, ప్రస్తుత ప్రముఖ బ్లాగర్, రచయిత, కవయిత్రి, మిత్రులు రెంటాల కల్పనగారు కూడా దాదాపు పదేళ్ళ ప్రాయంలో రామం రూపొందించిన ఒక సీరియల్ లో పాల్గొన్న స్వీట్ మెమొరీని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు. "టాం సాయర్" సీరియల్ తాలూకూ క్రింది ఫోటోలో కల్పనగారు కూడా ఉన్నారు.


Team of ramam's 'Tom sawyer' Radio play


ఈ సీరియల్ వెనుక చిన్న కథ ఉంది. రామం పుట్టి పెరిగిన ఖండవిల్లి గ్రామానికి డైలీ న్యూస్ పేపర్ రావాలంటే మధ్యాహ్నం మూడు గంటలు దాటేది. అప్పుడే ఆ రోజు పేపర్ చదువుకోవటం. అలాగే రామం వాళ్ళ ఇంట్లో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వీక్లీలు కూడా రెగులర్ గా తెప్పించేవారు. అప్పట్లో వారపత్రిక వెల పావలా. ఆ కాలంలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అనేక పిల్లల సీరియల్స్ వస్తూండేవి. మద్దిపట్ల సూరిగారి అనువాదం "పథేర్ పాంచాలి", జూల్స్ వెర్న్ నవల "సాగర గర్భంలో సాహస యాత్ర", మార్క్ ట్వైన్ రచించిన సుప్రసిధ్ధ పిల్లల నవల "టాం సాయర్", ముళ్లపూడి వెంకట రమణ గారి "బుడుగు" వంటి అనేక రోమాంచితమైన రచనలు వచ్చేవి. ఏ ఇతర ప్రచార సాధనాలూ లేని ఆ ఊళ్ళో రామానికి ఈ వారపత్రికలే ముఖ్యమైన ఆకర్షణలు. ప్రతి పరిణితి చెందిన వ్యక్తిలోనూ ఒక పసి బాలుడు దాగి ఉంటాడు అని మార్క్ ట్వైన్ చెప్పినట్లు ఈ రచనలన్నీ రామం హృదయం మీద చెరగని ముద్ర వేసాయి. అందులోనూ వీరోచిత కృత్యాలతో నిండిన బాల నాయకుడు "టాం సాయర్" రామానికి ఆదర్శప్రాయుడైయ్యాడు. ఈ క్రెడిట్ అంతా మార్క్ ట్వైన్ పిల్లల కోసం రాసిన నవలాన్నీ అద్భుతంగా అనువాదం చేసిన నండూరి రామ్మోహనరావు గారికే దక్కుతుంది. దాదాపు 15,20 ఏళ్ళ తరువాత రామం రేడియోలో స్థిరపడ్డాక "టాం సాయర్" సీరియల్ పిల్లల కోసం ప్రసారం చేయాలి అనే ప్రతిపాదన వచ్చింది. అదృష్టవశాత్తు ఆ అవకాశం అతనికే దక్కింది. ఏ కథైతే తను చిన్నతనంలో తన మనసుకి అయస్కాంతంలా అతుక్కుపోయిందో దాన్నే మళ్ళీ పిల్లల సీరియల్గా శబ్ద రూపంలో స్వయంగా రూపొందించే అవకాశం దక్కటం రేడియో తనకు ప్రసాదించిన అపూర్వమైన అదృష్టంగా రామం ఇప్పటికీ భావిస్తాడు.


