సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, April 1, 2013

వేములవాడ - నాంపల్లి





వేములవాడ:

సుప్రసిధ్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రము - ఆంధ్రప్రదేశ్, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలంలో ఉంది. ఎప్పటినుండో వెళ్ళాలనుకుంటూ... మొన్నవారాంతలో వెళ్ళివచ్చాము. ఆర్ టి.సి.బస్సులో హైదరాబాద్ నుండి సుమారు మూడున్నర గంటల ప్రయాణం. సిధ్ధిపేట, సిరిసిల్ల ల మీదుగా బస్సు వెళుతుంది. "దక్షిణ కాశీ"గా పిలవబడే వేములవాడలో  శివుడు శ్రీ రాజరాజేశ్వరస్వామి పేరుతో కొలువై, భక్తులచే "రాజన్న"గా పిలుపునందుకుంటున్నాడు. అమ్మవారి పేరు రాజరాజేశ్వరీదేవి. వేములవాడ ఆలయం ఎంతో పురాతనమైనదిగా చెప్తారు. ఆ ప్రాంతంలో దొరికిన శిలాశాసనాలలో ఈ ఊరి పేరు "లేంబులవాటిక" అని ఉన్నదట. తర్వత అది "లేములవాడ" అయి, ఇప్పుడు "వేములవాడ" అయ్యిందిట. ఈ ఊరిని రాజధానిగా చేసుకుని చాళుక్యులు క్రీ.శ.750 నుండీ క్రీ.శ.973 దాకా రాజ్యమేలారని అక్కడి శిలాశాసనాలు తెలుపుతాయి. పంపన, వగరాజు, భీమన మొదలైన మహాకవులు కళాపోషకులు,సాహితీప్రియులైన చాళుక్యుల ఆస్థానంలోవారేనట.






ఇక్కడి ప్రధానాలయ ప్రాంగణంలోని ధర్మకుండము ప్రముఖమైనది. ఇందులో స్నానం గ్రహచార భాధలను,సమస్త బాధలను తొలగించి, మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. కానీ పవిత్రమైన ఈ ధర్మకుండాన్ని భక్తులు పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు కనబడలేదు :( 

సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభస్వామి ఆలయం, ఇంకా కాస్త పక్కగా బాల రాజేశ్వరాలయం,విఠలేశ్వరాలయం, కోటిలింగాలు, సోమేశ్వరాలయం, బాలాత్రిపురసుందరీదేవి ఆలయం ఉన్నాయి. ప్రధాన ఆలయంలో శివలింగానికి ఎడమ పక్కన లక్ష్మీగణపతి విగ్రహం, కుడివైపున అమ్మవారి విగ్రహం ఉన్నాయి. గుడి బయట ఊళ్ళో మరిన్ని ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో వేణుగోపాలస్వామి ఆలయం బాగా పెద్దగా కనబడింది.

మేం వెళ్లిననాడు జనం బాగా ఉన్నారు. ఊరు పన్నెండింటికి వెళ్ళాం. దర్శనం అయి బయటకు వచ్చేసరికీ రెండున్నర అయ్యింది. జనం ఉన్నా అదృష్టవశాత్తు ఆ రోజున ఎవరో పీఠాధిపతి వచ్చారు. అయన వచ్చాకా కాసేపు క్యూ నిలిపివేసారు. అందువల్ల ఆయన ఆలయంలో ఉన్నంత సేపు, వేదపఠనాల మధ్యన మాకు చక్కగా దర్శనం అయ్యింది. 






 గుడి బయట దాదాపు చాలా కొట్లలో బెల్లం అచ్చులు అమ్ముతున్నారు. స్వామివారికి మొక్కు తీర్చుకోవటానికి బెల్లం తూకం వేస్తారుట. ఇంకా గుడి చుట్టు ఆవులను,దూడలనూ ప్రదక్షిణ చేయిస్తున్నారు. అది కూడా మొక్కేనట.

గుడి బయట ఒకామె అప్పుడే కుట్టిన విస్తరాకు




నాంపల్లి :

వేములవాడ వస్తోందనగా బస్సులోంచి ఒక చిన్న కొండ, దానిపై ఒక గుడి కనబడ్డాయి. రాజన్న దర్శనం అయ్యాకా, ఆ కొండ మీద గుడికి వెళ్దామన్నాను. వెములవాడ పక్కనే ఉన్న 'నాంపల్లి’ అనే గ్రామంలో ఆ గుడి ఉందట. 'లక్ష్మీనరసింహస్వామి' ఆలయంట. వేములవాడ దేవస్థానంవారిదేట ఆ గుడి కూడా. కొంతదాకా ఆటోలు వెళ్తాయి. తర్వాత మెట్లు ఎక్కాలి అని చెప్పారు. ఎండ విపరీతంగా ఉంది. అయినా కొండపై గుడి చూడాలనే ఉత్సాహంలో బయల్దేరాం.


view from the hill









 కొంతదాకా పైకి ఎక్కాకా కృషుడు కాళీమర్దనం చేస్తున్నట్లున్న పెద్ద నాగవిగ్రహం ఉన్న చోటన ఆటోలు ఆగుతాయి. ఆశ్చర్యం కలిగించేంతటి గొప్ప నిర్మాణం అది. చాలా అందంగా ఉంది. ప్లాన్ చేసి, కట్టిన ఇంజినీరుని తప్పక మెచ్చుకోవాలి. ఆ నాగపడగ  లోపలికి దారి ఉంది. రూపాయి టికెట్టు. టికెట్టు కనీసం ఐదు రూపాయలు చేయండి లేదా ద్వారం మూసేయండి అని ఆలయంవారు వినతిపత్రం ఇచ్చుకున్నారుట. అక్కడ మైంటైనెన్స్ కన్నా డబ్బులు మిగలాలి కదా! అక్కడ నుండీ ఈ వంద మెట్లు ఉంటాయి పైకి. మెట్లు స్టీప్ గానే ఉన్నాయి. చెప్పులు క్రింద వదిలేయటం వల్ల ఎండలో పైకెక్కటం కష్టమే అయ్యింది. ఇక్కడి నరసింహస్వామివారు స్వయంభూ ట. చలికాలంలో అయితే ఈ కొండపైకి రావటం చక్కని అనుభూతిగా మిగలగలదు.


ఇంటికొచ్చాకా నెట్లో వెతికితే ఈ గుడి విశేషాలు ఇక్కడ దొరికాయి:
http://www.youtube.com/watch?v=WA9IcbhaFpY



Sunday, March 31, 2013

Millet Fest - 2013





ఆహారం మరియు పౌష్ఠికాహారం బోర్డ్-భారత ప్రభుత్వం వారు, ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికర్చరల్ యూనివర్సిటీ(ANGRAU) సహకారంతో  నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో మూడు రోజులపాటు జరిగే "Millet Fest - 2013" ను నిన్న ప్రారంభించారు. ప్రజలు ఫాస్ట్ ఫుడ్స్ కి, ఇన్స్టెంట్ ఫుడ్స్ కి అలవాటు పడ్డం వల్ల చిరుధాన్యాలను కొనటం తగ్గిందని, అందువల్ల వాటి ఉత్పత్తి శాతం బాగా తగ్గిపోయిందట. రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు,సాములు మొదలైన చిరుధాన్యాలపై ప్రజల్లో తగ్గుతున్న ఆసక్తిని పెంచేందుకు, ఈ చిరుధాన్యాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, ఉపయోగాలూ తెలిపేందుకు ఈ ప్రదర్శనను క్రిందటేడు నుండీ నిర్వహిస్తున్నారుట. 





