సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, June 30, 2009

మొదటి సంపాదన


పార్ట్ టైం సంపాదనైనా,జీవితంలో మొదటి సంపాదన విలువ అపారం.ప్రపంచంలో సంతోషం అంతా మనదైనట్లు,అమౌంట్ తక్కువైనా ఓ లక్ష సంపాదించిన ఫీలింగ్.కాలేజీ రోజుల్లో చేతి ఖర్చులకి అమ్మనాన్నలని అడగకుండా కావాలనిపించినవి కొనుక్కోగలగటం మాటల్లో చెప్పలేని అనుభూతి.ఇంతకీ ఆ చిల్లర అవసరాలు ఏమిటీ అంటే--లెటర్ పాడ్స్,పెన్నులు,పుస్తకాలు,క్యాసెట్టులు,పైంటింగ్కి కలర్స్ గట్ర గట్ర..!ఇంతకీ నాకు దొరికిన చిరు సంపాదన ఏమిటి అంటే..విజయవాడ రేడియోస్టేషన్లో "యువవాణి" అని యువజనుల కార్యక్రమం ఉండేది.ఆ కార్యక్రమంలో 'రసవాహిని 'అనే శీర్షికలో ప్రోగ్రాం కి కాంట్రాక్ట్లు.ఏదొ ఒక విషయం మీద వ్యాఖ్యానం చెబుతూ ఆ విషయానికి సంబంధించిన పాటలు వెయ్యటం.అది కాకుండా హిందీ కవితలు రాసి వాటిని యువవాణిలో చదివే అవకాశం కూడా వచ్చింది.ఈ రెందు రకాల కాంట్రాక్టుల ద్వారా కాలేజీ రోజుల్లో కాస్తొ కూస్తో చిన్న సంపాదన ఉండేది.నాన్నగారికి పరిచయం ఉన్న ఆడియో ఏడ్ మేకెర్ ఒకాయన హిందీలో కొన్ని ఏడ్స్ నాతో చదివించుకునేవారు.అలా హిందీ ఏడ్స్ కి వాయిస్ ఇవ్వటం ద్వారా కొంత సంపాదన ఉండేది. ఆ సంపాదనంతా దాచుకుని ఒక "ఫిలిప్స్ టేప్ రికార్డర్" కొనుక్కున్నాను.నా అనందానికి అవధులు లేవు!!ఇంట్లో ఉంటే నా రికార్డర్ మోగుతూనే ఉండేది.ఎక్కువ వినద్దు పాడైపోతుంది అని ఇంక ఎవరూ అనేవారు కాదు.ఇప్పటికి నా టేప్ రికార్డర్ నాతొ భద్రంగా ఉంది.


విజయవాడలో "బుక్ ఫెస్టివల్" ఒకటి అప్పట్లో మొదలైంది.ఇప్పుడు అది మొదలెట్టి 17సంవత్సరాలైంది.మొదటి 12,13 సంవత్సరాలూ వదలకుండా వెళ్లాను.జనవరి మొదటివారంలో 10రోజులు జరుగుతుంది అది.వీలైనన్ని రోజులు వెళ్ళేదాన్ని."ఇంట్ళొ ఉన్న వందల పుస్తకాలు కాకుండా ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా పుస్తకాలు కొనేస్తున్నారు.ఇప్పుడు మీ కూతురు కూడా తయారైంది.సర్దలేక చస్తున్నా.."అని మా అమ్మ విసుక్కుంటూ ఉండేది.పిజీ అయ్యాకా రేడియోలో హిందీ పాఠాలు కండక్ట్ చేసే కాంట్రాక్టులు కొన్ని వచ్చాయి.సంపాదన కాస్త పెరగటంతొ బుక్ ఫెస్టివల్లొ పుస్తకాలు,ఆడియో క్యాసెట్లు కొనటం అలమారు నింపటం.ఇదే పని!

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే విద్యార్ధి దశలో మన అవసరాలకి మనం సంపాదించుకోవటంలో ఉన్న తృప్తి,ఆనందం అనుభవించే మనసులకే అర్ధం అవుతాయి!!