సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Wednesday, October 28, 2009
ముత్యాల ముగ్గు
బాపూగారి అసంఖ్యాక అభిమానుల్లో మా నాన్న ఒకరు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువవ్వగానే బాపూను కలిసిన నాన్న ఆయన చెప్పిన మాట విని అక్కడే ఉండిపొతే ఈ సినిమా టైటిల్స్ లో తన పేరు ఉండిపోయేది కదా అని ఇప్పటికీ అనుకుంటూంటారు...!! అప్పట్లో ఈ సినిమా విడుదలైనప్పుడు బాపు గారిది,ఎమ్.వి.ఎల్ గారిది ఆటోగ్రాఫ్ మాత్రం సంపాదించుకున్నారు.(పాతవవటం వల్ల వాటికి ఫొటో తీసినా సరిగ్గా రాలేదు.)
తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ "ముత్యాలముగ్గు"(1975). సినిమాలోని పాత్రలూ, డైలాగులూ, చిత్రీకరణ, పాటల సాహిత్యం,సంగీతం అన్నీ వేటికవే సాటి.ఇటువంటి గొప్ప సినిమా గురించి నా సొంత జ్ఞానంతో, అక్షరాలతో సమీక్ష రాయటం సాహసమే. ఒక సినిమా గురించి చాలా రకాలుగా రాయచ్చు.నేను కేవలం ఈ సినిమాకున్న ప్రత్యేకతలను మాత్రమే రాయదలిచాను. ఈ సినిమా తాలూకు నవలారూపాన్ని చిన్నప్పటినుంచీ చాలా సార్లు చదివాను. మొదటిసారి సినిమాను మాత్రం మేము టి.వి కొనుక్కున్న కొత్తలో, దూరదర్శన్ వాళ్ళు మధ్యాహ్నం వేసే ప్రాంతీయ భాషా చిత్రాల్లో చూసాను...
జీరో ఫిగర్ లేదా సన్నని ఆకృతి, హెవీ మేకప్, వీలయినన్ని తక్కువ దుస్తులు, గ్లామరస్ లుక్స్....ఇవి ఇవాల్టి ఆధునిక "హీరోయిన్" అర్హతలు, గుర్తులు కూడా. కానీ పెద్ద కళ్ళు, కళ్ళనిండా కాటుక, మేకప్ లేని సహజత్వం, ముద్దబంతి లాంటి రూపం, పొడుగాటి వాల్జెడ, "బాపురే" అనిపించేలాంటి తెలుగుదనం నిండిన అమ్మాయిలు ఆయన బొమ్మల్లాంటి మన బాపూ గారి హీరోయిన్లు. ప్రతి సినిమాలోనూ పాత్రకు తగ్గ రూపం, ఈ పాత్రకి ఈవిడే కరక్ట్ అనిపించేలాంటి ఆర్టిస్ట్ లు.
"అబ్బ...ఎంత పెద్ద కళ్ళు...." అని హీరో తో పాటూ మనమూ ప్రేమలో పడిపోతాము
ముత్యాలముగ్గు లో హీరోయిన్ తో.
"ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ
మత్తైదు కుంకుమ బతుకంత ఛాయ...."
"......తీరైన సంపద ఎవరింట నుండూ
దిన దినము ముగ్గున్న లోగిళ్ళ నుండు...."
".......ఇంటి ఇల్లాలికీ ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికీ అంత వైభోగం......"
అని పాడుతున్నది సుశీల గారైనా నటించిన సంగీత పాత్రను చూసి 'భార్య అంటే ఇలా ఉండాలి' అనుకోని మగవారుండరంటే అతిశయోక్తి కాదేమో..! పనులు చేసుకుంటూనో, ముగ్గు పెట్టుకుంటూనో, ఇల్లు సర్దుకుంటునో ఈ పాటలోని ఆరుద్ర గారి సాహిత్యాన్ని పాడుకోని తెలుగు ఇల్లాలు కూడా ఉండదు.
ఈ సినిమా గురించి చెప్పాల్సిన విశేషాలు చాలా ఉండటం వల్ల కధ గురించి క్లుప్తంగా --
అపార్ధాలతో విడిపోయిన ఒక జంట చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కధాంశం.