 యూనివర్సిటీ వాళ్ళు పరిశోధనల్లో భాగంగా చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు, బిస్కెట్లు, మురుకులు మొదలైనవి ప్రదర్శనలో ఉంచారు. అవి ఇంకా కావాలంటే యూనివర్సిటీ స్టోర్స్ లో లభ్యమౌతాయని కూడా చెప్పారు. ఇవే కాక వివిధ సంస్థలు(NGOs) చిరుధాన్యాలతో తయారు చేసిన రకరకాల పదార్థాలూ, వారు పండించిన ఆర్గానిక్ చిరుధాన్యాలు మొదలైనవి అమ్మకానికి పెట్టారు. నేటితరం మగ్గు చూపుతున్న పీజాలు,బర్గర్లు మొదలైన ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంత హానికరమో, మన పూర్వీకులు ఎంతగానో ఆస్వాదించిన ఈ చిరుధాన్యాలు, వాటితో ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చునో కూడా ప్రదర్శనలో తెలుపుతున్నారు. నిజానికి ఆరోగ్యానికి హాని చేసే శనగపిండితో చేసిన పదార్థాలకన్నా ఆరోగ్యానికి మేలు చేసే జొన్న పిండి, రాగి పిండి మొదలైనవాటితో చేసిన పదార్థాలు ఎంతో మంచివి. ఎందుకంటే పిల్లలకు కావాల్సిన కేల్షియం, ఇనుము మొదలైనవి చిరుధాన్యాలలోనే ఎక్కువగా లభిస్తాయి.







 ఇంత చక్కని ప్రదర్శన నగరంలో జరగటం, మాకులాగానే ఎంతోమంది విచ్చేసి ఈ వివరాలన్నింటిని తెలుసుకోవటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే గత ఏడాదిగా నేను ఈ చిరుధాన్యాలతో చేయగల వివిధ పదార్థాలను గురించి, వంటకాలను గురించీ విస్తృతమైన పరిశోధన జరుపుతున్నాను. జొన్న రవ్వ ఉప్మా, రాగి పిండి, సజ్జ పిండి, జొన్న పిండి, సోయా పిండి మొదలైనవి చపాతీ పిండి ఏ ఏ పాళ్ళలో కలిపితే చపాతీలు ఎలా వస్తాయో, అట్లల్లో మైదా బదులు జొన్న పిండి, పకోడీల్లో కూడా జొన్న పిండి కలపటం, రాగి పూరీలు మొదలైన ప్రయోగాలు చేస్తూ వస్తున్నా :) అందువల్ల వాళ్ళు అమ్మకానికి పెట్టిన మల్టీ గ్రైన్ ఆటా, మల్టీ గ్రైన్ రవ్వ, మల్టీ గ్రైన్ బ్రెడ్ నాకు కొత్తవి కాదు. కొన్నేళ్ళూగా నేను కొంటున్నవే. కొత్తగా నాకు తెలిసినవి ఏంటంటే మురుకులు, జంతికలు, ఖాక్రా లాంటివి కూడా జొన్న పిండితో చేసుకోవచ్చని. ఇలా కొత్తవి ఏం చేసుకోవచ్చో తెలుసుకోవటానికే మేము ఈ ప్రదర్శనకు వెళ్ళాం. కొన్ని రెసిపి బుక్స్ కూడా కొన్నాను. ఆర్గానిక్ చిరుధాన్యాలన్నింటినీ అమ్మే షాపు వివరాలు కూడా తెలుసుకున్నాం. బేగం పేటలో ఉందట వాళ్ళ షాపు.





మరోవైపున చిరుధాన్యాలతో చెసిన జొన్న రొట్టెలు, రగి రొట్టెలు మొదలైన వంటకాలను అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా వంటకాలు తయారవుతున్నాయి. అవి సాయంత్రమే తింటానికి పెడతారుట. 



న్యూస్ పేపర్లో ప్రకటన అయితే వేసారు కానీ ప్రదర్శన సమయం రాయలేదు. మేము నిన్న మధ్యాహ్నం వెళ్ళాము. "స్టాల్స్ చూడండి కానీ అమ్మకాలు సాయంత్రమే" అన్నారు. మళ్ళీ పాతిక కిలోమీటర్లు రాలేము అని రిక్వెస్ట్ చేస్టే కొన్ని స్టాల్స్ లో పదార్థాలు కొనుక్కోనిచ్చారు. ఇటువంటి ఉపయోగకరమైన ప్రదర్శనలు నిర్వహించేప్పుడు  సరైన సమయం, ఎన్నాళ్ళు ఉండేది, ఇలాంటి ప్రదర్శనకు వెళ్ళటం వల్ల ఉపయోగాలు మొదలైనవాటి ప్రచారం సమంగా జరిపితే ప్రదర్శకుల శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహవంతంగా తమతమ ప్రయోగాలను గురించిన వివరాలు తెలియజేసారు.

ప్రదర్శన తాలుకూ ఫోటోలు:




murukus with jowar


like khakhras


recipe books

Monday, March 25, 2013

కోటేశ్వర్ మందిర్



ఆమధ్యన మా పాప స్కూల్ వాళ్ళు ఊళ్ళోనే ఒకచోటకి విహారయాత్రకి తీసుకువెళ్ళారు. 'ఏదో గుడి అమ్మా..చాలా బావుంది' అని చెప్పింది వచ్చాకా. నిన్న ఆ గుడి వెతుక్కుంటూ వెళ్ళాం. సికింద్రాబాద్ లో ఒక మిలటరీ ఏరియాలో కాస్త ఎత్తు మీద ఉంటుందా శివాలయం. పేరు "కోటేశ్వర్ మందిర్". ఆర్మీవాళ్ల పర్యవేక్షణలో ఎంతో శుభ్రంగా, అందంగా ఉంది ఆలయం. సువిశాలమైన ప్రదేశం, అటవీ ప్రాంతమట. మాకు కనబడలేదు కానీ అప్పుడప్పుడు నెమళ్ళు కూడా ఉంటాయట అక్కడ. 

శివలింగం ఉన్న గర్భగుడి వెనకాల వైపున ఒక గుహలో మంచు శివలింగం ఉంది. చాలా బావుంది. 'శివపురాణం'లో ఈ గుడి ప్రస్తావన ఉందిట. జనసందోహం లేని ఇలాంటి ఆలయాలకు వెళ్లతం నాకు చాలా ఇష్టం. ప్రకృతి ఒడిలో ఉన్న ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం మనసుకి ఎంతటి ఉత్తేజాన్ని,కొత్త శక్తినీ ఇస్తుందో! 


