నేను ఇల్లు సర్దుకుంటూంటే మా అమ్మాయికి ఒక డబ్బా దొరికింది. అమ్మా ఇవి బాగున్నాయి నాకిచ్చేయ్ అని గొడవ. దాని చేతిలోంచి అవి లాక్కుని దాచేసరికీ తల ప్రాణం తోక్కొచ్చింది. నాన్న పదిలంగా దాచుకున్నవి నేను జాతీయం చేసేసాను. ఇప్పుడు నా కూతురు నా నుంచి లాక్కోవాలని చూస్తోంది...ఇదే చిత్రం అంటే...:) అవే పైన ఫోటోలోని బినాకా బొమ్మలు. ఒకానొకప్పుడు "బినాకా టూత్ పేస్ట్" వచ్చేది కదా. ఆ టూత్ పేస్ట్ పెట్టే కొన్నప్పుడల్లా ఒక బొమ్మ ఇచ్చేవాడట. ప్రతి నెలా అట్టపెట్టె లో ఏ బొమ్మ ఉంటుందా అని ఆసక్తిగా ఆత్రంగా కేవలం ఆ బొమ్మల కోసమే ఆ టూత్ పేస్ట్ కొనేవారట నాన్న. ఇప్పటికీ రంగు తగ్గకుండా ఎంత బాగున్నాయో.
ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చిన్న చిన్న బొమ్మలకు ముందు అయితే క్రింద ఫోటోలోలాగ గోడకో, అద్దానికీ, తలుపుకో అంటించుకునేలాగ కొన్ని బొమ్మలు ఇచ్చేవాడట. నాన్న అద్దానికి అంటించిన ఈ క్రింది లేడిపిల్ల బొమ్మను చూడండి..ఈ బొమ్మ వయసు సుమారు ముఫ్ఫై ఏళ్ళ పైమాటే.
ఇవికాక చిన్న చిన్న ప్లాస్టిక్ జంతువుల బొమ్మలు కూడా కొన్నాళ్ళు ఇచ్చారు బినాకావాళ్ళు. అవయితే పెద్ద పెట్టే నిండుగానే ఉన్నాయి. వాటితో ఏదో తయారు చేద్దామని దాచాను. ఇంతవరకూ చెయ్యనే లేదు. అవి అమ్మ దగ్గరే భద్రంగా ఉన్నాయి. "బినాకా" పేరును "సిబాకా" కూడా చేసారు కొన్నాళ్ళు. తరువాత ఆ పేస్ట్ రావటం మానేసింది.
అప్పటి రోజుల్లో సిలోన్ రేడియో స్టేషన్లో అమీన్ సయ్యానీ గొంతులో బినాకావాళ్ళు స్పాన్సార్ చేసిన టాప్ హిందీ పాటల కౌంట్ డౌన్ షో "బినాకా గీత్మాలా" వినని సంగీత ప్రేమికులు ఉండరు అనటం అతిశయోక్తి కాదు. నేను సిలోన్ స్టేషన్లో బినాక గీత్మాలా వినటం మొదలెట్టాకా ఒక డైరీలో ఆ పాటలు నోట్ చేసేదాన్ని కూడా. స్టేషన్ సరిగ్గా పలకకపోయినా ట్రాన్సిస్టర్ చెవికి ఆనించుకుని no.1 పాట ఏదవుతుందా అని చాలా ఉత్కంఠతతో ఎదురుచూసేదాన్ని...అదంతా ఓ జమానా...!!