చిన్నప్పుడు అమ్మ పూజ చేస్తూ సంకల్పం చెప్పేప్పుడు "భరత వర్షే, భరత ఖండే.....దక్షిణా దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే..." అంటూ చెప్పేప్పటి నుండీ శ్రీశైలం అంటే ఓ గొప్ప ప్రదేశం అని భావన. అన్ని పూజలకూ, వ్రతాలకూ ముందర చెప్పుకునే సంకల్పంలో శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు పేరు చెప్పి సంకల్పం చెప్పుకుంటాం. బోలెడు పుణ్య క్షేత్రాలుండగా శ్రీశైలాన్నే ఎందుకు సంకల్పంలో చెప్పుకుంటామని నాకు సందేహం ఉండేది. భూమండలానికి శ్రీశైలక్షేత్రం నాభీప్రాంతం అని పురాణాలు చెబుతాయని అందువల్ల సంకల్పంలో ఆ విధంగా చెప్పుకుంటాం అనీ అక్కడ నేను కొన్న "శ్రీశైల చరిత్ర"(స్థలపురాణం)లో రాసాడు. స్థల ప్రాశస్త్యం గల పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నప్పుడు ఆ స్థల పురాణం పై ఆయా ప్రదేశాల్లో ఏవైనా పుస్తకాలు దొరికితే కొనటం నాకు ఇష్టమైన ఆసక్తుల్లో ఒకటి.
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీశైల శిఖర దర్శనమే ఎంతో పుణ్యాన్ని మనదరికి చేరుస్తుందని అంటారు. ఇక శ్రీశైల మల్లికార్జునుని దర్శన భాగ్యం చేసుకుంటే మహా పుణ్యం లభిస్తుందట. స్థల ప్రాశస్త్యం గల పుణ్య క్షేత్రాలను వీలయినన్నింటిని దర్శించుకోవాలని నాకు చాలా కోరిక. రెండేళ్ళ నుండీ శ్రీశైలం వెళ్ళాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయాణం వాయిదా పడుతూనే వచ్చింది. ఇంకా శివుడి ఆజ్ఞ రాలేదేమో అనుకుంటూఉన్నాం మేము. మొన్న శుక్రవారం అప్పటికప్పుడు అనుకుని శ్రీశైలం బయల్దేరాం. వర్షాకాలం, చలికాలం దాటిపోయాయి ఇక ఈ ఎండల్లో కుదిరిందేమిటో అనుకున్నా. ఎండల్లో పాపని ఇబ్బంది పెట్టకూడదని పాపను అమ్మదగ్గర దించి బయల్దేరాం. రిజర్వేషన్ లేకపోయినా ఏదో ఒక బస్సు దొరుకుతుందని నమ్మకం. పెళ్ళయిన కొత్తల్లో తిరుపతి అలానే వెళ్ళాం. నెల ముందు చేసిన రిజర్వేషన్ కన్ఫార్మ్ అవ్వలేదు. అయినా రైలెక్కేసాం బొంబాయి నుంచి. వెంకన్నబాబు దయతో అంత పెద్ద ప్రయాణం సాఫీగా జరిగిపోయింది. ఇప్పటికీ ఆశ్చర్యమే ఆ ప్రయాణం.