స్నేహితుని చెల్లెలి పెళ్ళికి వెళ్ళి, అనుకోని పరిస్థితుల్లో ఆమెను వివాహమాడి ఇంటికి తెస్తాడు శ్రీధర్. అమాయకత్వంతో పాటూ లోకజ్ఞానం కూడా మెండుగా ఉన్న పల్లెటూరి అమ్మాయి లక్ష్మి.పేదింటి పిల్లను కోడలిగా మొదట్లో అంగీకరించలేకపోయినా, ఆమె వల్ల పోయిన దేముడి నగలు దొరకటంతో కోడలు లక్ష్మి తన ఇంటి మహాలక్ష్మి అనే నమ్మకానికి వస్తారు శ్రీధర్ తండ్రి రాజా రామదాసుగారు. ఆయన బావమరిది సోమరాజుకు తన కూతురుని శ్రీధర్ కు కట్టబెట్టి రామదాసుగారి ఆస్తినంతా అనుభవించేయాలని దురాశ. శ్రీధర్ ఒక పేదపిల్లని పెళ్ళాడి రావటం, రామదాసుగారు ఆమెను అంగీకరించటం సహించలేక నూతన దంపతులను విడదియ్యాలని కుట్ర పన్ని ఒక కాంట్రాక్టరు సాయంతో వారిద్దరినీ విడదీస్తాడు. దురాశ దు:ఖానికి చేటు అన్నట్లుగా తాను చేసిన పనికి కూతురివల్ల, కాంట్రాక్టరు వల్ల సోమరాజు ఎన్ని అవమానాలకూ నిందలకూ గురయ్యాడు, తాను తీసిన గోతిలో కాంట్రాక్టరు ఎలా పడ్దాడు, శ్రీధర్,లక్ష్మిల కవల పిల్లలు తెలివిగా తల్లిదండ్రులను చివరికి ఎలా కలిపారు అన్నది మిగిలిన కధ.
చాలా సినిమాలకు ఇతివృత్తాలు మన హిందూ పురాణాల నుంచే సేకరించబడ్డాయి. ఆ సినిమాలు బాగా ఆడాయి కూడా.అలాగే ఉత్తర రామాయణం ఆధారంగా ఈ సినిమా తీయబడిందని అంటారు. బాపు గారికి రాముడంటే ఎంత ఇష్టమో "సంపూర్ణ రామాయణం" "సీతా కల్యాణం" "అందాల రాముడు" మొదలైన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ముత్యాల ముగ్గులో కూడా శ్రీరామ పట్టాభిషేకానంతర కధని ఒక సాంఘిక సినిమా రూపాన్నిచ్చి ఎంతో అందంగా మనకందించారు బాపూరమణలు. నారాయణరెడ్ది గారు రచించి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన "శ్రీరామ జయ రామ సీతా రామ.." కూడా బాపుగారి రామ భక్తికి నిదర్శనమే !
ఈ సినిమాలో గుర్తుంచుకోదగ్గ "డవిలాగులు"
" యస్సారు గాదు. కళ్ళెట్టుకు సూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో. సూరిఇడు నెత్తురుగడ్దలా లేడూ"
"ఆ ! మడిసనాక కస్సింత కలాపోసనుండాలయ్యా!! ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటుంది."
"ఆ ముక్క, నే లెక్కెట్టే ముందు సెప్పాల. అసలు నే లెక్కే పెట్టనని నీ ఎదవ ఆలోచన. తప్పు కదూ! జాగర్త డిక్కీలో పెట్టించేస్తాను. "
"కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుంది. అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుంది. "
(ఇది బాపూగారికి కూడా బాగా నచ్చిన డైలాగుట.)
"సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు"
సినిమాకు సంబంధించి కొన్ని విశేషాలు, కబుర్లు
* పన్నెండున్నర లక్షలు ప్రొడక్షన్ కాస్ట్ పెట్టి తీసిన ఈ సినిమా మొదటి రిలీజు ఇరవై నాలుగోవారానికి రెండు కోట్లు వసూలు చేసిందిట.
* రొటీన్ గా వస్తున్న "విలన్" పాత్రకు కొత్త రూపాన్నిచ్చింది ఈ సినిమా. ఈ కొత్త తరహా విలన్ అసాధ్యుడు. అనుకున్నది సాధించే పనితనం ఉన్నవాడు, తన
పనివాడి నమ్మకద్రోహాన్ని కూడా పసిగట్టేంత తెలివైనవాడు, తాను చేసేది దుర్మార్గం అని ఒప్పుకోటానికి వెనుకాడని సాహసి. ఈ పాత్ర స్వర్గీయ రావు గోపాలరావు గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ వారీ చిత్రంలో చెప్పిన డైలాగులను అనుకరిస్తున్నారు అంటే ఎంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్నరో వేరే చెప్పనవసరం లేదు.
* "ముత్యాల ముగ్గు" లోని బంగళా షూటింగ్ శ్రీమతి ఇందిరా ధన్ రాజ్ గిర్ గారి అనుమతితో హైదరాబాద్ లోని జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ లో జరిగింది. సినిమాలో చూపిన కొన్ని నగలు కూడా ఇందిరగారివేనని అంటారు.
