సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Monday, February 15, 2010
పుత్రికోత్సాహం...
"పుత్రోత్సాహం" లాగ పుత్రికోత్సాహం నాలో పొంగి పొరలింది మొన్నటి రోజున...ఎందుకంటారా? వాళ్ళ స్కూలు ఏన్యువల్ డే సందర్భంగా జరిగిన ఫంక్షన్లో మా ఐదేళ్ల పాప మొదటిసారి స్టేజి ఎక్కి "వెల్కం డాన్స్" చేసింది. భయపడకుండా, ధైర్యంగా, నవ్వుతూ, కాంఫిడెంట్గా..! నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...బహుశా వాటినే పెద్దలు ఆనందభాష్పాలు అంటారేమో..
ఆ రోజు పాప పుట్టినరోజు కూడా అవ్వటం నాకు ఇంకా సంతోషాన్ని కలిగించింది. సమయానికి మావాళ్ళెవరూ ఊళ్ళో లేకపోయారు. అమ్మ,తమ్ముడు మాత్రం రాగలిగారు.
కాకి పిల్ల కాకికి ముద్దు. ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు. కానీ మా పాపకు మొదట్లో పుట్టిన ఐదు నెలల్లో రెండు ఆపరేషన్లు జరగటం...ఆరునెలలుదాకా నిద్రాహారాలు లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మనుషుల్లో పడిన పిల్ల అవటంవల్ల మాకు అందరికీ అదెంతో అపురూపం. అలా కళ్ళలో పెట్టుకు పెంచినపిల్ల ఇవాళ స్టేజి మీద డాన్స్ చేస్తూంటే మరి ఆనందమేగా. నాలోని నెగెటివె పోయింట్స్ రాకుండా అన్నీ మంచి గుణాలను అది పుణికిపుచ్చుకోవటం అదృష్టమే అనుకుంటాను. భగవంతుని దయ వల్ల పాప మంచి చదువు చదివి తన కాళ్ళపై తాను నిలబడాలని నా ఆకాంక్ష.
ఇదంతా బాగుంది కానీ తెర వెనుక కధ కూడా రాయాలని...
డాన్సు ప్రాక్టిసు కోసం నెల రోజులనుంచీ స్కూలువాళ్ళు పిల్లలను తెగ తోమేసారు. హోం వర్క్ లేదు చదువు లెదు. డాన్సులే డాన్సులు. పిల్ల ఇంటికి వచ్చి కాళ్ళు నెప్పులని గొడవ. ప్రొగ్రాం రోజున మూడింటికి పిల్లలను పంపమంటే పంపాము. నాలుగున్నరకు కార్యక్రమం మొదలౌతుందంతె నాలుగింటికే వెళ్ళి కూర్చున్నాము. స్టేజి తయారి దగ్గర నుంచీ కుర్చీలు వేయటం దాకా అంతా చూస్తూ దోమల చేత కుట్టించుకుంటూ కూర్చుంటే....ఏడున్నరకు మొదలెట్టారు. గెస్ట్ లందరి స్పీచ్లు అయ్యి కల్చురల్ ప్రోగ్రాంస్ మొదలయ్యే సరికీ ఎనిమిది దాటింది.
అదృష్టవశాత్తూ మా పాపది వెల్కం డాన్స్ అవటం వల్ల ముందు అది అయిపోయింది. కాని మొత్తం అయ్యేదాకా పిల్లలను పంపము అన్నారు. వంట్లో బాలేదు అంత సేపు కూర్చోలేను మొర్రో అని మొత్తుకున్నా వినరే...! మొత్తానికి ఎలాగో బ్రతిమిలాది నీరసంతో ఇంటికీ రాత్రి వచ్చేసరికీ పది అయ్యింది.
పుత్రికోత్సాహం సంగతి ఎలా ఉన్నా ఇంకెప్పుడు ఇలా డాన్సులకు పంపకూడదు అని నిర్ణయించుకున్నాను ప్రస్తుతానికి.కానీ తరువాత పాప ఇష్టపడి చెస్తాను అంటే చేసేదేముండదని తెలుసు..:) ఎందుకంటే వాళ్ళ ఉత్సాహాన్ని ఆపే ప్రయత్నం చేయలేము కదా. కాకపోతే ముందుగానే పర్మిషన్లూ అవి తీసుకుని ఉంచుకోవాలి అనుకున్నాము.
చలిలో పిల్లలను స్టేజీ పక్కన కూర్చోపెట్టారు.పిల్లలకు చలి+ దోమలు కుట్టేసి దద్దుర్లు. 4,5 గంటలు ఆకలితో ఉన్నారని మనకు బాధ తప్ప వాళ్ళకు ఆ ఉత్సాహంలో ఆకలే తెలియలేదు...:)
Subscribe to:
Posts (Atom)