పది వారాల పాటు దిగ్విజయంగా పిల్లల ప్రశంసలు పొందుతూ ప్రసారమైన ఈ సీరియల్ పూర్తి నీడివి మూడున్నర గంటలు. అంటే ఓ రాజ్కపూర్ సినిమా అంత. ఇది రామం కలలలో ఒకటి. అందుకే ఇందులో తన పిల్ల బృందంతో పాటూ కొన్ని పెద్ద వయసు పాత్రలను లబ్ధప్రతిష్ఠులైన సీతారత్నమ్మగారిలాంటి రేడియో కళాకారులు కొందరు పాలుపంచుకున్నారు. అప్పట్లో రేడియో శబ్ద మాంత్రికులుగా పేరుగాంచిన సీ.రామ్మోహన్రావు, నండూరి సుబ్బారావుగారు వంటి చెయ్యి తిరిగిన కళాకారుల చేత "పొట్టిబావా బాగా చేస్తున్నావోయ్.." అని ప్రత్యేక ప్రశంసలు పొందటం రామం జీవితంలో నేషనల్ అవార్డ్స్ కంటే అపూర్వమైన అనుభూతి. నండూరి రామ్మోహన్ రావుగారి నవలను రేడియోకి అనువదించి అద్భుతమైన సంభాషణలు రాసిన ప్రముఖ రచయిత, సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు కూడా ఎంతో అభివందనీయులు. ఈ సీరియల్లో వాడిన డజన్ల కొద్దీ సౌండ్ ఎఫెక్ట్స్, కథా గమనానికి అనువైన నేపధ్య సంగీతం కోసం రామం ఎంతో శ్రమించాడు. అంతే కాక "టాం సాయర్" పోలీ పెద్దమ్మ, పిల్లి నటించిన సీన్ లో ’పిల్లి ’ రామమే. అర్ధరాత్రి టాం సాయర్, హక్ భయపడే కుక్కల సీన్ లో ’కుక్క ’ కూడా రామమే. ఇవన్నీ కాక అవసరార్ధం ఎన్నో చిన్న చిన్న పాత్రలు కూడా రామమే ధరించాల్సివచ్చింది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా "టాం సాయర్" సీరియల్లోని ఏదో కొంత భాగాన్ని గీతా పారాయణంలాగ తరచు వింటూ ఉండటం ఇప్పటికీ రామం నిత్య కృత్యాల్లో ఒకటి. ఇక ఆ సీరియల్లోని సీన్లు, డైలాగులన్నీ ఇంటిల్లిపాదికీ కంఠతావచ్చు. "టాం సాయర్", "హకల్ బెరిఫిన్" రెండు ఆంగ్ల చిత్రాల కంటే ఈ శబ్దరూపకమే బాగా వచ్చిందని రామం ఘట్టి అభిప్పిరాయం(బుడుగ్గడిలాగ).



జర్నలిస్ట్, ప్రఖ్యాత సైన్స్ రైటర్ పురాణపండ రంగనాథ్ గారు రేడియోకి ఎన్నో శాస్త్రీయ రచనలు చేస్తూ ఉండేవారు. అలాగే పిల్లల కోసం కూడా ఎన్నో సైన్స్ నాటకాలు రాసారు. అందులో ఒక స్టేజ్ నాటకం పేరు "రోపోడా"(రోగాలు పోగొట్టే డాక్టర్?) దురదృష్టవశాత్తు బాల్యంలోనే వృధ్ధాప్యం దాపురించిన ఓ పిల్లవాడు ఒక విచిత్రమైన కాలయంత్రం ద్వారా తిరిగి యవ్వనాన్ని పొందటం ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. స్టేషన్ డైరెక్టర్ శ్రీనివాసన్, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రయాగ వేదవతిగార్ల నేతృత్వంలో విజయవాడ తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో ఈ నాటకాన్ని నిర్వహించి, కలా నిజమా అని భ్రమించేలాగ ఓ కాలయంత్రాన్ని కృత్రిమంగా సృష్టించి పత్రికల ప్రశంసలు పొందాడు రామం. ఇంతా చెస్తే ఆ యంత్రం తయారిలో వాడిన భాగాలన్నీ రేడియో స్టేషన్లోని ఇంజినీరింగ్ విభాగంలో పనికిరాకుండా పడేసిన పరికరాలే. మళ్ళీ ఇదే నాటకాన్ని అదే బృందంతో శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్లోని బహిరంగ రంగస్థలంపై అనేకమంది సాంకేతిక నిపుణులు, సైంటిస్ట్ ల్లు, సామాన్య ప్రేక్షకుల ఎదుట ప్రదర్శించి వారి మెప్పును కూడా పొందటం జరిగింది. ఈ క్రింది ఫోటోలోనిదే ఆ యంత్రం.