ఆ గుడి తాలూకూ చారిత్రాత్మక చరిత్ర  క్రింద ఫోటోలో చదవవచ్చు..



గుడి తాలూకూ మిగిలిన ఫోటోలు.. అక్కడెవరూ అభ్యంతరం పెట్టలేదు.. కొందరు ఫోటోలు తీసుకుంటుంటే నేనూ మొబైల్తో తీసాను...


ఆలయం మెట్ల పక్కన ఉన్న గణేశుడు


ఈ ఇత్తడి గంటలు, గుడి వెనకాల తళతలలాడేలా తోమి బోర్లించిన ఇత్తడి బకెట్టు, ఇత్తడి పూజ సామగ్రీ ముచ్చటగొలిపాయి.


ఆలయం లోపల ఉన్న ఈ గంటలు చాలా అందంగా ఉన్నాయి..


హనుమ..

గుడి వెనకాల ఉన్న గుహ

మంచు లింగం


గర్భగుడిలో శివలింగం

గుడి పైన ఉన్న శివుని విగ్రహం


గుడి వెనకాల ఒక గేటుకి కట్టి ఉన్న చిన్నచిన్న రేకుడబ్బాల్లో సన్నజాజి తీగలు వేసారు. అన్నింటిలో చిన్నచిన్న కొమ్మలకే మొగ్గలు వచ్చి సన్నజాజిపువ్వులు ఉన్నాయి. అసలే నా ఫేవొరేట్ పువ్వులాయే.. భలే సరదా వేసింది వాటిని చూస్తే! 



"ప్రేమించు పెళ్ళాడు" నుండి రెండు పాటలు





వంశీ తీసిన "ప్రేమించు పెళ్ళాడు(1985) " చిత్రంలో ఈ రెండు పాటలూ అత్యద్భుతంగా తోస్తాయి నాకు. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు. జానకి,బాలు ల గళాలు ఒక ఎత్తు, ఇళయరాజా సంగీతం ఒకఎత్తు అయితే, వేటూరి సాహిత్యాన్ని పొగడటానికి మాటలు కూడా దొరకవు అంటే ఒప్పుకోనివారుండరు. 

చివర్లో కాస్త గందరగోళం ఉన్నా సినిమా కూడా హీరోహీరోయిన్ల పెళ్ళి అయ్యేవారకూ సగం దాకా బావుంటుందని గుర్తు.. ఎప్పుడో చూడ్డమే ఈమధ్యన చూడలేదు. ఓసారి ఈ రెండు పాటలూ గుర్తుచేసేసుకుందామా...
 

1.) నిరంతరమూ వసంతములే..
చిత్రం : ప్రేమించు పెళ్ళాడు
సంగీతం: ఇళయరాజా
పాడినది : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
సాహిత్యం : వేటూరి
http://www.youtube.com/watch?v=ZT0_lTcb6gE

ఈ పాట ఇంటర్లూడ్స్ లో వాడిన వయోలిన్స్,సితార ఇళయరాజా మార్క్ తో చాలా మనోహరంగా ఉంటాయి. ముఖ్యంగా ఋతువుల స్వభావాలతో కూడిన వర్ణన చాలా చక్కని ప్రయోగం.

 

 సాహిత్యం:

ప: నిరంతరమూ వసంతములే మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే
నిరంతరము వసంతములే మందారములా మరందములే

1చ: హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణూ గానం
ఆకశానికవి తారలా ఆశకున్న విరి దారులా
ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటే
((నిరంతరము వసంతములే...))

2చ: అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపులేఖల్లు రాసి మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు గొలిచి పౌష్యమే వెళ్ళిపోయే..
మాఘ దాహలలోనా అందమే అత్తరాయే
మల్లె కొమ్మ చిరునవ్వులా...
మనసులోని మరుదివ్వెలా...
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే..
((నిరంతరము వసంతములే...))


2) వయ్యారి గోదారమ్మ..
సంగీతం: ఇళయరాజా 
పాడినది : ఎస్.పి.బాలు, ఎస్.జానకి 
సాహిత్యం : వేటూరి 


 ఈపాటలో బాలు నవ్వు ఓ అద్భుతం ! అలానే "కలవరం.. " "కల వరం"గా విరుపు వేటూరి వారికే సాధ్యం.

 



 సాహిత్యం :
ప: వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం..
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం.. 
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో..
కలవరింతే కౌగిలింతై..
వయ్యరి గోదారమ్మ..
 
1చ: నిజము నా స్వప్నం (హొ హొ..)
కలనో (హొ హొ) లేనో (హొ హొ హొ..  )
నీవు నా సత్యం (హొ హొ.. )
ఔనో (హొ హొ) కానో (హొ హొ హొ.. )
ఊహ నీవే.. (ఆహహహా) ఉసురు కారాదా (ఆఅహా.. )
మోహమల్లే.. (ఆహహహా) ముసురు కోరాదా (ఆఅహా..)
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ..
మువ్వగోపాలుని రాధిక..
ఆకాశ వీణ గీతాలలోనా..
ఆలాపనై నే కరిగిపోనా..
((వయ్యారి గోదారమ్మ..))

2చ: తాకితే తాపం (హొ హొ.. )
కమలం (హొ హొ) భ్రమరం (హొ హొ హొ..)
సోకితే మైకం అధరం (హొ హొ..) ఆధరం (హొ హొ హొ..)
ఆటవెలది.. (ఆహహహ) ఆడుతూరావే (ఆహా..)
తేటగీతి.. (ఆహహహ) తేలిపోనీవే.. (ఆహా..)
పున్నాగ కోవెల్లోనా పూజారి దోసిళ్ళన్నీ
యవ్వనాలకు కానుక
చుంబించుకుందాం బింబాధరాల
సుర్యోదయాలే పండేటివేళ..
((వయ్యారి గోదారమ్మ..))

Sunday, March 24, 2013

కొత్త పుస్తకాలు

(కొత్త పుస్తకాలకింకా ఫోటో తియ్యలే..ఇది పాత ఫోటోనే)


అప్పుడప్పుడు దాచుకున్న కాయితం ముక్కలతో పర్సు నిండగానే మనసు పుస్తకాల షాపు వైపు పరుగులు తీస్తుంది. గత ఏడాది మూడు దఫాలుగా కొన్న పుస్తకాలన్నీ చదవటం అవ్వనేలేదు.. మళ్ళీ కొనటం ఎందుకని కాస్త ఆగాను. పది పదిహేను రోజుల క్రితం ఒక కొత్త పుస్తకం గురించి విన్నాకా శ్రీవారికి ఫోన్ చేసి అడిగితే, పాపం ఆఫీసు నుండి రెండు ప్రముఖ షాపులకూ వెళ్ళి ఇంకా రాలేదన్నారని వచ్చేసారు. కాస్తాగి మళ్ళీ ఇవాళ చేస్తే నవోదయాలో ఉందని చెప్పారు. సరే పదమని శ్రీవారిని బయల్దేరదీసా. " ఆ పుస్తకమేదో మొన్ననే దొరికి ఉంటే బావుండేది... నువ్వు బయల్దేరితే..." అని పాపం భయపడ్డారు. "అబ్బే మీ జేబుకేం భయంలేదు.. నా పర్సు ఈమధ్యన కాస్త బరువెక్కిందిలెండి" అని అభయమిచ్చాను :)