* ప్రముఖ సినిమాటోగ్రాఫర్ "ఇషాన్ ఆర్య" ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. కొన్ని "కోకకోలా ఏడ్ ఫిల్మ్స్" చూసాకా బాపు గారికి ఈయనతో పని చేయాలనే ఆలోచన కలిగిందట.
*ఇక అవార్డుల విషయానికి వస్తే, 1975 లో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డ్ గెలుచుకుంది. బెస్ట్ కలర్ ఫొటోగ్రఫీ కి ఆల్ ఇండియా అవార్డ్ ను కూడా సినిమాటోగ్రాఫర్ ఇషాన్ ఆర్య సంపాదించుకున్నారు. ఇవేకాక ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ద్వారా మరెన్నో అవార్డులని కుదా ఈ చిత్రం సొంతం చేసుకుంది.
* బాపు రమణలు సంగీతప్రియులు. మధురమైన కె.వి.మహాదేవన్ సంగీతంతో పాటూ, నూతన దంపతుల సన్నిహిత దృశ్యాల చిత్రీకరణలో ప్రముఖ మేండొలీన్ విద్వాంసుడు Sri Sajjad Hussain గారి 16 నిమిషాల మేండొలిన్ బిట్ అందుకు సాక్షి .
* పేరుపెట్టేదాకా సినిమాను "ముత్యాల ముగ్గు" అని సరదాగా పిలిచేవారట. తర్వాతర్వాత అదే పేరు బాగుందని ఉంచేసారట.
* ఈ చిత్రంలో మాడా, ఆంజనేయస్వామి, పుజారిగారి కుటీరం, సంగీత చీరలు, హలం కట్టుకున్న సింపుల్ చీర, ముద్దొచ్చే కవల పిల్లలూ అన్ని సూపరే...ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారు ఆఖరు సీను లో....చాలా బాగా చేస్తారు. ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు ఏక్సిడెంట్ లో మరణించారట. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చి "బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం" అనేవారుట .
* స్వర్గీయ ఎన్.టి.ఆర్ గారికి ఎంతో ఇష్టమైన సినిమాట ఇది. డైలాగులు, సీన్లు తన చిన్ననాటిరోజులను గుర్తుకు తెస్తున్నాయని అనేవారట. స్కూలు పిల్లలకి వీడియో పాఠాలు తయారుచేసే ప్రోజక్ట్ బాపూరమణలకు అప్పజెప్పినప్పుడు ఇవి "ముత్యాలముగ్గు అంత బాగుండాలి" అనటం ఆ సినిమాకు పెద్ద ప్రశంసే మరి.
* ముళ్లపూడి వెంకటరమణగారి డైలాగులు ఈ చిత్రానికి ప్రాణాలు.
సినిమాలో గుర్తుండిపోయే విషయాలు:
తోటలో సంగీత జామకాయలు కోసి శ్రీధర్ కు కాకెంగిలి చేసి ఇచ్చే సీన్, శాంత శ్రీధర్ కు తేగ పెట్టేప్పుడు చెప్పే కబుర్లు, శ్రీధర్ ఫోటో పడేసుకుని వెళ్పోతే అది తీసుకుని లక్ష్మి ఆనందించే దృశ్యం, రాము ఆంజనేయస్వామితో మాట్లాడే మాటలు... గుర్తుండిపోతాయి.
సినిమాలో పాటలన్నీ బాగుంటాయి కానీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఏకైక సినిమా పాట "నిదురించే తోటలోకి...." , "ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురూ..." నాకిష్టమైనవి. అందరు నటులు తమ తమ పాత్రలకు ప్రాణం పోసారు. శ్రీధర్ నటన కంటే నాకు సంగీత నటనే ఎక్కువ నచ్చుతుంది. బహుశా కధలో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంవల్ల కావచ్చు. చిన్నప్పుడు ఈ సినిమా చూసి అంత ప్రేమించే భర్తకు భార్యపై నమ్మకం లేదేంటి? అది ప్రేమెలా అవుతుంది? అనుకునేదాన్ని. కానీ భార్యాభర్తల మధ్య అనుబంధానికి పునాది "నమ్మకం". అది లేని నాడు బంధాలు తెగిపోతాయి, కాపురాలు కూలిపోతాయి అనే సత్యాన్ని ఈ సినిమా తెలుపుతుంది అని పెద్దయ్యాకా అర్ధమైంది. సినిమా వచ్చి ముఫ్ఫైనాలుగేళ్ళు అయినా ఇంకా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అపురూపమైన చిత్రంగా మిగిలిపోవటానికి సినిమా అంతా నిండిఉన్న తెలుగుదనమే కారణం అనిపిస్తుంది నాకు.
ఇంత రాసినా ఇంకా ఏదో మిగిలిపోయింద నిపిస్తోంది... :)
Subscribe to:
Posts (Atom)