సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Saturday, November 21, 2009
విశాలనేత్రాలు - 3
(ఈ నవల మొదటి భాగం, రెండవ భాగం తరువాత ఇది ఆఖరి భాగం....)
రామానుజుని ప్రధాన శిష్యులైన గోవిందయతి, యజ్ఞమూర్తి, అనంత సూరి ,దాశరధి మొదలైన ప్రముఖులందరు వ్యాకరణ,వేదాంత, చతుర్వేదాలలో విద్వాంసులు. వారెవరికీ రంగనాయకుని మీద సదభిప్రాయం ఉండదు. సామాన్య రైతు కుమారుడు, ఒక వెలయాలిని వెంటబెట్టుకుని శ్రీరంగం వచ్చి నివసిస్తూ, మద్యపానం,సాముగారడీలు తప్ప భక్తిశ్రధ్ధలేమాత్రం కానరాని అతని పట్ల ఆచార్యులకేందుకంత అనుగ్రహ వాత్సల్యాలో వీరెవరికీ అంతుపట్టదు. శ్రీరంగేశుని దేవాలయానికి వెళ్ళేప్పుడు "దాశరధి" భుజం మీద ఆనించే యతీశ్వరుని చెయ్యి రాను రానూ రంగనాయకుని భుజం మీదకు తిరిగేంతటి పరమాత్మీయ దృష్టిని చూసి శిష్యులందరూ తప్పనిసరిగా అతన్ని గౌరవించడం మొదలుపెడతారు.
ఒకరోజు దేవాలయంలో రామానుజ శిష్యులు పఠిస్తున్న ద్రవిడ వేదపారాయణ దేవాలయం నలుమూలలా మారుమ్రోగుతున్న వేళ తన్మయంతో పులకించిన రంగనాయకుని నోటి వెంట అప్రయత్నంగా ద్రవిడ వేదపాశురం వెలువడుతుంది. అమృతగళం కాకపోయినా ఆ గొంతులో పలికిన మాధుర్య భక్తిభావాలందరినీ ఆశ్చర్యపరుస్తాయి. పారవశ్యంలో అతడు రామానుజుని "సుదీర్ఘ విశాల విలోచనాల దర్శన భాగ్యం" ప్రసాదించమని అడుగుతాడు. మరునిముషమే రామానుజుని గొంతులో పలికిన ద్రావిడ వేద పాశురాల పరంపర, అ వెంఠనే అర్చకుల శ్రీసూక్త పురుషసూక్తాలతో దేవాలయం ప్రతిద్వనిస్తుంది. "అటు చూడమన్న" రామానుజుని నిర్దేశంతో రంగనాధుని నేత్ర యుగళిని దర్శించిన రంగనాయకునికి అపూర్వానుభూతితో అతిలోక విశాలమైన స్వామివారి రమణీయ విలోచన యుగళి కనబడుతుంది. తన్మయత్వంలో మూర్చపోతాడతను. స్వామివారి దివ్యనేత్రాల సందర్శన భాగ్యంతో తన జన్మ ధన్యమైందని భావిస్తాడు. అంతటి తాదాత్మ్యంలో కూడా హేమ ఈ దర్శనభాగ్యానికి నొచుకోలేదని వాపోతాడు.
ఆనాటినుంచీ అతని జీవితమే మారిపోతుంది. మద్యపానం, మైత్రీ సంబంధాలు అన్ని క్రమక్రమంగా సడలిపోతాయి. సంపాదనంతా వైష్ణవ మఠానికి ధారపోస్తున్న అతడిని చూసి హేమసుందరి కలవరపడుతుంది. ఆమెలో మార్పు, పూర్వాశ్రమంలో రామానుజుని భార్య తంజమాంబ వృత్తాంతం, రంగనాయకుని రాకపోకలవల్ల రామానుజుమఠంలో మొదలైయ్యే ఘర్షణలూ,మఠంలోకి అడుగిడనివ్వకుండా హేమారంగనాయకులకు జరిగే అవమానం.....ఏం జరిగినా వీడని రామానుజుని నిశ్చింత , యజ్ఞమూర్తి, దాశరధి ల అంతర్మధనం...ఇవన్నీ నవలలో ఎవరికి వారు చదివి ఆనందించి, అవగాహన చేసుకోవలసిన విషయాలు.
వృధ్ధ శిష్యులెవరికీ దక్కని "అష్టాక్షరీ మంత్రోపదేశం" చెయటానికి రామానుజులే స్వయంగా రంగనాయకుని ఇంత అడుగు పెట్టిన సన్నివేశం చదువుతూంటే పారవశ్యంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ అనాయాస అష్టాక్షరీ మంత్రోపదేశానికి కారణం " హేమరంగనాయకుల పరస్పర తపన,ప్రేమానురాగాలు,మల్లవిద్యపై రంగనాయకునికి గల ఏకాగ్రత, వివాహితులు కాకపోయినా పుణ్యదంపతులవలే జీవించిన వైనం, ఒకరి తప్పిదాలనొకరు క్షమించుకున్న వారి అన్యోన్యత , ఎన్ని కష్టాలొచ్చినా సడలని వారి ప్రేమానుబంధం " అని యతీశ్వరుని ముఖత: విని యజ్ఞమూర్తి ఆశ్చర్యపోతాడు. పరమేశ్వర సాక్షాత్కారం భక్తి, జ్ఞాన,కర్మ యోగల ద్వారానే సాధ్యమన్న సత్యాన్ని మారుస్తూ, ప్రగాఢమైన మోహావేశాలు కూడా భగవంతుని సాక్షత్కారానికి పెద్ద మెట్టుగా తెలుపుతున్న రామానుజుని ప్రసంగాన్ని విని విడ్డూరపడినా సమర్ధించలేకపోతాడు.
యజ్ఞమూర్తి సంఘర్షణకు ఏం సమాధానం దొరుకుతుంది, మఠం మళ్ళీ పూర్వ వైభవాన్నెలా పొందింది, రంగనాయకుడు ఎలా వైష్ణవ పీఠాధిపతి అయ్యాడు, హేమాసుందరి రంగనాయకుల జీవితం మఠ పరిచర్యలకు ఎలా అంకితమైంది అన్న ప్రశ్నలకు నేను చెప్పగా మిగిలిన చాలా కొద్దిపాటి నవలా పఠనమే సమాధానం... !!
___________________________________________________________________
(మా పాపకు కొంచెం నలతగా ఉన్నందున పొద్దున్నే కుదరదేమో అని ఇప్పుడే ఈ టపా ప్రచురించేస్తున్నాను...)
Subscribe to:
Posts (Atom)