సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, December 31, 2009

సింహావలోకనం...


"Doctor Zhivago" సినిమాలో ఒక సీన్లో Zhivago(Omar Sharif) రాత్రి పూట కూర్చుని రాసుకుంటూ ఉంటాడు. అతను కాగితం మీద పెన్ తో రాస్తున్న చప్పుడు తప్ప మనకు ఇంకేమీ వినిపించనంత నిశ్శబ్దం..!! అలాంటి నిశ్శబ్దం లో ఏదన్నా రాయాలనే తపన ఇంకా ఇంకా ఎక్కువౌతూ ఉంటుంది. ఈ పౌర్ణమి పూటా ప్రస్తుతం నేను చేస్తున్నదీ అదే...కాకపోతే పెన్ చప్పుడు బదులు కీప్యాడ్ టకటకలు...!!

రేడియోలో ప్రతి డిసెంబర్ 31st కీ "సింహావలోకనం" (Bird's eye view) అనే కార్యక్రమం వస్తూ ఉంటుంది. ఆ సంవత్సరంలో ప్రసారమైన అన్నికార్యక్రమాల బిట్స్, విశేషాలు ఉంటాయి అందులో. నేను కూడా అలాంటి ఒక టపా రాయాలనే ఆలోచన బుర్రని దొలిచింది. బ్లాగుల గురించి విశ్లేషించే సాహసం నేను చేయదలుచుకోలేదు. ఈ సంవత్సరంలో నాకు నచ్చిన కొన్ని టపాల గురించి మాత్రం రాయాలని...నేను బ్లాగు తెరిచి ఏడు నెలలు...నాకు దొరికిన సమయంలో, నాకు తెలిసిన బ్లాగుల్లో, నేను చదివినవాటిల్లో కొన్నింటిని ఈ టపాలో ప్రస్తావిస్తున్నాను. ఇంతకన్న బాగున్న టపాలు నేను "మిస్" అయి ఉండవచ్చు...కానీ ముందు చెప్పినట్లు ఇవి "బెస్ట్" అని నేననను కానీ నేను చదివినవాటిల్లో నాకు నచ్చినవి అంతే.

నెలలవారీగా ఒకోటీ చెప్పుకు వస్తాను...

ముందుగా పాతవైనా 2008 డిసెంబర్ లో ప్రచురితమైన 3 టపాలను ప్రస్తావించలేకుండా ఉండలేకపోతున్నాను.
"నేను-లక్ష్మి" బ్లాగ్ లో 2008 decలో ప్రచురితమైన "
పిట్టకధ - కొత్త సంవత్సరం"
మనసుకు హత్తుకునే మాటలు, ఉన్నతమైన భావలు, ఆచరింపదగిన మంచి సూత్రాలూ, జీవిత సత్యాలూ ఈ బ్లాగర్ టపాల్లోని ప్రత్యేకతలు.

ఇక "పలకాబలపం" లో 2008 dec టపా "
బ్లాగోగులు: మనకి కావలసింది ఏమిటి?"
ఈ టపాలో బ్లాగర్లు ఎందుకు బ్లాగుతారో తనదైన శైలిలో చక్కగా వివరిస్తారు అరిపిరాల సత్యప్రసాద్ గారు.
కోతి కొమ్మచ్చి తెచ్చి చదివించి...అంటూ "పుస్తకం.net" లో రాసినా, "నవతరంగం"లో సినిమా కబుర్లు రాసినా చివరి వాక్యం దాకా మనతో చదివించేలా ఉంటాయి ఈ బ్లాగర్ టపాలు. ఈ బ్లాగ్ కు నేను రెగులర్ రీడర్ను కాకపోయినా "అన్నం ఒక్క మెతుకు చూస్తే చాలు.." అన్నట్లుంటాయి ఈయన టపాలు.


"
నా తెలుగు సినీ దర్శకులు"అంటూ dec 2008 లో ఉమా శంకర్ గారు రాసిన టపా నాకు భలే నచ్చేసింది. మురళిగారి బ్లాగ్ల పరిచయం తో నాకు పరిచయమైన ఈయన బ్లాగు నేను తరచూ చూసే బ్లాగుల్లో ఒకటి. ఈయన కొత్తగా మొదలుపెట్టిన బ్లాగ్లో అయినా తరచూ టపాలు రాసి మరిన్ని మంచి టపాలు అందిస్తే బాగుంటుందని ఆశ.

