సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, October 3, 2009

కొత్తసినిమా...తలనెప్పి..!!

అదివరలో...ఫస్ట్ డే ఫస్ట్ షో లు కొన్ని చూసాకా..టాక్ రాకుండా కొత్త సినిమాలు చూసి తల బొప్పి కట్టించుకోకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాను.కానీ ఒకోసారి విధి వక్రించడం వల్ల ఆ నిర్ణయన్ని మార్చుకుని కొత్త బొప్పెలు కట్టించుకోవటం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది.నిన్న శెలవు వల్ల ఇంట్లో శ్రీవారు ఎదురుగా ఉండేసరికీ కొత్త సినిమా చూడాలనే దుర్భుధ్ధి పుట్టింది.(మొగుడ్స్,పెళ్ళాంస్ ని వదిలి ముగ్గురం సినిమా చూసేద్దాం అని రెండు నెలల క్రితం అన్నదమ్ములతో కలిసి "అడివి"లోకి వెళ్ళొచ్చాకా అయినా బుధ్ధి రాలేదు..)"సినిమా" అన్న పదంలో ఉన్న మాయ అల్లాంటిది.

వచ్చిన తలనెప్పి వివరాలు:

తలనెప్పి 1)క్యూ లో నించునే రోజులు పోయాయి కాబట్టి,నెట్ లో శెలవురోజు కాబట్టి వెతికి వెతికి,సిట్లు ఖాళీ ఉన్న ఓ సినిమాకు టికెట్ బుక్ చెయ్యటం ఒక తలనెప్పి.

2) సినిమా అంటే ఓ లుక్ ఇచ్చే అయ్యవారిని ఒప్పించటం,కూర్చున్న రెండు గంటల్లోనూ 200సార్లు అసహనంగా కదిలే ఆయన మూమెంట్స్ గమనించుకుంటూ,చీకట్లో కూడా స్పష్టంగా కనిపించే ఆ తీవ్రమైన అసహనపు ఎక్ష్ప్రెషన్స్ గట్రా ఒక తలనెప్పి..! (అయినా,నా కోసం ఇంత భరిస్తున్నారనే ఆనందం లోపల్లోపల..)

3)సినిమాలకు పాపని తిసుకెళ్లకూడదు అనే నిర్ణయం మాకున్నందువల్ల,ముందు "అటు" వెళ్ళి పాపని దింపి,మళ్ళీ టైంకి సినిమా మొదలవ్వకుండా వెళ్ళడానికి;సినిమా మధ్యలో వచ్చిన ఫొన్ కాల్స్ వల్ల అది అయ్యాకా మళ్ళీ పాప కోసం "అటు" వెళ్ళడానికి మొత్తం 3ఆటోలు ఎక్కాల్సి వచ్చినందుకు బాధతో నిండిన తలనెప్పి...


4) ఇక ఇవన్నీ పక్కన పెట్టి కధలోకి వస్తే...ఎక్కువ ట్విస్ట్ లు పెట్టి ప్రేక్షకుడి ఆలోచనా శక్తిని పరీక్షించే ప్రయత్నాలు ఈ మధ్య కొత్త సినిమాలన్నింటిలో జరుగుతున్నాయి.మొదటి సన్నివేశాన్ని బట్టి క్లైమాక్స్ ఊహించుకునే స్థాయికి ప్రేక్షకుడు వచ్చేసాడని తెలుసుకున్న కధా రచయితలు,తమ చాకచక్యంతో జనాలు ఊహించలేని మార్పులను కధల్లోకి చొప్పిస్తున్నారు.ఓహో ఇలా కూడా జరగొచ్చన్నమాట అని మనం సర్దుకుపోయిన సందర్భాలూ,ఇష్టం వచ్చినట్లు కధను మార్చేస్తే చూస్తున్న ప్రేక్షకుడు ఏమవ్వాలి అనే కోపం వచ్చిన సందర్భాలు ఎక్కువే..!!

5)సినిమా అయ్యాకా పాప కోసం అమ్మావాళ్ళీంటికి ఒక్కర్తినీ ఆటోలో వెళ్తూంటే ,ఆటోఅతను సరిగ్గా తిసుకెళ్తాడా?పాటలెందుకు పాడతాడు?మొంచివాడో కాదో?రొడ్డు మీద సెలవు వల్ల ట్రాఫిక్ లేదు..బస్సెక్కాల్సిందేమో..?అని బోలెడు ప్రశ్నలూ.ఇల్లు దగ్గర పడేదాకా అదో తలనెప్పి..

