సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, October 6, 2010

నాన్న


nanna while in duty

అమ్మ ఫోన్ చేసింది నిన్న సాయంత్రం, "రేపు నాన్నను డిస్చార్జ్ చేస్తాం అన్నారు డాక్టర్..."
ఐదు రోజుల్నుంచీ నిద్రాహారాల్లేక ICU బయట కుర్చీల్లో కూర్చుని కూర్చునీ అమ్మ, అన్నయ్య, తమ్ముడూ...


ఇంట్లో ఉన్నా, ఏమైతుందో...ఏమౌతుందో అని బిక్కు బిక్కుమంటూ గడిపిన నాకూ ప్రాణాలు కుదుట పడ్డాయి...!
ఇవాళ నాన్న ఇంటికి వస్తారు.

*** **** ***

సృష్టిలో జీవితమూ శాశ్వతం కాదు అన్నది జగమెరిగిన సత్యమే. కానీ కొన్నిసార్లు మనకు తెలిసిన సత్యాల్ని మనం విస్మరిస్తాము. నమ్మటానికి మనసు ఒప్పదు. నాన్న గురించి కూడా అంతే...
ఏమొచ్చినా నాకు నాన్న ఉన్నారు...అన్న ధైర్యం ఐదు రోజుల క్రితం వరకూ...
కొండంత అండ, నాకు "నీడ" నాన్న...
నాన్న లేని జీవితం ఒకటి ఉంటుందన్న ఊహే లేదు ఇంతదాకా......
కానీ, ఐదు రోజుల క్రితం హఠాత్తుగా జరిగిన సంఘటన కఠోర సత్యాన్ని ఒప్పుకొమ్మని బలవంతపెట్టింది...
ఇకపై అలాంటి జీవితాన్ని ఎదురుకోవటానికి ఎప్పుడూ సిధ్ధంగా ఉండాలని...

*** *** ****

నాకే కాదు చాలా మంది కూతుళ్ళకు వాళ్ళ వాళ్ళ నాన్నలు అద్భుతాలే..
చాలా మందిలో నేనొకరిని...
"నాన్న" నాకేమిటో చెప్పేదెలా...
నాన్న కళ్ళతో నేను ప్రపంచాన్ని చూసాను
నా ప్రతి ఆలోచననూ, కదలికనూ బాగా అర్ధంచేసుకోగలిగింది నాన్న ఒక్కరే.
నేను మారు మాట్లాడకుండానే ఏమనుకుంటున్నానో చెప్పగలిగిన వ్యక్తి...
ప్రతి చిన్న విషయాన్నీ నేను పంచుకునే మొదటి వ్యక్తి నాన్న..

*** *** ***

" రంగు నీకు బాగుంటుంది. డ్రెస్ కొనుక్కో" అన్నప్పుడూ,
" చెప్పులు బావున్నాయి తీసుకో" అని చెప్పినప్పుడూ,
రకరకాల విషయాల గురించి గంటలు గంటలు చర్చించుకునేప్పుడూ,
ఏది కావాలన్నా నేను అడిగినప్పుడు,
"నువ్వు అడిగిందల్లా నేను కొనను. రేపు పెళ్లయ్యాకా ఏదన్నా కొనుక్కోలేకపోతే బాధపడతావు.." అన్నప్పుడు,


"పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైనది...నువ్వు ఆడపిల్లవని కాదు...ప్రతి వ్యక్తికీ జీవితంలో ఒక తోడు కావాలి..." అని పెళ్ళి అనేది ఎంత ముఖ్యమో రోజు రాత్రి డాబా మీద నాకు చెపినప్పుడూ,
" అబ్బాయి మంచివాడు. పెళ్ళిచేసుకో..." అని దగ్గర కూచుని మాట్లాడినప్పుడూ...
నాకు నాన్న స్నేహితుడు. ఒక శ్రేయోభిలాషి.
*** *** ****

