వంటల పట్ల,కొత్త ప్రయోగాల పట్లా నాకు చాలా ఆసక్తి.నేను ప్రయత్నించిన కొన్ని ఆరోగ్యకరమైన వంటల రెసిపీలని ప్రతి వీకెండ్ లోనూ రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ వారం ఒక మంచి హేవీ టిఫిన్ తో మొదలుపెడుతున్నాను:
బ్రేడ్ తో చేసే ఇది ఒక హెవీ టిఫిన్.హెవీ అంటే కూర ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వెయ్యదు.దీని పేరు నాకు తెలీదు.మేము ముంబైలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ నాకు చెప్పింది. ఆవడలు ఇష్టమైన వారికి ఇది నచ్చుతుంది.
కావల్సిన పదార్ధాలు:
1 బ్రెడ్ ప్యాకెట్ (సాండ్విచ్ బ్రెడ్ అయితే బాగుంటుంది)
4,5 (పెద్దవి) ఉడికించిన బంగాళదుంపలు
చిలికిన పెరుగు 1/2లీటర్ (కొద్దిగా నీరు కలుపుకోవచ్చు)
కొత్తిమీర సన్నగా తరిగినది-1చిన్న కట్ట
నూనె - పోపుకి తగినంత
పోపు దినుసులు:ఆవాలు,మినపప్పు,సెనగపప్పు,జీలకర్ర,చిటికెడు ఇంగువ,కర్వేపాకు 2 రొబ్బలు
కారం ఇష్టమైనవారు కూరలొనూ,పెరుగులొనూ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు.
చేసే విధానం:
1)ఉడికించిన బంగాళదుంపలతో "పోపు కూర" చేసి పెట్టుకోవాలి.
2)బ్రేడ్ స్లైసులన్నీ ఏదన్న గుండ్రటి మూతతో రౌండుగా కట్ చేసుకోవాలి.
3)చిలికిన పెరుగులో పోపు వేసుకుని ,కొత్తిమీర చల్లి ఉంచాలి.(రైతా లాగ అన్నమాట)
4)ఒక గరిటెడు బంగాళాదుంపల కూరని ఒక్కో రౌండ్ స్లైసుకి అద్ది, దాన్ని తవా పైన కూర అడుగు వైపుకి వచ్చేలాగ 1నిమిషము ఫ్రై చేసి తీసేయాలి ఇలా...
5)ప్లేటులో పైన వైపు రౌండ్ బ్రేడ్ స్లైసు వచ్చేలాగ ఓ 4 అరేంజి చేసి,
వాటిపైన చిలికిన పెరుగు బ్రెడ్ ముక్కలను కవర్ చేసేలా వేసి,
పైన కొత్తిమీర చల్లుకోవాలి.ఇలా--
ఒక సంగతి:
బంగాళాదుంపలు తినకూడదన్నది ఒక అపోహ.మధుమేహం ఉన్నవారు తప్ప, మిగిలిన వాళ్ళందరూ తినదగిన పౌష్టికాహారం.ఉడికించిన వాటిల్లో కార్బోహైడ్రేట్స్,విటమిన్ బి,సీ,ఇంకా కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. నూనెలో వేయించితేనే అది హానికరం.పప్పు దినుసుల్లో కన్నా ఎక్కువ తేమ బంగాళాదుంపల్లో ఉంటుంది,అందువల్ల పప్పుదినుసులలో కన్న తక్కువ కేలరీలు వీటిల్లో ఉంటాయి.ఉడికించిన బంగాళాదుంపముక్కలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మరసం,కొత్తిమీర చల్లుకుని సాయంత్రాలు టీ టైం లో తినచ్చు.
అయితే,తొక్కతీసి ఉడికించినా,తొక్క బ్రేక్ అయ్యేలా ఎక్కువ ఉడికించినా వీటిలోని పోషకాలన్నీ నశిస్తాయి..
ఈ సంగతి నేనొక పుస్తకంలో చదివి తెలుసుకున్నది.