ఎవరెంత దూరంలో ఉండాలో దేవుడంతే దూరంలో ఉంచుతాడుట. అందుకేనేమో పుస్తకాల షాపులకీ నాకూ మధ్యన  మైళ్ళు బాగా ఎక్కువైపోయాయి. అంచేత బండి పక్కనబెట్టి బస్సు మార్గాన్నేఎంచుకున్నాం. ఎర్రని ఎండలో రెండు బస్సులు మారి గమ్యం చేరాం. పుస్తక ప్రదర్శన తర్వత మీరు మళ్ళీ రాలేదేం అని ఆప్యాయంగా పలుకరించారు షాపులో ఆయన. "మొన్న మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించామని మేము బాగా ఫీలయ్యామండీ.." అంటూ మావారి చేతిలో నాక్కావాల్సిన పుస్తకాన్ని పెట్టారు ఆయన. "అక్కడివ్వండి.. ఈసారి ఆవిడదే బిల్లు.." అంటూ దొరికిందే ఛాన్సని మరో నాలుగు ఛలోక్తులు విసిరారు అయ్యగారు. "అబ్బే ఆవిడ ఖచ్చితంగా అలా అని ఉండరు.." అని షాపాయన నాకు సపోర్టందించారు. నేను తీసుకున్న పుస్తకాలు కాక మరో ఐదారు పుస్తకాలు బిల్లు జాబితాలో చేర్పించాకా "ఈ కథలు కూడా బావుంటాయి చూడండి.." అని మరో పుస్తకాన్ని అందించారు. వద్దు మహాప్రభో...ఇక చాలన్నాను. ఆయన వెంఠనే పుస్తకాన్ని తెరిచి ఓ కథ చూపెట్టి, "ఈ కథ చదవండి. నచ్చకపోతే పుస్తకం వెనక్కి తెచ్చి ఇచ్చేయండి. ఈ ఒక్క కథ కోసం ఈ పుస్తకం కొనచ్చు" అన్నారు. ఇహ అది కూడా కలిపి ఓ పదిపదిహేను పుస్తకాలు రెండు క్లాత్ కవర్లల్లో నింపుకుని, తృప్తిగా మిగతా పనులు ముగించుకుని ఇల్లు చేరేసరికీ రాత్రి భోజనసమయం దాటిపోయింది. 


ఇంటికొచ్చి గబగబా వంటచేసి, తిని, పిల్లని పడుకోబెట్టి, అన్ని పనులూ పూర్తి చేసుకునేసరికీ గడియారం ముల్లు ఇవాళ్టి తేదీ చూపించేసింది. కొత్తగా కొన్నపుస్తకాలు ఇంటికొచ్చాకా ఓసారి మళ్ళీ అన్నీ తిరగేసి, అన్నింటిపై కొన్నతేదీ వేసి, సంతకం పెట్టుకోవటం నాకు అలవాటు. రేపు ఆదివారమే కదా అందుకని లేటయినా తీరుబడిగా అన్నీ ఓసారి తిరగేసి, షాపాయన బాగుంటుందన్న కథ చదువుతూ లోకం మర్చిపోయినా, మధ్యలో ఓసారి తలెత్తి 'నాకు లేటవుతుంది.. మీరు నిద్రోండి..' అని చెప్పేసా! మనసు బరువైపోయినా వెంఠనే రెండవసారి మళ్ళీ చదివా! కథయ్యేసరికీ ఈ సమయమైంది. అసలు ఆ కథ గురించి రాద్దామని బ్లాగు తెరిచా.. కానీ ఈ కథంతా రాయాలనిపించి రాసేసా :) ఎందుకనో ఈసారి కొన్న పుస్తకాలన్నీ చాలా ఆనందాన్నీ, మంచి పుస్తకాలు కొన్నానన్న తృప్తినీ కలిగించాయి. వీటిల్లో ఎన్నింటి గురించి టపాలు రాయగలనో... చూడాలి మరి !


వచ్చేప్పుడు దారిలో నాన్న డాక్టరు దగ్గరకు వెళ్తే, పుస్తకాలు చూపించచ్చు అని అక్కడికి వెళ్ళా. నాన్న అన్నీ చూసి "బావున్నాయే.." అని "మరి చిరిగిన చొక్కా ఏదీ.." అన్నరు :-)

Friday, March 22, 2013

సెల్ ఫోన్ ప్రైవసీ ఎంత?





ఆ మధ్యన చల్లగాలికి బాల్కనీ లో నించుంటే పక్కనెక్కడ్నుంచో ఎవరివో ఆఫీసు కబుర్లు వినబడ్డాయి. ఇంట్లో నెట్వర్క్ లేదని బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఎవర్నో తిడుతున్నారు, ఎవరి గురించో ఫిర్యాదు చేస్తున్నారు.. ఆఫీసులో జరిగిన గొడవ ఎంతదాకా వెళ్ళిందో చెప్తున్నారు..! విసుగెత్తి లోపలికి వచ్చేసా. మరోసారి వంటింటి బాల్కనీలో బట్టలు ఆరేస్తుంటే.. క్రింద ఇంట్లో ఇల్లాలు సెల్ ఫోన్లో దగ్గటం, తుమ్మటం దగ్గరనుంచీ ఆ రోజు ఏ కూర వండిందో, ఏ కూరలో ఏ కారం, ఏ పొడి వెయ్యాలో విపులంగా వివరిస్తోందెవరికో! ఇక ఎదురు బిల్డింగ్(దగ్గరగా ఉంటుంది) లో ఓ బామ్మగారు ఎప్పుడూ బాల్కనిలోకి వచ్చే ఫోన్ మాట్టాడతారు వారి కూతురితో! కోడలి గురించీ, మనవల గురించీ, బంధువుల గురించీ..ఏవేవో చెబుతూంటారు. వద్దనుకున్నా వంటింట్లోకి వినబడిపోతాయా కబుర్లన్నీ! కారిడార్లోకి  ఏ ముగ్గు వేయటానికో, మొక్కలకి నీళ్ళు పొయ్యటానికో వచ్చామా.. రకరకాల గొంతులు.. వాళ్ల ఫోన్ కబుర్లు వినబడిపోతూనే ఉంటాయి. 


