
ఎండలో గొడుగు వేసుకుని డాబాపై ఒడియలు పెడుతుంటే
అమ్మతో ఒడియాలు పెట్టిన రోజు గుర్తొస్తుంది
భోజనాలయ్యాకా డైనింగ్ టేబుల్ సర్దుతున్నప్పుడు
"కాస్త కంచాలు తీసిపెటట్టచ్చు కదా, గిన్నెలు వంటింట్లో పెట్టవే"
అన్న అమ్మ కసుర్లు, ఒకోసరి బ్రతిమాలడo గుర్తుకొస్తుంది
కాస్త ఖర్చులటూఇటూ అయిన నెలలో
బజార్లో వెళ్తున్నప్పుడు
పాప అడిగిందేదైనా కొనలేనప్పుడూ
నేనడిగినప్పుడు డబ్బులివ్వలేదని
అమ్మని తిట్టుకున్న రోజులు జ్ఞాపకమొస్తాయి
వండిన కూర నచ్చలేదని పాప అలిగినప్పుడు
అమ్మ వంటకు పెట్టిన వంకలు జ్ఞాపకమొస్తాయి
కష్టపడి వండిన కూర పడేయలేక ఫ్రిజ్ లో పెట్టినప్పుడు
"అలా పెట్టకపోటే పడేయొచ్చు కదా"
అని అమ్మను వేళాకోళం చేసిన మాటలు గుర్తుకొస్తాయి
ఒంట్లో బాలేకపోయినా తప్పక పనిచేయాల్సొచ్చినప్పుడు
నన్ను ఒక్క పనీ చెయ్యనివ్వకుండా
అన్నీ తనే చేసుకున్న అమ్మ జ్ఞాపకమొస్తుంది
ఏదన్నా తేడా వచ్చినప్పుడు
నోరు మెదపలేకపోయినప్పుడు
చిన్నమాటకే అమ్మపై అరవటం జ్ఞాపకమొస్తుంది
కొన్ని చిక్కులు ఎదురైనప్పుడు..
అమ్మతో చెప్పలేకపోయినప్పుడు
శ్రీవారినీ ఇబ్బందిపెట్టలేననిపించినప్పుడు
స్నేహితులవద్ద లోకువవకూడదని పంచుకోలేనప్పుడు..
ఇలాంటప్పుడు అమ్మ ఎలా నెట్టుకువచ్చిందో అనిపిస్తుంది
మల్లెపూలు కడుతూంటే మాల విడిపోయినప్పుడు
ఎడచేత్తోనే చకచకా మాలకట్టేసే అమ్మ గుర్తుకొస్తుంది
అల్లరి చేసిందని పాపను కేకలేస్తూంటే
వాళ్ళనాన్న వెన్కేసుకొచ్చినప్పుడల్లా
నన్ను నాన్న వెన్కేసుకొస్తున్నారని
అమ్మ కోప్పడిన వైనం గుర్తుకొస్తుంది
ఆరేళ్ల కూతురిని చూసి
'అమ్మో ఎదిగిపోతోంది' అని నే బెంగపడినప్పుడు
పెళ్ళిడుకొచ్చిన నన్ను చూసినప్పుడల్లా
అమ్మ ఎంత బెంగపడేదో కదా అనిపిస్తుంది
ఇలా ఎన్నెన్నో సందర్భాల్లో
ఇంకెన్నో వందల సార్లు
అమ్మ గుర్తుకొస్తూనే ఉంటుంది
ఇంకా బాగా అర్ధం అవుతూనే ఉంటుంది..