నాకు నచ్చని కొన్ని పదాల్లో "అంటీ" ఒకటి.
నా చిన్నప్పటి వరకూ ఇరుగుపొరుగువాళ్ళని అత్తయ్యగారు,అక్క,వదిన,పిన్ని అని వరుసలు కలిపి పిలిచేవారు.రాను రానూ ఆ పిలుపులు పూర్తిగా తప్పిపొయాయి.ఆడవారందరికీ అన్వయించే ఒకే పదం అమలులొకి వచ్చేసింది..."ఆంటీ".ఇరుగుపొరుగు వాళ్ళే కాకుండా కూరలవాళ్లు,పాలవాళ్ళు అందరూ అదే పదం వాడటం మొదలెట్టారు..
బాగా చిన్నపిల్లలని పేరు పెట్టి పిలుస్తారు.స్కూల్,కాలేజీలకి వెళ్ళే పిల్లలని,పెళ్ళికానంత వరకూ "అక్క" అంటారు.ఇంక పెళ్ళి అయ్యిందో "ఆంటీ" నామకరణం జరిగిపొతుంది.అసలు పేరు తెలిస్తే, పేరు పెట్టో,ఏమండి అనో, పిలవచ్చు కదా? ఎందుకు ఆంటీ అని పిలవాలీ?అసలు నాకు తెలిసీ చాలామంది ఆడవాళ్ళ కి వయసు దగ్గర ఒకింత అభ్యంతరం ఉంటుంది.వెంటనే వయసు చెప్పటానికి ఇష్టపడరు.కొందరు ఎదుటి మనిషి వయసు సుమారుగా తమకన్నా చిన్నగా తెలుస్తున్నా సరే, అక్కగారు అనో,వదినగారూ అనో,పిన్నిగారూ అనో పిలిచేస్తు ఉంటారు.తమని తాము చిన్నగా అనుకుంటారొ ఏమో మరి.
మా నాన్నగారికంటే వయసులో పెద్దాయన ఒకసారి మా ఇంటికి వచ్చి మా అమ్మని "అక్కయ్యాగారు" అన్నరని మా అమ్మకి బోలేడు కోపం వచ్చేసింది.పెళ్లయ్యాకా మా ఇంటికి ఓసారి వంటకి వచ్చినావిడ మా అత్తగారిని "పిన్నిగారు" అన్నదని ఆవిడని మళ్ళి వంటకి రానివ్వలేదు మా అత్తగారు!!ఇంక నా సంగతికొస్తే..చిన్నప్పుడు రకరకాల పేర్లు,పెద్దయ్యాక "అక్క".అంతవరకూ బానే ఉండేది.నాకు పెళ్ళి అయ్యాకా, పెళ్ళికాని పక్కింటి అమ్మాయి కూడా నన్ను "ఆంటీ" అంటే ఒళ్ళు మండేది.వయసు చూడక్కర్లేదా?నాకు పెళ్ళి అయితే ఇంక ఆంటీ నా?అని మనసులో పీక్కునే దాన్ని.బయటకు ఎవరినీ ఏమీ అనలేము కదా...
ఒకసారి రైతు బజారుకి వెళ్తే అప్పటిదాకా "అక్కా" అనే కూరలవాడు "ఆంటీ ఈ కూర కొనండి,ఆ కూర కొనండి.."అనటం మొదలెట్టాడు.'నిన్నే పెళ్ళడతా 'లో 'పండు ' అంటే హీరోయిన్ కి ఎంత కోపం వస్తుందో...అంత కోపం వచ్చింది.నీ దగ్గర కూరలు కొనను.అని వచ్చేసా!!
ఆ తరువాత బొంబాయిలో మా పాలవాడు "అంటి..దూద్.." అని అరిచేవాడు."అబ్బాయీ నీ వయస్సెంత?" అన్నాను."30" అన్నడు."మరి నీ కళ్ళకి నేను ఆంటి లా ఎలా కనిపిస్తున్నను?అలా పిలిస్తే ఇంకనించీ నీ దగ్గర పాలు తీసుకోను!" అని ఖచ్చితంగా చెప్పేసా!! పాపం అప్పటి నుంచీ వాడు అలా పిలవటం మానేసాడు.కానీ పాలవాడు కాబట్టి అతడితో దెబ్బలాడగలిగాను.మిగిలిన అన్దరినీ ఏమంటాం...?తమ పిలుపుతో ఎదుటి వారిని ఏలాటి ఇబ్బందికి గురి చేస్తున్నాం అన్న విషయం ఎవరికి వారు అర్ధం చేసుకోవలసిందే కానీ ఒకరు చెప్తే వచ్చేది కాదు కదా..
మొన్న మా తమ్ముడు బండి తీసి బయటకు వెళ్తూంటే "అంకుల్ బాల్ ప్లీజ్,అంకుల్ బాల్ ప్లీజ్.."అని ఎవరో అంటూంటే ఎవరినో అనుకుని వాడు వెళ్పోతూంటే,మళ్ళీ అడిగారుట "అంకుల్ బాల్ ప్లీజ్.." అని.అప్పటికి గానీ అర్ధం కాలేదట వాడికి, పిలుస్తూన్నది వాడినే అని..!"నేను అంకుల్ అయిపోయానే.." అని వాడు బాధగా చెప్తూంటే,ఓహో ఈలాటి ఇబ్బందులు ఆడవాళ్ళకే కాక మగవారికీ ఉంటాయన్నమాట... అనుకున్నా అప్పుడు!!
కొసమెరుపు ఏమిటంటే,ఈ కొత్త పిలుపుకి నేను ఉడుక్కోవటం చూసి మావారు కూడా "ఆంటీ టీ ఇస్తావా...ఆంటీ వంటైందా...."అనటం మొదలెట్టారు...ఇప్పటికీ మానలేదు అంకుల్ !!