సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, December 6, 2009

ట్రాఫిక్ సిగ్నల్


మధుర్ భండార్కర్ తీసిన, కునాల్ నటించిన "ట్రాఫిక్ సిగ్నల్" గురించి కాదు నేను రాయబోయేది... నిత్యం మనం ప్రయాణీంచే రోడ్డు మీద మనకెదురయ్యే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి...అక్కడ మనకు ఎదురయ్యే, మనల్ని వ్యాకులపరిచే వతావరణం గురించి..!దాదాపు పది పన్నేండేళ్ళక్రితం నేను ఓ పదిరోజులకని ఈ ఊరు వచ్చినప్పుడు మా అన్నయ్య బండి మీద వెళ్తూ ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మొదటిసారి లోనయ్యాను ఈ వ్యాకులతకి.

చిరిగిన బట్టలతో దీనంగా, చింపిరి జుట్టుతో, జాలిగొలిపేలాంటి చూపులతో అడుక్కుంటున్న పిల్లలని, వృధ్ధులని...చూసి మొదట చేతికందిన చిల్లర లెఖ్ఖపెట్టకుండా ఇచ్చేసాను. కానీ ప్రతి చోటా ఇదే దృశ్యం. ఇలాంటివారే మరి కొందరు. అప్పుడర్ధమైంది ఇదొక వృత్తిగా మారిందని. గుళ్ళు, సినిమాహాల్స్, ఎక్కువ జనసందోహం ఉండే ప్రాంతాలు, పర్యాటక స్థలాలు మొదలైన ప్రదేశాలతో పాటూ అడుక్కోవటానికి దొరికిన సులువైన,కొత్త ప్రదేశాలు ఈ "ట్రాఫిక్ సిగ్నల్స్". అప్పటి నుంచీ ఈ ఊరొచ్చిన ప్రతిసారీ, ఇంకా పెద్ద పెద్ద సిటీల్లో చాలా చోట్ల చూస్తూనే ఉన్నాను. ఆ వ్యాకులతను అనుభవిస్తూనే ఉన్నాను. ఒకే రోడ్డులో మళ్ళీ మళ్ళీ వెళ్తూంటే అదే మనుషులు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటారు..అదే రీతిలో అడుక్కుంటూ..!! ఆఖరికి మొన్న బస్సులో వెళ్తూంటే ఒక సిగ్నల్ దగ్గర ఆగిన బస్సు కిటికీ లోంచి ఒక చెయ్యి వచ్చి నన్ను తాకింది..ఏదో ఆలోచనలో మునిగి ఉన్న నేను అద్దిరిపడ్డాను...చూస్తే ఒకతను...చేయి చాచి డబ్బులు అడుగుతున్నాడు...ఆటోల్లోకే కాదు...బస్సుల్లోకి కూడా చేతులు దూర్చేస్తున్నారే? అని ఆశ్చర్యపోయాను.

విచిత్రమేమిటంటే..ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండేవాళ్ళందరూ మామూలుగా ఉండరు. అతి దరిద్రంగా, అతి బాధాకరంగా, చూడగానే మనసు ద్రవించిపోయే వేషాల్లో ఉంటారు. ఎంతో కొంత ఇచ్చి ముందర కళ్ళ ముందు నుంచి పంపేయాలి బాబోయ్...అనిపించేలా ! అలా కావాలనే ఉంటారేమో వాళ్ళు...అనిపిస్తుంది నాకు. బక్కచిక్కిన ఒక మగవాడిని భుజాన వేసుకున్న ఒక స్త్రీ, గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లవాడిని వీపుక్కట్టుకున్న స్త్రీలు, కళ్ళు,కాళ్ళు లేక మరో మనిషి ఆసరాతో నిలబడి అడుక్కునేవాళ్ళు కొందరు, ఆటో ఆగగానే లోపలికి చేతులు పెట్టేసి డబ్బులు ఇచ్చేదాకా భయపేట్టేసేవాళ్ళు కొందరు, ఆకలి ఆకలి అని కడుపు చూపించి బెదిరించే రౌడి రకపు పిల్లలు కొందరు..ఇలా ఎన్నో రకాల జనాలను చూసి చూసి జుగుప్స కలుగుతుంది. భయం కలుగుతుంది. బాధ కలుగుతుంది. వేదన పెరుగుతుంది.

