'చిత్రం భళారే విచిత్రం' అని పాడాలనిపించింది.....
అసలేం జరిగిందంటే, ఇవాళ టపా రాసే మూడ్ లేక రాయలేదు.so, కొన్నికావాల్సిన ఫోటోలు వెతుకుదాం అని శోధన మొదలెట్టా. బ్లాగ్లో పెట్టే ఫోటోలు రాయల్టీ ఫ్రీ అయితే ఇబ్బంది ఉండదు అని ప్రత్యేకం అలాంటివాటి కోసం వెతకటం నా పనుల్లో ఒక పని. అవసరమైనప్పుడే కాక దొరికినప్పుడే దొరికినన్ని దాచుకోవటం కూడా ఒక అలవాటు. అలానే ఇందాకా ఒక ఫోటో కోసం నెట్లో వెతుకుతున్నా. ఒక ఫోటో లోంచి మరో ఫోటో లోకి వెళ్ళా, అక్కడ్నుంచి ఆ ఫోటో నన్నొక పికాసా వెబ్ ఆల్బమ్ లోకి తీసుకువెళ్ళింది. ఆ ఆల్బం తాలూకూ మనిషి ఇండియనో కాదో తెలీదు. పేరు కూడా హిందూవులా లేదు. అక్కడ కొన్ని పబ్లిక్ ఆల్బమ్స్ ఉన్నాయి. పబ్లిగ్గా పెట్టిన ఆల్బమ్స్ అన్నీ కొన్ని దేవాలయాలవి(ఇండియాలోవి కాదు),
చారిత్రాత్మక ప్రదేశాలవీ. ఎంతో శ్రధ్ధతో డీటైల్డ్ గా తీసినట్లు తెలుస్తున్నాయి. కొన్ని ఇతర దేశాలవీ ఉన్నాయి. అద్భుతమైన ఫోటోలు.
నాకసలే హిస్టరీ అంటే చాలా ఇష్టం. చారిత్రాత్మక కట్టడాలన్న, పూర్వీకుల, తరతరాల రాజుల తాలూకూ చరిత్రలు అన్నా మహా ఇష్టం. (డిగ్రీలో అన్నింటికన్నా హిస్టరీలోనే బోలెడు ఎక్కువ మార్కులు వచ్చాయి). మహానందపడిపోతూ ఫోటోలనీ చూసేసాను. ఇక ఆ ఆల్బమ్స్ లో ఒక ఆసక్తికరమైన ఆల్బం కనిపించింది. బహుశా అవి ఒక ఆధ్యాత్మిక మ్యూజియం తలూకూ ఫోటోలై ఉంటాయి అనిపించింది. మానవజాతి ఎలా ఆరంభమైంది, ఎలా పరిణితి చెందింది మొదలుకుని యోగా, కుండలిని, సైన్స్ కు సంబంధించిన చిత్రాలు రకరకాలు ఉన్నాయి. మధ్యలో అది ఏ భాషో తెలియదు కానీ నోట్స్ తాలూకూ పేజీలకు తీసిన కూడా ఉన్నాయి.
నాకా మనిషికి ఉన్న వైవిధ్యమైన ఆసక్తులు పట్ల మక్కువ కలిగింది. ఒక ప్రదేశం తలూకూ ఫోటోలు బాగున్నాయని ఆ పేరు పట్టుకెళ్ళి గూగుల్లో పెట్టా ఏ ప్రదేశమో తెలుసుకోవాలని. అది శ్రీలంక లోని ఒక చారిత్రాత్మక ప్రదేశం అని వచ్చింది. ఇక ఆ పేరు తాలుకు ’వికీ’లోకి వెళ్ళి వివరలు చదివా. ఆ తరువాత ఆ వ్యక్తి వివరాలు దొరికాయి. అతనొక జియోఫిజిసిస్ట్, రచయిత కూడా అని ఉంది. అదీ కధ. అక్కడితో నా పరిశోధన పూర్తి అయ్యింది. ఈ వెతుకులాటలో ఒక మంచి ఇంగ్లీషు బ్లాగు కూడా తగిలింది. ఏమి నా భాగ్యము అనుకున్నా.
ఒకోసారి అనుకోకుండా జరిగే చిన్న చిన్న సంఘటనలు ఏంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. తెలియని కొత్త విషయాలను తెలుసుకున్నప్పుడు, మనకు ఇష్టమైన సంగతులు మరొకచోట కనబడినప్పుడు కలిగే సంతోషాన్ని భావాలను మాటల్లో చెప్పటం కష్టం.