"నెమ్మదిగా అబధ్ధం చెప్పినా వింటారు. కానీ అరిచి నిజం చెప్పినా ఎవరూ నమ్మరు"
"సమస్య వచ్చినప్పుడు ఎప్పుడూ ముందు ఎదుటి వ్యక్తి దృష్టిలోంచి ఆలోచించాలి.."
"తుఫాను వచ్చినప్పుడు తల వంచుకుంటే పై నుంచి వెళ్పోతుంది. అలా కాదని తల ఎత్తుకు నిలబడితే నువ్వూ కొట్టుకు పోతావు.."
"ఇవాళ బాలేకపోయినా, రేపు బాగుంటుంది.. అనే ఆశతో ఎప్పుడూ ఉండాలి.."
"ఒకోసారి మన తప్పు లేకపోయినా తల వంచుకోవటం వల్ల సమస్యలు పరిష్కారమౌతాయి..."
అంటూ జీవిత సత్యాలు చెప్పినప్పుడు నాన్న నాకు ఒక మార్గ దర్శకుడు.

*** *** ***

నాన్న గురించి బ్లాగ్లో చాలా సార్లు రాయాలని అన్పించినా రాయలేకపోయను..
ఎందుకంటే రాయటానికి ఒకటి రెండు టపాలు చాలని అద్భుతం నాన్న.
నడిచే ఎన్సైక్లోపీడియా నాన్న..
ఒక నిరంతర అన్వేషి నాన్న...
ఒక స్వాప్నికుడు
కళాకారుడు
ఆశావాది.
ఎంత చెప్పినా తనివి తీరదు...ఎంత రాసినా ఇంకా చెప్పవలసింది మిగిలిపోతూనే ఉందనిపిస్తుంది...
నాన్న కూతురుగా పుట్టడం నా అదృష్టం...అంతే..!!

** *** ***
నాన్న గురించి ఇప్పటికైనా కొంతైనా రాయాలని ...
రేడియో కూడా లేని ఒక మారుమూల పల్లెటూర్లో పుట్టి పెరిగిన పిల్లాడి జీవన పయనం
"రాముడు" నుంచీ "రామం" దాకా నాన్న పయనం...రాయలనుకున్నా...
కానీ బ్లాగ్ పై సన్నగిల్లిన ఆసక్తి, రాసినా ఎవరు చదువుతారులే అనే నిర్లిప్తత రాయనివ్వటం లేదు..

*** *** ***
నిన్న కాస్త లేచి కూచోగానే ఏమీ తోచటం లేదని, పుస్తకం పెన్నూ తెప్పించుకుని హాస్పటల్ బెడ్ మీద బొమ్మలు వేస్తూ కూచున్నారుట.(నాన్న స్కెచెస్, పైంటింగ్స్ బాగా వేస్తారు.)
ఇంకొన్నేళ్ళు నాన్న ఆరోగ్యంగా మా మధ్యన తిరగాలని కోరిక. ప్రార్ధన.
*** **** ****


అప్పట్లోని 150 స్టేషన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఆకాశవాణి వార్షిక పోటీల్లో వరుసగా పది నేషనల్ అవార్డ్స్ వచ్చిన ఏకైన తెలుగు అనౌన్సర్ నాన్న.
తాను చేసిన అవిరామ సేవకూ, కృషికీ, సాధించిన విజయాలకూ ఆకాశవాణి సంస్థ ఏ మాత్రం గుర్తింపునీ ఇవ్వలేదనే బాధ ఆయనలో ఉండిపోయింది. అనామకంగా మిగిలిపోయిన చాలా మందిలా గొప్పవాళ్ళలాగే తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం అని మేము అనుకుంటాము.

క్రిందన నాన్న చేసిన ప్రోగ్రామ్స్ కు  ఆయా సంవత్సరాల్లోని Information & Broadcasting ministers నేషనల్ అవార్డ్స్ ఇస్తూండగా తీసిన కొన్ని ఫోటోలు.


 
నాన్న బయోడేటా(పెద్దది చేస్తే ఆయన చేసిన కార్యక్రమాల జాబితా ఉంటుంది.)