బాధ ఎందుకు అంటే వాళ్ళకు డబ్బులు వేసి ప్రోత్సహించనూ లేము, అలా అని ఇవ్వకుండా మనసుని ఇబ్బంది పెట్టనూలేము. మనం వృధాచేసే వాటిల్లో ఈ ఒకటి రెండు రూపాయలే ఎంత? అని వేసేస్తూ ఉంటాము.కానీ ఇలా కొన్ని వందల ఒక్క రూపాయిలు అడుక్కునేవాళ్ళకు ఆదాయాన్ని పెంచుతున్నాయి. సోమరితనాన్ని పెంచుతున్నాయి. మరిన్ని దొంగ వేషాలు వెయ్యటానికి పురిగొల్పుతున్నాయి.ఎందుకిలా? అని ప్రశ్నించుకుంటూనే ఉన్నాను...జనాలను భయపెట్టి, బాధపెట్టి డబ్బులు అడుక్కునే ఈ పధ్ధతి ఏమిటి? ఎవరూ దీని గురించి పట్టించుకోరా? అనుకుంటూంటాను.

ఏదో హడావుడిలోనో, రకరకాల ఆలోచనలతో పరధ్యానంగానో, పని వత్తిడిలో హడావిడిగానో ప్రయాణిస్తూ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగిన ప్రజలకు, ఉన్న వేదననో, లేని వేదననో పెంచేలాగ కనిపించే అడుక్కునే వాళ్ళ వేషభాషలు మరింత కంగారుకు,చికాకుకూ గురి చేస్తాయి. చేస్తున్నాయి. మన ఈ వ్యాకులత, చికాకే వాళ్ళకు డబ్బు ఆర్జించి పెడుతోంది. కొందరు అడుక్కునే పిల్లలను చిన్నవయసు నుంచే మరింత సోమరిగా తయారు చేస్తోంది. సులువుగా డబ్బు సంపాదించే మార్గం ఇదేనని వాళ్ళను నమ్మేలా చేస్తోంది. కానీ ఇది మారాలి. అన్ని చోట్లా మారటం అసంభవం కాబట్టి కనీసం ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళనైనా డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయగలిగితే ఎంతో బాగుంటుంది.

సిటీల్లో బెగ్గర్స్ ను కంట్రోల్ చేసే "స్పెషల్ డిపార్ట్మెంట్" ఒకటి ఉందని, దానికి ఒక "ఐ.ఏ.యస్.ఆఫీసరు" ఇంచార్జ్ ఉంటారని తెలుసు కానీ దాని పేరూ వివరాలూ నాకు తెలియవు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కలగజేసుకుని ఈ "ట్రాఫిక్ సిగ్నల్" దగ్గరకు బెగ్గర్స్ ను రానీయకుండా అదుపు చేయగలిగితే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఈ మధ్యన "Times of india" లో మిలియనీర్ బెగ్గర్స్ అంటు ఒక ఆర్టికల్ పడింది. అది దాచి దాని మీద రాద్దామనుకునే లోపూ ఆ పేపర్ మాయమైపోయింది ఇంట్లో. ఈ లోపూ మొన్న బస్సులో వెళ్తూంటే జరిగిన సంఘటన ఈ టపాకు మూలమైంది. ఈ టాపిక్ కు రిలేటెడ్ రెండు ఆర్టికల్స్ నెట్ లో దొరికాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవవచ్చు --
http://timesofindia.indiatimes.com/india/Beggar-in-India-is-a-millionaire-in-Bangladesh/articleshow/3256583.cms

http://www.indianofficer.com/forums/current-issues/5887-beggary-india.html