సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Saturday, March 6, 2010
" మృత్యోర్మా అమృతంగమయ - 1"
మహిళా బ్లాగర్లందరికీ ముందుగానే ఉమెన్స్ డే శుభాకాంక్షలు.
రాబోతున్న "ఉమెన్స్ డే" సందర్భంగా మొన్నటి టపాలో ప్రస్తావించిన ఒక "పాత పత్రిక--ఆంధ్రప్రభ" నుంచి ఒక నవలను పరిచయం చేయాలని సంకల్పం. ఇది 1975లో ఆంధ్రప్రభ పత్రిక నిర్వహించిన ఉగాది నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన శ్రీమతి ఏ.తేజోవతిగారి నవల "మృత్యోర్మా అమృతంగమయా". తేజోవతి గారి ఇతర రచనలు (నవలలు,కధలు) అంతకు ముందు కూడా ఆంధ్రప్రభలో ప్రచురితమయ్యాయి. అవి పుస్తకరూపంలో ప్రచురితమయ్యాయా లేదా అనేది నాకు తెలియదు. కధల సంపుటి మాత్రం అచ్చయినట్లు రచయిత్రి ఒకచోట పేర్కొన్నారు.
ఎం.ఏ.ఇంగ్లీష్ లిటిరేచర్ చదివిన ఈ రచయిత్రి అప్పట్లో గుంటూరులోని పలు కళాసాలల్లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసినట్లు కూడా తన పరిచయంలో తెలిపారు. రిటైర్ అయిన ఒక మహిళా లెక్చరర్ తన శేష జీవితాన్ని సమాజానికీ, ఉదోగస్థులైన ఇతర మహిళలకూ ఉపయోగపడేలా ఎలా మలుచుకున్నదీ ఈ నవల కధాంశం. ఒక ఆశ్రమానికి వెళ్ళి తన రిటర్డ్ లైఫ్ గడపాలనుకున్న ఆమె తన చూట్టూ జరిగిన కొన్ని సంఘటనలకు స్పందించి, తన చిరకాల కోరికను వదులుకుని సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కధ.
రచయిత్రి రాసిన విధానం, తన చుట్టూ ఉన్న కొందరు మనుషుల ఇబ్బందులు, బాధలూ చూసి వారికి ఏదన్నా సాయం చేయాలని ప్రధాన పాత్రధారి పడే ఆరాటం, ఆమెకున్న సేవా దృక్పధం, ఎదుటి వ్యక్తిని ఆమె అర్ధం చేసుకునే తీరు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆమె కేరక్టరైజేషన్ చాలా బాగుంది. ముఖంగా రచయిత్రి నవలను మహిళా లోకానికి అంకితం ఇచ్చిన వాక్యాలు నాకెంతగానో నచ్చాయి.
"ఇటు గృహిణులుగానూ, అటు ఉద్యోగినులుగానూ అష్టావధానం చెయ్యలేక సతమతమవుతున్న మహిళాలోకానికి" అని రాసారు .
ఈ నవల బయట దొరకదేమో అనే ఉద్దేశంతో మొత్తం కధను రాయదలిచాను.మరి నవలా కధను నాకు చేతనైన విధంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను...
మృత్యోర్మా అమృతంగమయా:
ఉమెన్స్ కాలెజీ లెక్చరర్ గా "కాంతిమతి" ఉద్యోగ విరమణ సభతో కధ మొదలౌతుంది. అభిమానంతో,పూలమాలలతో విద్యార్ధినులు,సహోద్యోగినులూ సన్మానించి, భారమైన మనసులతో రిక్షా ఎక్కించి కాంతిమతి ని ఇంటికి పంపిస్తారు. కానీ ఉద్యోగ విరమణ బాధ కన్నా ఎన్నో సంవత్సరాల బంధనాల నుంచి విముక్తి లభించిందన్న ఆనందంతో ఆమె ఇంటికి చేరుతుంది. ఎస్.ఎస్.ఎల్.సి తరువాత వివాహమైన ఆమె మామగారి మరణం, భర్త చిరుద్యోగం, కుటుంబ బాధ్యతలు వల్ల స్కూలు తిచరుగా ఉద్యోగం ప్రారంభిస్తుంది. ఆ తరువాత పిల్లల పోషణ నిమిత్తం పై చదువులు చదివి లెక్చరర్ ఉద్యోగం సంపాదించుకోగలుగుతుంది . చిన్ననాటి నంచీ తనకు ఇష్టమైన పూజా పునస్కారాలూ, హరికధా కాలక్షేపాలు మొదలైనవాటికి సమయం కేటాయించుకోలేని బాధ ఆమెలో మిగిలిపోతుంది.
ఇప్పుడిక సమయ పరిమితి,నిబంధనలు లేకుండా తన ఇష్టాన్ని కొనసాగించవచ్చని ఎంతో ఆనందిస్తుందామె. తన చిరకాల కోరిక ఒకటి మిగిలిపోయిందని, దానిని తీర్చుకోవటానికి అడ్డు చెప్పవద్దని తన వద్ద ఉంటున్న చిన్న కొడుకుని కోరుతుంది కాంతిమతి .
(ఇంకా ఉంది..)
Subscribe to:
Posts (Atom)