సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, October 6, 2009

చిరు సహాయం ఇచ్చిన సంతృప్తి.....!!

ఇల్లేది...పల్లేది...ఈ కుటుంబానికి దిక్కేది?
నీటిపాలైన సంసారానికి చుక్కానేది?

ఉన్నపళంగా నిరాశ్రయమైన పల్లెలెన్నో..?!
కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలెన్నో...?!
నీటిపాలైన గద్వాల్ చేనేత కార్మికుల భవిష్యత్తు బాగుపడేనా...?
నష్టపోయిన రైతులూ,వ్యాపరస్తులూ తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోగల్గుతారా..?
సహాయ కార్యక్రమాలూ,నిధులూ సక్రమంగా బాధితులకు అందుతున్నాయా...?
చీకటైన ఆ బ్రతుకులలో వెలుగు కాకపోయినా చిరు దీపమైనా వెలిగేనా...?

..ఇలా ఎన్నో..ఇంకెన్నో ప్రశ్నలు...ప్రశ్నలూ...
అంతుచిక్కని ఆలోచనలూ...టి.వి.లో శవాలు,కూలిపోయిన ఇళ్ళూ,నీట మునిగిన ఊళ్ళూ,పొలాలూ....
వై.యస్ గారితో పాటు ఐదుగురు మనుషులు దయనీయ స్థితిలో నిర్జీవులైపోతే ఎంతో బాధ పడ్డాం...మరి లక్షల జనాల జీవితాలు ఇవాళ తలక్రిందులైపోతే ఇంకెంత బాధ....ఒక మహా బాధ మనసుని దొలిచేస్తోంది..
మూడు రోజుల్నుంచీ మధ్యరాత్రి మెలుకువ వచ్చేస్తోంది...నిద్రే పట్టదు...
అయ్యో,ఆ వార్తల్లో కనిపించిన శవాలు ఎవరివో....ఎవరి బిడ్దో...ఎవరి తల్లో....ఎవరి అన్నో...

"భూమిపై పాపం పండిపోయినప్పుడు,భూమి భారం పెరిగిపోయినప్పుడూ
ఇలాంటి విపరీతాలు జరుగుతూంటాయి...
ప్రకృతి ప్రళయరూపం దాలుస్తూంటుంది" అని ఎక్కడో చదివిన గుర్తు..!
ఇది ఎవరి పాపం?ఎవరి శాపం?
పాపం ఎవరిదైనా ఇవాళ భరిస్తున్నది దీన అమాయక జనం...

భార్యలకూ,ప్రేమికురాళ్ళకూ కోట్లు,లక్షలు విలువ చేసే బహుమతులు అందజేసే వ్యాపారవేత్తలూ,ప్రముఖులూ,ధనవంతులూ ఇటువంటప్పుడు ఈ బాధితులకు

పెద్ద మొత్తాలలో సహాయం చెయ్యగలిగితే మానవత్వం నిలబడుతుందని నా అభిప్రాయం..!!
మరి నేను..?
వీరికి నేనేం చెయ్యగలను..?ఏదైనా చేయాలి...
చిన్నపిల్లని,సంసారన్నీ వదిలి ఆ ప్రాంతాలకు వెళ్ళి సహాయం చెయ్యలేను....
కానీ బాధ్యత గల పౌరురాలిగా చిరు సాయమైనా చేయాలి అనిపించింది...
ఒక సామాన్య మధ్యతరగతి గృహిణిగా పెద్ద సహాయాలేమీ చెయ్యలేను..
అయినా నాకు తోచిన చిన్న సాయం నేనూ చేసాను...

సహాయం నేరుగా బాధితులకు అందుతుంది అని నమ్మకం ఉన్న ఒక సేవా సంస్థకు నా దగ్గర ఉన్న కొంత డబ్బుని,కొన్ని కిలోల బియ్యాన్ని,మూడు సంచుల బట్టలను పట్టుకెళ్ళి ఇచ్చివచ్చాను.
ఇది చాలా చాలా చిన్న సహాయం...కాని ఇలాంటి చిన్న సహాయాలన్నీ కలసి ఒక "పెద్ద సహాయం" అవుతుంది అని నా నమ్మకం.
ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది....నేనూ నా వంతు బాధ్యత నేను నెరవేర్చాను అన్న సంతృప్తి నాకు కలిగింది.

ఇదంతా నేను ఏదో చేసేసాను అని చెప్పుకోవటం కోసం రాయటంలేదు...ఒకోసారి మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మనసుకు ఎంతటి సంతృప్తిని,ఆనందాన్ని కలిగిస్తాయో చెప్పటం కోసం రాస్తున్నాను...నా ఉడుతా సహాయం వల్ల నాకు కలిగిన సంతృప్తిని,ఆనందాన్ని పంచుకోవటం కోసం రాస్తున్నాను..!!