చూడచక్కని రూపం, నుదుటన శ్రీ చూర్ణంతో కనబడే ఆమె మృదుభాషిణి. చరగని చిరునవ్వు ఆవిడ సొంతం. ఆవిడే నాటి సంగీత విద్వాంసురాలు, 'మధుర గాయకి' బిరుదాంకితురాలు శ్రీరంగం గోపాలరత్నం గారు. ఒక తెలుగు శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా శ్రీరంగం గోపాలరత్నం గారు గుర్తుంచుకోదగ్గ గాయనీమణి. విజయవాడ స్టాఫార్టిస్ట్ గా పనిచేసి, తరువాత హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశల ప్రధానోపాధ్యాయినిగా, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా, టిటీడి ఆస్థానవిద్వాంసురాలిగా కూడా నియమితులయ్యారు. 'పద్మశ్రీ' గౌరవాన్ని పొందిన గోపాలరత్నంగారు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగానే కాక లలిత సంగీత గాయనిగా కూడా అమె ఎంతో ప్రఖ్యాతి పొందారు. ఆమె గాత్రంలో వైవిధ్యంగా పలికే గమకాలు, పలికేప్పుడు భావానుగుణంగా ప్రత్యేకత సంతరించుకునే పదాలు అమె ప్రత్యేకతలు. శ్రీరంగం గారిది తంజావూరు బాణీ అని అంటూంటారు.
పలు సంగీత నాటికల్లో కూడా ఆమె నటించారు. సతీసక్కుబాయి నాటికలో సక్కుబాయి, మీరా నాటకంలో మీరా పాత్రలు ఆమెకు పేరు తెచ్చాయి. మీరా నాటకంలో శ్రీకాంతశర్మగరు రాసిన అన్ని మీరా పాటలు గోపాలరత్నం గారే పాడారు. "ఎవరు నాకు లేరు", "గిరిధర గొపాలుడు కాకెవరు", సఖియా నిదురన్నది లేదు" మొదలైనవి చాలా బావుంటాయి. బాలమురళిగారి రచన "కనిపించు నా గతము", ఆయనతో కలిసి పాడిన రజని గారి "మన ప్రేమ", కృష్ణశాస్త్రి గారి ""శివ శివయనరాదా", "గట్టుకాడ ఎవరో, సెట్టు నీడ ఎవరో" మొదలైన పాటలు ఎంతో ప్రశంసలు పొందాయి. మంచాల జగన్నాధరావుగారు ట్యూన్ చేసిన (ఆకాశవాణిలో ఉన్న) గోపాలరత్నం గారు బాలమురళి గారితో యుగళంగా కొన్ని, కొన్ని విడిగానూ(సోలోస్) కమ్మగా పాడిన "ఎంకి పాటలు" నాకైతే చాలా ఇష్టం. ముఖ్యంగా గోపాలరత్నం గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆసక్తి ఉన్నవారు క్రింద లింక్లో వాటిని ఇడౌలోడ్ చేసుకోవచ్చు:http://www.yadlapati.com/sri-thallapaka-annamacharya-kirthans-by-srirangam-gopala-ratnam-devotional-mp3-songs/
పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారి "అనుభవ దీపం" రూపకానికి శ్రీకాంతశర్మ గారు "ఇంత వింత వెలుగంతా సుంత నాకు మిగెలేనా" అని ఒక పాట రాసారు. ఆవిడ పాటల్లో నాకు బాగా నచ్చే "తిరునాళ్ళకు తరలొచ్చే"పాటను మొన్న టపాలో పెట్టాను కదా, గోపాలరత్నంగారు మధురంగా మోహన రాగంలో పాడిన "ఎవ్వడెరుగును నీ ఎత్తులు" అన్న అన్నమాచార్య కీర్తన క్రింద లింక్లో వినవచ్చు: