మేనెల చివరకి నాలుగేళ్లవుతాయి బ్లాగ్ మొదలుపెట్టి. నా జీవితంలో దాదాపు నాలుగేళ్ళ కాలాన్ని తన సంచీలో వేసేసుకుందీ బ్లాగ్లోకం :)
నాలుగేళ్ల ముందు దాకా నా జీవితం ఒక ఎత్తు. ఇక్కడ అడుగుపెట్టాకా మారిన జీవితం ఒక ఎత్తు !
ఈ నలభై ఆరు నెలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి నా జీవితంలో... ఆరోగ్యంలో.. మనస్తత్వంలో... !!
ఏదెలా జరిగినా, నేను ఎప్పుడూ - ఎప్పటికీ నమ్మేది ఒక్కటే... "ఏది జరిగినా మన మంచికే" అని.
ఈ బ్లాగ్జీవనయానంలో, జీవితపు ఒడిదొడుకుల మధ్యన నాకు ఆటవిడుపుని అందించిన ప్రత్యేక నేస్తం నా "తృష్ణ". నాలో జరుగుతూ వచ్చిన మార్పులకి ఒక స్పెక్టేటర్ అన్నమాట.
"ఈ బ్లాగ్ నా సొంతం. నాకు తోచిన రాతలు రాసుకుంటాను.." అని ఆనందించినంత సేపు పట్టలేదు ఇక్కడ కూడా జీవితంలో మాదిరి ఎంత చీకటి దాగుందో తెలియటానికి. బ్లాగ్లోకంలో ఆనందించిన క్షణాల కన్నా నేర్చుకున్న పాఠాలే ఎక్కువ. ఇక్కడందరు మంచివాళ్ళే! కానీ మంచివాళ్ళు ఇన్నిరకాలుగా ఉంటారని ఇక్కడే తెలిసింది !
ఏదేమైనా నా లోకం నాది. నా లోకంలోకి తొంగి చూసే అవకాశాన్ని మాత్రం నా బ్లాగ్ ద్వారా ఇస్తున్నాను. నచ్చితే చదవండి. లేకపోతే ముందుకి సాగిపొండి. ఈ టపాతో "తృష్ణ" బ్లాగ్లో 500 టపాలు పూర్తవుతాయి! ఎవరికైనా సమయం ఎంతో విలువైనది. నా సమయాన్ని వెచ్చించి రాసిన ఈ టపాలన్నీ మీ విలువైన సమయాన్ని వెచ్చించి చదివి, నన్ను ప్రోత్సహించిన బ్లాగ్మిత్రులకూ, శ్రేయోభిలాషులకూ హృదయపూర్వక ధన్యవాదాలు.