6)అన్నింటిని మించి సినిమా కధో పెద్ద తలనెప్పి..ఇక నిన్నటి కధలోకి వస్తే,చాలా డౌట్లు..
అసలూ...ఒక ప్రేమికుడూ,ప్రేమికురాలూ ఉన్న మనిషికి మళ్ళీ ఎందుకు మరో వ్యక్తి పట్ల ఆసక్తి కలగాలి?అన్నది ప్రాధమిక ప్రశ్న.


కలిగిందే పో,అలా కలిగిన ఆసక్తిని ఇంకా ఇంకా పొడిగించి అది "ప్రేమే" అని చూట్టూ ఉన్నా పాత్రల ద్వారా పదే పదే చెప్పించి,మనల్ని నమ్మించే ప్రయత్నం కధకుడు ఎందుకు చెయ్యాలి?

నమ్మించారే పో,ఆ కొత్తగా పుట్టిన ప్రేమకి లాజిక్కులూ,కారణాలు ఉండవా?3 నెలలు ఒకే చొట పని చేస్తే,పక్కపక్కనే ఉంటే, పాత ప్రేమికులని మర్చిపోయి పక్కనే కనబడే వాళ్ళని ప్రేమించేసేంత బలహీనమైనదా వాళ్ళ ప్రేమ?

యువతా ఇలానే ఉన్నారు అని చూపించే సెటైరా ఇది?

పోనీ ఏదో ఒకటి,ఈ రెండోదే నిజమైన ప్రేమేమో అని మనం నమ్మే ప్రయత్నంలో ఉండగా,కాదు కాదు మొదటిదే అసలైనది అని మనల్ని కంఫ్యుజ్ చేసేస్తాడు కధారచయిత.

అసలు కధలోకి మరో పెద్ద హీరో ఎందుకు?సమస్యను చెప్పుకోవటానికి ఆ పెద్ద హీరో ఎమన్నా "లవ్ గురూ"నా?తనది ప్రేమో ఆకర్షణో తానే అర్ధం చేసుకోలేని వ్యక్తికి ప్రేమ అవసరమా?

సరే అంతా అయ్యి, విమానం దిగగానే వాళ్ల వాళ్ళ ప్రేమికులు వచ్చి "ఎంత మిస్సయ్యానో" అని గట్టిగా కౌగిలించుకునే సరికీ,అప్పటిదాకా "ధక్ ధక్" అని కొట్టుకున్న వాళ్ళ వళ్ళ మనసులు రుట్ మారిపోయి పాత ప్రేమికుల వైపు వెళ్ళిపోతాయి..!

మరి అంతదాకా మనకు చూపించిన వేదన,బాధా,ప్రేమ,ఆరాటం అన్నీ తూచ్చా?(ప్రేక్షకులు వెర్రిమొహాలు అని ఎర్రాటి అక్షరాల్లో చూపించటం అన్నమాట.)వాళ్ళు రాసిన ఉత్తరాల్ని చింపేసి,"హ హా హా " అని హాయిగా మనసారా నవ్వేసుకుంటూంటే..జుట్టు పీక్కోవాలని అనిపించని వాడు ప్రేక్షకుడే కాదని నా అభిప్రాయం.

7)ఇక సినిమాలో పాటలు,సందర్భోచితమా కాదా అన్న సంగతి నే చెప్పకపొవటమే బెటర్..చెబితే అవి నచ్చిన వాళ్ళతో అదో తలనెప్పి...!

8)ఇంటికి వచ్చి "కధ చెబుతా..కధ చెబుతా" అని(మైఖేల్ మదన కామరాజులో పాట లాగ)ఎంత శ్రీలక్ష్మిలాగా ప్రయత్నాలు చేసినా ఎవరూ వినరేమిటో....!అయినా మొదలెట్టాను"ఇద్దరమ్మాయూ,ఇద్దరబాయిలూ,వాళ్ళలో ఒక అమ్మాయి,ఒక అబ్బాయి విమానం ఎక్కుతారు..."వద్దు బాబోయ్ ....ఆపవే బాబూ...అని అందరూ...కెవ్వున...కేక..!

9)అలా కధ నోట్లోంచి బయటకు రాక రాత్రంతా పెద్ద తలనెప్పి...!!

10)తలనెప్పిల్లో ఇన్ని రకాలా అని టపా చదివిన వారందరికీ కొత్త తలనెప్పి..!?!

(ఇంతకి సినిమా పేరేమిటో...అబ్బ ఆశ,దోశ..చెప్పేస్తాననే..)