సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, April 28, 2011

దమ్మున్న సినిమానే !


సినిమాకు ఓ హీరో, ఓ హీరోయిన్ తప్పక ఉండితీరాల్సిన అవసరం లేదు. ఓ కథనో , ఓ సమస్యనో, నచ్చిన కాన్సెప్ట్ నో తీసుకుని, దానిని తెరపై ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్రీకరించగలిగితే చాలు. అది మంచి సినిమా అనిపించుకుంటుంది. అలాంటి సినిమాల్లో ఉండేవి కొన్ని ముఖ్య పాత్రలు మాత్రమే. వాళ్ళు మామూలు హీరో హీరోయిన్లలా ఉత్తమ లక్షణాలు కలిగి ఉండరు. మామూలు మనుషుల్లానే కాస్తో కాస్త కంటే ఎక్కువో బలహీనతలు కలిగి ఉంటారు. అటువంటి పాత్రల ద్వారా దర్శకుడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని తెరపై చూపగలుగుతాడు. కాకపోతే ఇలాంటి సినిమాలు (హీరో, హీరోయిన్ లేకుండా) తియ్యటానికి కాస్తంత ధైర్యం కావాలి.

గోవా లో బలమైన పట్టు ఉన్న ఒక డ్రగ్ డీలింగ్ ముఠాను పోలీసులు ఎలా అంతం చేయగలిగారు అన్న కథను సరళంగా తెరకెక్కించారు "Dum maaro dum" దర్శకులు రోహన్ సిప్పీ. ఎటువంటి అంతుపట్టని మిస్టరీ లేకున్నా, ప్రేక్షకులకు భయాందోళనలు కలగకున్నా, పూర్తిగా ఉత్కంఠభరితంగా లేకున్నా కూడా సినిమా చూసినవాళ్లతో 'బాగుంది' అనిపించగలగటం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. తమ వంతు పాత్రల్ని సమర్ధవంతంగా పోషించగలిగిన ముఖ్య నటులకు కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. "ప్రీతమ్" అందించిన సంగీతం కూడా చిత్రవిజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఇతని బాణిలన్నీ బాగుంటాయి. ఈ చిత్రంలో సునిధీ చౌహాన్ పాడిన పాట చాలా నచ్చేసింది నాకు. "జానా హై", "జియే క్యూం" కూడా బాగున్నాయి.

ఇక చిత్ర కథలోకి వచ్చేస్తే గోవా లో ఒక డ్రగ్స్ ముఠా. అమాయకులైన "లోరీ"(ప్రతీక్ బబ్బర్) లాంటి కుర్రాళ్ళు వాళ్ళ వ్యాపారంలో పావులు. డిజె జాకీ(రానా దగ్గుపాటి) ప్రేమికురాలైన జోయ్ (బిపాషా బసు) కూడా ఆ డ్రగ్స్ ముఠా నాయకుడు బిస్కుట్(ఆదిత్య పాంచోలి) గూటిలో చిక్కుకుపోయి ప్రేమికుడికి దూరం అయిపోతుంది. ఏ.సి.పి.విష్ణు కామత్ కు ఆ ముఠాను పట్టుకునే పనిలో ఉంటాడు. ఈ ముఖ్య పాత్రధారులందరికీ కూడా తమ తమ బలహీనతలు ఉంటాయి. అందువల్ల చిక్కుల్లో పడతారు వారంతా. ఓ కుట్రలో భాగమై పోలీసుల చేతికి చిక్కిన లోరీ చివరికి నిర్దోషిగా నిరూపించబడతాడా? జాకీ తన ప్రేమికురాలైన జోయ్ ని మళ్ళీ కలుసుకోగలుగుతాడా? బిస్కుట్ ఆటలు అడ్డుకోవటంలో ఏ.సి.పి.విష్ణు కామత్ సఫలమౌతాడా? అన్నది మిగిలిన కథ. ఉత్కంఠత లేకుండా ప్రేక్షకుని ఊహానుగుణంగా సాఫీగా సాగిపోయే ఈ చిత్రకథను సస్పెన్స్ థ్రిల్లర్ అనలేము. అలాగని డ్రామా అనీ అనలేము. కానీ కథనం, చిత్రీకరణ రెండు సినిమాకు బలాన్ని అందించాయి. చివరిదాకా బోర్ ఫీలవకుండా చేసాయి.

లోరీగా ప్రతీక్ బబ్బర్ నటనలో ఏ లోటూ కనబడదు. తల్లి స్మితా పాటిల్ నటనా కౌశల్యం అతని ప్రతి ఫ్రేం లోనూ కనబడుతూ ఉంటుంది. కానీ ఇతను ఇక ఇలాంటి కేరెక్టర్ రోల్స్ వదిలేసి ఏదైనా సీరియస్ సింగిల్ రోల్ లో నటిస్తే బాగుంటుంది. లేకపోతే ఇలా కేరెక్టర్ ఆర్టిస్ట్ ముద్ర వేసి పక్కన పెట్టేయగలరు మన సినీ పెద్దలు. "హమేషా", "యస్ బాస్" మొదలైన చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ వేసి మెప్పించిన ఆదిత్య పంచోలి "బిస్కుట్" పాత్రలో కూడా తనదైన ముద్ర వేసాడు.





