సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, July 8, 2009

అమ్మతనం

మాతృత్వం స్త్రీకి దేవుడిచ్చిన వరం.ఎన్ని హడావుడుల్లో,చికాకుల్లో ఉన్నా 'అమ్మా ' అన్న బిడ్డ పిలుపుకు సర్వం మరచి పరవసిస్తుంది తల్లి. కుమార్తెగా, సహొదరిగా, భార్యగా, కోడలిగా, స్నేహితురాలిగా, ఉద్యోగినిగా ఎన్ని అవతారాలెత్తి ఎన్ని పాత్రలు పోషించినా తల్లిగా మారిన స్త్రీ పొందే అనుభూతి అన్నిటికీ సాటిలేనిది.పాలుతాగే వయసులో బిడ్డ కేరింతలు చూసి ప్రసవ వేదన మరుస్తుంది,తప్పాటడుగులు వేసే పాపడిని చూసి అలసటని మరుస్తుంది,చిన్నారి చిట్టి పలుకులని విని జీవితంలోని ఒడిదొడుకులను మరుస్తుంది ;గోరుముద్దలు తినిపిస్తూ,లాలిపాటలు పాడుతూ,పిల్లల ఆటల్లో తానూ ఒక ఆటబొమ్మై ఆనందంతో మైమరచిపోతుంది.
తనకు తెలిసిన విజ్ఞానాన్ని,ప్రపంచాన్ని బిడ్దకు తెలియచెయ్యాలని తపన పడుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దయి సక్రమమైన మార్గంలోకి వెళితే తన జివితానికి సార్ధకత కలిగిందని పులకిస్తుంది మాతృహృదయం.ఆ సార్ధకతని నేనూ పొందాలని తాపత్రయపడే సగటు తల్లిని నేను.నేలపై పాకే పసిపాపను చూసి ఇది ఎప్పుడు నడుస్తుందొ..అనుకున్నాను.నడిచింది.పాపాయి బుడి బుడి నడకలను చూసి..ఇది ఎప్పుడు పలుకుతుందో అనుకున్నాను..ఇంకొన్నాళ్లకి పలికింది.."హృదయం ఎక్కడ ఉన్నది..అమ్మ చుట్టూనే తిరుగుతున్నదీ.." అని సొంత కవిత్వం కూడా పాడింది!! ఇప్పుడు పలకపై "అ,ఆ లు " దిద్దుతోంది...నిన్న రాత్రి "ఆ నుంచి అం అ:" వరకూ తప్పుల్లేకుండా రాసింది...ఏమిటో ఆనందం..."తెలియని ఆనందం.."అని పాడాలనిపించింది. ఈ భావాలు ప్రతి తల్లి మనసులో పొంగేవే...ప్రతి తల్లిని సంతొషపరిచేవే...కానీ ఏదన్నా సరే మనదాకా వచ్చి మనం అనుభవిస్తేనే ఆ భావం మనకు పూర్తిగా అవగతమయ్యేది,అర్ధమయ్యేది...అనిపించింది.
అందుకేనేమో అన్నారు అమ్మతనంలో కమ్మతనం వర్ణనాతీతం అని!!