తెలుగు సినీ గేయ ప్రపంచం లో ఒక యునీక్ సింగర్ గా బాలుగారు అధిరోహించిన శిఖరాలను బహుశా మరెవ్వరూ చేరుకోలేరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మహానుభావుని తాలుకూ కొన్ని రేర్ ఫొటోస్ ను, కొన్ని జ్ఞాపకాలనూ ఈ టపాలో పంచుకుంటున్నాను.
1971లో నాన్నగారు ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో పని చేస్తున్నప్పుడు , 'సంబరాల రాంబాబు' సినిమా రిలీజ్ తరువాత మద్రాస్ నుంచి బాలుగారు వచ్చినప్పుడు జరిగిన ఒక ఇంటర్వ్యు ఫోటో ఇది. ఆకాశవాణి తరఫున ఇంటర్వ్యు చేస్తున్నది మా నాన్నగారు.
బాలుగారి పాటకు నలభై వసంతాలు పూర్తయినప్పుడు "నయనం" అనే మాసపత్రిక వారు 2007లో ఆయన గురించిన విశేషాలతో,ఆర్టికల్స్ తో ఒక ప్రత్యేక సంచిక వేసారు. గొల్లపూడి గారి "ఎలిజీలు" పుస్తకం ఆవిష్కరణ సభ + బాలు పాటకు నలభై వసంతాలు సందర్భంగా జరిగిన సన్మాన సభ తాలూకూ విశేషాలు ఆ పత్రిక లో ప్రచురించారు. అందులోనివే ఈ క్రింది ఫోటోస్ :
ఆ పుస్తకంలో ప్రచురించిన బాలుగారి బయోడేటా :
అప్పటి "ఆంధ్రప్రభ" దినపత్రిక ఎడిటర్ దీక్షితులు గారి ఆధ్వర్యం లో తెలుగు సినిమా చరిత్ర గురించిన రకరకాల విశేషాలతో ప్రచురించబడిన "మోహిని(రెండు భాగాలు)" అనే పుస్తకంలో ఎందరో ప్రముఖుల చేత ఎన్నో వ్యాసాలు రాయించారు. ఆ పుస్తకం లో బాలూ ఇంటర్వ్యూ కోసం, విజయవాడ ఆకాశవాణి వార్తా విభాగం లో పనిచేస్తున్న బాలు చిరకాల మిత్రులు ప్రసాద్ గారితో పాటూ, ఆ ఇంటర్వ్యూ రికార్డ్ చేయటానికి నాన్నగారు కూడా నెల్లూర్లోని బాలుగారి ఇంటికి వెళ్ళారు. రెండు గంటలపాటు జరిగిన ఆనాటి ఇష్టాగోష్ఠి, చెప్పుకున్న కబుర్లు మరపురానివని నాన్న చెప్తూంటారు.
అప్పుడే 'మా అమ్మాయి కోసం' అని నా పేరుతో ఒక ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు. నా పేరు అడిగి ఒక జోక్ కూడా వేసారుట ఆయన. (ప్రస్తుతం ఆ లెటర్ కాని ,ఆటోగ్రాఫ్ కానీ దొరకలేదు టపాలో పెడదామంటే..) ఆ తరువాత కమల్ హాసన్ కు డబ్బింగ్ చెప్పటమే కాక బాలు సొంతంగా ప్రొడ్యూస్ చేసిన "మహానది" సినిమా చూశాకా, బాగా నచ్చేసి, నాన్న ఆయనకు ఒక లెటర్ రాసారు. దానికి ఆయన సమాధానం రాస్తూ చివరలో నా పేరు గుర్తుంచుకుని అమ్మాయికి ఆశీస్సులు అని కూడా రాసారు. అంతటి జ్ఞాపక శక్తి ఆయనది.