ఇక 2009 టపాల్లోకి వచ్చేస్తే భైరవభట్ల కామేశ్వరరావు గారి "తెలుగు పద్యం" బ్లాగ్లో may '09లో ప్రచురించబడిన "
జుగల్బందీ" గజల్స్ పట్ల, తెలుగు కవిత్వం పట్ల ఆయనకున్న మక్కువను తెలుపుతుంది. కృష్ణశాస్త్రి కవిత చదువుతూ జగ్జీత్ సింగ్ గజల్ వింటూ ఆయన పొందిన భావుకత్వానికి అక్షరరూపం ఈ టపా. ఇందులో ఆయన రాసిన జగ్జీత్ సింగ్ గజల్ లోని సాహిత్యం చిన్నప్పుడు ఒక పుస్తకంలో "కవిత" రూపంలో చదివి బాగుందని నేను రాసుకుని దాచుకున్నా. తరువాత టి.విలో ఒక లైవ్ కాన్సర్ట్ లో జగ్జీత్ సింగ్ పాడుతూండగా రికార్డ్ చెసుకోవటం జరిగింది. ఆ కవిత నాకు చాలా ఇష్టం.


నాకు ఇటివలే పరిచయమైన నిషిగంధ గారి "మానసవీణ"లో may '09లోని "
మనోనేత్రం" కవిత నన్నెంతో ఆకట్టుకుంది. చాలా లేటుగానైనా ఇంత మంచి కవిత్వాన్ని ఆస్వాదించే అవకాశం దొరికినందుకు సంబరపడుతూ ఉంటాను.

కూడలిలో అడుగుపెట్టిన మొదటి రోజు నాకు పరిచయమైన వ్యాఖ్యాతల్లో ఒకరు "సిరిసిరిమువ్వ"గారు. నా ప్రతి టపాకూ వ్యాఖ్య రాయకపోయినా ఈవిడ నా బ్లాగ్ రెగులర్ రీడర్ అని నాకు నమ్మకం. june '09లో తన బ్లాగ్లో రాసిన "
నా ఉపవాస దీక్ష" టపా మనల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.

july '09 లో ప్రచురితమైన "నా స్పందన" బ్లాగర్ లలిత గారి "
కెవ్వ్...వ్వ్...వ్...కేక(గుండెని గుల్ల చేసే సెంటిమెంట్)" టపా గురించి నే చెప్పేకన్నా మీరు చదివి కెవ్వ్...కేక...అనాలంతే..!!


క్వాంటిటీ కన్నా క్వాలిటి ముఖ్యమని ఆవిడ 82 టపాలకు వచ్చిన 2670 వ్యాఖ్యలే తెలుపుతాయి. ఏ విషయన్నైనా సూటిగా, నిర్భయంగా రాయగల ధైర్యం ఉన్న బ్లాగర్ సుజాతగారు. ఇంకా పాడాలా? అని ప్రశ్నించినా, ఆటోగ్రాఫ్ల గురించి ప్రస్తావించి మనల్ని చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళినా, ఓటర్ల తీరుపై విచారం వ్యక్తం చేసినా....ఈవిడే రాయాల్సిందే అని మనకు అనిపిస్తుంది. july '09 లోని "
చందమామల్లాంటి బ్లాగులు" నాకు బాగా నచ్చిన టపా.


జ్యోతిగారు నడుపుతున్న బ్లాగులు, చేస్తున్న కార్యక్రమాలూ చూసి ఈవిడకు ఎన్ని చేతులున్నాయో, 24 గంటలు ఎలా సరిపోతాయి లాంటి ప్రశ్నలు రాక మానవు . ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన "జ్యోతి" బ్లాగ్లోని ఈ Sep ’09 వ్యాసం "
ష'డ్రుచో'పేతమైన సాహితీ విందు... " నన్నెంతగానో ఆకట్టుకుంది.