దీని తరువాత, పిల్లల కార్యక్రమాల్ని పర్యవేక్షించే శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారి ప్రేరణతో తానే ఒక పిల్లల సంగీత కథారూపకం "చింటూ - బిజ్జూ" రూపొందించి సీరియల్గా ప్రసారం చేసాడు రామం. ఇందులో కథనం, పాటలూ, మిమిక్రీ అన్ని రామమే. దీని నిడివి ఒక గంట.


*** *** ***


మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫైనలియర్ పరీక్షాంశంగా సబ్మిట్ చేసిన "ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్" అనే థీసీస్ లో ఒక చాప్టర్ "బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇన్ ఫిల్మ్స్"( సినిమాలలో నేపథ్యసంగీతం). రామానికి ఇష్టమైన సబ్జక్ట్స్ లో ఒకటి. విజయచిత్ర పత్రికవారు ఇదే అంశం పైన నిర్వహించిన పోటిలో రామానికి ప్రధమ బహుమతి లభించింది. దాని న్యాయ నిర్ణేత ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు(ప్రముఖ నటి అంజలీదేవి భర్త). ఇదే అంశంపై ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సంచికలో రెండువారాలు ధారావాహికగా ప్రచురితమైంది. తనకెంతో ఇష్టమైన ఇదే అంశం మీద తను రాసిన మరో ప్రత్యేక వ్యాసం ఆంధ్రప్రభవారు అరవైఏళ్ళ తెలుగు సినీ చరిత్రను పురస్కరించుకుని ప్రచురించిన "మోహిని" లో చోటుచేసుకుంది.


ఇవన్నీ కాక తొలినాటి మూకీల నుంచి, నేటి DTS వరకూ తెలుగు చలనచిత్ర నేపథ్యసంగీతానికి సంబంధించిన అనేక ఆడియో క్లిప్పింగ్స్ తో ఆ పరిణామక్రమం ప్రేక్షక శ్రోతలు సులువుగా అర్ధమయ్యే రీతిలో సోదాహరణాత్మకంగా వివరించే స్టేజ్ షోలు అనేకం విజయవాడ, నెల్లూరు, భీమవరం మొదలైన చోట్ల స్వయంగా నిర్వహించి ఆహూతుల మన్ననలు అందుకున్నాడు రామం. ఇండియన్ ఎక్స్ ప్రెస్ మొదలైన పత్రికలవారు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే కారణంగా అకాశవాణి తరచూ బయటఊళ్ళలో నిర్వహించే OBలు(స్టేజ్ షోలు) ఎన్నింటికో రామాన్నే ప్రత్యేక వ్యాఖ్యాతగా తీసుకెళ్ళేవారు.

గాయకులు బాలు నిర్వహణలో కొనసాగిన "పాడుతా తీయగా" విజేతలతో (ఉష, పార్థసారథి,రామాచారి) విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక షోకి కూడా రామం వ్యాఖ్యాతగా, అనుసంధానకర్తగా తన పాత్ర విజయవంతంగా పోషించి, ఆ షోలో బాలు రాని లోటును తీర్చాడని ప్రేక్షకులతో అనిపించుకున్నాడు పొందాడు. ఆ క్రెడిట్ విజయవాడ "రసమంజరి" సంస్థ వారిదే.

*** *** ***
జాతీయ స్థాయిలో మొట్టమొదటి సైన్స్ సీరియల్ ప్రొడ్యూస్ చేసేందుకు ఢిల్లీ నుంచి పిలుపు అందుకున్నాడు రామం. మూడు నెలలు అక్కడ ఉండి ఢిల్లీలో పనిచేయటం మరపురాని అనుభూతి తనకు. తరువాత మళ్ళీ 1990లో నూతనంగా ప్రారంభించిన తెలుగు విదేశీ ప్రసారవిభాగం ఇ.ఎస్.డి.లో ప్రారంభ అనౌన్సర్ గా ఏ.బి.ఆనంద్ గారితో పాటు కలిసి పనిచేయటానికి ఆహ్వానం రావటం అతనికి ఢిల్లీ దాకా ఉన్న గుర్తింపుకి మచ్చుతునక. ఈ కారణాలతో ఢిల్లీ ఆకాశవాణి భవన్లో పని చేయటం వల్ల ఢిల్లీ అంటే కూడా ప్రేమ ఏర్పడింది అతనికి.

(ఇంకా ఉంది...)