"సంత" అంటే కొన్ని చిన్న చిన్న దుకాణాల సముదాయం...అంటే మార్కెట్ అనుకోవచ్చు. అన్నిరకాల వస్తువులు దొరికే సంతలు ఉంటాయి. మల్టీపర్పస్ అన్నమాట. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన సంతలు కూడా ఉంటూంటాయి. అక్కడ దొరికే వస్తువుని బట్టి ఆ సంతకు ఆ పేరు ఉంటుంది. పూల సంత, పుస్తకాల సంత, కూరల సంత, పశువుల సంత...అలా అన్నమాట. పూర్వం పల్లెటూర్లలో, గ్రామాల్లో ఊరి చివరలో వారంలో ఒక రోజున, ఎక్కువగా ఆదివారాలు ఈ సంతలు ఏర్పాటు చేసేవారు. పట్టణాల్లో కూడా సంతలు పెడుతూంటారు. మా అత్త, నాన్న, నాన్నమ్మ మొదలైనవారు చెబితే వినటమే కానీ నేనెప్పుడూ ఏ సంతా చూడలేదు. ఈ మధ్యనే ఓ నెల నుంచీ మా వీధిలో కూరల సంత పెడుతున్నారు కొత్తగా.
ఇక కూరలమార్కెట్ కో, రిలయన్స్ కో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి శనివారం హాయిగా ఇంటి దగ్గరే తక్కువ రేట్లకు కూరలు కొనేసుకుంటున్నాను. అసలు మార్కెట్ కు వెళ్ళి కూరలు కొనటం అనేది నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఆకుపచ్చగా, తాజాగా ఉన్న కూరలను చూస్తూంటే ఉత్సాహం పెరిగిపోయి, చేతిలోని సంచీ నిండి, చెయ్యి ఆ బరువును మొయ్యలేకపోతోంది అన్న స్పృహ కలిగేదాకా కూరలు కొనేస్తునే ఉంటాను. ఒకటా రెండా? దాదాపు పధ్ధెనిమిది,ఇరవైఏళ్ల అలవాటు. పైగా నాకు కరివేపాకు కోసమో,కొత్తిమీర కోసమో అడుగడుక్కీ వీధిలోకి పరుగెట్టడం ఇష్టం ఉండదు. వారనికి సరిపడా కూరలతో పాటూ కర్వేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు మొదలైన "కుక్కింగ్ ఏక్సెసరీస్" అన్నీ మర్చిపోకుండా తప్పనిసరిగా కొనేస్తాను. మా వీధిలోని సంత పుణ్యమా అని అన్నీ అందుబాటులోకి వచ్చేసరికీ అసలా కూరల్ని చూడగానే ఆనందతాండవమే. మొదటి రెండువారాలూ భారీజనాలను చూసి భయపడి నేను అటుకేసి వెళ్ళలేదు కానీ ప్రతి శనివారం "కూరల సంత" పెట్టడం చూసి రెండువారాల నుంచీ నేనూ కొనటం మొదలెట్టా.
సాయంత్రం ఆరుదాటితే జనం పెరిగిపోతారని గమనించి మూడూ నాలుగు మధ్యన వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. కూరలే కాక ఉసిరి కాయలు, చింతకాయలు, పండు మిర్చి, పెద్ద మిరపకాయలు మొదలైనవి కూడా ఉంటున్నాయి. క్రితం వారం పండు మిర్చి ఓ పావు కొని కొరివికారం, పెద్ద మిరపకాయలతో ఊరు మిరపకాయలు పెట్టాను. నిన్న ముద్దుగా బొద్దుగా ఉన్న చింతకాయలు కొన్నా. ఇంకా పచ్చడి పెట్టాలి. అప్పుడే తోటలోంచి కోసుకొచ్చినట్లు ఉన్న ఆకుకూరలు, తాజా కూరలు భలే ముచ్చటగా ఉన్నాయి. కూరలు అమ్మే ఒకమ్మాయి నన్ను గుర్తుపట్టి "అమ్మా నువ్వు మార్కెట్టుకు వస్తూంటావు కదా" అని అడిగింది. "ఎలా తెలుసు నేను?" అనడిగాను. మేము అక్కడివాళ్ళమే. జనాలు ఎక్కువరావట్లేదని ఇలా ఒకో వారం ఒకో వీధిలోకీ వచ్చి అమ్ముతున్నామమ్మా. ఇలా వస్తే మాకూ బేరాలు బాగా అవుతున్నాయి. నువ్వు వస్తూంటావు కదా నిన్ను గుర్తుపట్టా" అంది. "జనాల దగ్గరకు మీరు వెళ్లండి..."అన్న "మిష్టర్ పెళ్ళాం" సినిమాలో ఆమని డైలాగ్ గుర్తు వచ్చింది.
మధ్యాన్నం ఒంటిగంట నుంచీ రాత్రి తొమ్మిదింటిదాకా ఉంటున్నారు వీళ్ళంతా. ధరలన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. పావుకేజీలు కావలన్నా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎవరి జాగాల్లో తుక్కు వారే క్లీన్ చేసుకుని తీసుకెళ్ళిపోవాలని రూల్ కూడా పెట్టడంవల్ల మర్నాడు పొద్దున్నే వీధంతా సంత మొహం ఎరుగనట్లు మామూలుగా కూడా ఉంటోంది. అది మరీ నచ్చేసింది నాకు. ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ కాలంలో ఇలాంటి సంతలు ఎంత అవసరమో అనిపించింది. కూరల మార్కెట్ రేట్లకు డబుల్ రేటు పెంచేసి అమ్మే వీధుల్లోని కూరల కొట్లువాళ్ళకీ, సూపర్ మార్కెట్ల వాళ్లకీ ఇలాంటి సంతలే తగిన సమాధానం.