ఇక సిటి బస్సులో వెళ్తుంటే హింసే..! బస్సు చప్పుడులో ఎవరికీ వినబడదనుకుంటారో ఏమో కొందరు.. ఎవరూ వినకూడని కబుర్లు కూడా హాయిగా సెల్ఫోన్లో చెప్పేసుకుంటూంటారు. ముందు సీటులో వాళ్లకి వినబడుతుందేమో, పక్కన నించున్నవాళ్లకి వినబడుతుందేమో అన్న స్పృహే ఉండదు కొందరికి. కాలేజీ అబ్బాయిలు ఏ అమ్మాయిని ఎలా పడేసారో, ఏ అమ్మాయి ఎలా ఉంటుందో మొదలైన అందమైన కబుర్లు చెప్పుకుంటే, అమ్మాయిల టాపిక్కులు ఫిగర్ మైంటైనెన్స్, బ్యూటీ టిప్స్ ! ఉద్యోగస్తులు కొలీగ్స్ గురించి గాసిప్స్, వ్యాపారస్తులు తమతమ లావాదేవీలు... ఒకటేమిటి? సిటీబస్సులో వినబడినన్ని కబుర్లు టివీ వార్తల్లో కూడా వినలేం !! ఇక కొందరు సంగీతప్రియులు తమకిష్టమైన పాటలు బస్సులో అందరికీ వినబడేలా ఫుల్ స్పికర్లో పెట్టి మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు :(


ఇలా చెప్పుకుపోతే సెల్ ఫోన్ బాధకాల చిట్టాతో టపా కాదు ఒక పుస్తకం రాయచ్చు. చాలావరకూ సెల్ ఫోన్ల నెట్వర్క్ ఇళ్ళలోకి అందదు. మనమేమో ఊపిరి తోస్కోకుండా అయినా ఉండగలము కానీ సెల్ ఫోన్ లేకుండా అసలు ఉండలేమాయే! ఎవరి పరిమితులను బట్టి వారు హాయిగా సెల్ ఫోన్ వాడుకోవచ్చు.. కానీ ఇలా ఇంటి బయటకో, బాల్కనీలోకో వెళ్లి మాట్టాడితే అందరికీ వినబడుతుంది ఇంటిగుట్టు, ఆఫీసు గుట్టు రట్టే.. అని ఎవరికీ తోచదా? అన్నది నా ప్రశ్న. తప్పనిసరిగా ఎవరితోనైనా ఏదైనా మాట్టాడాల్సి వస్తే కాస్త నెమ్మదిగా మాట్టాడుకుంటే బావుంటుంది కదా! మేమైతే ఓ పధ్ధతి కనిపెట్టాం.. నెట్వర్క్ ఉండదని + సెల్ వాడకం మంచిది కాదని కూడా చెప్తున్నారని, ఇంట్లో వీలైనంత ల్యాండ్ లైన్ వాడుతున్నాం. ఆఫీసు ఫోన్ చేయాలంటే తను క్రింద సెల్లార్ లోకి వెళ్లి మాట్లాడి వస్తారు.


అందరి ఇళ్ళలో టెలీఫోన్ లేని రోజుల్లో ఎదురింట్లోకో, పక్కనే ఉన్న షాపు లోకో వెళ్ళాల్సివస్తే ఎంతో ఇబ్బందిగా ఉండేది. తర్వాతర్వాత అందరి ఇళ్ళలో ల్యాండ్ లైన్ ఫోన్లు వచ్చాయి. కాస్త ప్రైవసీ పెరిగింది. ఎవరింట్లో వాళ్ళు సుఖంగా మంతనాలు,చర్చలు చేసుకునేవారు. ఇప్పుడు సుఖాలు మరీ పెరిగిపోయి, టీనేజీ పిల్లలతో సహా మనిషి మనిషికీ సెల్ ఫోన్లు వచ్చాకా మనుషుల కమ్యూనికేషన్, కనక్టివిటీ బాగా పెరిగాయి. అది సంతోషకరమే. సెల్ ఫోన్ సొంతమే, ఫోన్ కాల్ వ్యక్తిగతమే, కానీ తాము పబ్లిక్లోనో, బాల్కనీల్లోనో మాట్లాడే సెల్ ఫోన్ల మాటలకి ప్రైవసీ లేదన్న సత్యాన్ని జనాలు గమనించగలిగితే బాగుంటుంది కదా !

Saturday, March 16, 2013

పనసచెట్టు - పనస పొట్టు




అనగనగా మా ఊరు. మా ఊరి పెరటితోటలో పెద్ద పనసచెట్టు. దాని నిండా ఎప్పుడూ గంపెడు పనసకాయలు ఉండేవి. పైన ఫోటోలో ఉన్నట్లు బుజ్జి బుజ్జి కాయలు కూర కు వాడేవారు. శెలవులయిపోయి బెజవాడ వెళ్పోయేప్పుడు మా సామానుతో పాటు ఓ గోనె బస్తా.. దాన్నిండా బుజ్జి బుజ్జి పనసకాయలు, ఓ పెద్ద పనసకాయ ఉండేవి. చిన్నవి కూర కాయలని ఇరుగుపొరుగులకి పంచేసి, పెద్ద కాయ మాత్రం అమ్మ కోసి తొనలు పంచేది.


మా చెట్టు పనసకాయలో అరవై డభ్భై దాకా తొనలు ఉండేవి. కొన్ని కాయల్లో వందా దాకా తొనలు ఉండేవి. మహా తియ్యగా ఉంటాయని అందరూ చెప్పుకునేవారు. అలా ఎందుకు అంటున్నానంటే నేనెప్పుడూ పనసకాయ తిని ఎరుగను ! నాకా వాసనే గిట్టదు..:( ముక్కు మూసేసుకుంటాను. మా అన్నయ్య నాతో ఒక్క పనస తొన అయినా తినిపించాలని పనసతొనలు పట్టుకుని నా వెనకాల తిరిగేవాడు.. ముక్కు మూసుకుని ఇల్లంతా పరిగెట్టించేదాన్ని తప్ప ఒక్కనాడు రుచి చూడలేదు. అందుకే అన్నారు "ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి.." అని గేలి చేసినా సరే! పనసకాయ కోసే దరిదాపులకి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు నా కూతురు వాళ్ల నాన్నతో కలిసి నన్ను ఆటపట్టిస్తూ పనసతొనలు తింటుంది. బజార్లో కూర కోసం పనసపొట్టు, పాప కోసం పనస తొనలు కొంటుంటే నాకు మా పెరట్లోని చెట్టు గుర్తుకు వస్తుంది.. ఎంత పెద్ద చెట్టో ఎన్ని కాయలు కాసేదో.. ! కాలజాలంలో ఇల్లు, పెరడు అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడిలా కొనుక్కుని తింటున్నాం కదా అని మనసు చివుక్కు మంటుంది..:( నువ్వు ఒక్క పనసచెట్టు గురించి ఇంతగా అనుకుంటున్నావా..? మాకు పనస తోట ఉండేది.. తెల్సా అన్నారు నాన్న!


 పనసతొనలు తినను కానీ పనస పొట్టు కూర మాత్రం చక్కగా చేస్తాను, తింటాను. ఇంతకీ ఇప్పుడు సంగతేంటంటే మా అన్నాయ్ మాంగారూ ఊర్నుండి కూర పనసకాయ తెచ్చిచ్చారు. వద్దనలేను కదా.. తెచ్చేసా ! 
కానీ ఎట్టా పొట్టు చెయ్యాలి? నా దగ్గర కత్తి లేదు కత్తిపీటా లేదు :(
"చాకుతో పనసపొట్టు తీసే మొహం నేనూను..:( " అనేస్కుని.. 
మొత్తానికి సక్సెస్ఫుల్ గా పొట్టు తీసి, ముక్కలు చేసి గ్రైండర్ లో వేసి పొట్టు చేసేసానోచ్ !!! 