" Tu " అనే పాప్ సాంగ్ తో ఒకప్పుడు హంగామా సృష్టించిన మోడల్ బిపాషా ఇవాళ ఒక అగ్ర నటి. చాలామంది కుర్రాళ్ళ ఆరాధ్య దేవత. నా దృష్టిలో ఈమె అందం, అభినయం రెండూ ఉన్న మరొక అదృష్టవంతురాలు. ఈ సినిమాలో కూడా తన పాత్రకు పూర్తి న్యాయాన్ని అందించింది. బిపాషా కళ్ళు చాలా ఎక్స్ప్రేసివ్ గా ఉంటాయి.

ఈ మధ్యన చెప్పుకోదగ్గ హిట్స్ లేని అభిషేక్ కు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించింది. అంతకు ముందు రోహన్ తీసిన రెండు సినిమాల్లో కూడా అతని మిత్రుడైన అభిషేక్ బచ్చన్ నటించాడు. Om jai jagadish, Yuva, bluff master, Guru, Dhoom series, Paa, Delhi-6 మొదలైనవి నాకు నచ్చిన అభిషేక్ సినిమాలు. ముఖ్యంగా "గురు"లో అతని నటన నన్నెంతగానో ఆకట్టుకుంది. అంచలంచెలుగా పరిణితి చెందుతూ ఎదిగిన నటుడతను. పాత్రల్లో బాగా లీనమయ్యే గుణమున్న ఇతడు "Dum maaro dum" లో ఏ.సి.పి.విష్ణు కామత్ గా కనిపిస్తాడు. కానీ చివరిలో ఇతగాడిని ఎందుకు చంపేయాలి? పక్కవాడి మోసాన్ని కనిపెట్టి బ్రతికేసినట్లు చూపెట్టొచ్చు కదా అని నటుడిపైని అభిమానం ప్రశ్నించింది. "రానా" పాత్రను ఎలివేట్ చేయాలన్న ప్రయత్నమేమో మరి..!

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన తెలుగువాడైన రానా సంగతి. టిపికల్ తెలుగు హీరో లక్షణాలు ఏ మాత్రం కనబడని రానా ఈ హిందీ చిత్రంలో బాగా ఇమిడిపోయాడు. మొదటి సినిమాతోనే బిపాషాతో లింక్ కట్టేస్తు వచ్చిన వార్తలు ఇతని పవర్ఫుల్ ఇమేజ్ ను తెలుపుతాయి. ఎక్కువ పాత్ర లేకున్నా, ఇచ్చిన మేరకు సమర్ధవంతంగా మరిన్ని మంచి పాత్రలు లభిస్తే బాలీవుడ్ అతని మొదటి ఆస్థానంగా మారిపోవచ్చు. రాబోతున్న తెలుగు సినిమాతో అతని భవిష్యత్తుని మన ప్రేక్షకులు ఎలాగూ నిర్ణయిస్తారు..:)

చివరిగా సినిమాలో నాకస్సలు నచ్చని రిమిక్స్ పాట గురించి తప్పక చెప్పాలి. అసలూ...అసలూ...అసలూ...వాటి మానాన వాటిని వదిలేయ్యక పాత పాటల్ని రీమిక్స్ ఎందుకు చేస్తారు? తెలుగైనా, హిందీ అయినా రిమిక్స్ లంటే ఒరిజినల్స్ పాటలను ఖూనీ చెయ్యటమే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయం ఎవడిక్కావాలి? "దమ్మారో దమ్.." అంటూ జీనత్ చేసిన చిన్నపాటి ఊపుకి యావద్దేశం ఓ ఊపు ఊగింది. ఇప్పటికీ అంతే. కానీ ఈ కొత్త రీమిక్స్ ను చూస్తూంటే అసహ్యం కలిగింది. "జుగుప్స" అంటారే అలాంటి భావన కలిగింది. ఏదైనా శృతిమించితే కలిగేది వికారమే. అందం, అభినయం ఉన్నా కూడా సరైన సినిమాల్లేక తెరమరుగైన హీరోయిన్ల జాబితాలోకి వచ్చేస్తుందేమో ఇక దీపిక. "ఓం శాంతి ఓం" లో ఈమెను చూసి వహీదాలాగ ఉంది పైకొస్తుందేమో అని ఆశపడ్డాను.

సినిమా మధ్యలో ఓచోట లోర్నా పాటలనుకుంటా వినిపిస్తాయి. ప్రఖ్యాత గోవన్ గాయని "లోర్నా" వాయిస్ చాలా ప్రత్యేకంగా ఉండి తను పాడిన పాటలు చాలా బాగుంటాయి. టైటిల్ సాంగ్ లో ప్రచారం చేసినంత దమ్ము లేకపోయినా పట్టుసడలని కథనంతో, పాత్రధారుల ఉత్సాహవంతమైన నటనతో నా దృష్టిలో దమ్మున్న సినిమానే అనిపించుకుంది "Dum maaro dum". ఓసారి చూసేయచ్చు.