ఇక "కొత్తపాళీ" గారి బ్లాగ్ గురించి నేను చెప్పేదేముంది...ఆ బ్లాగ్లో వ్యాఖ్య రాయాలంటే మాటలు వెతుక్కోవాలి, బోలెడు విషయ పరిజ్ఞానం కావాలి. "బ్లాగుల పరిధి ఇప్పుడున్న దానికంటే ఒక వందరెట్లయినా విస్తరించాలి. దైనిక ప్రాతిపదికన జాల విహరణ (browsing the net on a daily basis) చేసే తెలుగు వారి సంఖ్యలో కనీసం 10 శాతం బ్లాగు పాఠకులు కావాలని నా కోరిక " అంటూ ఆయన రాసిన Sep ’09 లోని"
బ్లాగులూ-బ్లాగర్లూ" టపా బ్లాగుల అభివృధ్ధిని గురించిన ఆయన తపనను తెలుపుతుంది.


"స్వర్ణముఖి" బ్లాగర్ చైతన్య వయసులో చిన్నవాడైనా అతనికున్న విషయ పరిజ్ఞానం నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తుంది. "
శరద్చంద్రికోత్సవం"అంటూ oct 2009 లో ఈ ఉత్సవాన్ని గురించి వివరిస్తూ, అతను చూసిన సంగీతసామ్రాట్టుల కచేరిల గురించి రాసిన టపా సంగీతప్రేమికురాలైన నాకు బాగా నచ్చేసింది. చిన్న తేడా వచ్చినప్పుడు నేను అలిగితే, సహనం వహించి నన్ను అర్ధం చేసుకున్న మనిషి..బ్లాగ్లోకం నాకు అందించగా నాకు పరిచయమై నన్ను అప్యాయంగా "అక్కా" అని పిలిచే ఓ మంచి "తమ్ముడు" ఇతను.


వంద టపాల తరువాత నేను విరామం ప్రకటించినప్పుడు నా కోసం "
కవిత" రాసి నా మనసు దోచుకున్న "మనస్వి" జయగారు. Oct '09లో "బుర్రలేని పిల్ల" అని .అనాధ బాలిక గురించి ఆవిడ రాసిన ఒక నిజ జీవిత సంఘటన ఆవిడలోని ఉత్తమ సంస్కారానికీ, మూర్తీభవించిన మానవత్వానికీ ప్రతీక.

ఇక "నాన్న" భాస్కర్ గారి గురించి నే చెప్పేదేముంది...రకరకాల బ్లాగులు నడపడంలో , వంటలలో, సాంకేతిక నైపుణ్యంలో, తెలివితేటల్లో ఆయనకాయనే సాటి. బ్లాగ్లోకానికి నాన్నగారైనా....అలవాట్లు, కొన్ని పోలికలను బట్టి నాకు మా అన్నయ్యను తలపించే అన్నగారు నాకు.
Oct '09లో "
గడిచిపోయిన నిన్నటికీ రాబొయే రేపటికీ మధ్యనున్న నిశ్శబ్దం" అంటూ "బిగ్ బీ" గారి ప్రసంగానికి అనువాదాన్ని రాసిన ఈ టపా నాకిష్టం.


" నాతో నేను నా గురించి" అంటూ వేణూ శ్రీకాంత్ గారు రాసే చిన్ననాటికబుర్లు చదివి బాల్యంలోకి వెళ్ళని బ్లాగర్ ఉండరు. "ఈ రోజు ఎక్కడికి వెళదాం నాన్నా?" అంటూ నాన్నగారితో షికార్లు, "అంతా మన మంచికే" అంటూ చిన్నతనంలో నేను చదివిన "ట్వింకిల్" కధ...మెలోడియస్ పాటల్ని, ఎన్నో స్మృతులు రాసి నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తూంటారీయన.
Oct '09లో "
ఐస్ ఐస్ పుల్లైస్.. " అంటు బ్లాగర్లందరినీ బాల్యంలోకి తీసుకెళ్ళారు. మొదట్లో అక్కడక్కడ ఈయన వ్యాఖ్యలను చదివి నా బ్లాగ్లోకి తొంగి చూడరెందుకో అనుకునేదాన్ని. హఠాత్తుగా ఒకరోజు ఆయన తరచూ చూసే బ్లాగుల లిస్ట్ లో నా బ్లాగ్ పేరుని చూసి ఆశ్చర్యపోయాను.