అలానే ఈ ప్రయాణం కూడా ఆశ్చర్యంగా జరిగింది. బస్టాండ్ లో చూస్తే ఏ బస్సులోనూ సీటూ లేదు. శెలవులని జనం ఎక్కువ ఉన్నారుట. మాకోసమే అన్నట్లు(ఇలాగని మాతో ఉన్నవాళ్లందరూ అనుకున్నారు) స్పెషల్ బస్సొకటి అప్పటికప్పుడు వేస్తున్నారని తెలిసింది. మరో గంటలో బస్సులో ఉన్నాం. తిరుగు ప్రయాణానికి కూడా ఇలానే టికెట్టు దొరుకుతుందిలే అన్నారు శ్రీవారు. పొద్దున్నే నల్లమల అడవిదారిలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. కదులుతున్న బస్సులోంచే బోలెడు ఫోటోలు తీసేసా. వాతావరణం కూడా చల్లగా ఉంది. దిగాకా పొద్దున్నే దర్శనానికి బయల్దేరాం. మూడు గంటలు పట్టచ్చు రద్దీ ఉంది అన్నారు బయట కనుక్కుంటే. దర్శనానికి వెళ్తుంటే శివపార్వతులు, కుమారస్వామి, వినాయకుడు ఉన్న ఒక మంచి పటం దొరికితే కొన్నాం ఇంట్లో దేవుడిమందిరంలో పెట్టుకోవటానికని. ఎప్పుడో మొక్కుకున్నానని, అమ్మవారికి రాయించమని అమ్మ ఇచ్చిన పట్టుచీర, ఈ పటము తీసుకుని క్యూలో నించున్నాం. అరగంటలో దర్శనం అయ్యింది. మామూలుగా శివలింగాన్నిముట్టుకుని అభిషేకం చేస్కోనిస్తారుట ఇక్కడ. కాశీలోనూ అలానే చేసుకున్నాం మేము. కానీ జనం ఉన్నప్పుడు కాస్త దూరం నుంచే పంపేస్తారుట. లోపలికి వెళ్ళలేకపోయినా మేం కొన్న పటం దేవుడి దగ్గర పెట్టివ్వమని అడిగాము. శివలింగాన్ని తాకించి, అభిషేకం చేసిన నీరు చల్లి, పూజ చేసిన బిల్వ పత్రాలు కూడా వేసి పటం మా చేతికిచ్చారు పూజారిగారు. సంతోషదర్శనం అయ్యింది.
అక్కడ్నుంచి అమ్మవారి దర్శనానికి దారి. అక్కడ కూడా అరగంటే పట్టింది. అక్కడ కూడా ఈ పటాన్ని ఇచ్చాము. పూజారిగారు చక్కగా పూజా కుంకుమ ,పువ్వులు పటం పైన వేసి ఇచ్చారు. అమ్మ ఇచ్చిన పట్టుచీర ఇస్తే, మమ్మల్ని ఆగమని అమ్మవారి దగ్గర అది పెట్టి, హారతి ఇచ్చారు. శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబికాదేవి దర్శనమే ఆనందదాయకంగా ఉండగా ఈ కుంకుమ, హారతులు మాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చాయి. కాశీ విశాలాక్షి గుడిలో కూడా ఇలానే అనుకోకుండా నాకు కుంకుమ, గాజులు కూడా ఇచ్చారు పూజారిగారు. చిన్న విషయాలైనప్పటికీ ఇలాంటివి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అలా ఓ గంటలో దర్శనం అయిపోయింది. గుడి బయటకు వచ్చేప్పుడు దర్శనం క్యూ చాలా పెరిగిపోయి ఉండటాన్ని గమనించాం. పూజరి చెప్పినట్లుగా పట్టుచీరను ఆఫీసులో అందించాము. రసీదు ఇచ్చి ఏరోజు అమ్మవారికి కడతారో చెప్పారు వాళ్ళు.
గుడి లోపల అనుమతిలేదు కానీ బయట కాసిని ఫోటోలు తీసుకున్నా. చాలా చోట్ల రాళ్ళపై చెక్కిన ఏవేవో శాసనాలు ఉన్నాయి. వాటిపై ఉన్న భాష అర్ధం అయితే ఎన్ని చారిత్రక విషయాలు తెలుస్తాయో కదా అనిపించింది. గుడి చుట్టు తిరగటం వల్ల ఎండలో కాళ్ళు సుభ్భరంగా కాలిపోయాయి. అంతలా ఎప్పుడూ పాదాలు కాలలేదు నాకు. ఆ ఎండలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఒక చిన్న పిల్లాడికి గాంధీ వేషం వేసి, వెండి రంగు పూసి గుడి గేట్లో నిలబెట్టారు. చాలా దు:ఖం వచ్చింది వాడిని చూస్తే. ఓ ఐస్క్రీం కొని వాడిని ఓ చోట కూచోపెట్టి తినిపించాను. అంతకంటే ఏమీ చెయ్యలేక ! ఇక క్యూ మైన్టైనెన్స్ మాత్రం మాకు చాలా అసంతృప్తిని కలిగించింది. ఒకరి వెనుక ఒకరిని కాక, ఉన్న సన్నటి దారిలోనే జనాల్ని వదిలేస్తున్నారు. జనాలక్కూడా తొందరే. ఆ తోపులాటలు చికాకు తెప్పించాయి. సరైన పధ్ధతిలో క్యూ కట్టించవచ్చు కదా అధికారులు అనిపించింది. మరి తిరుపతి మాటేమిటీ అనకండి. అది మరీ ఘోరం. ఏదో ఒక పూజకి టికెట్టు కొంటే తప్ప మామూలుగా దర్శనానికి వెళ్ళలేం.
