కొన్ని పరిస్థితులను, కొన్ని విషయాలను వినటానికే కాదు; కొన్ని సందర్భాల్లో "స్పందించటానికి" కూడా కొంత గుండెధైర్యం అవసరం.అది ఒక్క రోజులో రాదు...కాలాన్ని,పరిస్థితులను బట్టి మనిషిలో స్థిరత్వాన్ని ఏర్పర్చుకుంటుంది.ఇప్పుడది నాలో కొంతైనా ఉంది....దానికి సంబంధించి కొన్ని జ్ఞాపకాలు....
డిగ్రీ చదివే రోజుల్లో ఒక శెలవుదినాన నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళాను.తను బయటకు వెళ్తోంది.
."ఎక్కడికి?" అని అడగకూడదు కాబట్టి అడగలేదు."నాతో వస్తావా?" అంది.అలాగేనని తలఊపాను.
"మీ ఇంట్లో పాత బట్టలు ఏమైనా ఉన్నాయా?" అంది. "ఊ " అన్నా."పద మీ ఇంటికి" అంది.మళ్ళీ వెనక్కి మా ఇంటికి వెళ్ళాం. నా డ్రెస్సులు,అమ్మ చీరలు కొన్ని తీసుకుని బయల్దేరాం. "అక్కడ నువ్వేమీ ఫీలయిపోకూడదు.." ముందుగానే చెప్పింది. అర్ధం కాలేదు.
"నువ్వు గోరింటాకు బాగా పెడతావు కదా,అక్కడ అవసరం ఉంటుంది" అని 2,3 మెహందీ కోన్స్ కొంది దారిలో.
రిక్షా దిగి చూసాను.."నిర్మల్ హృదయ్ భవన్"(the house for mentally handicapped and physically handicapped) అని రాసి ఉంది.తను,వాళ్ళ ఫామిలీ అక్కడికి రెగులర్గా వెళ్తూంటారు.నాకు తెలుసు.లోపలికి వెళ్లగానే కొందరు పిల్లలు "అక్కా.." అని తనని చుట్టుముట్టారు."ఇదిగో మా ఫ్రెండ్ గోరింటాకు బాగా పెడుతుంది కావాల్సినవాళ్ళు పెట్టించుకోండి" అని వాళ్ళతో చెప్పి ,మేము తెచ్చినవి తీసుకుని తను లోపలికి వెళ్ళింది.వెళ్తూ వెళ్తూ, నా వైపు చూసి "నువ్వు పని అయ్యాకా ఇక్కడే ఉండు.లోపలికి రాకు".అంది.మళ్ళీ అర్ధం కాలేదు...
సరే,నా పనిలో నే పడ్డా.దొరికిన చేతులన్నింటికీ గోరింటాకు పెట్టడం నాకు చాలా ఇష్టమైన పని.తెచ్చిన మెహందీ కోన్లు అయిపోయాయి.పిల్లలంతా వెళ్ళిపోయారు.నా ఫ్రెండ్ ఇంకా లోపల్నుంచి రాలేదు.సందేహపడుతూనే తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాను...నా గుండె ఆగిపొయింది కాసేపు... physically and mentally handicapped పిల్లలు బోలెడు మంది...నా స్నేహితురాలు ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకుని ఆడిస్తోంది..ఆ పిల్లవాడికి ముక్కు ఉండాల్సిన చోట పెద్ద కన్నంలా ఉంది...చుట్టూరా అలాంటి పిల్లలే...ఎవరు కన్న బిడ్డలో...చూడలేకపోయాను...!పరుగున బయటకు వచ్చి నించున్నా...
నా కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదు...ఐదు నిమిషాల్లో నా ఫ్రెండ్ వచ్చింది.."నేను రావద్దన్నాను కదా,ఎందుకు లోపలికి వచ్చావు?" అంది కన్నీళ్ళు నిండిన నా మొహంలోకి చూస్తూ....అప్పుడర్ధమైంది తను నాకు ఎందుకు రావద్దని చెప్పిందో..!ఆ సమయంలో నాకు తనొక కొత్త వ్యక్తిలాగా,తను ఒక పెద్ద శిఖరం మీద ఉన్నట్లూ,నేను పాతాళంలో ఉన్నట్లూ అనిపించింది.డబ్బు,బట్టలు లాంటి సహాయాలు అందరూ చేస్తారు...అదేమ్ గొప్ప కాదు...కానీ చూడటానికే భయం వేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఆప్యాయంగా వాళ్లను అక్కున చేర్చుకున్న తన పెద్ద మనసుకు మనసులోనే జోహార్లు చెప్పాను...ఎందుకంటే నాకు ఆ సమయంలో మాటలు రాలేదు...
బయటకు వచ్చి నడుస్తున్నాము...నేను తల వంచుకుని ఆలోచనల్లో ములిగిపోయాను..."హలో మేడం..ఎక్కడికి వెళ్ళిపోయావు?వెనక్కు వచ్చేయ్...ఆ గేటుతోనే అది మర్చిపోవాలి" అంది.ఆ తరువాత నన్ను మౌనంగా వదలకుండా ఇంటికి వెళ్ళేదాకా ఏవో కబుర్లు చెప్తూనే ఉంది...!! ఆ రోజు నాకనిపించింది...నిజంగా నాకు గుండెధైర్యం లేదు..అని...!
కానీ ఆ తరువాత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నాకు కొంతైనా అది ఏర్పడిందనే అనుకుంటున్నాను.ఎందుకంటే 15ఏళ్ళ క్రితం మాకు అత్యంత సన్నిహితుడైన మా మేనమామ కేన్సర్ వ్యాధితో నరకయాతన అనుభవించటం కళ్ళార చూసాను.ఆయన కన్ను మూసినప్పుడు దగ్గరే ఉన్నాను...!పన్నెండేళ్ళ క్రితం మా నాన్నమ్మ చనిపోయినప్పుడు..కటకటాల గదిలో ఆవిడను పడుకోబెట్టినప్పుడు...తెల్లారి జనాలందరూ వచ్చేదాకా గడపకు ఒక పక్క అమ్మ,మరో పక్క నేను...రాత్రంతా మేమిద్దరమే...నిర్జీవమైన ఆవిడ శరీరం దగ్గర కుర్చునే ఉన్నాం!! అప్పుడు నాలో కించిత్తైనా భయం కలగలేదు...
రెండేళ్ళు అనారోగ్యంతో నానా యాతనా పడి, క్రితం ఏడు మా మామగారు కాలం చేసినప్పుడు....అంతక్రితం రెండు నెలలు బెడ్ రెస్ట్ లో ఉన్న నేను... నిలబడ్డాను...! మరి "పెద్ద కో్డలిని"...వయసు లేకపోయినా, బాధ్యత తెచ్చిన పెద్దరికం అది...అలా నాకెదురైన పరిస్థితులు నాలో కొంతైనా గుండె ధైర్యాన్ని తెచ్చాయి....ఎప్పుడైనా వెనక్కువాలి ఆలోచనల్లోకి వెళ్ళినప్పుడు...కాలం తెచ్చిన మార్పంటే ఇదేనేమో మరి అనిపిస్తూ ఉంటుంది...!!