సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, January 7, 2010

ఇక కావలసినదేమి...


వాగ్గేయకారుల్లో నాకు అత్యంత ఇష్టమైన "త్యాగయ్య" గురించి ప్రత్యేకం చెప్పటానికేముంది? పొద్దున్నే ఆయన కృతులు వింటుంటే ఈ కృతిని బ్లాగ్లో రాయాలనిపించింది..."బోంబే సిస్టర్స్"(సరోజ,లలిత)పాడిన కృతి వినటానికి పెడుతున్నను...




త్యాగరాజ కృతి, బలహంస రాగం, ఆది తాళం :

పల్లవి
: ఇక కావలసినదేమి మనసా సుఖముననుండవదేమి

అనుపల్లవి
: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాథుడు
అంతరంగమున నెలకొనియుండగ (ఇక)

చ1: ముందటి జన్మములను జేసినయఘ బృంద విపినముల-
కానంద కందుడైన సీతా పతి నందక యుతుడైయుండగ (ఇక కావలసిన)

చ2
: కామాది లోభ మోహ మద స్తోమ తమమ్ములకును
సోమ సూర్య నేత్రుడైన శ్రీ రామచంద్రుడే నీయందుండగ (ఇక కావలసిన)

చ3: క్షేమాది శుభములను త్యాగరాజ కామితార్థములను
నేమముననిచ్చు దయా నిధి రామభద్రుడు నీయందుండగ (ఇక కావలసిన)


త్యాగరాజ కృతికి అర్ధాన్ని రాసేంతటి గొప్పదాన్ని కాదు కానీ నాకు అర్ధమైన అర్ధాన్ని కూడా రాయటానికి సాహసించాను...

అర్ధం:

ఓ మనసా, ప్రశాంతంగా ఎందుకుండవు? ఇంకేమికావాలి నీకు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే నీ మనసునందు నిండి ఉండగా ఇంకేమి కావాలి నీకు?

ఆనందకారకుడైన శ్రీరాముడు తన నందక ఖడ్గంతో పుర్వ జన్మలందు చేసిన పాపారణ్యములను నాశనం చేయటానికి సిధ్ధముగానుండగ ఇంకేమి కావాలి నీకు?

నీలోని కామము,లోభము,మదము,మోహమూ మొదలైన అంధకారములను తొలగించటానికి, సూర్య చంద్రాదులను తన నేత్రాలలో నింపుకున్న శ్రీరామచంద్రుడు నీలో కొలువై ఉండగా ఇంకేమి కావాలి నీకు?

ఈ త్యాగరాజాశించెడి క్షేమాది శుభములను నీకొసగ గలిగిన దయానిధి అయిన శ్రీరామభద్రుడు నీలో ఉండగా ఇంకేమి కావాలి నీకు?
ఓ మనసా....