తీరా పావు వంతు కాయ కొడితేనే బోలెడు పొట్టు వచ్చింది.. నే కూరకి కాస్త తీసి, మిగిలింది ఎవరికి దానం చెయ్యాలా అని ఆలోచన..?! ఎక్కడ తెలుగువాళ్ళే తక్కువ..పనసపొట్టు కావాలా అని ఎవర్ని అడుగుతాం?
ఇంకా ముప్పాతిక కాయ ఉంది ! అంచేత నే చెప్పొచ్చేదేమిటంటే, పనసపొట్టు ఎవరిక్కావాలో చెప్పండి బాబు చెప్పండి...


***    ***    ***

పనసపొట్టు కూర గురించి ఇక్కడ రాసా..  
http://ruchi-thetemptation.blogspot.in/2011/11/blog-post_23.html 





Thursday, March 14, 2013

నీ స్మృతిలో..




ఏమి రాస్తే సాంత్వన?
ఏమి చేస్తే సాంత్వన?

దిగులు పడితేనా?
వగపు వీడితేనా?

నిన్ను తలిస్తేనా?
నిన్ను మరిస్తేనా?

కన్నీరు చిందిస్తేనా?
చిరునవ్వు నవ్వితేనా?

నీ పుట్టినరోజు 'జయంతి'గా మరిందని దిగులుపడనా?
 జ్ఞాపకాల్లో సైతం నీవు 'సజీవమే'నని తృప్తిపడనా?

ఏమి రాస్తే సాంత్వన?
ఏమి చేస్తే సాంత్వన?


(ఆత్మీయమిత్రుడు, హితుడు, సహోదరుడు శంకర్ స్మృతిలో... ఈ నాలుగు వాక్యాలూ !! )


Sunday, March 10, 2013

??




ఎన్ని చికాకులు  ఎన్ని గందరగోళాలు
ఎన్ని దిగుళ్ళు  ఎన్ని నిట్టూర్పులో
బతుకుబండి నడవాలంటే
దాటాల్సినవెన్ని టుపోటులో !

ఎన్ని మాటలు  ఎన్ని మౌనాలు
ఎన్ని కూడికలు  ఎన్ని తీసివేతలో.. 
మంచితనపు చట్రంలో నిలవాలంటే
భరించాల్సినవెన్ని సమ్మెటపోటులో !!



Friday, March 8, 2013

ఆడవాళ్ళూ మీకు జోహార్లు(1981)





బాలచందర్ తీసిన "ఆడవాళ్ళూ మీకు జోహార్లు(1981)" ఓసారెప్పుడో టివీలో చూసాను. ఆసక్తికరంగా మొదలుపెట్టి ఉత్కంఠంతో చివరికి ఏమౌతుంది.. అని చివరిదాకా చూస్తే.. చివరికి తన సహజ ధోరణిలో మనసుని భారం చేసేస్తారు బాలచందర్ :( నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో బాలచందర్ ఒకరు. ఆయన తీసినవి దాదాపు అన్ని సినిమాలు చూసాను. ఈ క్లైమాక్స్ విషయంలోనే నాకు ఆయనతో పేచీ :) సినిమా అంతా చక్కగా తీసి క్లైమాక్స్ చెడగొట్టడమో లేదా దు:ఖ్ఖాంతం చెయ్యటమో బాలచందర్ కు ఉన్న మహా చెడ్డ అలవాటు.


ఈ సినిమా కథలో నాకు బాగా నచ్చినది దర్శకుడు స్త్రీ కి ఇచ్చిన విలువ. మగవాడి పతనం వెనుకే కాదు విజయం వెనుక కూడా స్త్రీ పాత్ర ఉంటుంది. రాక్షసుడు లాంటి మనిషిని కూడా ఉన్నతుడిలా తీర్చిదిద్దగల ఓర్పూ, నేర్పు స్త్రీకి ఉన్నాయి అని చెప్తుంది ఈ కథ. నర్సింహ మృగంలా మారటానికి కారణం అతని తల్లి. మళ్ళీ అతను మనిషిగా మారటానికీ, అతని జీవితాన్ని అనురాగంతో నింపటానికీ ఇద్దరు స్త్రీలు కారణం. ఈ సినిమా కూడా ఎంతో చక్కగా ఉంటుంది సగానికి పైగా. జయసుధ నటన నిజంగా ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో ఉన్న మిగతా నటిమణులంత గ్లామరస్ గా లేకపోయినా, సహజ నటిగా, చాలావరకు చీరకట్టులోనే కనిపిస్తూ, ఆనాటి నటీమణుల్లో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అది తాను ఎంచుకున్న పాత్రల ద్వారా నిరూపించుకుంది ఆమె. ఈ చిత్రంలో నర్సింహులు లాంటి కిరాతకుడ్ని ఉన్నతుడిగా తీర్చిదిద్దిన రాణి పాత్రకు జయసుధ ప్రాణం పోసిందని చెప్పాలి. నాకెంతో ఉన్నతంగా కనబడుతుందా పాత్ర. చదువురాని 'దబ్బపండు' పాత్ర కూడా ఎంతో ఉదాత్తంగా ఉంటుంది.


కృష్ణంరాజు సినిమాలు చాలా తక్కువ చూసానేమో.. ఇందులో అతని నటన నన్నాశ్చర్యపరిచింది. ఎంతో చిన్న చిన్న హావభావాలను కూడా సమర్థవంతంగా అభినయిస్తాడతను. కౄర స్వభావం లోంచి చదువుకున్న వివేకవంతుడిగా అతను పాత్రలో నటనలో తీసుకువచ్చిన మార్పులు మనల్ని మెప్పిస్తాయి. రాణి చెప్పే "ఆరడుగుల విగ్రహానికి ఆవగింజంతైనా నిగ్రహం లేదు", "నువ్విలా చూస్తే నే నీరుగారిపోతా" అన్న నర్సింహ డైలాగులు; సారాకొట్టు దబ్బపండు పాత్రలో వై.విజయ,  "క" భాష మాట్లాడే చలాకి పిల్లగా సరిత పాత్రలు కూడా గుర్తుండిపోతాయి.  

"ఎవరికి ఎవరూ సొంతం కాదు. ఇద్దరిదీ ఇచ్చిపుచ్చుకునే బేరం.. అంతే " అనే 'దబ్బపండు' పాత్ర వై.విజయకు లభించిన నటనకు ఆస్కారం ఉన్న అతి తక్కువ పాత్రల్లో  ఒకటి. ఇప్పటి మోడ్రన్ 'లివ్ఇన్ రిలేషన్ షిప్' ను నర్సింహులు-దబ్బపండుల సహజీవనం ద్వారా అప్పట్లోనే చూపెట్టాడు దర్శకుడు.