"బుక్స్ అండ్ గాల్ఫ్రెండ్స్" సారధి "గీతాచార్య" ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ తమ్ముడికి కూడా వంద చెతులేమన్నా ఉన్నాయేమో అని నా అనుమానం. Oct '09లో "మరువం" లో ప్రచురితమైన "
అయిబు పాడిన అమ్మ పాట" కధ ఎందరో బ్లాగ్మిత్రుల మన్ననలు పొందింది.


ఇహ బ్లాగర్ల అభిమాన ఆడపడుచు "పరిమళం" గారి బ్లాగ్లో Nov '09లో ప్రచురితమైన "
దివ్యగుణములు" టపా మానవునికి కావాల్సిన పదహారు దివ్యగుణముల గురించి తెలుపుతుంది.


నా "బంగారు పాపాయి" టపా ద్వారా నాకు పరిచయమైన మాలా కుమార్ గారి బ్లాగులన్నీ మధురస్మృతుల సమాహారాలు. Nov '09లో "సాహితి" లో ప్రచురితమైన "
ఊర్వశి" టపా "ముదితల్ నేర్వగలేని విద్య గలదే ముద్దార నేర్పించినన్..." అన్న పద్యాన్ని గుర్తుకు తెస్తుంది.


చాలామందిలాగే నేను ఈ బ్లాగ్ అభిమానిని. రోజూ దినపత్రికను చూడకపోతే తోచనట్లే, రోజూ బ్లాగ్లోక విహారం మొదలెట్టగానే కొత్త టపా ఉన్నా లేకున్నా, ఓ సారీ "నెమలికన్ను"లోకి తొంగి చూడనిదే బ్లాగులు చూసినట్లే అనిపించదు. జ్ఞాపకాలను నెమరువేసుకోవటంలో ఈయన తరువాతే ఎవరైనా అనిపించి మురిపిస్తాయీయన టపాలు. Nov '09లో ప్రచురించిన "
పోలి స్వర్గం" నాకెంతో నచ్చిన టపా.
చెప్పాపెట్టకుండా అప్పుడప్పుడు మాయమైపోతూ, ఏమయ్యారో అనుకునేలోపూ మళ్ళీ హఠాత్తుగా ప్రత్యక్ష్యమైపోయే ఈయన "సార్ధకనామధేయులే" అనిపిస్తూ ఉంటుంది నాకు.



మన కవితారాణి ఉషగారి కవితాగానాల "మరువపువనం" నుంచి ఎంత వెతికినా ఒక్కదాన్నీ విడదీయలేకపోయాను. అందుకే Dec '09 లో ప్రచురితమైన, నాకు బాగా నచ్చిన "విశ్వామిత్ర" సీరియల్లోని "
చివరి భాగాన్ని" నచ్చిన టపాగా అందిస్తున్నాను.


నా "ఉత్తరాలు" టపా ద్వారా నాకు పరిచయమైన భావనగారి "కృష్ణపక్షం" సున్నితమైన భావోద్వేగాల లేఖాసమూహం.
Dec '09 లో ప్రచురితమైన "
ఒంటరి గూడు" టపా నన్నెంతగానో ఆకట్టుకుంది. రెండు విభిన్న దృక్పధాల మధ్యనున్న సంఘర్షణను, రెండు మనసుల వాదనలనూ వారి వారి దృష్టికోణాల నుంచి చూపించి, మనస్తత్వ విశ్లేషకురాలా? అనిపించేలా రచనలు చేసే భావనగారి "కృష్ణపక్షం" రెగులర్ రీడర్ని నేను .

"లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్" అన్నట్లు ఇటీవలకాలంలో మొదలై ప్రతి టపాతో మనతో "ఆహా" అనిపిస్తున్న బ్లాగ్ "నా గోల".
ఈ బ్లాగ్లో Dec '09 లో ప్రచురితమైన "
నీకు నువ్వు తెలుసా?"
కవిత అద్భుతం. చదివితే మీకే తెలుస్తుంది.

ఇవండీ నాకు నచ్చిన , నాకు తెలిసిన కొన్ని మంచి టపాలు. మీక్కూడా నా "సింహావలోకనం" నచ్చిందనే భావిస్తాను.
ఈ 2009 సంవత్సరానికిక శెలవు మరి....

ఇన్నాళ్ళూ వ్యాఖ్యల రూపంలో నాకు ప్రోత్సాహానిచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకవేళ నా వ్యాఖ్యలతో కానీ, టపాలతో కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని మనవి...

"బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.."