ఎందుకు పెట్టారో కానీ ఇక్కడ కులాలవారీగా సత్రాలు, ఉచిత భోజన సదుపాయాలు ఉన్నాయి.(ఎక్కడా ఇన్ని రకాల కులసత్రాలు చూడలేదు నేను) ఏదేమైనా వారు అందించే సదుపాయాలకు గానూ ఆయా సత్రాల నిర్వాహకులను మెచ్చుకోవాల్సిందే. భోజనం చేసి చుట్టుపక్కల ప్రదేశాలు చూద్దామని ఆశగా బయల్దేరాం. అసలు నాకు అడవి ప్రదేశాలు చూడాలని చాలా ఆసక్తి. స్థల పురాణంలో కొన్ని ప్రాంతాల గురించి చదివి ఎప్పుడెప్పుడని చాలా ఉత్సాహపడుతూ ఓ జీప్ మాట్లాడుకుంటూంటే రాత్రి బస్సుకు టికేట్లు లేవన్నాడు ఒకాయన. "రాత్రేమిటి రేపు రాత్రికి కూడా లేవుట" అన్నారు ఇంకొకరు. ఇక బలవంతాన సైట్ సీయింగ్ ప్రోగ్రాం కాన్సిల్ చేసేస్కుని బస్టాండ్ చేరాం ఆదుర్దాగా. నాలుగింటి బస్సులో టికెట్లు ఉన్నాయి. ఎల్లుండి పొద్దున్న దాకా ఇక లేవు టికెట్లు అన్నారు కౌంటర్లో. రాకరాకవచ్చి అప్పుడే వెళ్పోవటమా అని నేను ఏడుపుమొహం వేసాను. "రెండేళ్ళ నుంచీ రావాలనుకుంటే రాగలిగామా? ఇప్పుడు దర్శనం బాగా అయ్యింది కదా? రెండురోజులు ఉండిపోవటం అవ్వదు. పనులున్నాయి. పాపను తీసుకుని చల్లబడ్డాకా మళ్ళీ ఉండేలా వద్దాం" అని శ్రీవారు సముదాయించారు. ఏమనుకున్నా తప్పేది లేదని రూం ఖాళీ చేసి ఇక బయల్దేరి పోయాం.
ఎండంతా మన పరమే అని భయపడుతుంటే అప్పటికప్పుడు మబ్బుపట్టి వాతావరణం చల్లగా మారిపోయింది. కాస్త చినుకు కూడా పడింది. వర్షాకాలంలో వెళ్తున్నట్లే అనిపించింది. చీకటి పడేదాకా మళ్ళీ బస్సులోంచి ఫోటోలు తీస్తూ, మధ్య మధ్య తెచ్చుకున్న పుస్తకం చదివేస్తూ తిరుగుప్రయాణం ఎంజాయ్ చేసేసా. శ్రీశైలం డామ్ ఏరియా, పాతాళగంగ(కృష్ణానదే) మాత్రం భలే ఉంది. ఆ ఫోటోలు బాగా వచ్చాయి. ఏమీ చూడడానికి వీలవ్వకపోయినా ఇలా బస్సులోంచి ఫోటోలయినా బాగా తీసుకోగలిగినందుకు సంతోషం కలిగింది. రెండు రోజులు ప్లాన్ చేసుకుని ఉండిరావాల్సిన ప్రయాణం ఇది.
ఊరు చేరుతూంటే "दानॆ दानॆ पॆ लिखा है खानॆवालॆ का नाम", "ఏది ఎప్పుడు ఎలా జారగాలో అలానే జరుగుతుంది", "ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది" మొదలైన కొటేషన్స్ అన్నీ గుర్తుకొచ్చాయి.
**** ***** ****
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Monday, May 16, 2011
శ్రీశైలం ప్రయాణం, ఫోటోలు
Subscribe to:
Posts (Atom)