చివరి పదినిమిషాలు కథ మాత్రం చెత్తగా అయిపోయిందనిపిస్తుంది. రాణి పాత్రను చంపివెయ్యటం నాకస్సలు నచ్చలేదు. తగినంత కారణమూ కనిపించదు. మంటల్లో ఉన్న ఇద్దరు మనుషులని రక్షించిన డైరెక్టరు మరో మనిషిని కూడా రక్షించచ్చు కదా..అనవసరంగా చంపేసారు. ఆ రెండో ఆడమనిషితో హత్య చేయించేసి ఆమెనూ జైలు పాలు చేసేస్తారు డైరెక్టర్ గారు ! 

ఈ సినిమాను యూట్యుబ్ లో క్రింద లింక్ లో చూడవచ్చు:
http://www.youtube.com/watch?v=tUULiZT3AbI

ఇందులో ఒక పాట ఉంటుంది.. "ఆడవాళ్ళూ మీకు జోహార్లు " అని. నాకు చాలా నచ్చే పాటల్లో ఒకటి. ఆత్రేయ మాత్రమే రాయగలరు అలాంటి సాహిత్యం. పైన యూ ట్యూబ్ సినిమా లింక్లో "1:48:27" దగ్గర పాట మొదలౌతుంది. బాలు పాడిన అతి చక్కని పాటల్లో ఇది ఒకటన్నది నా అభిప్రాయం.


సాహిత్యం: ఆత్రేయ
సంగీతం : కె.వి.మహాదేవన్
పాడినది : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సాహిత్యం:

ఆడాళ్ళూ మీకు జోహార్లు 
ఓపిక ఒద్దిక మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళూ
((ఆడాళ్ళూ))

ఒకరు దబ్బపండు, ఒకరు పనసపండు
ఒకరిది కనబడే పచ్చదనం
ఒకరిది కానరాని తీయదనం((ఒకరు..))
ఇద్దరి మంచితనం నాకు ఇస్తుంది చల్లదనం
ఇది తలుచుకుంటే మతి పోతుందీ దినం
((ఆడాళ్ళూ))

రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం, మనిషి చేయడం
మనసు నిదరలేపడం, మమత నింపడం((గోరంత))
ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మర్చుకోవడం
ఇదే పనా మీకు..? ఊ..? ఇందుకే పుట్టారా?
((ఆడాళ్ళూ))


Wednesday, March 6, 2013

'రాజసులోచన' స్మృత్యర్థం..కొన్ని చక్కని పాటలు..



ప్రముఖ నటి, నాట్య కళాకారిణి "రాజసులోచన" నిన్న కన్నుమూసారు. మూడొందలకి పైగా దక్షిణాది భాషాచిత్రాల్లో నటించారు. ఆమె చిత్రాల్లోని ఎక్కువగా నృత్య ప్రధానమైన పాటలు ఉండేవి.  ఆమె నటించిన పాటల్లో కొన్ని చక్కని పాటలు.. ఆమె స్మృత్యర్థం..


1) "జయ జయ జయ శారదా "
మహాకవి కాళిదాసు 
http://www.youtube.com/watch?v=IZ5jKXmg_l8

 


2) నిను వర్ణించిన కవే కవి.. 
"మహాకవి కాళిదాసు" చిత్రం లోదే ఒక హాస్య ప్రధానమైన పాట..


 



"రాజమకుటం" చిత్రంలో వినసొంపైన నాలుగైదు పాటలు :

 3) ఊరేది పేరేది ఓ చందమామ 
http://www.youtube.com/watch?v=SzKHRJHlnrE  


4)"సడిసేయకే గాలి "
 రాజమకుటం
   


5)'రాజమకుటం' లోని " ఏడనున్నాడో ఎక్కడోన్నాడో"
ఇతర పాటలు క్రింద లింక్ లో వినవచ్చు 
http://www.sakhiyaa.com/raja-makutam-1960-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C-%E0%B0%AE%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B0%82/ 


6) "తియతియ్యని "
ఖైదీ కన్నయ్య 

  















7) "ఈ ముసిముసి నవ్వుల "
 ఇద్దరు మిత్రులు
 http://www.youtube.com/watch?v=EpCgBNdT_To 
 


8)కమ్ కమ్ కమ్.. 
శాంతి నివాసం  

















9) "మెరుపు మెరిసిందోయ్ మావా" 
చిట్టి తమ్ముడు

   


10) ఏస్కో నా రాజా" 
చిట్టి తమ్ముడు
    



11) "చెక్కిలి మీద చెయ్యి "
 మాంగల్య బలం

   


12) "పొద్దైనా తిరగకముందే"
      తోడికోడళ్ళు

  



13) "ఆశలు తీర్చవే ఓ జననీ "
శాంతినివాసం 
http://www.youtube.com/watch?v=3pEymqk93OE 




14) నిదురమ్మా 
బికారి రాముడు 
http://www.sakhiyaa.com/bikari-ramudu-1961-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/ 



15) "లేదుసుమా లేదుసుమా "
పెంకిపెళ్ళాం 
http://www.sakhiyaa.com/penkipellam-1956-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%BE%E0%B0%82/ 





" रीत पॆ यॆ पैरॊं की मोहरॆ ना छॊड्ना.."




నిన్ననూ GooglePlusలో హృతిక్ రోషన్ పాటల ముచ్చట్లు చెప్పుకుని, కాలేజీ రోజుల్ని తలుచుకుని ఆనందించాం :-) అలా నిన్నంతా హృతికానందంలో మునిగి తేలాకా రాత్రి రేడియో పెట్టుకుని వాకింగ్ చేస్తుంటే మళ్ళీ మంచి మంచి పాటలు వచ్చి ఎంత ఆనందపెట్టాయో చెప్పలేను. వింటున్నంత సేపు నవ్వుకుంటూనే ఉన్నా. ఆనందం పాటల వల్ల కన్నా వాటి వెనుక దాగున్న గతస్మృతుల పరిమళాల్లోది...! వచ్చినవాటిల్లో మూడు పాటలు మాత్రం గుర్తుండిపోయిన పాటలు. ఏం పాటలొచ్చాయో చెప్పనా మరి..

* రేడియో పెట్టేసరికీ "తన్హా తన్హా యహా పే జీనా.." వస్తోంది..
http://www.youtube.com/watch?v=5qauqHmVqG0
అప్పట్లో ఎంత పిచ్చి అందరికీ ఈ పాటంటే? ఒక్కసారిగా ఊర్మిళ దేశాన్నొక ఊపు ఊపేసింది కదా :)

* ఆ తర్వాత "దిల్ సే రే.." అని రెహ్మాన్ పిచ్చెక్కించేసాడు..
http://www.youtube.com/watch?v=YwfCMvo19s8

 "दिल तो आखिर दिल है ना..
मीठी सी मुश्किल है ना...पिया..पिया.." అని గుల్జార్ మాత్రమే రాయగలిగే సాహిత్యం మత్తులో ములిగితేలనివాళ్ళెవరు?


ఈ సిన్మా పాటలైతే నేను అసలు ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖే లేదు...పాఖీ పాఖీ పర్దేశీ, జియా జలే జా జలే, ఛైయ్యా ఛైయ్యా, సత్రంగీ రే... అన్నీ కూడా అద్భుతమైన పాటలే.

* ఆ తర్వాత ఇంకా ఏవో వచ్చాయి..

