సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, November 17, 2009

తిలక్ గళంలో ఆయన "వెన్నెల"

పదహారేళ్ళ క్రితం ఒక జనవరి నెల పుస్తకమహోత్సవం లో కవితలు నచ్చి "అమృతం కురిసిన రాత్రి" మిగతా పుస్తకాలతో పాటూ కొనుక్కుని ఇంటికి తెచ్చాను. ఏం కొన్నావని చూసిన నాన్న "ఈ పుస్తకం ఎందుకు కొన్నావు?"
అని అడిగారు. "నచ్చింది...కొన్నాను..." అన్నా. "ఈ కవితలను నువ్వు అర్ధం చేసుకోగలవా?" అన్నరు. "ఊ..." అన్నాను. "ఈ తిలక్ ఎవరో తెలుసా?" అన్నారు. తల అడ్డంగా ఊపాను. "మూర్తి బాబయ్య మేనమామగారు. రామారావు అంకుల్ వాళ్ళ తమ్ముడు." అన్నారు. "ఈ పుస్తకం పాత ముద్రణ మనింట్లో ఉంది. ఎప్పుడైనా చూసావా?" అన్నారు... లేదన్నాను. దాంట్లోని ఒక కవితను తిలక్ గారు స్వయంగా చదివిన రికార్డింగ్ ఇంట్లో ఉంది వినమన్నారు.

అలా పరిచయమయ్యింది "అమృతం కురిసిన రాత్రి" నాకు. మూర్తి బాబయ్య గిటార్ వాయిస్తే,తిలక్ గారు పాడేవారట, లేకపోతే ఎవరిచేతైనా పాడించుకుంటూ వినేవారట. కొన్ని కవితలని మూర్తిబాబయ్య ట్యూన్ కట్టి పాడించారు. "గగనమొక రేకు కన్నుగవ సోకు..." పాట నేను నేర్చుకుని పాడేదాన్ని... (నాన్న చిరకాల స్నేహితుడు మూర్తిబాబయ్యే "గమ్యం" సినిమాకు సంగీతం చేసిన ఈ.ఎస్.మూర్తి.)

తిలక్ గారు స్వయంగా చదివిన "వెన్నెల" కవిత బ్లాగ్మిత్రుల కోసం.....



కార్తిక మాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
భూమి ఒంటిని హత్తుకుంది
శిశువులాంటి వెన్నెల
నవ వధువులాంటి, మధువులాంటి వెన్నెల
శిశిరానికి చెలించే
పొరల పొరల వెన్నెల
శరద్రధుని సౌధానికి కట్టిన
తెరల తెరల వెన్నెల
ఎంత శాంతంగా,
హాయిగా, ఆప్యాయంగా ఉందీ !
చచ్చిపోయిన మా అమ్మ
తిరిగొచ్చినట్టుంది
స్వర్గంలో ఎవరో సంగీతం
పాడుతున్నట్టుంది.
ఎంత నీరవ నిర్మల సౌందర్యం
నన్నావరించుకుంది ?
ఏ చామీకర చషకంతో
నా పెదవుల కందిస్తున్నది ?
ఈ రాత్రి నిద్రిత సర్వధాత్రి మీద
ఎవరు ఈ తళుకు తళుకు
కలల పుప్పొడిని వెదజల్లారు !
ఎవరీ మెరిసే ముఖమల్
జంఖానా పరిచి వెళ్ళారు !
ఓహో ! చంద్రకిత ధాత్రి
ఓహో ! కోరకిత గాత్రి
ఓహో ! శరధ్రాత్రి !
వ్యధలతో బాధ్యతలతో
భయాలతో మహితమైన
నా మనస్సుకిప్పుడూరట కలుగుతోంది.
ఈ వెన్నెల నా మనస్సులోకి
జారుతోంది
నా గుండెల పగుళ్ళనుండి కారుతోంది
నా అంతరాంతర రంగస్థల
ఏకాకి నటుడినైన నన్ను
తన మైత్రీ మధుర భావంతో
క్రమ్ముకుంటోంది
నా లోపలి లోపలి గుప్త
వీణా తంత్రీ నివహాన్ని
వేపధు మృదు లాంగుళుల
తాకి పలికిస్తోంది.
నన్ను బతికిస్తోంది
నా బతుక్కి అందాన్ని
అర్ధాన్నీ ఆశనీ
రచిస్తోంది
నా రచన తానైపోయింది
వెన్నెల వంటి నా ఉద్రేకానికి
తెలుగు భాష శరద్వియ
ద్విహార వనమై నడిచిపోయింది
చలి చలిగా సరదాగా ఉంది వెన్నెల
చెలి తొలిరాత్రి సిగ్గులా ఉంది
విరిసిన చేమంతిపువ్వులా ఉంది
పడకగదిలో వెలిగించిన
అగరొత్తుల వాసనలా ఉంది
పడగిప్పిన పాములు తిరిగే
పండిన మొగలి వనంలాగుంది
పన్నీరు జల్లినట్టు ఉంది
విరహిణి కన్నీరులా ఉంది
విరజాజుల తావితో కలిసి
గమ్మత్తుగా ఉంది
విచిత్రమైన మోహమణి
కవాటాలను తెరుస్తోంది
యౌవన వనంలోని కేళీ సరస్సులా ఉంది
దవుదవ్వుల పడుచు పిల్లలు
పకపక నవ్వినట్టుంది
దాపరికంలేని కొండజాతి
నాతి వలపులాగుంది
ఇది సృష్టి సౌందర్యానుభూతికి టీక
ఇది తరుణ శృంగార
జీవన హేలకు ప్రతీక
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు
గానపు తెన్నుల
జారెను తోటల
కొబ్బరి మొవ్వుల
ఇంటిముందు బోగన్ విల్లా పువ్వుల
ధనికుల కిటికీ పరదా చిరుసందుల
సురతాలస నిద్రిత సతి కపోలమ్ముల
జారిన జార్జెత్ చీర జిలుగుటంచుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
నిరుపేదల కలలో
కదలిన తీయని ఊహల
ఊరిపక్క కాలువ అద్దపు రొమ్ముల
ఊరి బయట కాలీకాలని
చితి కీలల
ఆడవిలో వికసించిన ఒంటరి పువ్వుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
(1965)

(ఇది పుస్తకంలోని కవిత. తిలక్ గారు చదివిన దాంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి.)

ఈ పుస్తకంలో "అమృతం కురిసిన రాత్రి", "నువ్వు లేవు నీ పాట ఉంది", "నేను కాని నేను" నాకు బాగా నచ్చే కవితలు.