* చివరిగా మరో మంచి పాట నన్ను గతస్మృతుల్లో ఊయలలూగించింది. కాలేజీ రోజుల్లో చిత్రహార్ లో, టాప్ టెన్ సాంగ్స్ లో ముందుండేది ఈ పాట.. ఇది కూడా గుల్జార్ దే.. సిన్మా కూడా తనదే.. "హు తు తు"
గుర్తు వచ్చేసిందా పాట.. "ఛై చప్పా ఛై..ఛప్పాక్ ఛై.." !  చక్కని సాహిత్యంతో చాలా సరదాగా ఉంటుంది పాట. టాబూ hair style ఒక్కటే నాకు నచ్చదు ఈ పాటలో :)

"ढूंढा करॆंगॆ तुम्हॆ साहिलॊं पॆ हम
रीत पॆ यॆ पैरॊं की मोहरॆ ना छॊड्ना.." అన్న వాక్యాలు నాకు చాలా ఇష్టం..


singers : lata& hariharan
lyrics: gulzar
music: vishal bharadwaj






Friday, March 1, 2013

“ओ साथी रे..”



పురస్కారాలు అందుకోకపోయినా, కొన్ని పాటలు ఎంతో ఖ్యాతిని సంపాదించేసుకుని సంగీతప్రియుల పెదాలపై ఎప్పుడూ నాట్యం చేస్తూ ఉంటాయి. అటువంటి పాటల్లో ఒకటి “ముకద్దర్ కా సికందర్“(1978) సినిమాలోని “ओ साथी रे..” పాట. అమితాబ్ బచ్చన్ సినిమాల్లో “షోలే” తరువాత అత్యంత జనాదరణ పొందిన సినిమా ఇది. చిత్రంలో “సలామే ఇష్క్ మేరీ జా”, “దిల్ తో హై దిల్”, “రోతే హుయే ఆతే హై సబ్” మొదలైన మిగతా పాటలన్నీ బహుళజనాదరణ పొందినవే. ప్రేమనీ, ఆవేదననీ, ఆర్ద్రతనీ కలగలుపుకున్న “ओ साथी रे..” పాట మాత్రం ఆణిముత్యమనే చెప్పాలి. అమితాబ్ కి ఎన్నో హిట్ సాంగ్స్ ని రాసిన గీత రచయిత “అంజాన్” ఈ పాటని రాసారు. 

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గాయకుడు కిశోర్ కుమార్ పాడిన ఉత్తమ చిత్రగీతాల్లో ఈ పాట ఒకటి. సంగీతదర్శకద్వయం “కల్యాణ్ జీ-ఆనంద్ జీ” సంగీతాన్ని అందించిన “ओ साथी रे..” పాట ఇప్పటికీ ఎంతో మంది నోట వినిపిస్తునే ఉంటుంది అనటం అతిశయోక్తి కాదు. కొన్నేళ్ళుగా ఇదే పాట కొందరి నోటి వెంట పాటగా, ఈల గా కొన్ని వందలసార్లు వినీ వినీ విసుగొచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి :-)

మిగతా భాగం "వాకిలి" పత్రికలో...
http://vaakili.com/patrika/?p=1531





Monday, February 25, 2013

"అనువాదలహరి" లో



నా బ్లాగ్ రెగులర్ పాఠకుల కోసం:

కవిత్వం అంటే ".....spontaneous overflow of powerful feelings from emotions recollected in tranquility" అని Wordsworth అన్నట్లు ఏవన్నా  స్ట్రాంగ్ ఇమోషన్స్ కలిగినప్పుడు కవిత్వాన్ని రాస్తూంటారు కవులు ,కవయిత్రులూ. కానీ నేను అవలీలగా కవితలు రాయగలిగే కవయిత్రిని కానే కాదు. ఏవైనా అనుభూతులు గాఢంగా మనసుని కదిపినప్పుడు మాత్రమే నాలుగువాక్యాలు రాసుకుంటూంటాను. బ్లాగ్ నా సొంతం కాబట్టి అందులో నే రాసుకున్న వాటిని కూడా పొందుపరిచాను.

"అనువాదలహరి" బ్లాగ్ లో ఉత్తమమైన ఆంగ్ల కవితలను తెలుగులో అనువదిస్తుంటారు ఎన్.ఎస్.మూర్తి గారు.  సాహిత్యంలో తమకంటూ ప్రత్యేక స్థానాలు సంపాదించుకున్న ఎందరో కవులు, కవయిత్రుల రచనల మధ్యన నాకూ కాస్త చోటు ఇచ్చారు "అనువాదలహరి" బ్లాగర్ మూర్తి గారు.. 

http://teluguanuvaadaalu.wordpress.com/2013/02/24/sometimes-trishna-telugu-indian/

 ఆ సంతోషాన్ని నా బ్లాగ్ పాఠకులతో పంచుకుందామనే ఈ టపా.. ఇన్ఫర్మేషన్ కోసమే కాబట్టి కామెంట్ మోడ్ పెట్టడం లేదు.


Thursday, February 21, 2013

నిన్నిలానే చూస్తూ ఉన్నా..



క్రితం వారం ఓ సినిమాకెళ్ళినప్పుడు హాల్లో "జబర్ దస్త్"  ట్రైలర్ వేసాడు. రొమాంటిక్ కామెడి అనుకుంటా. "అలా మొదలైంది" సినిమా తీసిన నందిని రెడ్డి సినిమా. ట్రైలర్ చూస్తే సిన్మా ఎలా ఉంటుందో ఏమో.. అని అనుమానం కలిగింది కానీ ఈ పాట మాత్రం బావుంది. Fm వాళ్ళు సుప్రభాతంలా రోజూ వినిపించేస్తున్నారు. తినగ తినగ వేము.. అన్నట్లుగా పాట వినీ వినీ నాకు బాగా నచ్చేసింది..:) పాటలో హిందీ వాక్యాలు మాత్ర0 పెట్టకపొతే బావుండేది.  ఈ మధ్య ఏమిటో కొత్త పాతల్లో ఆంగ్ల పదాలు..వాక్యాలు, హిందీ పదాలు..వాక్యాలు ఎక్కువయిపోయాయి...:(


 "నిన్నిలానే చూస్తూ ఉన్నా, రోజిలాగే కలుసుకున్నా 
గుండెలో ఈ అలజడేంటో కొత్తగా.. 
ఊహలోనే తేలుతున్నా, ఊసులెన్నో చెప్పుకున్నా 
నాలో నేనే నవ్వుతున్నా వింతగా.. 
నిన్నిలా.. నిన్నిలా.. నిన్నిలా " 

S.S.Thaman సంగీతం. రాసినది 'శ్రేష్ఠ' ట. ఎక్కడో ఎప్పుడో విన్న పాటలా అనిపిస్తోంది. ప్రత్యేకత ఏంటంటే ఈ పాట నటి "నిత్యా మినన్" పాడింది. 'అలా మొదలైంది' సెంటిమెంట్ తో పాడించారేమో... అయినా ఆ అమ్మాయి బాగానే పాడుతుంది. పెక్యులియర్ వాయిస్. ఆ హస్కినెస్ లోనే అందం ఉంది.

.